Next Page 
సామ వేద సంహిత పేజి 1

              

                            శ్రీమదాంధ్రవచన సామవేద సంహిత
                 
                ---అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య

                                   

                                  


                               యస్య నిః శ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్!
                                నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
                                           ఛంద అర్చిక ఆగ్నేయ పర్వము
                                                 మొదటి అధ్యాయము

                                             మొదటి ఖండము
   
    ఋషులు :- 1,2,4,7,9,10 భరద్వాజుడు. 3 మేధాతిథి. 5,6 ఉశనసుడు. 8. వత్సుడు.
   
1. ఆగ్న ఆ యాహి వీతయే గృణానో హవ్యదాతయే | నిహోతా సత్సి బర్హిషి !!
   
    అగ్నీ! హవిస్సులు ఆరగించుటకు విచ్చేయుము. మా స్తుతులు ఆలకించుటకు విచ్చేయుము. నీవు దేవతల ఆహ్వాతవు. దేవతలకు హవ్య వాహనుడవు. దర్భాసనముపై ఆసీనుడవగుము.
   
2.    అగ్నీ! నీవు సమస్త యజ్ఞముల హోతవు. మానవ యజమానుల హితము కోరువాడవు. నిన్ను ఋత్విజులు గార్హపత్యాది రూపములుగా స్థాపించుచున్నారు.
   
3.    అగ్ని దేవతల ఆహ్వాత. సర్వజ్ఞుడు. ఈ యజ్ఞమును సిద్ధింప చేయువాడు. హవ్యవాహనుడు. అట్టి అగ్నిని అర్పించుచున్నాము.
   
4.    అగ్ని తనను ఉపాసించు వారికీ ధనదాత. సమిధలచే ప్రజ్వలితుడగు వాడు- ప్రకాశించువాడు. ఆహుతుల స్వీకర్త. అగ్ని మా స్తుతులు వినవలెను. బలశాలి కావలెను. రాక్షసులను సంహరించవలెను.
   
5.    అగ్ని తనను స్తుతించు వారికి ధనములిచ్చువాడు. అతిథిసముడు. మిత్రుని వంటి ప్రియతముడు. రథము వంటి లాభకారి. అట్టి అగ్నిని స్తుతించుచున్నాము. ప్రసన్నుని చేయుచున్నాము.
   
6.    అగ్నిదేవా! మాకు అనంత ధనము ప్రసాదించుము. మమ్ము లోభుల నుండి రక్షింపుము. ద్వేషించు వారి నుండి పాహి.
   
7.    అగ్నిదేవా! విచ్చేయుము. చక్కని ఉచ్చారణలచే నిన్ను నుతించుచున్నాము. ఆలకించుము. సోమ రసమును వర్లిల్ల చేయుము.
   
8.    అగ్నిదేవా! నేను వత్సుడను. నిన్ను స్తుతించుచున్నాను. నీ మనసునకు ఆనందము కలిగించుచున్నాను. ద్యులోకము నుండి ఆకర్షించదలచినాను.
   
9.    అగ్నిదేవా! నీవు అథర్వుడవు. సకల లోకములు నీకు శిరము వంటివి. వానిని భరించుచున్నావు. నిన్ను కమలపత్రములందు పుట్టించుచున్నాము. అరణులు మధించియు రగిలించుచున్నాము.
   
10.    అగ్నిదేవా! నీవు మా రక్షకుడవు. ఈ యజ్ఞము స్వర్గ కారకము. దీనిని పూర్తి చేయించుము. నీవే కదా మాకు కనిపించు దేవతవు.
   
                                                రెండవ ఖండము
   
ఋషులు  :- 1 అయుంక్ష్వుడు. 3,8,9 ప్రయోగుడు. 2 వామదేవుడు. 4 మధుచ్చందుడు. 5,7 శునశ్శేపుదు. 6 మేధాతిథి. 10 వత్సుడు.
   
1. అగ్నీ! నరులు బలమును కోరి నీకు నమస్కరించుచున్నారు. ఆ కారణముననే నీకు నమస్కరించుచున్నాను. బలముచే శత్రువును వధించుము.
   
2.    అగ్నిదేవా! నీవు సర్వజ్ఞుడవు. హవ్యవాహనుడవు. అమరుడవు యజ్ఞ సాధనమవు. దేవదూతవు. నిన్ను స్తుతించుచున్నాను. వర్దిల్ల చేయుచున్నాను.
   
3.    అగ్నిదేవా! యజమాని చేయు స్తుతులు ఆడపడుచుల వంటివి. అవి నిన్ను కీర్తించును. నీ దరికి చేరును. వాయువు వలె ప్రజ్వలింప చేయును. స్థిరపడును.
   
4.    అగ్నిదేవా! మేము నిత్యము రాత్రింబవళ్ళు నీకు మనసా నమస్కరించుచున్నాము. నీ వద్దకు చేరుచున్నాము.
   
5.    అగ్నిదేవా! నీవు స్తుతులు విని మేల్కొనువాడవు. యజమానిని అనుగ్రహించు వాడవు. యజ్ఞ ప్రదేశమున ప్రవేశించుము. యజమాని భయంకరుడవగు నిన్ను దర్శించ దలచినాడు. స్తుతించుచున్నాడు.
   
6.    అగ్నిదేవా! ఈ యజ్ఞము దోషరహితము. ఈ యజ్ఞమున సోమపానమునకు ఆహ్వానించుచున్నాము. దేవతల సహితుడవై విచ్చేయుము.
   
7.    అగ్నిదేవా! నీవు యజ్ఞస్వామివి గుర్రము తన తోకతో తనను బాధించు వారిని తోలినట్లు నీ జ్వాలా వాలమున శత్రువులను పారద్రోలుము.
   
8.    ఔర్వభృగునితో సమానుడును, అప్నువానుని అంతటివాడును, సముద్ర మధ్యమున ఉన్నట్టి బడబాగ్నిని ఆహ్వానించుచున్నాను.
   
9.    నరులు సమిధలచే అగ్నిని ప్రజ్వలింప చేయుదురు గాత. పరిశుద్ద మనస్కులై క్రతువులు నిర్వహింతురు గాత. ఋత్విజులు అగ్నిని జ్వలింపచేయుదురు గాక.
   
10.    వైశ్వానరాగ్ని సూర్య రూపమున ఆకసకమున అవతరించిన తరువాతనే సకల ప్రాణిజాలము - నిరంతరగామియు, నివాస హేతువగు - మహా జ్యోతిని దర్శించుచున్నారు.
   
                                                 మూడవ ఖండము
   
ఋషులు :-
ప్రయోగుడు. 2,5 భరద్వాజుడు. 3,10 వామదేవుడు. 4,6 వశిష్టుడు. 7.విరూపుడు. 8. శునశ్శేనుడు. 9 గోపవనుడు. 11 కణ్వుడు. 12 మేధాతిథి 13 అంబరీషుడు. 14 ఉశనుదు.
   
1.    అగ్ని హింసకు అశక్యుడు బలవ్మతుల బంధువు. బలశాలి జ్వాలలచే వర్ధిల్లువాడు. మహామహుడు ఋత్విజులారా! అట్టి అగ్నిని అర్చించండి.
   
2.    ఈ అగ్ని మండి పడు మంటలవాడు. అతడు సమస్త రాక్షసాది హింసకులను వధించును గాక. మాకు ధనములు ప్రసాదించును గాక.
   
3.    అగ్నిదేవా! నీవు మహానుభావుడవు. మాకు సుఖములు కలిగించుము. ఈ యజమాని దేవతల దర్శనము అర్ధించుచున్నాడు. అతని వద్దకు విచ్చేయుము. దర్భాసనమున ఆసీనుడవు అగుము.
   
4.    అగ్నిదేవా! నీవు ప్రకాశమానుడవు. జరా రహితుడవు. మమ్ము పాపముల నుండి రక్షింపుము. మమ్ము హింసించు శత్రువులను నీ మంటలతో బూడిద చేయుము.
   
5.    అగ్నిదేవా! నీవు అశ్వములు శీఘ్రగాములు సాధువులు వాహకములు వానిని నీ రథమునకు పూన్చుము.
   
6.    అగ్నిదేవా! నీవు అర్చనీయుడవు. ధనస్వామివి అనేక యజమానులచే ఆహ్వానించ బడువాడవు. దీప్తివంతుడవు. ఉపాసకులకు శుభములు కూర్చువాడవు. మేము నిన్ను స్థాపించుచున్నాము.
   
7.    అగ్నిదేవతలందు శ్రేష్టుడు. ద్యులోకమున కన్న ఉన్నతుడు. భూమికి ప్రభువు. అట్టి అగ్ని జలములకును జంగమములకును ప్రేరణ కలిగించుచున్నాడు.
   
8.    అగ్నిదేవా! ఇవి మా హవిస్సులు. ఇవి మా స్తుతి వచనములు వీనిని దేవతలకు అందించుము.
   
9.    అగ్నిదేవా! నేను గోపవనుడను. నిన్ను స్తుతించుచున్నాను. ఆవిర్భవింప చేయుచున్నాను. వర్దిల్ల చేయుచున్నాను. సర్వగమనుడవు, పాపకుడవగు నీవు నా ఆహ్వానమును ఆలకించుము.
   
10.    అగ్ని అన్నపాలకుడు. కవి హవి అర్పించు వారికి రత్నాదులు ఇచ్చువాడు. అతడు హవిస్సులను వ్యాప్తము చేయుచున్నాడు.
   
11.    సూర్యుడు సకల భువన ద్రష్ట ప్రసిద్దుడు. సకల భూతజ్ఞాత అట్టి సూర్యుని, కిరణములు పైన నిలిపి ఉంచినవి.
   
12.    అగ్ని యజ్ఞ విద్వాంసుడు. సత్యధర్ముడు. ద్యోతమానుడు. శత్రు నాశకుడు. అట్టి అగ్ని దేవుని స్థాపించండి. స్తుతించండి.
   
13.    జలములు శాంతములు, సుఖప్రదములు అగును గాత. దేవతలకు ప్రీతి కరములు అగునుగాత. మేము సేవించినంత సుఖప్రదములు అగును గాత. కలిగిన వ్యాదులను శాంతింప చేయునుగాత. కలుగని వ్యాధులను దూరము చేయును గాక. మాకు అమృత బిందువులై రాలునుగాత.
   
14.    అగ్నీ! సజ్జన పాలకుడవగు నీవు ఇప్పుడు ఏ యజ్ఞమునకు సిద్ది కలిగించుచున్నావు? మేము నిన్ను స్తుతించుచున్నాము. మాకు గోవులను కలిగించుము.
   
                                           నాలుగవ ఖండము
   
ఋషులు :- 1,3 శంయుడు. 2 భర్గుడు. 4. వసిష్ఠుడు. 5. భరద్వాజుడు. 6. ప్రస్కణ్వుడు. 7. తృణపాణి. 8. విరూపుడు. 9. శునశ్శేపుడు. 10. సౌభరి.
   
1.    అగ్నిని వర్లిల్ల చేయుటకు సర్వ యజ్ఞములందు స్తుతులచే నుతించండి. అమరుడు, మిత్రసముడు, అనుకూలుడు, సకల భూతజ్ఞాతయగు అగ్నిని ప్రార్ధించుచున్నాము.
   
2.    అగ్నిదేవా! మమ్ము ఒక ఋక్కుచే పాహి రెండు ఋక్కులచే పాహి అన్నముల స్వామీ! మమ్ము మూడు ఋక్కులచే పాహి. అగ్నీ! మమ్ము నాలుగు స్తుతులచే పాహి.
   
3.    అగ్నిదాత. యువకుడు. పావకుడు. అగ్నిదేవా! భరద్వాజుడనగు నా సోదరుని నిమిత్తము ప్రజ్వరిల్లుము. నీవు మహా తేజస్సున ధనయుక్తుడవై మాకు జ్యోతిని ప్రసాదించుము.
   
4.    అగ్నిదేవా! నీవు యజమానులచే హవనము చేయబడువాడవు. నిన్ను స్తుతించు వారు సుఖింతురు గాక. మా జనులకు గోసమూహములనిచ్చు ధనికులు సుఖింతురు గాక.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS