Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 2

     "అందని దానికి అర్రులు సాచకూడదని గాంధీగారే చెప్పారు కదా నాన్నా."    
    "ఒరేయ్ నిన్నూ...."    
    "చిన్న చిన్న విషయాలకి అనవసరంగా కోపం తెచ్చుకోకూడదని కూడా ఆయన చెప్పినట్టు గుర్తు-"    
    ఆయన నిస్సహాయుడై కొడుకువైపు చూస్తూ వుండి పోయాడు. రాణా ఆ విధంగా సబ్-ఇన్ స్పెక్టర్ అయ్యాడు.    
    రాణా మనస్తత్వ శాస్త్రం చదువుకోలేదు. రాబర్ట్ లిమ్గర్, డాక్టర్ మాక్స్ ఎవరో కూడా తెలీదు. అయినా అతనికి ఎలా అలవడిందో కానీ జీవితాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా వుంచుకోవడం అలవాటయింది. ఈ ప్రశాంతత అన్నది మనిషికి తను నమ్మిన సిద్దాంతం నిజాయితీగా అమలు జరపడం వల్ల మాత్రమే వస్తుంది. ఆ సిద్దాంతం ఎటువంటిదైనా కానీ, దానివల్ల ఎంతమంది శత్రువులైనా కానీ ఆ సంతోషం అతడి కళ్ళల్లో నిరంతరం ప్రతిబింబిస్తూ వుంటుంది. ఆశ్చర్యకరంగా రాణాకి అది చిన్నతనంనుంచే అలవడింది. చాలా చిన్న వయసులోనే అతడి తల్లి కథలు చెప్పేది. ఆ కథలు రాముడి గురించీ, కృష్ణుడి గురించీ కావు. అతడి తండ్రి గురించి. అభూతకల్పనల కన్నా యదార్ధ గాథలు చిన్ని మనసుల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.    
    గాంధీగారు తమ ఇంటికి వచ్చారన్నది రాణా నమ్మలేని ఒక అద్భుతమైన నిజం!    
    తండ్రిని ఏడిపించటానికి గాంధీని ఉదాహరణగా తీసుకునే వాడే తప్ప, అతడికి తండ్రి అంటే ఎంతో గౌరవం వుండేది. తల్లి పోయిన ఏడాదికి తండ్రి పోయాడు. ఒక స్నేహితుడి దగ్గిర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయినట్టు ఆయన కొడుకు దగ్గిర శలవు తీసుకుని వెళ్ళిపోయాడు. "అక్కయ్య జాగ్రత్త తమ్ముడిని బాగా చూసుకో" లాటి అంపకాలు ఏమీ లేవు. ఆయన చిరునవ్వు వెళ్ళొస్తానంది. అతడి కన్నీటి చుక్క వెళ్ళిరమ్మంది.    
    తండ్రి పోయేటప్పటికి తమ్ముడు తొమ్మిదో క్లాసు చదువుతున్నాడు. అక్క పురుళ్ళకి ఇంటికొచ్చేది. చేసేది సబ్-ఇన్ స్పెక్టర్ ఉద్యోగం. వచ్చే జీతం దేనికీ సరిపోయేది కాదు. తను చేసేది "బంగారపు గని"లో అతడికి తెలుసు.    
    నిజాయితీగా ఆలోచించటం వేరు. నిజాయితీగా బ్రతకటం వేరు. చాలామంది గొప్పగా ఆలోచిస్తూ, మామూలుగా బ్రతికేస్తుంటారు. అక్కకి సిజేరియన్ చేయించవలసి వచ్చింది. అర్జెంటుగా ఐదువేలు కావల్సి వచ్చాయి. మొదటిసారి అతడు లంచం తీసుకున్నాడు. ఒక దొంగసారా కాంట్రాక్టరు దగ్గిర అతడు చేయిసాచాడు.    
    రాణాకి ఆ అనుభవం ఆనందకరంగా ఏమీ అనిపించలేదు. ఆ రాత్రంతా తండ్రి కలలో వస్తూనే వున్నాడు. నిద్రలేక కళ్ళు ఎర్రబడ్డాయి. ఆస్పత్రి నుంచి పిల్లాడిని తీసుకుని అక్క ఇంటికి వచ్చింది. "ఒరేయ్, నీ మేనల్లుడికి నాన్న పేరు పెడదామనుకుంటున్నాన్రా" అన్నప్పుడు, అతడు మరింత గిల్టీగా ఫీలయ్యాడు. ఆమె నిశితమైన దృష్టినుంచి అదేమీ దాటిపోలేదు. వెళ్తూ వెళ్తూ అయిదువేలు అతడి చేతిలో పెట్టింది. అతడు ఆశ్చర్యంగా "ఇదేమిటి అక్కా" అని అడిగాడు.    
    ఆమె పేలవంగా నవ్వి, "నా కోసం నువ్వు ఖర్చుపెట్టిన డబ్బుల్రా" అంది. అతడు విభ్రాంతుడై "ఇవి తిరిగి ఇస్తున్నావా" అన్నాడు. "బావకి తెలియకుండా నీ దగ్గిర ఇంత డబ్బు ఎక్కడిది?"    
    "ఇంత డబ్బు ఎలా సంపాదించావో ముందు నువ్వు చెప్తే సరే" అంది.    
    అతడి దగ్గర జవాబు లేదు. ఆమె అతడి దగ్గిరకి వచ్చి "ఒరే తమ్ముడూ! చిన్నప్పుడు అమ్మచెప్పిన కథలు నువ్వేకాదు. నీతో పాటు నేనూ విన్నాను. నీ బాధ నేను గ్రహించలేననుకున్నావట్రా. నా నగలు కుదవపెట్టాను" అంది. బలమైన కారణం లేదుగానీ అతని కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. ఆ రోజే కాంట్రాక్టర్ కి డబ్బు తిరిగి ఇచ్చేసి, "రేపట్నుంచీ ఈ వ్యాపారం చెయ్యటానికి వీల్లేదు" అని వార్నింగ్ యిచ్చాడు.    
    కాంట్రాక్టర్ తెల్లబోయి "ఈ సబ్-ఇన్ స్పెక్టర్ కి కాస్తంత వెర్రి వున్నట్టుంది" అనుకున్నాడు. ఇచ్చిన లంచాన్ని తిరిగి తీసుకువచ్చి ఇచ్చేసి- వద్దు అనడం అతడికదే ప్రధమం. "పోనీ ఐదువేలూ మిగిలిందిలే" అనుకున్నాడు. అదే అతడు చేసిన తప్పు, మరుసటి రోజు అతని బట్టీలమీద రైడింగ్ జరిగింది. ఇరవై మందిని రాణా అరెస్ట్ చేశాడు. తరువాత ఎవరెవరు ఎలా తమ పలుకుబదులు ఉపయోగించి బయటపడ్డారు; రాణాకి ఎందుకు బదిలీ అయిందీ అన్నవి వేరే విషయాలు. కానీ ఒకటి మాత్రం నిజం.    
    డబ్బులు యిచ్చేశాక క్రితం రోజు బాధ రాణాకి లేదు. హాయిగా నిద్రపోయాడు. మనిషికి హాయిగా నిద్రపోగలగడం కన్నా ఇంకొక వరం లేదన్న సంగతి అతడికి అప్పుడే తెలిసింది. ఆ రకంగా అతడి జీవితపు పుస్తకంలో ఒక కొత్త అధ్యాయాన్ని అతడి అక్క తెరిచింది. ఆ తరువాత అతడు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు కూడా అక్కయ్యే అతడికి కావల్సిన మానసిక బలం యిచ్చింది.    
    ఉద్యోగంలో చేరిన నాలుగు సంవత్సరాలకి అతడికి ఇన్ స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. అప్పటికి రాణాకి పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఏర్పడింది. డిపార్ట్ మెంట్ లోని లోటుపాట్లని కూడా తెలుసుకున్నాడు. అయినా అతడి సిద్దాంతాలలో మార్పేమీ లేదు. ఒక "టఫ్" ఆఫీసర్ గా పేరుపడ్డాడు. అతడితో గొడవ పెట్టుకోవటానికి పైవాళ్ళు కూడా కాస్త తటపటాయించేవాళ్ళు అయితే అతడి ఉద్యోగ జీవితం పూలపాన్పు కాలేదు. అతడు అన్నట్లే, ఒక బంతిలా రాష్ట్రం నలుమూలలకీ తన్నబడ్డాడు. ఈ 'చివరి' పెనాల్టీకిక్ మాత్రం కాస్త బలంగా తగిలింది. దీనిగురించి తెలుసుకోవాలంటే వారంరోజులు వెనక్కి వెళ్ళాలి.                                               *    *    *    
    ఎప్పుడూ నిస్తేజంగా దాదాపు నిర్మానుష్యంగా వుండే ప్రభుత్వ రహదారి బంగ్లా ఆ రోజు కళకళలాడుతూ వుంది. కొత్తగా రంగులు వేయటంవల్ల దానికి కళ వచ్చింది. పోలీసులూ, పైరవీకారులూ హడావుడిగా తిరుగుతున్నారు.    
    ఫెళఫెళలాడుతూ పైన ఎండ అయినా అక్కడ "వేడి" తో పోల్చుకుంటే అది అంత లెక్కలోది కాదు. వస్తూంది హోం మినిష్టర్ మరి!    
    వరుసగా నాలుగు కార్లు, రెండు జీపులూ ఆ కాంపౌండ్ లో ప్రవేశించాయి. అక్కడున్న జనం అంతా వాటిచుట్టూ మూగారు. సరీగ్గా అక్కడికి ఫర్లాంగు దూరంలో వున్న చిన్న సైజు బజార్లో, షాపులకి కాస్త ఇవతలగా ఒక గుడిసెలాంటి తడికల కొట్టులో ఒక ముసలమ్మ కూర్చుని వుంది. ఆమె ముందు నాలుగైదు కుండలున్నాయి. ఒక తడికకి "మజ్జిగ పెద్దగ్లాసు ఇరవై అయిదు పైసలు, చిన్నగ్లాసు-పదిహేను పైసలు" అని వ్రాసి వుంది. షాపుల్లో జరుగుతున్న హడావుడి చూసి ముసలమ్మ, పక్కనే గట్టుమీద జంతికలు అమ్ముతున్న కుర్రాడితో "ఏట్రా వీరాసావీ ఆ గొడవ?" అని అడిగింది.    
    "ఈ రోజు బంద్ అవ్వా దుకాణాలు మూసెయ్యాలె" అన్నాడు. అంతలో అక్కడికి మోటార్ సైకిల్ వచ్చి ఆగింది.    
    "ఒక గ్లాసు మజ్జిగియ్యి."    
    "పెద్దదా? చిన్నదా బాబూ."    
    "ఎండ పేలిపోతోంది. పెద్దదే ఇవ్వు" గ్లాసందుకుని తాగి పావలా యిచ్చాడు.    
    "డబ్బులా? వద్దులే బాబూ"    
    అతడు ఆశ్చర్యంగా "వద్దా? నువ్వు డబ్బులకి కాదా అమ్మేది?" తను వచ్చింది ఉచితంగా దాహం తీర్చే కెంద్రానికేమో అన్న అనుమానంతో అడిగాడు. ముసలామె తటపటాయించింది.    
    "తీసుకో అవ్వా!"    
    ఆవిడ డబ్బులు తీసుకుంటూ, "ఇన్నేళ్ళకి మజ్జిగ తాగి డబ్బులిచ్చిన మొదటి పోలీసోడివి నువ్వే బాబూ" అంది రాణాకి నవ్వాలో, ఆ మాటలకు బాధపడాలో అర్ధం కాలేదు. అంతలో అవ్వ అడిగింది. "దుకాణాలు కట్టెయ్యమంటున్నారు ఎందుకు బాబూ ఈ రోజు బంద్ అట?" అని అతడికి ఎలా వివరించాలో అర్ధంకాలేదు. "ఢిల్లీలో సరీగ్గా పని చెయ్యడం లేదని హైదరాబాద్ ప్రభుత్వం బంద్ చేయిస్తోంది" అన్నాడు.    
    "ప్రభుత్వాలన్నీ ఒకటి కాదా బాబూ"    
    చాలా అమాయకమైన చిన్న ప్రశ్నే రాణా దగ్గిర సమాధానం లేదు. సరీగగా అదే సమయానికి రహదారి బంగ్లాముందు ఒక లారీ వచ్చి ఆగింది. అందులోంచి ఇరవై మంది గూండాలు దిగారు. బనీను పంచెల్తో కొందరూ, ఫాంటూ షర్టులతో కొందరూ వున్నారు. చేతుల్లో వున్న ఆయుధాల్ని వారేమీ దాచుకునే ప్రయత్నం చేయటంలేదు.    
    ముందు కార్లోంచి దిగుతూన్న హోం మినిష్టర్ దగ్గరికి డి.ఐ.జి. పరుగెత్తుకు వచ్చాడు (డి.ఐ.జి.) అస్తి పంజరానికి బట్టలు తొడిగినట్టు వున్నాడు. పక్కనెవరైనా గట్టిగా తుమ్మితే ఉలిక్కిపడి ఆంజనేయ దండకం చదివేవాడిలా వున్నాడు. హోం మినిష్టర్ పొడుగ్గా వున్నాడు. మధ్యపాపిడి, నొక్కుల జుట్టు, కాళ్ళకి బిగుతుగా వుండే పైజమా వేసుకుని, వదులు లాల్చీతో వున్నాడు. కాస్త మేకప్ మారుస్తే నర్తనశాల బృహన్నలవుతాడు. డి.ఐ.జి. లంటే భారీ విగ్రహాలు, హోం మినిష్టర్లంటే పెద్ద రౌడీల్లా వుంటారు అని అనుకుంటే పొరపాటు అని వాళ్ళిద్దరూ నిరూపిస్తారు.    
    అతడు హోం మినిష్టర్ అవటానికి కారణభూతురాలైన స్త్రీ నెమ్మదిగా కారులోంచి దిగింది. అందరి దృష్టి ఆమెమీద పడింది. ఖాకీఫాంటు వేసుకున్న వాడినుంచీ, ఖద్దరు చొక్కా వేసుకున్న వాడివరకూ ఆమెనే చూస్తున్నారు. ఆమె సుతారంగా కారు దిగుతూ అక్కడ వున్న వారందరికీ చిరునవ్వుతో నమస్కారం చేసింది.    
    హోం మినిష్టర్ భార్య ఆమె!    
    అతగాణ్ణి హోం మినిష్టర్ చేసింది ఆమే!    
    ఆమె పేరు కామిని. ఆమె ఒకప్పుడు ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించిన అభినేత్రి. ఆమె నటించిన సినిమాలు కనకవర్షం కురిపించేవి. ఆ తరువాత ఆమె రాజకీయాలవైపు ఆకర్షింపబడింది. అయితే స్వయంగా పాల్గొనలేదు, పార్టీ తరఫున ప్రచారం చేసింది. ఆమె ఉపన్యాసాలకు జనం లక్షల సంఖ్యలో వచ్చేవారు. ఆమె ప్రచారం చేసిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమెకు ఏ పదవి కావాలంటే అది ఇచ్చేటందుకు పార్టీ సిద్దంగా వుంది. కానీ ఆమె తిరస్కరించింది.    
    ఆమె భర్త పేరు టి.కె.రెడ్డి అతని పూర్తిపేరు ఎవరికీ తెలీదు. కామిని సినీఫీల్డులో నిలదొక్కుకుంటున్న కాలంలో ఆమెకో నోటీసు పోస్టులో వచ్చింది. అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. బుచ్చిరెడ్డిపాలెంకి పదికిలోమీటర్ల దూరంలో వున్న పల్లెనుంచి వచ్చిన ఆ నోటీసు సారాంశం ఏమిటంటే "కామిని వురఫ్ కామేశ్వరి, తన పదిహేనేళ్ళ వయసులో కన్నారెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుందని, పొలంలో కూలిపని చేసే (ప్రస్తుతం కీర్తిశేషుడైన) కామేశ్వరి తండ్రి ఈ వివాహం జరిపినట్టు ఋజువులున్నాయనీ" వగైరా వగైరా కామిని కంగారుపడలేదు. కన్నారెడ్డిని పిలిపించింది. అతడు ఇద్దరు ముగ్గురు పెద్దమనుషుల్ని తీసుకుని బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చాడు. "చూడమ్మాయ్. శుభ్రంగా కాపురం చేసుకో నువ్విలా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన సంగతి మేం మర్చిపోతాం. ఈ కోర్టు గొడవలూ అవీ నువ్వు పడలేవు" అన్నారు వాళ్ళు.    
    కామిని నవ్వింది. "పది సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన నేను ఇప్పుడు గుర్తొచ్చానా? లేక నా పొజిషన్ గుర్తుకు తెచ్చిందా?" అని అడిగింది వాళ్ళు మాట్లాడలేదు కన్నారెడ్డిని లోపలికి తీసుకెళ్ళి ప్రైవేటుగా మాట్లాడింది.    
    "చూడూ, నేను నిన్ను పెళ్ళాడినప్పుడు ఎంత అమాయకంగా వున్నావో ఇప్పుడూ అంత అమాయకంగా వున్నావ్. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. అదెవరో నువ్వు కరెక్ట్ గా చెప్తే నేను నిన్ను ఏలుకుంటాను. లేదంటావా....సై.....చూసుకుందాం. నువ్వు నా వైపా వాళ్ళ వైపా అని తేల్చుకోవడానికి ఇదో పరీక్ష" అంది కన్నారెడ్డి నిజాయితీగా "నేనూ ఒక లాయరూ కలిసి ఇదంతా చేస్తున్నాం. రెండు లక్షలు ఇస్తే నీ సంగతి మర్చిపోతాను" అన్నాడు.    
    "అందులో ఆ లాయర్ కెంత ఇవ్వాలి?"    
    "అది నీ కనవసరం."    
    ఆమె బాత్ రూమ్ తలుపు తెరిచి, "ఇతనేనా మీ లాయరు?" అంది.    
    లోపల దృశ్యాన్ని టి.కె. రెడ్డి జీవితాంతం మర్చిపోలేదు. (అలా మర్చిపోలేకపోవటం అతడికి లాభించింది కూడా) లోపల గచ్చుమీద కుర్రలాయరు పడివున్నాడు. రాత్రే కొట్టిన దెబ్బలేమో ఇంకా ఫ్రెష్ గా వున్నాయి. ఇంకో అరగంట అలా వదిలేస్తే ప్రాణాలు పోవటం ఖాయం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS