Next Page 
నెత్తుటిబొట్టు పేజి 1

                                                   

                                                                  నెత్తుటి బొట్టు
                                                                                              ----- కొమ్మూరి వేణుగోపాలరావు



    ఆ చిన్న పెంకుటింట్లోని దక్షిణం వైపున్న పడకగది బూజు బూజుగా వుండి, చాలీచాలని విద్యుద్దీపకాంతిలో వెలవెలాపోతోంది.

    గదిలో ఓ ప్రక్క గోడ కానుకుని చిన్న నులకమంచం వుంది. దానిమీద మాసి చారలు కట్టి వున్న పరుపు, దానికి సరిపడీ పడనట్లు చిరిగి పీలికలైవున్న నీలం రంగు దుప్పటి.

    మంచంమీద ఇరవై ఏళ్ళ యువతి బాధలో మెలితిరిగిపోతూ ప్రసవవేదన పడుతోంది. ఎంత ఆపుకుందామన్నా నిగ్రహించుకోలేక వున్నట్టుంది. "అమ్మో" అన్న కేకలు వేస్తోంది.

    గదిలో ప్రసవవేదన పడుతున్న యువతి గాక ఇంకో అమ్మాయి కూడా వుంది. ఆ అమ్మాయి పదహారేళ్ళకు మించి వుండవు. చెంపకు చారడేసివున్న పెద్దపెద్ద కళ్ళు. వాటిలోంచి ప్రసరించే అమాయకమైన చూపులు. ఇంట్లో వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు. ఆ విషమ స్థితిలో ఏమిచెయ్యాలో తోచక ఆ పిల్ల బిత్తర పోతోంది.

    ఆ అమ్మాయి పేరు ప్రజ్ఞ.

    అక్కయ్యకు నెలలు నిండాక సాయం కోసం రమ్మని రాస్తే కొద్దిరోజుల క్రితమిక్కడికి వచ్చింది. అక్కయ్యకు నెలలు నిండాయి, చేసేవారు ఎవరూ లేరని చెప్పి చెల్లెళ్ళను పిలిపించుకోవడం రావడం మూడు నెలలు పోయి వెట్టి చాకిరీచేస్తూ వాళ్ళక్కడ వుండిపోవాల్సిరావడం మధ్యతరగతి కుటుంబాల్లో పరిపాటి. అలా వుండిపోయినప్పుడు కొన్ని అనర్ధాలు జరుగుతూ ఉండడం కూడా కద్దు.

    ప్రజ్ఞ విషయంలో అలాంటి అనర్ధమేమీ జరగలేదుగానీ, జరక్కుండా తప్పించుకునేందుకు ఎంత ప్రయాసపడాల్సివచ్చిందో ఆమె త్రికరణ శుద్దిగా నమ్మిన దేవుడుకి తెలుసు.

    "అక్కయ్యా !" అంది వణికే గొంతుతో మంచంమీద ఆమె తల దగ్గర కూర్చుని.

    అరుంధతి కళ్ళు పైకెత్తి చెల్లెలివైపు దీనంగా చూసింది. అలా చూసినప్పుడు రక్తహీనతవల్ల కనురెప్పల క్రింద ఏర్పడిన తెల్లదనం గుండె కళుక్కుమనేటట్లు కనిపించింది.

    "ఎలా వుందక్కయ్యా ?"

    అరుంధతి పాలిపోయిన పెదవులు నవ్వటానికి ప్రయత్నించాయి. ఇంతలోనే పెద్ద నొప్పి తెర వచ్చి బాధతో మెలికలు తిరిగిపోయింది.

    "అక్కయ్యా ! అక్కయ్యా" అని పిలుస్తోంది ప్రజ్ఞ ఆందోళనతో. ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

    "బావ... బావను పిల్చుకురా" పక్కమీద పడుకున్న యువతిహీన స్వరంతో అంది.

    "బావ...ఇప్పుడెక్కడుంటాడక్కయ్యా ?"

    "అక్కడే... అక్కడే ..."

    'అక్కడే' కు అర్ధం ప్రజ్ఞకు తెలుసు. సరిగ్గా దారి కూడా తెలియని కొత్త ప్రదేశంలో వేళకాని వేళలో, ఇంకా ప్రపంచమంటే ఏమీ తెలియని వయసులో వున్న ఆడపిల్ల _ ఆ ఇల్లు వెదుక్కుంటూ ఎలా పోగలదు ?

    కాని అక్కయ్య స్థితి చూస్తే అంతకన్న గత్యంతరం లేదనిపిస్తోంది. ఇరుగు పొరుగు అన్నీ పూరిళ్ళు. వాళ్ళతో ఎక్కువగా పరిచయం కూడా లేదు.

    ఒక్క నిమిషం స్తబ్దుగా నిలబడి, చిన్న చిన్న నిట్టూర్పు విడిచి తలుపు దగ్గరగా వేచి, బయటకు వచ్చింది. ఆమెకు భగవంతుడంటే ఎనలేని భక్తి. రోజూ ఉదయం స్నానం చెయ్యగానే గంటసేపయినా పూజ చేస్తుంది. భక్తే కాక భగవంతునిపై అచంచలమైన విశ్వాసం. మనసులో ఆయన్ని ధ్యానించుకుని రోడ్డుమీద అడుగు పెట్టింది.

    'ఆ ఇల్లు' తనకు తెలుసు. అక్కయ్య ఓసారి ఏదో పనిమీద అటు తీసుకుపోతూ దూరంనుంచి చూపించింది. చిన్న చిన్న సందులు గుర్తు పెట్టుకుంటూ అటూ ఇటూ బిక్క చూపులు చూస్తూ భయం భయంగా అడుగులు వేస్తున్నది ప్రజ్ఞ.

    ఓ చిన్న సందులోకి మళ్లి నడుస్తున్నది. ఆ లొకాలిటీ అంతా నిర్మానుష్యంగా వున్నది. ఆమె గుండె గబగబ కొట్టుకుంటున్నది. త్వరగా అక్కడనుంచి బయటపడాలని ఆరాటపడుతూ ముందుకు సాగుతుండగా, వున్నట్టుండి వెనుకనుంచి అడుగుల చప్పుడు వినవచ్చింది. వద్దు వద్దను కుంటూనే తల త్రిప్పి చూసింది. నలుగురు యువకులు దూరంనుంచి ప్రసరిస్తోన్న స్ట్రీట్ లైట్ కాంతిలో కనిపించారు. ఆమె అమాయకురాలే అయినా తెలివితక్కువదేమీ కాదు. ఒకే ఒక్క చూపులో వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టీ, మొహాల తీరును బట్టి ఎలాంటి వారో గ్రహించి వేసింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS