Next Page 
మంత్రముగ్ధ పేజి 1

                                           
                                                         మంత్ర ముగ్ధ
 
                                                                                        ___లల్లా దేవి

   
    శృంగార భంగిమలో వెన్నెల తీగలా నిలిచి ఉందామె!

    చివురాకుల్లా రక్త వర్ణాన్ని చిమ్ముతున్న పెదవులు రావంతగా విచ్చుకున్నాయి. ముత్యాల పేరులాంటి
పలువరుస తృటి కాలం తరలించి చిరుదరహాసాన్ని తలపించింది.

    నిండారిన వెన్నెల విశ్వమంతా పరచుకుంది.

    "ఇంకా ఎంతసేపని అలా మౌనంగా ఉండి పోతావు?" చెక్కిలి మీద చేతులానించి చెలిమిగా ప్రశ్నించాడు శివరాజ్! సంకోచంగా రెండడుగులు వెనక్కు వేసింది!

    "మీ రెందుకింతగా తొందరపడుతున్నారో తెలుసునాకు!" అంది.

    "తొలిరేయి తొందరపాటుసహజం కదా తులసీ!"

    పెళ్ళికి కూడా మీరిలాగే తొందరపడ్డారు. పెళ్ళికి మీ తొందర!

    తొలిరేయి ముహూర్తం తొందర!"

    "ఇప్పుడు నీ వయసెంతో నీకు గుర్తుందా? పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోతావు. ఇప్పుడు నీ ముందు నేనున్నాను. గుర్తించావా డార్లింగ్? భర్తను కదా? బ్రతిమాలుకుంటున్నాను."

    ఆమె కరిగిపోయింది. కన్నులు చెమరించాయి.

    "ఇటువంటి పరిస్థితి రాకూడదనే ముందుగా పెళ్ళి వద్దన్నాను. ఎంత తొందర మీకు చెప్పినమాట వింటారా? అంతా పోలీసు బుద్ది!"

    "నిన్ను అరెస్టు చేయటం నా వల్ల కాలేదు"

    "అరెస్టు చేయకపోయినా అదుపులోకి తీసుకున్నారు కదా మిస్టర్ శివరాజ్ ఎ.ఎస్.పి. గారు. మీరు ఐ.పి.ఎస్. పూర్తిచేసి ట్రయినింగ్ పాసవటానికి కనీసం అయిదారు దండయాత్రలు జరుగుతాయనుకున్నాను. కాని నేను ధీసిస్ సమర్పించకుండానే మీరు హడావిడిగా అన్నీ పూర్తి చేసుకుని వచ్చేశారు."

    "అవునోయ్ మరి? పెళ్ళి ఆలస్యమయిపోతోందని గుర్తుకు రాగానే క్లాసులు కూడ దంచుకొచ్చేశాయి. బాగా ఆకలిమీదున్నాను. అలమటించేలా చేస్తున్నావు. కరుణించావా?"

    "పెళ్ళికి ముందు నేను చెప్పిన షరతులు మీకు గుర్తున్నాయా? మర్చిపోయారా?"

    "ఎలా మర్చిపోతాను ప్రేయసీ! చెప్పింది నువ్వు కదా!?"

    "ఆడిన మాట తప్పకూడదు. భార్యకిచ్చిన వాగ్దానం ఒదులుకుంటారా?"

    "వాగ్దానం వదిలి పెట్టుకుంటామని ఎవరన్నారు?" అన్నాడు గోముగా!

    "అయితే మరి ఈ తొందరెందుకు?"

    "నేను నీకిచ్చిన వాగ్దానం ఏమిటి?"

    "ధీసిస్ పూర్తి అయేంతవరకూ పిల్లలు పుట్టకూదదని!"

    "అలాకాకుండా చాలా దారులున్నాయి. డాక్టర్స్ ని అడిగితే యిస్తారు"

    "అలాంటి ప్రక్కదారులు నాకిష్టం లేదని కూడ చెప్పాను"

    "ముద్దు పెట్టుకుంటే కూడ పిల్లలు పుడతారేంటి?" బుంగమూతి పెట్టాడు.

    "అదా శ్రీవారి కోరిక! అయితే ఓకే! నాకేమి అభ్యంతరం లేదు"

    ఇండియన్ పోలీస్ సర్విస్ లో ఎ.ఎస్.పి. గా రిక్రూట్ అయి వచ్చి నెల కూడ తిరగని శివరాజ్ చెంగున దూకాడు!

    ఈసారి అడుగయినా కదపలేదు తులసి!

    మనీప్లాంట్ చివుళ్ళు త్రుంచుతూ నిలబడింది! తెల్లని చీరలో వెన్నెల బొమ్మలా, మన్మధ రేఖలా ఉన్నా ఆమెను ఆక్రమించుకున్నాడు.

    ఉక్కిరిబిక్కిరి అయింది. అవకాశం దొరికిందే చాలునని అతడామెను కౌగిలినించి విడిచి పెట్టలేదు. చేతులు బిగించేశాడు.

    "మీ పోలీసుదాడికి ఊపిరాడదు. విడిచి పెట్టండి బాబూ!" బ్రతిమాలుకుంది. ఆమె నలాగే పొదివి పట్టుకుని నడిపించి తీసుకువచ్చి ఊయల మీద ప్రక్కనే కూర్చో పెట్టుకున్నాడు.

    "గాలికి నీ ముంగురులు నుదురుమీద అల్లరిచేస్తున్నాయి డార్లింగ్!"

    "రోడ్ మీద మీ చేతివేళ్ళు కూడ అల్లరి చేస్తున్నాయి. ఆడపిల్ల అంటే వరుడికయినా, వాయుదేవుడి కయినా అల్లరి చేయాలని పిస్తుంది కాబోలు! అందాన్ని చూస్తే ఆశ! ఆడపిల్లని చూస్తే అలుసు!"

    "లెక్చరర్ వి కావాలనుకుంటున్నావు కదా!" పోలీసు ఆఫీసర్ కి పాఠాలు మొదలెట్టావన్నమాట?"
    "ఇది జీవితం కదా! ఎప్పుడే అవసరం వస్తుందో ఎవరికీ తెలుసు!" రాగరంజితమై అరుణాంచితమైన పగడపు దవ్వల్లాంటి మునివేళ్ళతో పెదవులమీద తట్టి మరీ చెప్పింది తులసి!

    "నువ్వు చాలా లోతులకు వెళ్ళి మాట్లాడుతున్నావు?" ఇంకా తన ఆటలు సాగవని గుర్తించిన శివరాజ్ ఆమె ఒడిలో తల ఉంచి ఊయల మీదనే కాళ్ళు బారజాపేశాడు. చేతిని వెనుకగా త్రిప్పి ఆమె భుజం మీద వేశాడు.
   


Next Page 

  • WRITERS
    PUBLICATIONS