Next Page 
ఉష్ ష్ ష్..... పేజి 1

                                              ఉష్ ష్ ష్.....

 

                                                                                                --మల్లిక్

    అర్ధరాత్రి....

    సమయం ఒంటిగంట అయ్యింది.... 

    దేశంలోని జీవరాసి సమస్తం నిద్ర అనే తాత్కాలిక మృత్యువు ఒడిలో ఒరిగిపోయి వుంది. అదొక లోకం!...శారీరకమైన చలనం లేని లోకం!

    మనిషి నిద్రపోతే ఏమవుతాడు ?తాత్కాలికంగా మరణిస్తాడా ?....మరి .....ఊపిరి అడ్తుందే....కల మాటో ?....మనిషి నిద్రపోతే శరీరం విశ్రాంతి తీసుకోంటుంది ....మరి అత్మో ?.... ఆత్మకూడా  విశ్రాంతి తీస్కుంటుందా?సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినా ఏ శాస్రజ్ఞుడైనా దీనికి నిర్వచనం యివ్వాగలుగుతడా?

    ఉహు .....!

    ఈ సందేహాలతో సంబందం లేకుండా రాత్రి నిశబ్దంగా కునుకు తీస్తుంది .

    కానీ  ప్రణయ ?

    అతని శరీరము ,మనసూ రెండు విశ్రాంతి తీసుకోవడంలేదు .అతని మనసునిండా గందరగోళంగా ఏ వే వో ఆలోచనలు

    చాలా ఆలోచనలు !

    ఓ రూపం లేని ,ఒక కొలిక్కిరాని ఆలోచనలు !!!

    అలా గందరగోళంగా వున్న మనసుతో అతను నడుస్తున్నాడు చీకట్లో .

    నిశ్శబ్ద సంగీతాన్ని చీకటి రాగంలో ఆలపిస్తున్నరాత్రి తాళం

    నడుస్తున్నాడు.

    ఎక్కడికి?

    ఏమో?

    అతనికే తెలీదు.

    కర.....కర....కర

    కాలికింద ఏదో పడి నగిలింది చిట్లుతూ.

    క్రిందికి వంగి చూసి ఉలిక్కిపడ్డాడు.

    మనిషి పుర్రె...

    అప్పుడు గమనించాడు-

    అది శ్మశానం....

    అతనికి కాస్త దూరంలో చితిమంటలు కనిపించాయి!

    ఒక్కసారిగా అతని మనసును భయం ఆవహించింది.

    భయం భయంగా చుట్టూ చూశాడు.

    మనిషి మరణించిన తరువాత ఏమవుతాడు?

    పురాణాలలో చెబుతున్న విధంగా స్వర్గానికో, నరకానికో వెళ్తాడా?   

    మనిషితోబాటు ఆత్మకూడా మరణిస్తుందా? ఆత్మకి చావులేదని అంటారుగా....? అంటేశరీరం నశిస్తే ఆత్మ వేరే శరీరం వెతుక్కుంతుందా ?

    అటువంటప్పుడు శరీరానికి నశించే గుణం వుండటం ఎందుకు ....!అత్మలాగే అదీ నశించనిదై వుంటే బాగుండేదిగా ?

    మరి దెయ్యం అంటే ఏమిటి ?

    ఆత్మ వేరు దెయ్యం వేరునా ?

    చిట ....చిట....చిట....చిట.....

    ఏదో శబ్దం .....ఉలికిపడి ఆగి వెనక్కి చూశాడు ప్రణయ్ ఉహు .....

    వెనుక ఎవరూలేరు !

    మరి ఆ శబ్దం .....

    భయంగా రెండుడుగులు ముందుకు వేశాడు .

    చిట ....చిట....చిట....

    మళ్ళి అదే శబ్దం .

    అతను ఆగాడు.

    శబ్దం ఆగింది .

    అది తన కాళ్ళకింద పడి నలుగుతున్న ఎండుటాకుల శబ్దం అని గ్రహించాడు .

    ఈ స్మశానం నుండి సాధ్యమయినంత త్వరగా బయటపడాలి.

    నడక వేగం పెంచాడు ప్రణయ్.

    భయంకరమైన ఘర్జన!

    ప్రణయ్ గుండె ఒకసారి ఆగి మళ్ళీ కొట్టుకుంది.

    కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు.

    తనకు ఇరవై గజాల దూరంలో ఓ భారీ ఆకారం నిలబడివుంది. రెండు చేతులూ నడుముమీద వుంచుకుని.

    "ఎ....ఎ....ఎవరు నువ్వు?" తడారిపోయిన గొంతుకతో ప్రశ్నించాడు ప్రణయ్.

    "మృత్యువుని...నిన్ను కబళించాలని వచ్చాను. ఇక్కడే...ఈ శ్మశానంలోనే నిన్ను సమాధి చేస్తాను."

    వికటాట్టహాసం చేసింది ఆ ఆకారం. తర్వాత ఆ మసక వేల్తురులో ఆ భీకరాకారుడి చేతిలో తళుక్కున మెరవడం చూశాడు ప్రణయ్.

    కత్తి!

    ఇక తను తాత్సారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసు అతనికి.

    అంతే....

    ప్రణయ్ శక్తినంతా కూడదీసుకుని పరుగుదీశాడు.

    "ఏయ్ ఆగు! ఎక్కడకికి పోతావ్ రా? నన్ను తప్పించుకుని నువ్వు ఎక్కడకీ లేవు. హహహ ..."వికటాట్టహాసం చేస్తూ ఆ భీకరాకారుడు ప్రణయ్ ణి తరమసాగాడు.

    ప్రణయ్ పరుగుతీస్తున్నాడు పడుతూ లేస్తూ. అతని శరీరం చెమటతో తడిసి ముద్దయిపోతోంది. రానురానూ  భయంవల్ల అతని శరీరాన్ని నిస్సత్తువ ఆవహిస్తోంది. కాళ్ళలో శక్తీ క్షీణిస్తున్న ట్టు అనిపిస్తూంది. పరుగెత్తుతూ తూలిపోతున్నాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS