Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 1


                                       గుళ్ళో వెలిసిన దేవతలు                                                                                                                        --సి.ఆనందరామం                   

                    
                 
                                         1
    
    కెవ్వున కేకపెట్టి లేచి భర్తను గట్టిగా కౌగలించుకుంది పావని వణికిపోతూ...విఠల్ పావనిని వణికిపోతూ...విఠల్ పావనిని పొదివిపట్టుకుని "ఏం జరిగింది పావనీ?" అన్నాడు.
    పావని సమాధానం చెప్పలేకపోతోంది. శరీరమంతా చెమటలు పడుతున్నాయి. విఠల్ ను చుట్టిన చేతులు వణికిపోతున్నాయి.
    అతని హృదయానికి మరింత హత్తుకుపోతూ కాతర స్వరంతో "నన్నిలా మీకు దగ్గరిగా మరి కాసేపు ఉండనీయండి!" అంది.
    విఠల్ నవ్వి "కాసేపేం ఖర్మ! ఎంతసేపైనా ఉండు! ఎప్పుడూ ఉండు. కానీ, ఏం కాల వచ్చింది? ఈ మధ్య తరచుగా నువ్విలా ఉలికిపడి లేస్తూనే ఉన్నావు. కలలకే ఇలా అయిపోతే ఎలా?" అన్నాడు.
    "కలా! కలేనా అది! అబ్బా! కలలోనయినా ఆ క్షోభ భరించలేనండీ!"
    "ఏం కలో చెప్పు..."
    "సరళ ఎక్కడినుండో దీనంగా 'అక్కయ్యా! రా!' అని పిలుస్తోంది. ఆ పిలుపు కాదనలేక వెళ్ళిపోతున్నాను. మీరు దూరంగా నిలబడిపోయారు. మీరు నన్ను పిలుస్తే మీ దగ్గిరకు వచ్చేదాన్నేమో! కానీ, మీరు నన్ను పిలవటంలేదు. నా దగ్గిరకు రావాలని ప్రయత్నించటంలేదు. కోపంగా చూస్తూ బాధగా కన్నీళ్ళు కారుస్తూ నాకు అందరాని దూరాన నిలిచిపోయారు. నేను ఒక్కదాన్నే పిచ్చి దానిలాగ ముందుకు పోతున్నాను. నా గుండెలు పగిలిపోతున్నా, ఏడుపు ముంచుకొస్తున్నా, అలాగే ముందుకు పోతున్నాను...అబ్బా! ఏం నరకం అది? నావల్ల కాదండీ! మిమ్మల్ని వదిలి పోలేను!"
    "పిచ్చి పావనీ! ఏం మాటలివి? నన్ను వదిలి ఎక్కడికి పోతావ్! ఎందుకు పోనిస్తాను?"
    "మరి, అలా దూరంగా నిలిచిపోరుగా! నాతోపాటు వస్తారుగా!"
    "భలేదానివి నువ్వు పిచ్చిదానివై ఎక్కడికో పరుగెడుతూ నన్నూ నీతో రమ్మంటావా? నీ పిచ్చికుదిర్చి నిన్నే నా దగ్గిరకు రప్పించుకుంటాను."
    కాలింగ్ బెల్ మ్రోగింది పావని భయంతో విఠల్ చెయ్యి గట్టిగా పట్టుకుంది.
    "ఛ! ఎం.ఏ. పాసయి లెక్చరర్ గా పనిచేస్తూ ఇలా అయినదానికీ, కాని దానికీ, ఉలికి ఉలికి పడుతున్నావంటే ఎవరైనా నవ్వుతారు. చెయ్యి వదులు ఏమిటో, ఎవరో చూడనీ!"
    వీధిలోనుండి 'టెలిగ్రాం' అని కేక వినిపించింది. పావని విఠల్ చెయ్యి వదిలేసి భయంగా చూసింది విఠల్ నవ్వి లేచివెళ్ళి సంతకం చేసి టెలిగ్రాం తీసుకున్నాడు.
    టెలిగ్రాం చదువుతూ అదొకరకంగా మారిపోయిన విఠల్ ముఖంచూసి, "ఏం జరిగిందండీ! ఎవరిచ్చారు టెలిగ్రాం?" అని అడిగింది పావని ఆందోళనగా-
    విఠల్ మాట్లాడకుండా టెలిగ్రాం పావని చేతిలో పెట్టాడు. ఆ టెలిగ్రాం పావనికే!
    "అక్కయ్యా! చివరిసారి ఒక్కసారి నన్ను చూడటానికి రావూ?- సరళ..."
    టెలిగ్రాం చదివి పాలిపోయిన ముఖంతో విఠల్ ణు చూసింది పావని...
    అప్పటికి విఠల్ కూడదీసుకున్నాడు. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ "చూసావా? ఎంత మంచి వార్త విన్నామో! ఒక్కసారి వెళ్ళిరా? ఇంకమీదట ఇలాంటి పిచ్చి కలలు రావు," అన్నాడు.
    పావని బెంగగా "వెళ్ళిరా? అంటున్నారా? మీరు నాతో రారా?" అంది.
    "పల్లెటూరి బడుద్దాయిలా మాట్లాడకు. నాకు అర్జంట్ కేసులున్నాయి. ఎలా రాగలను? ఆ మాత్రం ఒక్కదానివీ వెళ్ళలేవూ?"
    "వెళ్ళను. ఒక్కదాన్నీ ఎక్కడకూ వెళ్ళను."
    "అయితే మానెయ్యి."
    "మానను సరళ ఇలా పిలుస్తోంటే వెళ్ళకుండా ఉండలేను."
    "ఏం చేస్తావు అయితే?"
    "వెళ్తాను-మీతో కలిసి..."
    "నాకు తీరుబడి లేదంటోంటే..."
    "మీరు రాకపోతే, ఇక్కడే ఉండి-సరళకోసం బెంగపెట్టుకుని, చచ్చిపోయి, ఒక్కదాన్నే శాశ్వతంగా మళ్ళీ తిరిగిరాని దూరానికి వెళ్ళిపోతాను...."
    "పావనీ!"
    విఠల్ పావని నోరు గట్టిగా మూసాడు.
    "ఛ! నోటికెంతొస్తే అంత మాట్లాడతావు. ఇలాంటి పాడు మాటలంటే ఏమొస్తుంది నీకు?"
    "నన్ను ఇలా చిత్రవధ చేస్తే మీకు మాత్రం ఏమొస్తుంది?"
    "మహా తల్లీ! చంపకు! నేను వస్తాలే! కానీ ఒకటి రెండు రోజులకంటే నేను ఎక్కువ ఉండటానికి వీల్లేదు. అవసరమైతే అన్ని ఏర్పాట్లూ చూసి నిన్ను అక్కడ ఉంచి వచ్చేస్తాను."
    "అలాగే! ముందు బయలుదేరండి. మిమ్మల్ని పంపించి నేను అక్కడ ఉంటానేమిటి?"
    "వీలయితే సరళణు మనతో తీసుకొచ్చేద్దాం!"
    "నిజంగా మీరెంత మంచివారండీ!"
    "మంచివాడ్ని కాను. స్వార్ధపరుడ్ని-సరళ నిక్కడికి తీసుకురాకపోతే, నిజంగా నీ కలలో లాగ నువ్వు సరళణు వెతుక్కుంటూ నన్ను వదిలి వెళ్ళిపోతావేమో! తలుచుకుంటేనే భయం వేస్తోంది."
    కిలకిల నవ్వింది పావని.
    "ఆ స్వార్ధం అలాగే పదికాలాలపాటు ఉండనివ్వండి. ఆ మాత్రం స్వార్ధం లేకపోతే జీవితంలో మాధుర్యంలేదు."
    టెలిగ్రాం కేక విని నిద్రలో కంగారుగా లేచి కూచున్న పద్మావతి, కొడుకు ఎంతకూ సంగతి చెప్పకపోవటంతో ఉండబట్టలేక "విఠల్! టెలిగ్రాం ఎక్కడ్నుంచిరా?" అని కేక పెట్టింది.
    పావని, విఠల్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విఠల్ పావనికి కళ్ళతోనే ధైర్యంచెప్పి తల్లిదగ్గిరకు వెళ్ళాడు.
    "సరళ ఒక్కసారి రమ్మని టెలిగ్రాం ఇచ్చిందమ్మా!"
    మ్రాన్పడిపోయింది పద్మావతి. తనవంక నిర్ఘాంతపోయి చూస్తోన్న పద్మావతి చూపులు తప్పించుకుంటూ.
    "పావనిని తీసికెళ్తున్నాను." అన్నాడు విఠల్.
    పద్మావతి సమాధానం చెప్పలేదు. వరండాలో మంచంమీద కూచుని అంతా వింటోన్న వెంకట్రావు మాత్రం
    "కుటుంబానికి మచ్చలా పుట్టింది ముదనష్టపుది?" అన్నాడు కసిగా.
    ఈ మాటలు పావని విందేమోనని లోపలికి చూసాడు విఠల్. పావని వింది పళ్ళమధ్య నలుగుతోన్న పెదవి రక్తం చిమ్ముతోంది అప్పుడే.
    పావనిని చూస్తే ఎంత జాలి కలిగినా పెదవి విప్పి తండ్రినేమీ అనలేక పోయాడు విఠల్...
    మనసులో ఎంత మంటగా ఉన్నా "బయలుదేరటానికి వీల్లేద"ని కొడుకుతో అనగలిగేశక్తి ముసలాయనకీ లేకపోయింది...
    పావని వెళ్తోందంటే సంతోషించినవాడు రవి ఒక్కడే! ఇంటర్ సీనియర్ చదువుతున్నాడు రవి. వచ్చీ రాని వయసులో అతడు చేసే అల్లరుల కన్నీటికి అంకుశంలా అడ్డు తగులుతుంది పావని...కాలేజీకి వెళ్తున్నాడో లేదో, కనుక్కుంటుంది. కాలేజీ ఎగ్గొట్టి ఫ్రెండ్స్ తో తిరిగితే ఎలాగో కనిపెట్టి చీవాట్లు పెడుతుంది. ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టనియ్యదు. అన్నింటికీ లెక్కలడుగుతుంది.
    లోలోపల మురిసిపోతూ "ఎప్పుడు వెళ్తున్నావు వదినా?" అన్నాడు రవి.
    "ఏం నాయనా! హాయిగా బలాదూరు తిరుగుదామనా! జాగ్రత్త! నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను. ఈ లోపుగా ఏమైనా ఘనకార్యాలు చేసావంటే చక్రవడ్డీతో సహా బదులు తీరుస్తాను."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS