Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 1


                                 స్వర్గంలో ఖైదీలు
    
                                                         ----బలభద్రపాత్రుని రమణి
    
                                       
    

     డిశంబర్ చలి మనిషిని ముడుచుకుని నడిచేట్లు చేస్తోంది. రాత్రిపూట ప్రతి ఇంటిముందూ వెలుగుతున్న తారకలు జీసెస్ కి స్వాగతం చెప్తున్నట్లున్నాయి.
    'నిన్న పశువుల.....పాకలోనా.......బెతల్హామ్ నగరమందు.....'పది పన్నెండేళ్ళపిల్లలు గుండెలకి చేతులు అడ్డుగా పెట్టుకుని ప్రతి ఇంటిముందూ గేటుకి ఆనుకుని నిలబడి పాడుతున్నారు.
    కారుడ్రైవ్ చేస్తున్న వర్షకి తన చిన్నతనం గుర్తొచ్చి నవ్వుకుంది. మిషినరీ స్కూల్లో చదివినతనకి వారంలో మూడుసార్లు 'చాపల్' కి వెళ్ళడం, బైబిల్ పరీక్ష వ్రాయడం కంపల్సరీగా వుండేది. బొట్టూ, గాజులూలాంటివి వేసుకోవడం అప్పట్నుంచే అలవాటు తప్పిపోయింది. అమ్మతోపొరపాటున ఏ మేనమామల ఇంటికేనా పెళ్ళికో, పేరంటానికో వెళ్తే పాట పాడమనగానే చర్చ్ పాటలేపాడేది. దాంతో వాళ్ళునవ్వేవాళ్ళు.
    అమ్మతనకి అలా చెయ్యకూడదని ఎప్పుడూ చెప్పలేదు. అసలు అమ్మ తనని ఎప్పుడూ మందలించేదికాదు! "ఏదైనా దేవుడిపాటేగా....వాళ్ళు 'కావేటిరంగా, శ్రీరంగా' అని పాడట్లేదూ....నవ్వితే నవ్వారు. నువ్వేం బాధపడకు తల్లీ" అనేది.
    అమ్మ! వర్షకి కంట్లో నీరు తిరిగింది. అమ్మని చూసి నెలరోజులుఅయింది. అసలు ఇంతకాలం అమ్మని చూడకుండా ఆమె జీవితంలో లేదు.
    వర్షపెదవులమీద పలుచనిచిరునవ్వు....పుట్టగా నేతను చూసిన మొదటిమిత్రురాలు. ఒక కొమ్మపువ్వుల్లా... ఒకేసారి చేతిలోంచిజంటగా రాలిపడే గవ్వల్లా....తనూ.....అమ్మా.....ఎక్కడికెళ్ళినా, ఎక్కడున్నా...అన్నీ కలిసేచేసేవారు.
    ఆమెకి బాల్యం గుర్తొస్తోంది!
    రొమేంటిసైజింగ్ ది పాస్ట్.....ప్రతి వ్యక్తికీ గడిచిన జీవితంతో సుందరంగా, మనోహరంగా అనిపిస్తుంది. కానీ ఆమెకి....తలుచుకోగానే మనసంతా చేదుతిన్నట్లైంది!
    "పాపపేరు చెప్పండి" స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ అడిగింది.
    "వర్ష"
    "ఫాదర్ నేమ్?"
    "నో ఫాదర్. పేరెంట్ గా మదర్ పేరు వ్రాయండి. నా పేరు విద్య"
    హెడ్ మిస్ట్రెస్ కళ్ళజోడు ముక్కుమీదకి జారిపోయేటంతగా ఆశ్చర్యపోయింది. క్రమేణా ఆ ఆశ్చర్యం ఇంకో విధంగా మారిపోయింది.
    "నో......సారీ! రూల్స్ ప్రకారం ఇక్కడ ఫాదర్ నేమ్ వ్రాయాలి."
    "ఏం? మదర్ పేరు ఎందుకు పనికిరాదూ?" విద్య గొంతు వణికింది.
    "రూల్స్ ప్రకారం కుదరదు."
    "ఓ.కే.కుదిరేచోటే చేర్పించుకుంటాను "అమ్మ తన చేతిని పట్టుకొని బయటికొచ్చింది.
    అమ్మచెయ్యి అందుకోగానే తనకి ఎంతో ధైర్యంగా అనిపించింది. అమ్మకెందుకుకోపం వచ్చిందో తెలిసేవయసు కాదు. విద్యవర్షాని మదర్ థెరీసా స్కూల్లో చేర్పించింది.
    సాధారణంగా వర్ష ఎవరితో స్నేహంచెయ్యడం, ఎవరి ఇళ్ళకైనా వెళ్ళి ఆడుకోవడం వుండేదికాదు.
    ఒకరోజు క్లాస్ మేట్ రేణుక ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ ముద్దుగా వున్న వర్షని ముద్దుచేసిబిస్కెట్లూ కేకులూ పెట్టింది. ఇంతలో ఎవరో ఆవిడ తండ్రి స్నేహితురాలు వచ్చింది.
    "ఈ పాప...ఆ విద్యాదేవి కూతురుకదూ!" అదోరకంగా చూస్తూ అంది.
    "అవును మా రేణు స్నేహితురాలు. నీకు వాళ్ళ అమ్మతెలుసా?" రేణుక తల్లి అడిగింది.
    ఆవిడ మూతి వంకరగా తిప్పి, "ఆ....తెలీకేం.....పెళ్ళీ పేరంటం లేకుండా బిడ్డనికన్న మహాతల్లి! అసలు ఇలాంటి వాళ్ళవల్లే మనసమాజం ఇలా ఏడుస్తోంది!" అంది.
    రేణుక తల్లి వర్షని అదోలాచూసి "రేణూ....ఇంక ఆడిందిచాలు. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించెయ్యి" అంది.
    వర్షకి ఆ చూపు తాకాల్సిన చోటే తాకింది. ఆమె సున్నితమైన హృదయం బాధతో రెపరెపలాడింది. గాలివాటుకి ఊగుతున్న లేతసుమ బాలలా ఆమె చిన్నారి హృదయం తల్లడిల్లిపోయింది.
    ఇంటికి వచ్చి తల్లిని చుట్టుకుని ఏడుస్తూ "ఎందుకమ్మా వాళ్ళు నిన్ను అలా అంటున్నారు? వాళ్ళల్లా నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదూ?" అని అడిగింది.
    విద్య కూతుర్ని దగ్గరికి తీసుకుని "ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. నువ్వుపుట్టావు. అప్పటికే భార్యాబిడ్డలున్న ఆ వ్యక్తికి రెండవ భార్యగా వుండే ఖర్మ నాకుపట్టలేదన్నాను. దట్సాల్! ఇందులో వాళ్ళంతా అలా నోళ్ళు నొక్కుకోవలసింది ఏంటో నాకు అర్ధం కావడంలేదు. నువ్వూ ఇవన్నీ ఆలోచించి మెదడు పాడుచేసుకోకు. చదువుమీద తప్పనీ శ్రద్ద దేనిమీదా పెట్టద్దు. నువ్వు ఆడుకోవాలంటే నేనున్నాను. నువ్వు మాట్లాడాలంటే నేనున్నాను. నీ ప్రతి ఆలోచనా.....ప్రతి ఆనందం.....ప్రతి బాధానాదిగా ఫీలయ్యే నేను నీ పక్కన వుండగా నీకింక లోకంలో వేరే వాళ్ళతో పని ఏముంది?" అంది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS