Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 1

                                                           రాయుడిగారి సినిమా కథ
                                                                                          

                                                                           --వసుంధర
                           

                                              
 ప్రొడ్యూసర్ రాయుడికి సినీ ఫీల్డులో మంచి పేరుంది. ఆయన చిత్రాలను పండితులు, పామరులు కూడా మెచ్చుకుంటారు. చూస్తున్నంతసేపూ మనిషిని ఏదో లోకంలోకి తీసుకుపోయి-కాసేపు ఇహలోకానికి దూరంగా ఉంచడం ప్రధానంగా ఉంటాయాయన చిత్రాలు. వినోదం ప్రధానాంశంగా ఉండే ఆయన చిత్రాలన్నీ సుఖాంతాలే! అన్నీ ప్రేమికుల చుట్టూ తిరిగి, చివర్లో వాళ్ళ పెళ్ళితో ముగిసేవే! కొత్తదనమంతా కథ చెప్పడంలోనే ఉండేది. రాయుడిగారి సినిమాకి దర్శకుడెవరూ అన్నది ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. రాయుడిగారి సినిమా అంటే రాయుడిగారి సినిమాయే!  
    సాధారణంగా రాయుడు తానొక చిత్రం విడుదల చేయగానే వెంటనే మరొక చిత్రం తలపెట్టేవాడు. ఈసారి మాత్రం విడుదలైన చిత్రం వందో రోజుకు వచ్చినా ఇంకా కొత్త చిత్రం ప్రారంభించలేదాయన. సినిమా పత్రికలన్నీ అదో పెద్ద విశేషంగానే వ్రాశాయి. చాలా మంది విలేఖరులు ఆయన్ను ఇంటర్వ్యూచేసి ఈ విషయమే అడిగారు. అన్నింటికి ఆయనిచ్చిన సమాధానం ఒక్కటే__మంచి కథ కావాలి! అందుకోసమే తను ఎదురు చూస్తున్నాడు! 
    ఈ విషయం తెలిసి ఎందఱో రచయితలాయన్ను వినాయకున్ని పత్రితో ముంచేసినట్లు తమ తమ రచనలతో ముంచెత్తేశారు. పత్రికలు నిర్వహించే పోటీలకు కంటే ఆయనకే ఎక్కువ రచనలు వచ్చాయి. రాయుడు ఓపికగా అన్నీ చదివాడు. ఒక్కటీ నచ్చలేదు.
    ఇటీవలే రాయుడు తన చిత్రం శతదినోత్సవ సభలో ప్రసంగించి వచ్చాడు. అప్పట్నించీ ఆయనకు భయం పట్టుకుంది__తను మళ్ళీ ఇంకో చిత్రం తీయగలనా అని! ఆయన భయానిక్కారణం లేకపోలేదు. ఆయన తీసిన ప్రతి చిత్రం లోనూ ఏదో కొత్తదనం ఉంది. కథలెంత పాతవయినా, జనం ఆ కొత్తదనం పట్లనే ఆకర్షితులవుతున్నారు. ఆ పేరు నిలబెట్టుకోవాలన్నది రాయుడి తాపత్రయం.  
    మద్రాసులోనూ, హైదరాబాదులోనూ ఉండే రచయితలో, జర్నలిస్టులో, సినీ ఫీల్డుకు సంబంధించిన వ్యక్తులో వచ్చి ఆయన్ను వేధిస్తున్నారు. కొంతకాలం వీళ్ళందరికీ దూరంగా ఉండాలని రాయుడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయాన్ని భార్యకు కూడా చెప్పాడు.  
    రాయుడి కిద్దరు పిల్లలు. ఇద్దరూ మగపిల్లలే! పెద్దవాడికి పదిహేను, చిన్నవాడికి పది. వాళ్ళిద్దరికీ కూడా అప్పుడు సెలవులు. ఎప్పుడూ చెల్లెలు రాయుడింటికి రావటమేగానీ, రాయుడు చెల్లెలింటికి వెళ్ళలేదు. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళి సరదాగా గడపాలని పిల్లలు తహతహలాడుతున్నారు. ఎప్పుడూ సినిమా హడావుడిలో తలమునకలవుతూ వుండే తండ్రి ఇలా అనగానే పిల్లలిద్దరూ ఎగిరి గంతేశారు. రాయుడి భార్య కూడా ఎంతో సంతోషించింది.  
    రాయుడి చెల్లెలు ఆయన కంటే ఒక సంవత్సరం మాత్రమే చిన్నది. రాయుడికంటే పదేళ్ళు ముందుగానే ఆమె వివాహమైపోయింది. అప్పటికి రాయుడింకా సినీరంగ ప్రవేశం చేయలేదు. సినిమారంగంలో ప్రత్యేకత ఏమిటంటే సినీ ఫీల్డుకి సంబంధించిన వారి కుటుంబం గురించి పత్రికలు, పాఠకులు కూడా అట్టే పట్టించుకోరు. రాయుడి భార్యాబిడ్డల గురించి ఒకటి రెండుసార్లు పత్రికల్లో ఫోటోలు వచ్చాయేమోగాని__రాయుడి చెల్లెలు గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు.  
    రాయుడు చెల్లెలికి ఉత్తరం రాశాడు. తనరాక గురించి ఎవరికీ చెప్పవద్దన్నాడు. ఒకటి రెండు నెలలు తను అక్కడే ఉంటానన్నాడు. చెల్లెలి నుంచి జవాబు వచ్చేక, ఆయన చెప్పా చెయ్యకుండా ఒక రోజున కుటుంబంతో సహా మద్రాసునించి మాయమయ్యాడు. తన సెక్రటరీలకు ఆయన ఆదేశం ఇచ్చాడు _ హైదరాబాదులో తన గురించి ఎవరైనా అడిగితే మద్రాసులో ఉన్నట్టు చెప్పాలి. మరీ ముఖ్యమైన విశేషమైతేనే ఏ సంగతీ తనకు చెప్పాలి! తనే ఊళ్ళో ఉంటున్నదీ ఎవ్వరికీ తెలియనివ్వకూడదు.
    రాయుడిప్పుడే ఊళ్ళో ఉన్నాడూ అన్న విషయం రచయితలమైన మేమూ చెప్పదల్చుకోలేదు. ఎటొచ్చీ ఆయన ఉండే ఊరు ఓ సినిమా కథ జరగడానికి అనుకూలమైనది. అక్కడ బీచి వుంది. కాలేజీలున్నాయి. హోటళ్ళున్నాయి, బారులున్నాయి, నైట్ క్లబ్సున్నాయి. 
    రాయుడి చెల్లెలి పేరు లలిత, ఆమెకు ముగ్గురు పిల్లలు, పెద్దవాడికి రమారమి పాతికేళ్ళుంటాయి. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. పెద్దదానికి పద్దెనిమిది. రెండో ఆమెకు పదమూడు శంకర్, లత, గీత__వాళ్ళపేర్లు. లలిత భర్త సుందరానికి ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం. 
    పేరు, డబ్బు వున్న రాయున్ని ఎవరైనా అభిమానం గానే చూస్తారు. కాబట్టి, రాయుడికి స్వంత చెల్లిల్నించి అభిమానం లభించడంలో ఆశ్చర్యం లేదు.
    "నువ్వొస్తున్నట్లు నలుగురికీ చెప్పుకుంటే ఎంతో గొప్పగా ఉండేదన్నయ్యా! నువ్వేమో అజ్ఞాతవాసమంటివి!" అంది లలిత. 
    "ఏం చేయనమ్మా! కొత్త సినిమా కథకోసం ఆలోచిస్తున్నాను. అక్కడ సాధ్యపడటం లేదు. నీయింట్లో ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఆశపడి వచ్చాను. నా గురించి ఇక్కడ ప్రచారం అయిందంటే నేను కోరుకునే ప్రశాంతత ఇక్కడా లభించదు" అన్నాడు రాయుడు. 
    నాలుగు రోజులు అక్కడ ప్రశాంతంగానే గడిచిపోయాయి. ఈ నాలుగు రోజుల్లోనూ రాయుడి కొడుకులు సత్యనారాయణ, సూర్యనారాయణ- లలిత కూతుళ్ళు లత, గీత బాగా దగ్గరయ్యారు. శంకర్ మాత్రం ఎక్కువగా రాయుడితోనే గడిపేవాడు రాయుడిక్కూడా మేనల్లుడితో సరదాగా ఉండేది. మంచి కాలక్షేపం అయ్యేది.   
    శంకర్ ఎమ్మే పాసయ్యాడు. ఒకటి రెండు నెలల్లో తండ్రి పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం దొరకవచ్చు ననుకుంటున్నాడు. శంకర్ కి తెలుగు సినిమాలంటే బొత్తిగా సదభిప్రాయం లేదు.
       "నాకూ లేదురా! అందుకే కదా__ఓ పట్టాన ఏ కథ తోనూ సంతృప్తిపడలేక పోతున్నాను. చాలామంది నా సినిమాలని తెలుగు సినిమాలు అనడానికి ఇష్టపడరు" అన్నాడు రాయుడు.   
    "ఏమో మామయ్యా! నిర్మొహమాటంగా మాట్లాడటం నా అలవాటు. ఏ సినిమాలూ నాకు నచ్చవు. చాలా అసహజంగా ఉంటాయవి!" అన్నాడు శంకర్.   
    రాయుడు కాస్త దెబ్బతిని, "సమాజమో, అసహజమో తెలుసుకోడానికి నీకున్న అనుభవమెంత? జీవితం చాలా విచిత్రమైనది. ఎన్నో అసాధ్యాలు అందులో జరుగుతూంటాయి. అనుభవం మీద ఆ విషయం నువ్వే తెలుసుకుంటావు" అన్నాడు.   
    "మామయ్యా! మొదటి సినిమా తీసినప్పుడు, నువ్వు నాకంటే ఎంతో పెద్దవాడివి కాదు. అందువల్ల అనుభవం గురించి నాకు చెప్పకు" అన్నాడు శంకర్.   
    రాయుడు నవ్వి, "అనుభవం వయసుతో వచ్చేది కాదు. తెలివి అందరికీ సమంగా వుండదు. నేను తీసి తీసినిమాల్లో ఏదీ అసహజం కాదనే నా నమ్మకం" అన్నాడు.   
    శంకర్ నిట్టూర్చి, "ఆ నమ్మకం ఉండబట్టే నువ్వు యింకా సినిమాలు తీస్తున్నావు. మంచి నిర్మాతననుకుని గర్వపడుతున్నావు. స్వయంతృప్తి మనిషిని గొప్పవాణ్ణిచెయ్యదు" అన్నాడు.   
    "ఇంతకీ నీ బాధ ఏమిటో నాకు అర్ధంకాలేదు" అన్నాడు రాయుడు.   
    "నువ్వు తీసిన రెండు సినిమాల్లో ప్రేమ కథ బావా మరదళ్ళ మధ్య జరుగుతుంది. నా దురదృష్టమేమిటో నాకు మరదళ్ళులేరు!" అన్నాడు శంకర్.   
    దానికి నేనేం చేయను? అందుకు నా సినిమాలను తప్పుపడతావా? ఇది చాలా అన్యాయం" అన్నాడు
రాయుడు  
    "ప్రేమించి పెళ్ళిచేసుకోవాలని నాకుంది. మరదలే వుండి ఉంటే నా ప్రేమకథ సుఖాంతమయ్యేది. అది లేకపోవడంవల నాకెన్ని కష్టాలు వచ్చాయో చూడు" అన్నాడు శంకర్.
    "నువ్వెవరినైనా ప్రేమించావా?" అడిగాడు రాయుడు.
    ఈ ప్రశ్నకోసమే ఎదురు చూస్తున్నట్లుగా, శంకర్ తన ప్రేమ కథ చెప్పాడు. అతడి ప్రియురాలి పేరు సుహాసిని. కాలేజీలో బియ్యే రెండో సంవత్సరం చదువుతోంది. అందంగా ఉంటుంది. సుహాసిని కనబడితే చాలు - శంకర్ వళ్ళు ఝల్లుమంటుంది. ఆమె లేకుండా తనుబ్రతకలేనని అతడి ఆలోచన.
    సుహాసిని ప్రేమ పొందటం కోసం అతడు రాయుడు సినిమాల్లో చూపించిన ట్రిక్సు ఉపయోగించాడు. ఒక్కటీ పనిచేయలేదు ఆ వివరాల నతడు రాయుడికి చెప్పాడు
    సాధారమైన ట్రిక్సు ఏమిటంటే, ప్రేమించిన అమ్మాయి ఒంటరిగా పోతూంటే నలుగురు కిరాయి రౌడీలను నియమించి ఆమె మీదకు ఉసిగొల్పి, ఆమె రక్షించమని కేకలు పెడుతూంటే తను వెళ్ళి తరిమేయడం. రాయుడి సినిమాలో ఇదే ట్రిక్కు చూపిస్తాడు. కాని, హీరోయిన్ కు మీ విషయమై అనుమానం వస్తుంది. అప్పుడు హీరో తను వళ్ళంతా గాయాలతో హాస్పిటల్లోచేరి, ఆమెకోసం కబురుపంపుతాడు. ఆమె చూడ్డానికి వెడుతుంది జాలిపడి. అప్పుడు హీరో ఆమెతో - "నన్ను క్షమించు రాధా! నీ మీద ప్రేమతో నీ మనసు నావైపు తిప్పుకోవాలని, కొందరు కిరాయి రౌడీలను నీమీద కుసిగొల్పి నిన్ను రక్షించినట్లు నటించాను. నీ మనసు నావైపు తిరిగితే నేనేమైనా ఫరవాలేదని నా దగ్గర డబ్బులేకపోయినా రౌడీలను నియమించాను. వాళ్ళు కోరిన డబ్బిస్తానన్నాను. అంతా అయినాక పది రూపాయలే ఇచ్చానని వాళ్ళు నన్ను చావదన్నారు" అంటాడు. ఆ క్షణం నుంచీ హీరోయిన్, హీరోని ప్రేమించడం మొదలవుతుంది. కానీ శంకర్ విషయంలో అలా జరుగలేదు.

 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS