Next Page 
హిమసుందరి పేజి 1

          

                    హిమ సుందరి
   
                                                                             __కురుమద్దాలి విజయలక్ష్మి


    "ఏమిటి విషయం?" అన్నట్లు కనుబొమలు ఎగరేసి, స్కూటర్ లాక్ చేస్తూ అడిగాడు రామకృష్ణ.

    "ఏముంది?" అంది సీత.

    "మామ్మగారితో బాగా కాలక్షేపం అవుతున్నట్లు ఉంది?"

    "నా కాలక్షేపం సంగతి అలా ఉంచండి. మీరేమిటి - ఇవాళ ఇంటికి తొందరగా వచ్చారు?"

    "హా - హతవిధీ!"

    "ముందా నాటకాల భాష, ఓవర్ ఏక్షన్ మానేసి- విషయానికి రండి!"

    "ఆఫేస్ నుంచి భర్త తొందరగా ఇంటికి రాకపోతే భార్య బాధపడుతుంది. నాలాంటి భార్యావిధేయుడు బిఫోర్ టైము అఘోరిస్తే - వచ్చినందుకు సంతోషించక - ముందే ఎందుకు వచ్చారంటూ కళ్ళెర్రజేస్తే - తల పట్టుకుని హా - హతవిధీ! అంటే తప్పయిందా?"

    "నేను కళ్ళు ఎర్రజేశానా?" సీత రామకృష్ణ ముఖంలో ముఖంపెట్టి మరీ అడిగింది.

    "మరి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి కదా!"

    "ఉదయం తలంటి పోసుకుంటుంటే కుంకుడు పులుసు కళ్ళల్లో పడి కళ్ళు ఎర్రబడ్డాయి."

    "ఆ విషయం నాకేం తెలుసు? అయినా అసలే పెద్ద కళ్ళు. ఆ కళ్ళని అలా తెరిచి పెట్టుకుని తలంటి ఎవరు పోసుకోమన్నారుట?"

    "నేను కళ్ళు తెరుచుకుని పోసుకున్నానో - కళ్ళు మూసుకుని పోసుకున్నానో మీరు చూశారా?"

    "నన్నేప్పుడయినా అలాంటి సీను చూడనిచ్చావా! ఓ సమయంలో భర్తముందు పూర్తిగా సిగ్గు విడిచేసిన భార్య స్నానం చేసేటప్పుడు మరికొన్ని సందర్భాలలో భర్తని దూరంగా...."

    "సెన్సార్!" అరిచింది సీత.

    రామకృష్ణ సీరియస్ గా ముఖంపెట్టి - "కష్టపడి సినిమా తీసినవాళ్ళు సెన్సార్ బోర్డ్ వాళ్ళని ఎందుకు తిడతారో ఇప్పుడు అర్ధమయింది, నిజాన్ని వాళ్ళు భరించలేరు. నీవూ అంతే!" కోపంగా అని బెడ్ రూమ్ లోకి వెళ్లాడు.

    సీత "హూ" అంది. పైటకి దుమ్ము, ధూళి లేకపోయినా కోపంతో గట్టిగా విదిలించి, విసవిస నడుస్తూ వంట గదిలోకి వెళ్ళిపోయింది.

    రామకృష్ణ, సీతా మనోహరి మూడు నెలలనుంచి కలసి కాపురం చేస్తున్న కొత్త దంపతులు. కలసి ఉంటే కలదు సుఖం అన్నది వాళ్లకి ఈ మూడు నెలల బట్టి తియ్యటి అనుభవం. పోట్లాడుకుని విడిపోయి, కోపంతో పళ్ళు నూరుకుని ఆ తర్వాత కలుసుకుంటే ఆ ఆనందం, ఆ అనుభవం, ఆ అనుభూతి మా గొప్పగా ఉంటాయని ఓ దిక్కుమాలిన గొప్ప తెలుగు నవలలో రామకృష్ణ, సీతామనోహరి చదివారు. వాళ్లకి ఇంతవరకూ ఏ విషయంలో పోట్లాట రాలేదు, కోపమూ రాలేదు. ఆలాంటప్పుడు కోపంతో విడిపోయి కలుసుకుని, ఆ మధురం ఎలా చవి చూడాలి? అందుకే తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళినట్లు వీళ్ళిద్దరూ ఆ కొత్త అనుభవం చవి చూడాలని ఎవరికి వారే శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

    ఆ ప్రయత్నంలో భాగమే ఇప్పుడు జరిగింది.

    రామక్రిష్ణ ఆఫీస్ డ్రస్ మార్చేసి, మధుర ప్రింట్స్ ఉన్న లుంగీ, మల్లెపూవు రంగు లాల్చీ ధరించి వంటింట్లోకి వచ్చి డైనింగ్ టేబిల్ ముందు కుర్చీలో కూర్చుంటూ "లాభం లేదు సీతా!" అన్నాడు.

    "నిజమే!" అంది సీత.

    "మనకీ జన్మకి కోపం రాదు."

    "వస్తుంది పరాయి వాళ్ళమీద.... అంతేగాని- మీ మీద నాకు, నామీద మీకూ మటుకు కోపం రాదు."

    "అంతేనా?" దిగాలు పడిపోతూ అడిగాడు రామకృష్ణ.

    "ఈ జన్మకి ఇంతే. దేనికయినా యోగం ఉండాలి. పెట్టి పుట్టాలి" విచారంగా ముఖంపెట్టి భారంగా పలికింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS