Next Page 
రేపల్లెలో రాధ పేజి 1


                                       రేపల్లెలో రాధ
    

                                                                  ---బలభద్రపాత్రుని రమణి

 

    
                            
    
  

      కొండమీద నుండి చూస్తే వరదరాజపురం పేర్చిన బొమ్మల కొలువులా వుంది. లక్కపిడతల్లాంటి ఇళ్ళూ, ఈ ఊరి సంగతులు ఇంకో ఊరికి మోసుకుపోవాలన్నట్లు గబగబా పారుతున్న ఏరూ! ఊరి మధ్యలో సీతమ్మ మనసులా చల్లని నీడనిచ్చే రావిచెట్టూ, కాస్తంత వెనకగా కొండంత అండగా కోదండరాముడి గుడీ, అరివేణికుండలా మెట్టు మేట్టుకీ బొట్లు పెట్టి అలంకరించుకున్న కోనేరూ, దాంట్లో రాత్రివేళ విచ్చుకునే కన్నెపిల్లల కలల్లాంటి కలువలూ! గుడిముందు హనుమంతుడు తోకచుట్టి నిలబడినట్లుగా ఎత్తయిన ధ్వజస్తంభం!
    
    ఊళ్ళో గాలి కబుర్లన్నీ మోసుకొస్తున్న రావి ఆకుల గలగలల నేపథ్యంలో వెర్రి గొల్లడొకడు తనకు తెలియని రాగంలో అద్భుతమైన పదం ఏదో పాడుతూ గొడ్లు తోలుతున్నాడు. వాటి గిట్టలనుండి లేచిన ధూళితో బుగ్గలు ఎర్రబడగా సూర్యుడు తాటిచెట్ల చాటున దాక్కుంటున్నాడు.
    
    వేసవి గాడ్పులో వెదురుపొదల వేడి నిట్టూర్పుల మధ్య మావతిగా మారి తాపాన్ని ఉపశమింపచేయ చూస్తున్నాయి.
    
    శ్రుతికి తగ్గ లయని జతచేస్తూ 'ఛుక్.... ఛుక్' మంటూ వంతెన మీదుగా ఎక్కడికో పోతోంది రైలు!
    
    పిల్లా, పెద్దా అందరూ చేస్తున్న పనులు ఆపేసి అరచెయ్యి నుదుటికి చేర్చి ఆసక్తిగా రైలు మలుపు తిరిగిపోయేదాకా చూశారు.
    
    అదెళ్ళిపోయాక మళ్ళీ పనుల్లో మునిగిపోయారు.
    
    రైలుబండి పొగని అనుకరిస్తూ లంక పొగాకు చుట్ట తాలూకు పొగ 'గుప్పు.....గుప్పు' మని వదిలాడు ఆ ఊరి మోతుబరి సుబ్బారాయుడు. మనసులో "కేశవుడు ఉత్తరం రాసి చాలా రోజులైంది. ఈరోజైనా వస్తుందేమో చూడాలి!' అనుకున్నాడు. పట్నంలో ఉన్న అతని ఆప్తమిత్రుడి తాలూకు ఆలోచనలు అతడిని చుట్టుముట్టాయి. ఏడో తరగతి తర్వాత కేశవుడితోపాటు తనూ పట్నం వెళ్లి చదువుకుని ఉంటే ఈ వరినాట్లూ, కలుపులూ కాకుండా హాయిగా కాలుమీద కాలేసుకుని ఏ గాలియంత్రం ఉన్న గదిలోనో కూర్చుని ఉండేవాడు. ఎదురుగా ఓ జుట్టు కత్తిరించుకున్న పిల్ల అటు పరికిణీ ఇటు జుబ్బాకాని గౌనులో నిలబడి తను చెప్పిందల్లా రాస్తుంటే, తను గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చుని తిరుగుతూ, 'ఎస్.... బాస్...' మని ఇంగిలీసులో దంచేసేవాడు! ఆ పిల్ల ఏపిల్ పండ్లలాంటి బుగ్గలతో ఒయ్యారంగా ముందుకి వంగి, "ఎస్, బాస్!" అనేది తను విలాసంగా నవ్వి ఆమె బుగ్గమీద చిటికేసేవాడు.
    
    "ఛీ, ఏంటండీ ఈ పని .... నా బుగ్గమీద సిటికేత్తారేంటీ?" ఎదురుగా నిలబడ్డ సన్యాసిరావు మెలికలు తిరుగుతూ అన్నాడు.
    
    ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సుబ్బారాయుడు సిగ్గుపడుతూ నిలబడ్డ సన్యాసిరావుని చూసి "నువ్వెప్పుడొచ్చావురా?" అన్నాడు విసుగ్గా.
    
    "మీరు కలలో కెళ్ళినప్పుడండీ! ఈమారు ఎటెళ్ళారండీ?" కుతూహలంగా అడిగాడు!
    
    "ఏం అక్కడికి కూడా తగలడదామనా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదనీ ..." సణిగాడు సుబ్బారాయుడు.
    
    సన్యాసిరావు అతని భార్యకి ఎక్కడో వేలువిడిచిన తమ్ముడు. చిన్నతనం నుండే ఆడవాళ్ళతో చేరి చింతపిక్కలాటలూ, వామనగుంటలూ ఆడుతూ పెద్దయ్యాడు. నీలాటి రేవుల నుంచి సమర్త పేరంటాల వరకూ అతను వెళ్ళని ప్రదేశం ఉండదు. ఏ ఇల్లాలైనా అతన్ని చూడగానే ఆనందంగా "ఈ పిల్ల వెధవని కాస్త ఎత్తుకో... చేతినిండా పని ఉంది!" అనో  లేక "సమయానికొచ్చావురా! కాస్త పోటెయ్యి, ఇన్ని చింతకాయలు ఒక్కదాన్నే దంపలేక చస్తున్నాను!" అనో పని అప్పగించేస్తారు. అతను ఉండటం మాత్రం సుబ్బారాయుడి ఇంట్లోనే ఆ పాతకాలం మండువా లోగిలి ఇంట్లో సుబ్బారాయుడి భార్యా కూతురూ కాకుండా, అతని విధవ అక్కగారూ, ఆవిడ కొడుకూ, అతని తమ్ముడూ, మరదలూ వారి ముగ్గురు సంతానం, రోగిష్టి తల్లీ, ఆవిడ తమ్ముడూ, వాతల తాతయ్యా కూడా ఉంటారు.
    
    వాతల తాతయ్య అసలు పేరేమిటో సుబ్బారాయుడికి కూడా తెలియదు. అస్తమానం వార్తా పత్రిక చేతపట్టుకుని బొమ్మలాడుతున్న పిల్లలకో, పొయ్యి దగ్గరున్న ఆడవాళ్ళకో 'స్కాములూ .... స్వాహాలూ .... ఓటు బ్యాంకులూ, రిగ్గింగులూ...' అంటూ అదేపనిగా వార్తలు చదివి వినిపించడంవల్ల 'వార్తల తాతయ్య' గా పేరొంది, పలకడంరావి పిల్లల దయవల్ల 'వాతల తాతయ్య' గా స్థిరపడిపోయాడు.
    
    సుబ్బారాయుడికి ఆ ఊళ్ళో వంద ఎకరాల సుక్షేత్రంలాంటి మాగాణీ ఇచ్చిపోయాడు తండ్రి. తన స్వయంశక్తితో ఇంకో ఇరవై ఎకరాలకి పెంచి కౌలుకివ్వకుండా వ్యవసాయం జేసుకొస్తున్నాడు. పొట్టినిక్కర్లనుండీ పంచెకట్టులోకి మారిన దగ్గరనుండీ అతను ఎక్కువగా పొలంలోనే కాలం గడిపాడు. అతని తమ్ముడు ప్రకాశం, హార్మోనియం ముందు పెట్టుకుని సరిగమల్ని శోధించడంలో ఉన్న ఆసక్తి వ్యవసాయం విషయంలో చూపించలేకపోయాడు.
    
    "చిన్నాడు కష్టపడలేడ్రా, పాపం!" అనే తల్లి సన్నాయి నొక్కులు అతన్ని అప్రయోజకుడ్ని చేయడానికి సాయపడ్డాయి.
    
    సుబ్బారాయుడికి ఊహ వచ్చేనాటికే బావగారు పోవడంతో అతని అక్క సూరమ్మ ఆ ఇంట్లో ముఖ్యమైన మెంబరుగా స్థిరపడిపోయింది. ఆమె కొడుకు గణపతి పదో తరగతి తప్పి జులపాలు పెంచి జులాయిగా తిరుగుతుంటాడు.
    
    ప్రకాశం భార్య శాంత పేరుకితగ్గ ఇల్లాలు. తోడికోడల్ని స్వంత అక్కలా, అత్తగార్ని తల్లిలా, బావగార్ని అన్నలా చూడగలిగిన వెన్నలాంటి మనసు ఆమెకి ముగ్గురు మగపిల్లలు.
    
    ఇక ఆ ఇంటి యజమానురాలు పార్వతమ్మ నిజంగా సార్ధక నామధేయురాలు. అన్నపూర్ణలా ఇంటికి వచ్చిన వాళ్ళకి వండి వడ్డిస్తూ, లోకపావనిలా అందరి మంచి చెడ్డల గురించీ తెలుసుకుంటూ, ఆదిలక్ష్మిలా భర్తకి ఏ నిమిషంలో ఏం కావాలో తెలుసుకుని మసలుకుంటుంది. ఆమె కాపురానికి వచ్చింది మొదలు వంటింట్లో గుండిగలతోటీ, చల్లకవ్వంతోటే ఆమె స్నేహం నలుగురు మగపిల్లలు పుట్టిపోయారు. ప్రతిసారీ గర్భసంచి తిరగబడిపోయేది. ఆ సంగతి పట్నంలో డాక్టర్ చెప్పి,  "ఇంక గర్భంవస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం!" అని భయపెట్టాక కూడా నెల తప్పి మూడవ నెలవరకూ భర్తకి కూడా చెప్పలేదు. తెలిసాక సుబ్బారాయుడు లబలబలాడి "నాకు నీకన్నా పిల్లలు ముఖ్యం కాదే! తీయించేద్దాం!" అన్నాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS