Next Page 
హృదయాంజలి పేజి 1

   
                      హృదయాంజలి
               
                                       __పోల్కంపల్లి శాంతాదేవి    

    పాడిపంటలతో విలసిల్లే చిన్న పల్లెటూరు అది!

    ఆ ఊరికి అతడు వార్తా పత్రికలాంటివాడు.

    మరి ఎందరికో కరదీపిక లాంటివాడు.

    కమ్మని కంఠంతో పద్యాలు, పాటలు పాడగలడు. పురాణాలు వినిపించగలడు. నాటకాలు ఆడగలడు. ఆడించగలడు. సాగర కెరటంలా అవిశ్రాంతంగా ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించుకొంటూనే ఉంటాడు.
 
    అతనికో చల్లని సంసారం!

    చక్కని నలుగురు బిడ్డలు!

    అనురాగవతి అయిన భార్య.
 
    అమృతాన్ని పంచే తల్లి.

    పసుపు కుంకుమలు దిద్దుకొన్న గుమ్మాలతో, తీర్చిదిద్దిన రంగవల్లులతో అలరారే అందమైన లోగిలి. వసారా దాటి లోపలికి అడుగు పెడుతూనే పెరటిలోంచి కనిపిస్తూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్టుగా తులసి కోట. ఆ ప్రక్కనే కామధేనువులా కనిపించే గోమాత. 

    ఆయన పేరు సుప్రసన్నాచారి!
    తెలుగు టీచరు. ప్రక్క గ్రామంలో ఆయన ఉద్యోగం.
    రోజూ సైకిల్ మీద వెళ్ళి వస్తుంటాడు.


        *    *    *

    ఓ అందమైన సాయంకాలం.
    సూర్య తాపం అప్పుడే తగ్గింది.
    పిల్లలంతా ముంగిళ్ళలో ఆడుకొంటున్నారు. దాగుడుమూతలాట.
    సుప్రసన్నాచారి తల్లి అనంతలక్ష్మమ్మ పిల్లలకి కళ్ళు మూస్తోంది.
 
    "దాయిళ్ళు మూయిళ్ళు దండారి కోయిళ్ళు..... పిల్లవచ్చే ఎలుక భద్రం.... ఎక్కడి దొంగలు అక్కడే.... గప్ చిప్...." అంటోంది మూడేసిసార్లు.
 
    వాళ్ళ వాకిట్లో ఆరేడుమంది పిల్లలు దాక్కొన్నారు. ఎవరికీ ఇంకా పదేళ్ళు దాటి ఉండవు.
    పిల్లలంతా తలా ఓ దిక్కు దాక్కోవడానికి పరుగుదీస్తున్నారు. ఎంత రహస్య స్థలంలో దాగినా ఎవరో ఒకరు దొంగ కాక తప్పడం లేదు.
 
    అనంతలక్ష్మమ్మగారు దొంగయి తన ముందుకువచ్చి కూర్చొన్న వాళ్ళకు కళ్ళుమూసి, ఓపికగా మూడేసిసార్లు "దాయిళ్ళు మూయిళ్ళు....." అంటూంది.
 
    ఈ ఇంటికి ఎదురుగా విశాలమైన ప్రహరీగోడవున్న పెద్ద గేటొకటి ఉంది. కొద్దిగా తెరుచుకొన్న గేటు దగ్గర ఒక అబ్బాయి నిలబడి వున్నాడు. పదేళ్ళుంటాయి. ముట్టుకొంటే మాసిపోయేలా తెల్లటి తెలుపు అబ్బాయి ఒంటి రంగు. అంతకంటే తెల్లటి తెలుపు అతడు వేసుకొన్న సమ్మర్ చొక్కా. అప్పుడే స్నానం చేశాడేమో ముఖంమీద ఫ్రెష్ గా మెరుస్తూంది పౌడరు. నీట్ గా క్రాఫ్ దువ్వుకొని కడిగిన ముత్యంలా వున్నాడు. వీళ్ళ ఆటని ఆసక్తిగా చూస్తున్నాడు.
 
    నీలం నిక్కరు వేసుకొన్న ఒక అబ్బాయికి ఎంతకీ దాక్కున్న వాళ్ళు ఒక్కరు కూడా దొరకలేదు.
    నిస్పృహగా వెనక్కి తిరిగివచ్చి గేటు దగ్గరున్న అబ్బాయిని మెల్లిగా అడిగాడు. " ఎక్కడ దాక్కున్నారు?"
    అతడు చేత్తో సైగచేశాడు - ప్రక్కింటి వాళ్ళ గడ్డివాము వెనుక దాక్కున్నారని.

    అడిగిన అబ్బాయి గడ్డివాము వెనక్కి పరిగెత్తి, ఒక అమ్మాయిని పట్టుకొని, "అపూ చోర్! అపూ చోర్ అయింది!"  అని అరిచాడు.
 
    అపూ అన్న ఆ పిల్ల గేటు దగ్గర నిల్చున్న అబ్బాయి దగ్గరికి వచ్చి రౌద్రంగా అడిగింది. "గడ్డివాము వెనక దాక్కున్నామని ప్రభుకెందుకు చెప్పావు?"

    "నేను చెప్పలేదు!"
 
    "నువ్వు సైగ చేయడం నేను చూశాను!"

    "......." కళ్ళు మిటకరించి చూడడం తప్ప మరో మాట రాలేదు ఆ తెల్లచొక్కా అబ్బాయికి.
    "మరోసారి చెప్పావంటే మర్యాదుండదు. జాగ్రత్త!" ఆ అమ్మాయి మహా సీరియస్ గా వార్నింగ్ యిచ్చి ముసలావిడ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూయించుకొంది.
 
    ముసలావిడ ఆ పిల్లకళ్ళుమూసి  "......ఎక్కడి దొంగలు అక్కడే! గప్ చుప్!" అని కళ్ళు తెరవగానే తూనీగలా పరిగెత్తింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS