Next Page 
లవ్ మర్డర్స్  పేజి 1

                    

                   లవ్ మర్డర్స్

                                   __కురుమద్దాలి విజయలక్ష్మి

       

    "అమ్మడూ! జాగ్రత్త రేపు ఉదయం సర్కార్ లో వస్తాము"

    "నాన్నగారూ! నేనేం చిన్న పిల్లనుకాను. ఈ ఉదయం నుంచి ఇప్పటికి 'జాగ్రత్త..... జాగ్రత్త' అంటూ కనీసం వందసార్లయినా చెప్పి వుంటారు" అంది అమల నవ్వుతూ.

    అమల తెలివికి మురిసిపోతూ "చూచావటే రాజేశ్వరి! అమ్మడంటే అల్లాటప్పా కాదు" అని ఫక్కున నవ్వారు పరంధామయ్యగారు.

    పరంధామయ్య, రాజేశ్వరమ్మలకి, అమల ఏకైక సంతానం. అమిత గారాబంగా పెంచినా అమల బుద్ధిమంతురాలు, తెలివి కలదీ.

    "అమలకి అప్పుడే ఇరవై ఏళ్లు నిండాయి. దిక్కుమాలిన చదువు ఎవరిని ఉద్ధరించను? పెళ్ళి చేస్తే ఈ పాటికి పిల్లల తల్లయి కళకళలాడుతూ వుండేది" అంటుంది రాజేశ్వరమ్మ. ఆడపిల్లలకు పెళ్ళి, పిల్లలు, అనుకూల దాంపత్యం చాలని ఆమె అభిప్రాయం.

    "అమ్మడు ఇష్టపడ్డప్పుడే పెళ్ళి పేరంటం. పెళ్ళిమాట నా ముందేత్తకు. దానిష్టమొచ్చినంత చదువుకోని" అంటారు పరంధామయ్య.

    పెద్ద చదువులు చదవటం, గొప్ప పనులు చేయటం అమలకు ఇష్టం. ప్రస్తుతం బి.ఏ. చదువుతున్నది.

    పక్కఊళ్ళోనే చుట్టాలింటిలో పెళ్ళి. వాళ్ళయినా చాలాదూరం చుట్టాలు. బీదవాళ్ళు, పెళ్లిరాత్రి  ఒంటిగంటకి అందుకే సర్కార్ లో ఏడుగంటలకు బైలుదేరి తిరిగి ఉదయం సర్కార్ లో రావాలని అనుకున్నారు.

    తెల్లవారితే పరీక్షలు. అందుకే పెళ్ళికి రానంది అమల.

    పరంధామయ్య, రాజేశ్వరమ్మ ఎక్కిన రిక్షా బైలుదేరింది.

    రిక్షా వీధి మలుపు తిరిగిందాకా చూచి ఇంటిలోకి వచ్చి తలుపు గడియ బిగించింది అమల.

    పరంధామయ్య ఇల్లు పెద్దది అంటే, పన్నెండు పెద్ద గదులున్నది. మూడు గదులు చిన్న కాపురానికి అద్దెకిచ్చారు. ఆ వాటాలో వాళ్ళు యాత్రల నిమిత్తం పదిరోజుల క్రితం తమ వాటాకి తాళంవేసి వెళ్ళిపోయారు.

    అమల సహజంగా ధైర్యం కలది కాబట్టే ధైర్యంగా తల్లి తండ్రులను పంపించి, ధైర్యంగా వుంది.

    అమల భోజనం ఎనిమిది గంటలకే చేసింది. కాసేపు విశ్రాంతిగా మంచంమీద మేనువాల్చింది. తెల్లవారి బి.ఎ. పబ్లిక్ పరీక్షలు మొదలు. పుస్తకాలు ముందేసుకుని చదవసాగింది.


                                                       2


    "ఇటోక్కసారి చూడు....."

    కీచుగా వినిపించింది కిటికీలోంచి, అమల క్షణం కోయ్యబారిపోయింది.

    "నీకే చెప్పేది? ఇటోక్కసారి చూడు."

    మళ్ళి అదే కీచు కంఠం. అమల చదువుతున్న పుస్తకం తెలియకుండానే చేతిలోంచి జారిపోయింది. గుండె దడదడలాడింది.

    అమల భయం కప్పి పుచ్చుకుని, చటుక్కున తల ఎత్తింది కిటికీ వైపు.

    కిటికీకి ఆనుకుని ఓ వికృతాకారుడు నుంచునివున్నాడు. అతని రెండు చేతులు కిటికీ ఊచలను పట్టుకుని వున్నాయి. అమల వణికిపోతూనే విసురుగా లేచి వేగంగా కిటికీ తలుపులు వేయబోయింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS