Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 2


    
    నేను అయోమయంగా చూస్తూ "నువ్వింత బాగా కవిత్వం చెప్పగలవా?" అన్నాను.
    
    "నువ్వూ చెప్పగలవు. అర్ధం తెలీని పదాలన్నీ నిఘంటువులోంచి పోగుచేసి చివర ప్రాస వచ్చేట్లు వ్రాసి ఏ పత్రికకైనా పంపించు!" అని నవ్వింది.
    
    "అయితే అతను ఈ కవిత న అగురించి ఆలోచించి వ్రాయలేదంటావా?" అడిగాను.
    
    "వెర్రి సుమతీ! ఒక్క నీ గురించేమిటి, వాడు మార్గెరెట్ గురించి రజియా సుల్తానా గురించి, పంకజం గురించి, నూకాలమ్మ గురించి.... ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ స్త్రీ జాతినే వుద్దేశించి వ్రాశాడు! చాలా.." అంది.
    
    దాని మాటలు అంతా అర్ధమైనట్లే వుంటాయి కానీ ఆలోచిస్తే, ఏవీ అర్ధం కావు! దీని మాటలకన్నా ఆ విరించి వ్రాసే భావకవిత్వమే మేలు!
    
    ఆదివారాలు హాస్టల్ కొచ్చేవాడు. "ఈసారి సంపెంగలూ, ఇంకోసారి పుస్తకంలో పెట్టి ఎండపెట్టిన సరస్వతీ ఆకులూ.... ఇలా ఏదో ఒకటి తెచ్చేవాడు! మాధవి విసుగ్గా..." అత్తయ్య చేసిన చేగోడీలు, అరిసెలు తేవచ్చుగా బావా! ఎందుకిలా మమ్మల్ని హింసపెడ్తావు? లంచం ఇవ్వకుండా నువ్వు చదివి వినిపించే కవితల్ని మేం ఎందుకు వినాలి?" అంది ఓసారి.
    
    విరించి చిన్నబుచ్చుకోలేదు. "నువ్వు వినక్కర్లేదు. అసలు నీకోసం వ్రాయలేదు కూడా!" అని కరాఖండిగా చెప్పేశాడు.
    
    "మరి! మా సుమతి కోసమా? అదంతా మతిలేనిదనుకున్నావా?" నిలదీసింది మాధవి.
    
    "ఆమె భాషలేని నా మౌన విపంచి....రాగాలు పలికే అనురాగాల హేల..." అన్నాడు.
    
    నా అరచేతుల్లో చెమటలు పట్టాయి. తనువు కంపించడం అంటే అదేనేమో....నిలకడగా కూర్చోలేకపోయాను.
    
    మాధవి వెంటనే "అయితే ఆమెని పెళ్ళి చేసుకుంటావా?" అని సూటిగా అడిగేసింది.
    
    నాకు గుండె ఆగినంత పనైంది. ఈ ప్రశ్న ఇలాగా అడగడం? మాధవి అతనన్నట్లే సున్నితత్వం తెలీని మొద్దు! ఇంతగా నన్ను ప్రేమిస్తున్నవాడు....పెళ్ళెందుకు చేసుకోడూ?
    
    విరించి మాధవి వైపు చీత్కారంగా చూశాడు.
    
    "పెళ్ళి అనేది తుచ్ఛమైన కోరికలు తీర్చుకోవడానికి పొందే లైసెన్స్! ఐహికమైన సుఖాలకి చేసుకునే ఒడంబడిక! ప్రేమకి అవేం అక్కర్లేదు..... చంద్రుడు కలువనీ, తుమ్మెద పుష్పాన్నీ పెళ్ళాడవు!" అన్నాడు.
    
    మాధవికి ఎంత ఒళ్ళు మండిందోగానీ....
    
    అతని చేతి సంచీ తీసి విసిరికొట్టింది. "మనిషిని పెళ్ళి చేసుకుంటే అది అన్నం అడుగుతుంది. కట్టుకోడానికి బట్టా, వుండటానికి ఇల్లూ అడుగుతుంది! వెళ్ళు.....ఆకాశంలో తారకనో...రాయినో....రప్పనో....ప్రేమించుకో! నా ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా!" అని అరిచింది.
    
    విరించి క్రింద పడ్డ కాయితాలు ఏరుకుని సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓ రోజు మాధవి వూరెళ్ళినప్పుడు మా హాస్టల్ కొచ్చాడు.
    
    అతన్ని చూడగానే నాకూ సంతోషం కలిగిందనుకుంటా... "రండి" అన్నాను. ఇద్దరం విజిటర్స్ చైర్ కేసి నడిచాము. అందరూ కాలేజీ కెళ్ళారు. పెద్దగా జనం లేరు.
    
    "సుమతీ! మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను" అని అరచేతులలో మొహం దాచుకుని భోరుమన్నాడు.
    
    చెట్టంత మగాడు అలా ఏడుస్తుంటే పద్దెనిమిదేళ్ళ వయసులో తట్టుకోలేకపోయాను.
    
    "విరించిగారూ!" అని దగ్గరకి జరిగాను.
    
    అతను ఛటాలున మోకాళ్ళ మీద కూర్చుని నా ఒడిలో తలదాచుకుని-
    
    "ఊహ వచ్చిన నాటి నుండీ ఎటువంటి స్త్రీ కోసం వెతుకుతున్నానో అటువంటి స్త్రీ మీరు! నా ఊహా సుందరి....ఈ లావణ్యం.....ఒద్దికా....వినయం....మాధవి లాంటి లంకిణిలకి చచ్చినా పట్టుబడవు! కసిగా అన్నాడు.
    
    "అలా అనవద్దు" అన్నాను.
    
    "సుమతీ....నువ్వు నా వూపిరివి.. నా జీవన వేదానివి" అంటూ తమకంగా అల్లుకోసాగాడు.
    
    గట్టిగా చప్పట్లు వినిపించి వెనక్కి తిరిగి చూశాం
        
    మాధవి నిలబడి చప్పట్లు కొడుతూ "వెరీగుడ్" అంది.
    
    నేను సిగ్గుపడ్డాను.
    
    విరించి కోపంగా నన్ను వదిలేసి "ఏమిటి వెరీగుడ్?" అన్నాడు.
    
    "నీ అలౌకికమైన ప్రేమకి... స్వచ్చమైన కోరికకి! మొత్తానికి ప్రేమించడానికి ప్రకృతున్నా ఈ అవసరం  ఆడదే తీర్చకలదని తెలుస్కుని మా వెర్రిదాన్ని లైన్ లో వేశావన్నమాట! ఎవరన్నారు నువ్వు వెర్రివాడివని....మాయమాటలు చెపుతూ అమాయకత్వాన్ని అనుభవించే ఓ వర్గానికి ప్రతినిధివి. నువ్వు తుమ్మెదలాంటి వాడివే. నీకూ వర్జినిటీనే కావాలి. అందుకే నీలాంటివాడు పెళ్ళాంతో రెండో రాత్రి కాపురం చెయ్యలేడు, దాని వర్జినిటీ పోయిందని! స్కౌండ్రల్...మోసం చెయ్యడానికి అదే దొరికిందా నీకూ? పో... మళ్ళీ ఈ దరిదాపుల్లో కనిపించావంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తా..." మాధవి ఆవేశంగా అరిచింది.
    
    విరించి ఊహించలేనంత వేగంగా వెళ్ళి దాని చెంపమీద కొట్టాడు. "మధువు గ్రోలడంలో తుమ్మెదకి ఎంత తృప్తి వుందో....పుష్పానికీ అంతే ఉపయోగం వుంది. అది తెలీక నీలాంటివాళ్ళు ఏదో దోపిడీ జరిగిపోతోందని గుండెలు బాదేసుకుంటుంటారు." అన్నాడు.
    
    మాధవి కోపంతో ఊగిపోతూ అతని రెండు చెంపలూ వాయించి - "నువ్వు కవిత్వం రాస్తూ ప్రేమా....దోమా అని దాన్ని మోసం చెయ్యకుండా కనీసం ఫ్రాంక్ గా ఉంటే బావుండేదిరా! నీలో దాగున్న దొంగకి ఈ దెబ్బలు సరిపోవు. చెప్పు దెబ్బలు కావాలి!" అంది.
    
    ఈ గొడవకు అందరూ పరిగెత్తుకొచ్చారు. గొడవపడినందుకు మాధవిని వారంరోజులు కాలేజీలో సస్పెండ్ చేశారు. గొడవ నా వల్ల అయిందని వాళ్ళకి తెలీదు! నేను చెప్తానంటే మాధవి చెప్పనీయలేదు.
    
    "నాకు ఈ సంవత్సరం పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం చదివించడానికి అమ్మా నాన్న వున్నారు. నీకు నీమీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు. ఒద్దు....చెప్పొద్దు!" అంది.
    
    నేను కన్నీళ్ళతో తల వూపాను.
    
    అలాగే అది చెప్పినవన్నీ వినివుంటే నా జీవితం ఈ విధంగా వుండి వుండేది కాదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS