Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 1


                        మేడ్ ఫర్ ఈచ్ అదర్

                                                            _ సూర్యదేవర రామ్ మోహనరావు

 


    విశాఖపట్నం....

 

    సముద్రం....

 

 

    ఆ సమయంలో నీలి నీలి పూల పరికిణీ వేసుకుని, లేతనీలిరంగు జాకెట్టు వేసుకుని, నీలిపూలను జడలో తురుముకుని, నీలికళ్ళతో చూస్తున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉంది.

 

    ఆ అమ్మాయి ఎర్రటి ముఖమ్మీద పడుతున్న నల్లటి కురుల్లా మాసిపోతున్న పడమటి ఎండ మబ్బుల మీద సన్నని చీకట్లు ముసురుకుంటున్నాయి.

 

    చల్లదనంతో తడిసిన రామకృష్ణా బీచ్ కి దూరంగా ఉన్న వైట్ హౌస్ పక్కనున్న ఎత్తైన ఇసుక దిబ్బలు బంగారు కుప్పల్లా కన్పిస్తున్నాయి. ఆ కుప్పలకు అటూ ఇటూ రెండు పొడవాటి తాటి చెట్లున్నాయి.

 

    అక్కడ, ఆ ప్రదేశం ఆ సమయంలో నిశ్శబ్దంగా, నిర్జనంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఆ సమయంలోనే ఒక గాలి తెర హాయిగా అక్కడ చెట్లను, ఇసక దిబ్బలను రాసుకుంటూ, వింత శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది.    

 

    ఆ గాలికి ఓ బూడిద రంగు ఆర్గండీ చీర రెపరెపలాడింది. ఆ వెనక చేతి గాజులు చేసిన చిరుసవ్వడి.

 

    చిరుసవ్వడి చేసిన ఆ గాజులు వేసుకున్న ఆ అమ్మాయి గాజుబొమ్మలా ఉంది.

 

    ఆ అమ్మాయి పేరు రోష్ణీ.

 

    రోష్ణీ బాగుంటుంది. రోష్ణీ ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన బొమ్మలా అమంగా ఉంటుంది. ఆ అమ్మాయి కళ్ళు కలవ పువ్వువోలె విడిపోయి, నీటి మీదపడి తేలుతున్న కలువరేకుల్లా చక్కగా, మనోహరంగా ఉంటాయి.

 

    వంటికి వెన్నలా వయసు అంటుకుని ఉంది. వెన్నలాంటి ఆ కన్నె రోష్ణీ.

 

    ఆ సమయంలో చలిగాలి తగలకుండా భుజాల చుట్టూ పైటను కప్పుకుమ్తూ, వయ్యారంగా వెనక్కి జరిగి ఇసుక దిబ్బలకు ఆనుకుంటూ చిలిపిగా ఎదురుగా ఉన్న వ్యక్తి వేపు చూసింది.

 

    ఆమె కెదురుగా ఆ అబ్బాయి. ఆ అబ్బాయికో ముప్పై ఏళ్ళుంటాయి. నీట్ గా ఉన్నాడు. టీవీ సీరియల్స్ లో కనిపించే హీరోల్లా ఉన్నాడు.

 

    అతని పేరు అవినాష్.

 

    అక్కడకు వాళ్ళిద్దరూ వచ్చి ఇప్పటికి సరిగ్గా నలభై అయిదు నిమిషాలైంది.

 

    అవినాష్ ముందుకి జరిగి ఆ అమ్మాయి కెదురుగా కూర్చున్నాడు. ఆమె కళ్ళవేపు చూస్తూ-

 

    "అసలేమీ మాట్లాడకపోతే మనివిక్కడ కెందుకొచ్చినట్టు..." ఒకింత విసుగ్గా అన్నాడు.

 

    రోష్ణీ వెంటనే జవాబివ్వలేదు.

 

    "మాట్లాడవా?" మళ్ళీ రెట్టించి అడిగాడు.

 

    ఆ మాటకు ఆ అమ్మాయి నెమ్మదిగా బదులిచ్చింది-

 

    "ఏం మాట్లాడను... ఇందాకట్నించి నువ్వే మాట్లాడుతున్నావు కదా... ఇప్పుడు కూడా నువ్వే మాట్లాడు..."

 

    "నేనో సీరియస్ విషయం చెప్పనా...నీకు..." ఆ అబ్బాయి గొంతులో మార్పొచ్చింది. ఆ మార్పుకు ఆ అమ్మాయి తలెత్తి అతని ముఖం వేపు చూసింది.

 

    "చెప్పు..." అంది.

 

    అప్పుడా అబ్బాయి తన ఎడమచేయి మీద, కుడి చెయ్యి డొప్పలా చేసి-

 

    "ఈ చేతుల్లో ఏముందో చెప్పుకో?" అన్నాడు.

 

    "ఏం వుంటుంది... ఉంటే ఇసకుంటుంది..." అంది ఆ అమ్మాయి.

 

    "కాదు" బుంగమూతి పెడుతూ అన్నాడు అవినాష్.

 

    "మరి?"

 

    "ఇందులో ఏముందో నీ మనసుని అడగనా..."

 

    "అడుగు..."

 

    ఆ మాటకు వెంటనే ఆ అబ్బాయి ఆ చేతుల్ని అలాగే ఆమె హృదయమ్మీద పెట్టాడు.

 

    "ఇప్పటికైనా ఏం వుందో తెల్సిందా..." అని అడిగాడు.

 

    "ఆహఁ..." ఆ అమ్మాయి తల అడ్డంగా ఊపింది.

 

    "ఆడపిల్లలకి రెండు మనసులుంటాయి... అంచేత ఏమీ తెలీదు..." సరదాగా అన్నాడతను.

 

    "రెండు మనసులుంటాయా... ఎప్పుడు కనిపెట్టావు బాబూ..." ఓరకంట చూస్తూ అడిగింది రోష్ణీ.

 

    "వేరే కనిపెట్టాలా... ఏ అమ్మాయిని చూసినా తెలుస్తుంది..." అంటూ ఆ అమ్మాయి జాకెట్టువేపు, జాకెట్టులోన దాగిన అందాల వేపు కావాలనే చూస్తూ అన్నాడు అవినాష్. అప్పుడు అసలు విషయం ఆ అమ్మాయికి అర్థమైంది.

 

    "ఛీ... పాడు... అన్నీ వెధవ కబుర్లే..." పక్కకు జరిగిన పైటను సరిగ్గా సర్దుకుంటూ కోప్పడింది రోష్ణీ. 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS