Next Page 
నీలికనుల నీడల్లో  పేజి 1

                                                      నీలికనుల నీడల్లో
                                                                           --కురుమద్దాలి విజయలక్ష్మి
 

                                            

 

 

     మా!
   
    మా యీ!
   
    మాతా!
   
    అమ్మా!
   
    ఈ పిలుపులన్నీ కూడా తల్లిని పిలిచే పిలుపులే ఒకే వ్యక్తి పదే పదే ఎలుగెత్తి అలా పిలవటం లేదు. ఆవేదనతో ఆక్రోశంతో అరుస్తున్నాడు.
   
    అలా అరుస్తున్న వ్యక్తి పేరు ఆనందయ్య. వయసు డెబ్బైయ్యో పడిలా వున్నవాడు.
   
    ఆనందయ్య అలా అరుస్తుంటే ఓ చెట్టు క్రింద కళ్ళు మూసుకుని నిద్ర, జాగ్రదావస్తకాని రీతిలో పడుకున్న నలభయి ఏళ్ళ వ్యక్తి ఓ కన్ను తెరిచి ఓరచూపు సాగించి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
   
    ఊరికి దగ్గరగా వున్నా చిత్తడివి అది. అడవి ప్రాంతాలలో మనుషులంటూ ఎవరుంటారు? అయినా ఆనంధయ్య అడవిలోకి చూపు సారించి ఎలుగెత్తి పిలుస్తూనే వున్నాడు.
   
    "తాతా!" ఆ వ్యక్తి లేచి కూర్చుని బద్దకంగా వళ్ళు విరుచుకుంటూ పిలిచాడు. అతని పేరు రఫూర్.
   
    ఆనందయ్య వినిపించుకోలేదు.
   
    మరోసారి కాస్త గట్టిగా "తాతా!" అని పిలిచాడు రఫూర్.
   
    "ఎవరు?" ఆనందయ్య కళ్ళు చిలికించి చూస్తూ అడిగాడు.
   
    "నేనే."
   
    "నేనే అంటే?"
   
    "ఓ మనిషిని తాతా!"

    "అది తెలుస్తూనే వుంది. ఎందుకు పిలిచావన్నదే తెలియక అడిగాను."
   
    "అది తెలియకనే నేనూ అడిగాను తాతా!"
   
    "నన్ను చూస్తే వేళాకోళంగ వుందా నాయనా!"
   
    "ఉహూఁ"
   
    "మరి ఈ ఎకసెక్కం మాటలు ఏమిటి?"
   
    రఫూర్ బద్దకంగా ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు.
   
    "బాధలో వున్నా హృదయం నాది. దెబ్బతిన్న మనసు నాది. విశ్రాంతిగా పడుకున్న నీకేం తెలుస్తుంది నా గాధ!" అనుకున్నాడు ఆనందయ్య.
   
    రఫూర్ కండువా దులిపి భుజాన వేసుకుని ఆనందయ్య దగ్గరకు వచ్చాడు.
   
    "తాతా! ఎకసెక్కం కాదు. నిజంగానే అడిగాను. నీవు ఎవరిని పిలుస్తున్నావొ నాకు అర్ధమయింది. ఎలుగెత్తి పిలిస్తే రాయిలాగా వున్న దేముడు కూడా పలుకుతాడేమో గానీ శక్తిమాయి మాత్రం పలకదు" అన్నాడు రఫూర్.
   
    "నీ కెలా తెలుసు?" అనుమానంగా చూస్తూ అడిగాడు ఆనందయ్య.
   
    "నేను నీలాగానే ఎవరో చెప్పిన మాట ఇక్కడికి వచ్చి మానవమాత్రుడు కనపడతాడేమోనని వెతికి వేసారి చివరికి నీలాగానే కంఠనాళాలు తెగిపడేలా అరచి అరచి చివరికి నీరసంతో అలా చెట్టునీడన తొంగున్నాను. మాగన్నుగ నిద్రపడుతున్నది. నీ అరుపులతో లేచాను."
   
    "అయ్యో!" అన్నాడు ఆనందయ్య.
   
    "ఫర్వాలేదు తాతా! మనిషి అన్నవాడికి కావాల్సింది నిద్ర కాదు. నీతి, న్యాయం అవే ఈనాడు కరువయ్యాయి."
   
    "నిజమే. ఇంతకీ నీ కొచ్చిన కష్టం ఏమిటి బాబూ?"
   
    "చెపితే తీరేది కాదు తాతా!"
   
    "సాటి మనిషితో చెప్పుకుంటే మండే మనసు చల్లబడుతుంది.
   
    "నిజమే తాతా! తాత్కాలికంగా చల్లబడుతుందే మోగాని సమస్య తీరదు. అయినా పెద్దవాడివి నీవు చెపుతాను. ఠాకూర్ నా కొడుకులు తిని తెగబలిసి....."
   
    అతను కసిగా తిడుతుంటే భయం భయంగా చుట్టూ చూశాడు ఆనందయ్య. "అలా గట్టిగా మాట్లాడకు అని కూడా గొణిగాడు.
   
    "ఇక్కడ చెట్లు తప్ప మనుషులు లేరు తాతా! వింటే మాత్రం ఏం చేస్తారుట! తలతీసి మొలేస్తారా? గొయ్యి తీసి నిలువునా కప్పేస్తారా? బచ్చా నా కొడుకులు. ఏడాదిపాటు శ్రమకోర్చి రాత్రనక, పగలనక నానా కష్టపడి పంట పండిస్తే నా తాతలనాటి బాకీ ఇంకా తీరలేదని చెప్పి పంట దింపే సమయానికి అడ్డుతగిలి మొత్తం పంట తీసుకెళ్ళారు. నేనేం తినాలి? నా పెళ్ళాం బిడ్డలు ఏం తినాలి? అందుకే చద్దామని వచ్చాను. చద్దాముఅనుకుని ప్రయత్నం చేసి విరమించాను. దమ్ములేని వెధవని" రఫూర్ చెప్పాడు.
   
    "చచ్చి ఏమీ సాధించలేము నాయనా!" ఆనందయ్య అన్నాడు.
   
    "బతికుండి ఏం సాధించలేనప్పుడు చస్తే మాత్రం ఏమిటి?"
   
    "చావు సమస్యకి పరిష్కారం కాదు. ఏదో అద్భుతం జరుగుతుంది. అప్పుడు మనలాంటి వాళ్లకి మంచి జరుగుతుంది."
   
    "గంట క్రితం వరకు ఆ ఆశతోనే కాళీ తల్లిని పిలిచాను. కంఠనాళాలు చిట్లాయేమోగాని పిలుపుకి "ఊ" అన్నవాళ్ళు కానరాలేదు. అలసి సొలసి ఇలా చెట్టుకి చేర్ల గిలబడ్డాను. అవునుగానీ తాతా! నీకొచ్చిన కష్టం ఏమిటట?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS