Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 1

                                                          లేడీస్ హాస్టల్
   
                                                ----యండమూరి వీరేంద్రనాథ్
   
   
                               

   

 

 

    ఎపిలోగ్ :
   
    అర్దరాత్రి కావొస్తూంది, ఊరు నిద్రకుపక్రమించింది.
   
    ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఒక పోలీసు జీపు నిర్మానుష్యమైన రోడ్ల వెంట వెళ్తూంది. ఆ అలికిడికి లేచిన కుక్క రెండు మూడుసార్లు అరచి మళ్ళీ పడుకుంది. ఒక నిశ్శబ్ద చలన చిత్రంలో అపశృతిలా వున్నదా అరుపు.
   
    జీపు అయిదు నిమిషాలపాటు ప్రయాణించి, ఒక ఇంటిముందు ఆగింది. ఆ ఇంటి ముందు పందిరివేసి వుంది. మామిడి తోరణాలున్నాయి. పెళ్ళి కళ ఇంకా తగ్గలేదు.
   
    లైట్లవాడు ఇంకా తన సామాగ్రి తీసుకు వెళ్ళలేదు. పందిరిపైన బోర్డుకి ఆ పేర్లు అలాగే వున్నాయి.
   
                                                      కిరణ్మయి
                                                   WEDS
                                                   రాయన్న

   
    జీపులోంచి దిగిన ఇన్ స్పెక్టరు ఇంటివైపు నడిచాడు. పందిరిక్రింద జంఖానా మీద ఇద్దరు ముగ్గురు నిద్రపోతున్నారు. అరుగుమీద ఒక ముసలాయన గురక పెడుతున్నాడు. వాళ్ళ మధ్యగా వెళ్ళి తలుపుతట్టాడు.
   
    లోపలందరూ గాఢ నిద్రలో వున్నట్టు - చాలాసేపటివరకూ తలుపు తీయలేదు. దాదాపు అయిదు నిముషాల తరువాత ఒక లావుపాటి ఆవిడ వచ్చి గడియతీసి, పోలీసు డ్రస్ లో వున్న వ్యక్తిని చూసి బిత్తరపోయింది. అప్పుడు సమయం సరిగ్గా పన్నెండు గంటలయింది.
   

           
   
                                                                అధ్యాయం - 1
   
    22. 32. 34 Hrs.
   
    కిరణ్మయి లోపలికి ఇంకా పూర్తిగా ప్రవేశించకుండానే వెనుక తలుపు మూసుకుంది. ఆమె చేతిలో పాలగ్లాసులేదు. ఎవరో దాన్ని గదిలో టేబిల్ మీద వుంచారు. ఆ టేబిల్ పక్కనే తను నిలబడి వున్నాడు.
   
    ఆమె గదిలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా మల్లెపూల పరిమళం ఆ గదిని చుట్టుముట్టింది. తలలో ఎంత పెద్ద పూదండ పెట్టుకున్నా ఆ పరిమళం మెడ వెనుకనుంచి పైకిపాకే నాసికకే పరిమితం చేయడం కేవలం పురుషుడికి దేముడిచ్చిన వరం.
   
    ఆమె తలెత్తి అతడివైపు చూద్దామనుకుంది. కానీ హిమాలయాల నుంచ్జి కన్యాకుమారివరకు వ్యాపించిన భారతీయ సంస్కృతి జంట హిమాలయాల నుంచి కన్యాకుమారి మధ్య శరీర కంపన, దాన్ని సాధ్యపడనివ్వలేదు .... ఆమెకు ఆశ్చర్యమేసింది.
   
    మానసిక శాస్త్రంలో ఆమెకున్న పట్టాకూడా దీనికి ఏ విధమైన వివరణా ఇవ్వలేకపోయింది. ఆమె ఆలోచించింది. అతడి గురించి తనకి ప్రత్యేకంగా ఏమీ తెలీదు. పెళ్ళిచూపులు అయిదు నిమిషాల కన్నా ఎక్కువసేపు జరగలేదు.
   
    'ఏమన్నా మాట్లాడుకుంటారా' నై ఇద్దరినీ అడిగే సంస్కారం తమ ఇంట్లోవారికి లేదు. అటువైపు పెళ్ళికొడుకు తరపు వారినుంచి కూడా అటువంటిదేమీ కనపడలేదు. కానీ వారు పూర్తిగా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవారు. ఒక్కడే కొడుకు. తండ్రికి పొలాలున్నాయి. ఖద్దరు పంచెకట్టుకుని, భుజంమీద కండువా వేసుకున్నాడు. అమాయకంగా వున్నాడు. ఎత్తుగా బలంగా వున్న ఆయనకి కూర్చున్న కుర్చీ పూర్తిగా సరిపోలేదు. పట్నం వారితో వియ్యమందబోతున్న భయం లీలగా కనపడుతూంది. ఆ అడ్వాంటేజ్ తీసుకుని తండ్రీ, రెండో అన్నయ్య విజ్రుంభించి మాట్లాడారు. కాని తమకన్నా వారు ఆర్ధికంగా కాస్త వున్నవారే అని ఆమె గ్రహించింది.
   
    ఈ సంబంధం గురించి ఆమె అంత ఆశ పెట్టుకోలేదు. తొమ్మిది మంది సంతానంలో ఆమె ఆరవది. తండ్రి తాలూకాఫీసులో హెడ్ గుమాస్తా లంచం తీసుకుంటూ వుండగా పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. పెద్దన్నలిద్దరూ ఏడుస్తూ నాలుగొందలిస్తారు. దాంతో కుటుంబం నడుస్తుంది. ఆమె ఒక్కతే సైకాలజీలో ఎమ్మే చదివింది. అధీ ఇంట్లో ఎంతో వ్యతిరేకతతో.....షెడ్యూల్డు కాస్టు అవటంవల్ల స్కాలర్ షిప్ దొరికింది. అదొక్కటే ఆశాకిరణం ఆమె ఇంట్లోవారితో పోరాడి ఎమ్మే పూర్తిచేయగలిగింది మానసికంగా.
   
    ఆమెకన్నా పైన నలుగురు అన్నయ్యలూ, ఒక అక్కావున్నారు. అక్కకి మళ్ళీ ఆరుగురు సంతానం. బావ సారా కాంట్రాక్టరు. అదే సంస్కృతి! చిన్నప్పటి నుంచీ ఆమె ఆ ఇంటికి దూరంగా వుంటూనే వచ్చింది.
   
    ఎమ్మేప్యాసయిన కొంతకాలానికి వచ్చిందీ సంబంధం! ఆమెకప్పుడే పెళ్ళి చేయటం ఇంట్లో వారికి ముఖ్యంగా తండ్రికి ఇష్టంలేదు. కులం అడ్వాంటేజివల్ల, చదివిన చదువువల్ల తన కూతురికి పదిహేనొందలకి తక్కువ కాకుండా జీతం వస్తుంది అని అతడికి తెలుసు. అందువల్ల "అంత తొందరగా" ఆమెని వదులుకోవటం ఇష్టంలేదన్న తన అభిప్రాయాన్ని చాలా నాజూకుగా వెల్లడించేవాడు. వరుడి పేరు రాయన్న.
   
    పేరు బాగోలేదు. బావున్న పేరున్న వారందరూ ఆరడుగుల ఎత్తుండరు. కానీ రాయన్న ఆరడుగుల ఎత్తు.
   
    22.32.46 Hrs.
   
    గదిలో అడుగుపెట్టిన పన్నెండు సెకన్లకి ఆమె తలెత్తి అతడివైపు చూసింది. అతడికి తను భుజాలదాకా వస్తుంది అనుకుంది. అంతలో, అతడూ తనవైపే చూస్తూ వుండటంతో చప్పున కళ్ళు దించుకుంది.  కానీ ఆ రెప్పపాటు కాలంలోనే, అతడూ తనలాగే ఈ నిశ్శబ్దయుద్దాన్ని ఎలా శాంతి సంప్రదింపుల ద్వారా రాజీకి వచ్చి దగ్గిరవ్వాలనే ప్రయత్నంలో తటపటాయిస్తున్నట్టు గ్రహించింది. అప్రయత్నంగా వచ్చిన నవ్వును అతి కష్టంమీద అతడికి కనబడకుండా దాచుకోవటంలో విఫలమైంది.
   
    ఈ వివాహం జరుగుతుందని ఆమె పెద్దగా ఆశ పెట్టుకోకపోవటానికి మరో కారణం అతడి క్వాలిఫికేషను! అతడు గ్రాడ్యుయేటు కూడా కాదు. ఇది ఆమెకు అభ్యంతరం లేదుగానీ, చాలామంది మొగవాళ్ళు తమ కన్నా ఎక్కువ చదివిన అమ్మాయిని భార్యగా ఇష్టపడరని ఆమెకు తెలుసు. అయినా కూడా వాళ్ళు పెళ్ళిచూపులకు రావటానికి సమ్మతించారని తెలిసి కొద్దిగా ఆశ్చర్యపోయింది.
   
    ఆమె అతడిని మొదటిసారి చూసింది రంజీట్రోఫీ మ్యాచ్ లో!
   
    రాయన్న ఆంధ్ర తరపునుంచి క్రికెట్ ఆడే టీమ్ లో ప్రధాన ఆటగాడు.
   
    అతడు పెళ్ళిచూపులకు వస్తున్నాడని తెలిసాక ఆమె నాలుగో అన్న (అతడొకడే ఆమెతో ఆ ఇంట్లో చనువుగా వుండేది) పట్టుబట్టి ఆ రోజు మ్యాచ్ కి తీసుకెళ్ళాడు. ఆమెకి క్రికెట్ గురించి బాగా తెలుసుగానీ అంతగా ఉత్సాహం లేదు. ఆమె వద్దంది. అతడెవరో, ఇంకా పెళ్ళిచూపులు కూడా కాలేదు. ఇలా వెళ్ళటం ఎందుకు? అని వాదించింది కానీ ఆమె అన్న దీన్నో థ్రిల్ గా ఫీలయ్యాడు.
   
    అన్ని మామూలు రంజీమ్యాచ్ ల్లాగే, అందులోనూ అది ఆంధ్రా-హైదరాబాద్ ల మధ్య కాబట్టి, జనం ఆట్టేలేరు. ఇద్దరూ టిక్కెట్టు కొనుక్కుని వెళ్ళి కూర్చున్నారు. ఎందుకో డ్రెస్సింగ్ గదిలోంచి బయటకు వచ్చిన రాయన్నని దూరంనుంచే ఆమె అన్న చూసి చెయ్యివూపాడు. రాయన్న అతడిని గుర్తుపట్టలేదు. సంబంధం మాట్లాడటానికి తండ్రితో కలిసి అతడూ వెళ్ళాడు. అంత దూరంనుంచి గుర్తుపట్టటానికి ఆ కొద్ది సమయమూ సరిపోదు. అందుకే అతడు చెయ్యి వూపినప్పుడు రాయన్న మొహంలో ఆశ్చర్యం కనపడింది. అతడు తిరిగి లోపలి వెళ్ళిపోయాడు.
   
    ఆట ప్రారంభమైన ఇరవై నిముషాలకే ఆంధ్రజట్టు మూడు వికెట్లు కోల్పోయింది. రాయన్న అయిదోవాడు. అతడు బ్యాట్ పట్టుకుని ఆటస్థలంలోకి వెళుతూ వీళ్ళు కూర్చున్నవైపు తలతిప్పి, ఆమె అన్నవైపు మరోసారి పరిశీలనగా చూసేడు. అతడెవరో అకస్మాత్తుగా గుర్తొచ్చినట్టు ముఖ కవళికలో మార్పొచ్చింది. అతడి చూపు పక్కనున్న తనవైపు సాగబోయేటంతలో చప్పట్లు మ్రోగటంతో అతడు 'పిచ్' వైపు నడక సాగించాడు.
   
    ఆంధ్రజట్టు ఆశలు చాలావరకు అతడిమీదే వున్నాయి. అతడు కూడా నిరాశపర్చలేదు. స్కోరు నెమ్మదిగా పెరగసాగింది. లంచ్ సమయానికి అతడు యాభై పరుగులు చేశాడు. సాయంత్రం ఆట పూర్తయ్యేసరికి ఆంధ్ర 238 లోనూ, అతడు నూటికి కేవలం రెండు పరుగులు తక్కువలోనూ వున్నాడు. ఉన్నది కొద్దిపాటి జనం అయినా, కుర్చీల్లో నిలబడి చప్పట్లు కొడుతున్నారు. తిరిగి వస్తున్నంతసేపూ అతడు తాము వున్నవైపే చూపు నిలిపినట్టు ఆమె గ్రహించింది. అతడు తనని గుర్తించాడు.
   
    అబ్బాయిలూ అమ్మాయిలూ అతడిని చుట్టుముట్టి ఆటోగ్రాఫులు తీసుకుంటున్నారు. బయటకొస్తూ వుండగా అన్న "ఎలా ఉన్నాడే" అని అడిగాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనేది మిగతా ఏ విషయంలోనైనా సరిపోతుందేమోగానీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మాత్రం కాదు. పెళ్ళయిన మొదటి సంవత్సరమంతా గదిలో బిగించుకు కూర్చున్న జంటలో కూడా- పదేళ్ళుపోయాక ఒక రకమైన శూన్యత రావటాన్ని ఒక సైకాలజీ స్టూడెంటుగా ఆమె గమనించింది. అలా గ్రహించటానికి ఆమెకి ప్రపంచపు అవసరం రాలేదు. తన ఇల్లే సరిపోయింది. తన ఇంట్లోనే ఆరుగురు దంపతులున్నారు తల్లీ తండ్రితో సహా.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS