Next Page 
యుగాంతం పేజి 1

                                                        యుగాంతం

                                                   --యండమూరి వీరేంద్రనాథ్



                                        

    

 

     అనంతానంతమైన విశ్వంలో కొన్ని వేల సంవత్సరాల్నుంచీ నిర్విరామంగా ఒకే కక్ష్యలో పరిభ్రమిస్తున్న కోటాను కోట్ల గోళాల మధ్య ఒక చిన్న కదలిక క్షణంలో వెయ్యోవంతుసేపు ఏర్పడి మామూలుగా సర్దుకుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన కదలికని ప్రపంచంలోని ఏ విజ్ఞాన పరికరమూ పట్టుకోలేకపోయింది.
   
    భూమి మామూలుగానే తిరుగుతోంది. సూర్యుడి ఉదయాస్త మయాలు మామూలుగానే జరుగుతున్నాయి. అయితే భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఒక నక్షత్రం ప్రాక్సిమా సెంక్చువరీ అని పిలువబడేది. వెంట్రుకవాసిలో తన కక్ష్య నుంచి బయటపడి అమితమైన వేగంతో ప్రయానించసాగింది.
   
    అది ఏప్రిల్ పదమూడు. గ్రీన్ విచ్ కాలమానం ప్రకారం 14-30 నిమిషాలు. అప్పుడు సగం ప్రపంచం గాఢ నిద్రలో వుంది.
   
    శైలజ, రమణ, జానకి, రాజయ్య, మెడ్ డొనాల్డ్, జగదీష్ చంద్ర అందరూ కలిస్తే ప్రపంచం.
   
    సమస్యలు- సాంఘికం, మానసికం, రాజకీయం, నైతికం అన్నీ కలిస్తే ప్రపంచం.

___________________________________________________________________
                       మహా ప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది!   
___________________________________________________________________

                                                                    1
   
    ఇండియన్ టైమ్స్ పత్రికా కార్యాలయం రెండో అంతస్తు కుడివైపు హాల్లో బల్లమీదున్న ఓ చిన్నకాగితం ముక్కని భూతద్దంలో పరిశీలిస్తున్నది శైలజ.
   
    "ఏమిటది అంత పరీక్షగా చూస్తున్నావ్?" అన్నది టైపిస్టు రాణి దగ్గరకొస్తూ.
   
    "ఏదో చెత్త కాగితం. ఏమి వ్రాసివుందా అని చూస్తున్నాను."
   
    "సబెడిటర్ లక్షణం పోనిచ్చావు కాదు. ప్రతిదాన్నీ శోధించనిదే మనసు నిలవదా ఏం?"
   
    శైలజ నవ్వింది. "మనం ఇంకా నయం. అమెరికాలో జర్నలిస్టులైతే....."
   
    "చాల్చాలు....." అంటూ రాణి టేబుల్ మీద కాగితం తీసుకొంది. పురాతన కాలపు పుస్తకంలోంచి వూడిపోయిన ముక్క అది. ఎండకి ఎండి, వానకి నాని చివికిపోయింది. శిథిలావస్థలో వుంది.
   
    "ఎక్కడ దొరికిందిది?"
   
    "మా ఇంటి పెరట్లో."
   
    రాణి నవ్వింది. "పెరటిలో దొరికిన కాగితాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి శోధించటం కోసమేనా నీకు జీతమిస్తున్నది?"
   
    "ఏ పుట్టలో ఏ కాగితం వుందో ఎవరికి తెలుసు?"
   
    "సర్లే పద. టీకి టైమవుతూంది."
   
    ఇద్దరూ క్యాంటీన్ వేపు నడుస్తూంటే శైలజ అన్నది- "మా యింటి పెరటికి అవతలివేపు గోరీలున్నాయి. అక్కణ్నుంచి గాలికి ఎగిరి వచ్చుంటుంది."
   
    "ఏ పుస్తకంలోదో చిరిగి వుంటుంది. దానికంత ప్రాముఖ్యత యివ్వటం అనవసరం." శైలజ మాట్లాడలేదు.
   
    ఇద్దరూ క్యాంటీన్ లో ఓ మూల కూర్చున్నారు. కుర్రాడు టీ తీసుకొచ్చి ముందు పెట్టేడు.
   
    రాణి ముందుకు వంగుతూ "ఎంత బావుందో!" అన్నది.
   
    "ఏమిటి?"
   
    "అలా ముందుకి వంగొని కూర్చుంటే నీ కడుపుమీద ముడత."
   
    శైలజ చప్పున సర్దుకొని కూర్చుంటూ, "ఇడియట్" అంది.
   
    రాణి నవ్వింది. "నేనన్నదాంట్లో తప్పేముంది?"
   
    తప్పులేదు. శైలజ పక్కనుంచి వెళ్ళే పదిమందిలో తొమ్మిది మంది ఆమె వైపు తిరిగి చూస్తారు.
   
    "నీ వయస్సెంత?" రాణి అడిగింది.
   
    "ఇరవై ఆరు."
   
    "మైగాడ్!" అంది రాణి. "ఇరవై ఆరేళ్ళ జీవితాన్ని డ్రైగా గడిపావా?"
   
    "డ్రై..... అంటే?"
   
    "వెట్ కానిది." కొంచెం నిశ్శబ్దం. మళ్ళీ రాణీయే టీ కప్పు తీసుకుని తాగుతూ అన్నది "వేడి వేడి కప్పులో టీ లాటిది యవ్వనం.
   
    "అవును. మూడు గుక్కలేస్తే అయిపోతుంది."
   
    "వెయ్యకపోతే చల్లారిపోతుంది."
   
    ఈ మాటలకి శైలజ నవ్వింది. రెండు చేతుల్లోకి కప్పు తీసుకుని, "నా జీవితాన్ని ఇలా దోసిలిలో వుంచి అర్పిద్డామని ఎదురు చూస్తున్నాను. ఈ నా మనసు, ఈ శరీరం ఒకరికే. ఆ ఒకరూ ఎవరో నాకు తెలీదు. ఇదొక 'వే ఆఫ్ లైఫ్'. నువ్వన్నట్టూ జీవితాన్ని ఇంకోరకంగా కూడా అనుభవించవచ్చు. అదివేరే ఫిలాసఫీ. ఆహ్ది పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏ రకం జీవితాన్ని కొనసాగించాలా అని. నేను మొదటి రకాన్నే ఇష్టపడతాను."
   
    "ట్రాష్" అంది రాణి. "ఇవన్నీ సెంటిమెంట్లు. నీ ఒక్క జీతం మీద కుటుంబం ఆధారపడి వుంది. కాబట్టి నీ తండ్రి నీకు సంబంధాలు చూడడు. నీ తమ్ముళ్ళు రెక్కలొచ్చేవరకూ నిన్ను ప్రేమగా చూసి ఆ తర్వాత ఎగిరిపోతారు. అప్పటికి నీకు నలభై ఏళ్ళొస్తాయి." ఒక్కక్షణం నిశ్శబ్దం.
   
    శైలజ ఖాళీకప్పు కింద పెట్టి, చిన్న స్వరంతో "ఇవన్నీ నేను ఆలోచించలేదంటావా?" అంది.
   
    "ఆలోచిస్తే ఇలా నిస్సారంగా గడపవు" అన్నది రాణి. అని, ఈ విధంగా కొనసాగించింది. "దూరంగా చిన్నవెలుగురేఖ కూడా కనిపించని చీకటే భవిష్యత్తయితే. దొరికిన మిణుగురుల్తో ఆడుకోవటమే మంచి పద్దతి. 'మీ ఇంట్లో చిదిమి దీపం పెట్టుకోండిరా' అని ఓ అపరంజి బొమ్మని పల్లకీలో పంపితే, వాళ్ళు సంతృప్తి చెందరు. ప్రక్కన నోట్ల కట్ట వుందా, లేదా అని చూస్తారు.....నీ శరీరాన్ని నువ్వెంత పవిత్రంగానైనా వుంచూ- నీ మనసెంత పవిత్రంగానైనా వుండనీ-పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ డబ్బే ప్రధానపాత్ర వహిస్తుంది. అలాంటప్పుడు.... అటువంటి మొగవాడికోసం ఎందుకు శరీరాన్ని పవిత్రంగా వుంచడం? ఎంజాయ్!"
   
    ఆమెవైపు కన్నార్పకుండా చూసింది శైలజ. అంతర్లీనంగా మనిషి నైతిక విలువలమీద డబ్బు, ఎంత ప్రభావం చూపిస్తుంది!
   
    ఈ కొత్త థియరీ చాలా చేదునిజం. కానీ జీర్ణం చేసుకోవాలి.
   
    పొరలు పొరలుగా విడదీసి చూస్తే, ముగ్ధంగా వుండాల్సిన స్త్రీని రాటుతేలేటట్టు చేసింది వ్యవస్థేనేమో అనిపిస్తుంది.
   
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
   
    "వ్యవస్థ మారాలంటే ఏం చెయ్యాలి?" అంది శైలజ.
   
    రాణి నవ్వింది. "ప్రళయం రావాలి."
   
    శైలజ నవ్వలేదు. "ఈ వ్యవస్థ మారటంకోసం ప్రళయమే రావాల్సివస్తే, ఆ ప్రళయాన్ని ఈ క్షణమే ఆహ్వానిస్తున్నాన్నేను, ప్రళయం రావాలి. ఆ ప్రళయకాల ఝంఝామారుతంలో..... ప్రక్షాళనమైన మనస్సుతో, ప్రక్షాళనమైన వ్యవస్థతో మనిషి కొత్త జీవితం ప్రారంభించాలి."
   
    రాణి ఆమె చెయ్యి పట్టుకుని, "ఏయ్, ఏమిటది? అందరూ చూస్తున్నారు" అంది.
   
    శైలజ తన ఆవేశానికి తానే సిగ్గుపడి, "సారీ, పద పోదాం" అంది. ఇద్దరూ శైలజ సీటు దగ్గరికి వచ్చేరు. రాణి కుర్చీ వెనక్కి జారబడి, "ఏమిటీ ఫైలు?" అని అడిగింది ఫైలు విప్పుతూ.
   
    "ఇంటర్వ్యూ అప్లికేషన్లు. రేపు ఇంటర్వ్యూ వుందిగా."
   
    "కొత్త కుర్రాళ్ళు వస్తారన్నమాట" అంటూ ఒక్కో అప్లికేషనూ, దాని కుడివేపు మూలనున్న ఫోటో చూస్తూ పేజీలు తిప్పసాగింది రాణి.
   
    అలా చూస్తున్నదల్లా ఒకచోట ఆగి, "హాయ్!" అంది. "ఈ అబ్బాయి చూడు ఎంత బావున్నాడో?"
   
    శైలజ అటు చూడలేదు. "అయితే ఏమిటిట" అన్నది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS