Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 1

                                   గాడ్స్ గిఫ్ట్
   

                                                                           --కురుమద్దాలి విజయలక్ష్మి
   
   
                              

 

   

   మౌన పోరాటం ఇది మరీ మౌనంగ పోరాటం-
   
    మానభంగ పర్వంలో మగవాడి దౌర్జన్యంలో-
   
    అబలల ఆరాటంలో అతివల పోరాటం.
   
    సతులార సాగండి ముంముందుకి-
   
    పడతులారా పదండి పైపైకి.
   
    "నారాయణ...నారాయణ..." అంటూ మేఘాలమీద ప్రయాణం చేస్తూ ఊరిమీద పడ్డ నారద మునీంద్రుల వారికి ముక్తకంఠంతో అదేదో నినాదం లాంటి పాట పాడుతూ ఆడ మళయాళం [ఆడ] ఆయుధాలా [అప్పడాల కర్ర, కత్తిపీట, చాట, చీపురు, రోకలి, రుబ్బుడుపత్రం, కారం డబ్బా వగైరా] ధరించి ముందుకు సాగుతూ కనిపించారు.
   
    నారాయణ మంత్రం మర్చిపోయిన నారద మునీంద్రుల వారు, "ఈ ఆడంగుళు ఆఘమేఘాలమీద ప్రయాణిస్తూ ఎక్కడికి వెళుతున్నారు?" అన్న ఆలోచనతో పొట్ట ఉబ్బిపోగా ఏమాత్రం ఆలశ్యం చేయకుండా వాళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు.
   
    "పురుష వాసన! పురుష వాసన" పైటచెంగుతో ముక్కు మూసుకుంటూ అంది సువాసనల వాణి.
   
    "నారదుల వారే వాణీ!" అంది మరో సుబోధనల రాణి.
   
    కాస్త కలకలం తర్వాత అందరూ సర్దుకున్నారు.
   
    "ఎందాకా మీ యీ పయనం తల్లులారా?" నారద మునీంద్రులవారు వినయంగా అడిగాడు.
   
    "చెప్పాలా?" సూరంపూడి సూర్యకాంతాదేవి కయ్యిమని అరచినట్లే అడిగింది.
   
    "చెప్పాలా! అంటే చెప్పి తీరాలని రూలేం లేదు తల్లీ! నా ఆరోగ్యం సంగతి లోకవిదితమే. ఏదైనా తెలుసుకునేదాకా మనసు వూరుకోదు. తెలుసుకున్న తర్వాత పొట్ట ఉబ్బుతుంది. ఆ ఉబ్బు తగ్గేవరకూ భరించరాని బాధతో విల విల లాడుతాను. ఎవరి చెవో దొరకకపోదు, అక్కడ ఊదకపోను. దాంతో నా పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. వెంటనే నారాయణ జపం చేస్తూ నాలుగు లోకాలు తిరుగుతుంటాను." నారదుల వారు మనసులోది దాచుకోకుండా చెప్పారు.
   
    "మా పయనం రహస్యం. మా సమస్య రహస్యం. గ్యాస్ ఉన్నా పొట్ట ఉబ్బుతుంది. దానికి మేమేం చేస్తాం. ఏ డాక్టరు దగ్గరకో పొండి!" నడిమింటి నాంచారమ్మ మొఖమాటం లేకుండా చెప్పింది.
   
    "తల్లులారా! ఇది అన్యాయం." నారద మునీంద్రుల వారు లబ్బు లబ్బుమని గోలపెట్టాడు.
   
    "ఇది అన్యాయం అయినప్పుడు ఏది న్యాయం? ఏది సత్యం? ఏది ధర్మం?" ఆవేశంతో వూగిపోతూ అడిగింది అరుణవర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర.
   
    "అమ్మా తల్లీ!" అన్నాడు నారదుడు.
   
    "మన్ని అమ్మలారా తల్లులారా అంటున్నాడే! పోనీ చెప్పేద్దామా?" రంగనాయకి బోలెడు జాలిపడుతూ అంది.
   
    "జాతి....జాతి...." గుర్తుచేసింది విమల.
   
    "కులాలు మతాలు జాతులు మీకుగాని నాకేంటి తల్లీ!"
   
    "జాతి అంటే మగజాతి పురుషజాతి."
   
    "నారదుల వారిది మగజాతి అయినా పాపం బ్రహ్మచారేకదే?"
   
    "పాపం అంటూ జాలితో దిగజారకు. ఆడవాళ్ళు బొందన పడేది ఇక్కడే."
   
    "నారదుల వారు ఆడవాళ్ళని "అమ్మా...తల్లీ" అని తప్ప 'సిస్టర్' అని కూడా పిలవరే. మనం ఈయన శీలాన్ని శంకించ కూడదు."
   
    "అదే కూడదన్నాను. ఘోటక బ్రహ్మచారి..."
   
    "ఘోటక బ్రహ్మచారి అయేది, అఘోటకచారి అయేది అప్రస్తుతం. మగవాడు. ఈ నాలుగక్షరాలు గుర్తుపెట్టుకో చాలు."
   
    ఆడవాళ్ళంతా అదో రకంగా చూస్తూ, ఇదో రకంగా మాట్లాడటం ఏదో రకంగా వుంది నారదుల వారికి. అందరాడంగుల మధ్య ఏకో నారాయణ అయాడు. ఏమీ చేయలేక అలవాటులో అలవాటుగ  నారాయణ....నారాయణ ...." అన్నాడు శూన్యంలోకీ చూస్తూ.
   
    మరికాసేపు వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జనపడి ఒకరి చెవులు మరొకరు కొరుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు.
   
    "సరే! మా కధా కమామీషు చెపుతాము. మీరు మాత్రం ఈ విషయం ఎక్కడా వూదకూడదు." అంది అలివేణి కోడలు త్రివేణి.
   
    "నారాయణ నారాయణ" అన్నాడు నారదుడు. అంతేగాని ఊదే విషయం మాత్రం చెప్పలేదు.
   
    "ఆడవాళ్ళకే ఈ కష్టాలెందుకు?" లా సగం చదువుతూ మధ్యలో లా చదవటం ఆపేసిన లాయర్ సుహాసిని, లా...పాయింట్...తీస్తూ అడిగింది. లా పూర్తిగా చదవకపోయినా ఆ...కాలంలో....నే....లా....చదివే రోజుల్లో అంటూ మాటకు ముందు అనటం, ప్రతిదానికి పాయింట్ తీయటం వల్లను అందరూ ఆమెని లాయర్ సుహాసిని అంటుంటారు.
   
    యం. బి. బి యస్. చదువుదామని ఒకటో క్లాసునుంచి టెన్త్ వరకు కలలు కని టెన్త్ క్లాసు మూడుసార్లు తప్పి చివరికి ఓ డాక్టరుగారి భార్య అయిన అమృతవల్లి తను ఆ కాలంలో డాక్టరు చదువుదామనుకుంది- అంటూ చెపితే నవ్విపోతారేమో అని డాక్టరుగారి భార్యగా అంధరికి చెప్పుకుని తృప్తిపడుతూంటుంది. అంతేకాదు మాటలు కూడా సరిగ్గా వుచ్చరించలేని అమృతవల్లి "మా డాక్టరుగారు ఈ రోజు ఓ రోగికి పెధిడిన్ ఇచ్చి, మార్ఫియా ఇంజక్షను పొడిచి, కాంపోజ్, గార్డినాల్ టాబిలెట్టులు నోట్లోకి ద్రవరూపంతో ఇచ్చి పొట్ట కోసి పెద్దాపరేషను చేశారు" అంటూ నోటికొచ్చిన మందుల పేర్లు చెపుతూంటుంది. ఇన్ని మత్తుమందులు ఇస్తే రోగి "ఠా" అంటాడని బొత్తిగ తెలియని అమాయకురాలు.
   
    "ఆడవాళ్ళకే ఈ కష్టాలెందుకు?" అని లా చదవని లాయరు సుహాసిని అడగంగానే తానూ ఓ మాట మాట్లాడాలనే సదుద్దేశ్యంతో "మా డాకటారుగారు చెపుతుంటారు కదా! ఆడాళ్ళకి ముట్టులు అంటులు...." పెదవి కదిపిందో లేదో కయ్యిమంది కామాక్షి "అందరూ మాట్లాడితే ఎలా?" అంటూ.
   
    "కష్టాలు ఆడవాళ్ళకే కాదు తల్లీ! మగవాళ్ళకీ వస్తాయి" నారద మునీంద్రుల వారు చల్లగా శలవిచ్చారు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS