Next Page 
సంకల్పం పేజి 1

                                సంకల్పం
   
                                                             ---సూర్యదేవర రామ్ మోహన రావు
   
   
                              

 

 
    IN TIMES OF GREAT STRESS AND ADVERSITY, IT'S ALWAYS BEST TO KEEP BUSY, TO PLOW YOUR ANGER AND YOUR ENERGY INTO SOMETHING POSITIVE.
   
                                    *    *    *    *    *
   
    WHY WALK WHEN YOU CAN RUN
   
    కాలానికి ఒక రూపం లేదు. దానికి పాపం లేదు.
    కాలం అద్దం లాంటిది.
    అంధ యుగమైనా, స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబం.
    కాలం వలయం లాంటిది. దానికి కేంద్రం లేదు.   
    ఎవడికి వాడే ఇచ్చా ప్రయత్న బలంతో
    వర్ణోజ్వల వలయాలను సృష్టించగలుగుతాడు.
    కాలం జాలం లాంటిది.
    కళ్ళు మూసుకుని నడిస్తే, ఉచ్చులో పడతాడు.
    శక్తిపరుడు, యుక్తిపరుడు దాన్ని ఛేదిస్తాడు.
    కాలం సవాల్ వంటిది.
    సాహసవంతుడందుకొని ముందుకు సాగిపోతాడు.
     సాహసి కానివాడు, జీవన సమరానికి, స్వర్గానికి పనికిరాడు.
     హిమ సుందర శృంగమైన ఎవరెస్టుని ఒక టెన్సింగే ఎక్కగలడు!
   
                                                                                                                                                                                  - తిలక్
   

                                   *    *    *    *    *
   
                                                      ప్రారంభం
   
    చలనం ఆగిపోయిన జలపాతం నేలమీద నెమ్మదిగా నడుస్తున్నట్టుగా వుంది సముద్రం.
   
    ఆ సముద్రం ముందు రాత్రి వర్షానికి తడిసిన ఇసక దిబ్బలు పడమటి ఎండా చివరి కాంతిలో గంధకాపు రంగులో విచిత్రంగా కన్పిస్తున్నాయి.
   
    దూరంగా ఏరాడకొండ సముద్రంలో మునిగిపోయిన పాతకాలపు కారులా వుంది.
   
    అప్పటికి సమయం సాయంత్రం అయిదుగంటలైంది.
   
    జోడుగుళ్ళ పాలెం సరుగుడు చెట్ల మీదుగా వస్తున్న గాలి, అంతెత్తు ఎగిరే అలల్ని స్పృశించి, మట్టిదిబ్బల్ని తాకి, గువ్వల్లా గుంపుగా వున్న గవ్వల సొరంగాల్లో ప్రవేశించి విచిత్రమైన శభ్దాలకు అంకురార్పణ చేస్తోంది.
   
    బీచ్ కొచ్చే దారంతా పూల మార్కెట్ లా వుంది.
   
    అమ్మాయిలు... అబబయిలు.... నవదంపతులు.... కాలేజీ కుర్రాళ్ళు...వృద్దులు.... పిల్లలు.... రకరకాల రంగు, రంగుల కార్లు, జీపులు....మారుతీలు, హీరో హోండాలు, రాజ్ దూత్ లు, అంబాసిడర్లు, సిటీబస్సులు.... సైకిళ్ళు... ఆటోలు.... రిక్షాలు...
   
    అన్నిటినీ చూస్తూ నించున్నాడు వికాస్.
       
    సన్నగా, పొడవుగా వున్నాడు..... నుదురు మీద పడుతున్న జుట్టు-సూదిముక్కు- సూటిగా చూసే చూపులు- అతనిలోని ఆకర్షణ అతని కళ్ళే- అంతంత పెద్ద కళ్ళు- సాధారణమైన దుస్తులు- వచ్చీ పోయే కార్లవేపు చూస్తున్నాడతను.
   
    పది నిమిషాలు గడిచాయి.
   
    హలో... హలో..... హలో....
   
    తన ప్రక్కనే నెమ్మదిగా వచ్చి ఆగిన కారుని అతను గమనించలేదు.
   
    ఆ కారు కోసమే అతను చూస్తున్నాడు       
   
    ఆ కారులో ఓ అందమైన అమ్మాయి- ఆ అమ్మాయికో పాతికేళ్ళుంటాయి. అందమైన జీవిత కావ్యాల కలల అలలా ఉంటుంది. నల్లగా ఉన్నా... ఆమె మేని నునుపుదనం.... కళ్ళలో కదిలే కాంతి నైరాశ్యపు గుండె లోతుల్ని ఛేదించి, మాధుర్యాన్ని నింపేలా ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం...ఉత్సాహం.... ఉత్తేజం.... ఎప్పుడూ ఆడిగా మెరిసే బుల్లి బుల్లి పెదవులు...ఎప్పుడూ నవ్వినట్లుగా ఉంచే అందమైన పలువరస.... ఆయిదడుగుల ఆరంగుళాల ఎత్తులో... 37:24:38 వైటల్ స్టాట్ స్టిక్స్ తో మహాశిల్పి చెక్కిన అపురూప శిల్పంలా ఉంటుంది. నండూరి ఎంకి ఎల్నరబిలిటీ.... ఆమె ఆపాదించుకున్న ప్రత్యేకతలు....
   
    కారు పార్కుచేసి వస్తూ "ఇప్పుడే వచ్చారా?" అంది నవ్వుతూ. కారుమేఘంలాంటి, నల్లటి, ఒత్తైన మృదువైన జుట్టు ఆమె భుజాల్ని కప్పేస్తూ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది.
   
    "సరిగ్గా 14 నిమిషాలైంది..." చేతి వాచీ వేపు చూస్తూ అన్నాడు వికాస్.
   
    వంగపండురంగు ఆర్గండీ చీర... అదే రంగు జాకెట్టు... వదులుగా వదిలేసిన జుట్టు.... కన్పించీ, కన్పించని బొట్టు.... లేత గులాబీరంగు లిప్ స్టిక్....
   
    "ఇవాళ మీరు ఫోన్ చెయ్యండి చూసి ఆశ్చత్యపోయాను.... ఏంటి విశేషం...."
   
    బీచ్ గార్డెన్ లోకి అడుగుపెడుతూ అడిగిందామ్మాయి.
   
    "రోజూ... మీరే ఫోన్ చెయ్యడం... బాలేదు.... అంచేత ఇవాళ నేనే ఫోన్ చేశాను..." అన్నాడు వికాస్.
   
    "ఏం కాదు... బుకాయించకండి... స్పెషల్ న్యూస్ వుందన్నారుగా ఫోన్లో.... మర్చిపోయారా...?"
   
    "స్పెషల్ న్యూస్.... అన్నానా... అయితే చెప్పాల్సిందే..."
   
    గార్డెన్ లో ఓ ప్రక్కన స్టేట్ ఫిషరీస్ వారి కేంటీన్, ఇంకో ప్రక్క క్వాలిటీ ఐస్ క్రీం పార్లర్ ఉన్నాయి.
   
    "మీకు ఐస్ క్రీం ఇష్టమా.... ప్రాణ్ పకోడా ఇష్టమా...?"       
   
    "నాకేదిష్టమో మీరే చెప్పండి..." చిలిపిగా చూస్తూ అందమ్మాయి.
   
    "ప్రాణ్ పకోడా అనుకుంటాను..." ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు వికాస్.
   
    "కాదు... ఐస్ క్రీం... అదీ ఈ టైంలో గనక..."   

    ఇద్దరూ పార్లర్ లో కార్నర్ సీట్స్ చూసుకొని కూర్చున్నారు.
   
    "ఐస్ క్రీం... కి.... టైమ్ సెన్స్ కీ సంబంధం ఏమిటి?" బేరర్ కి రెండు కప్స్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసి అడిగాడు వికాస్.
   
    "చెప్పనా.... బిజినెస్ మెన్ గా పైకి రావాలనుకుంటే ఫస్ట్ ణ మీరు చెయ్యాల్సిందేవిటో తెల్సా-? సైకాలజీ రీడింగ్... ఉదాహరణకు కేంటిన్ దగ్గరున్న వాళ్ళని, పార్లర్ దగ్గరున్న వాళ్ళని గమనించండి.... ఇక్కడంతా వున్నది యూత్, అవునా, అక్కడ మిడిలేజ్ డ్ పీపుల్స్ వున్నారు.... అవునా.... ఇక్కడున్న వాళ్ళకి అక్కడకెళ్ళి ప్రాణ్ పకోడా తినాలని వుంటుంది....అక్కడున్న వాళ్ళకి ఇక్కడ కొచ్చి ఐస్ క్రీం తినాలని వుంటుంది.... సహజమే కదా.....! కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న ఫీలింగ్.... ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకచోట ఎక్కువగా వున్నప్పుడు... ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సహజంగా అక్కడికే వెళతారు... అందుకున్న మాట..."
   
    "గుడ్ అబ్జర్వేషన్.... మీరు సైకాలజీ స్టూడెంటా...." నవ్వుతూ అడిగాడు వికాస్.
   
    బేరర్ తెచ్చి పెట్టిన ఐస్ క్రీం కప్స్ లో ఓ కప్ ని వికాస్ వేపు తోస్తూ...
   
    "చూడండి మిస్టర్ వికాస్.... మన పరిచయమై ఇవాల్టికి ఎన్నో రోజో చెప్పగలరా...?"
   
    "కరెక్ట్ గా సెవెన్త్ డే.... యామై కరెక్ట్...."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS