Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 4


    "వెరీగుడ్! అయితే, ఓడీ తీసుకోండి. ఆ క్లర్క్ కి నేను చెప్పానని చెప్పండి. ఆఁ- మీ పేరేమన్నారు?" మళ్ళీ రాంగోపాల్ వేపు తిరిగాడతను-
    "రామ్ గోపాలండి"
    "రామ్ గోపాల్ గారూ! మీరు చెయ్యాల్సిందేమిటంటే, వెంటనే హోమ్ లోన్ ఎకౌంట్ మా బ్యాంక్ లో ఓపెన్ చేయండి! నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మాకు ఏడేళ్ళపాటు మీరు కట్టాలన్నమాట. కడితే మేము మీకు ఆ డబ్బుకు డబుల్ ఎమౌంట్ లోన్ గా ఇస్తామన్న మాట... ఏడేళ్ళ తర్వాత!"
    రామ్ గోపాల్, ప్రసూనాంబ ముఖాలు చూసుకున్నారు.

   "మీరు నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటానండీ- మేము ఇల్లు కట్టుకోడానికి డబ్బులేక లోన్ కోసం వచ్చామండీ.
    "తెలుసండీ! అందుకే హోమ్ లోన్ ఎకౌంట్ తెరవమంటున్నాను."
    "కానీ, మేము లోన్ కావాలని అడుగుతూంటే ఏడేళ్ళపాటు మీరు మమ్మల్ని పైసలు కట్టమంటున్రేమిటి?"

"అదంతేనండీ! మేము ప్రజల క్షేమం కోసం, లాభం కోసం ఏ స్కీమ్ ప్రారంభించినా ఇలాగే ప్రజలకు లాభపడే విధంగా ఉంటాయ్ అన్నమాట. మీకేం కావాలండీ?" ఇంకొకతనిని అడిగాడు మధ్యలో.
    "నాకు ఇంకో లాకర్ ఇస్తానన్నారు. దాని విషయం మాట్లాడదామని-"
    "నాకు పాత చింతపండు పంపిస్తానన్నారు. దాని సంగతేమిటి?"
    రామ్ గోపాల్, ప్రసూనాంబ దిగాలుపడి ఇంటికి చేరుకున్నారు.
    "ఇగో ప్రసన్నా! నేన్జెపుతున్నా ఇను- మనదేశంలో మిడిల్ క్లాసోడికి సాయం జేసేటోడెవ్వడూ లేడు. ఎరుకనా? ఉన్నోడూ, లేనోడూ అందరూ డుబాయించెడిది మిడిల్ క్లాసోడినే. మనం ఈ జన్మల ఇల్లు కట్టలేము" అన్నాడు రామ్ గోపాల్. ఇన్ స్టాల్ మెంట్ లో ముచ్చటపడి కొనుక్కున్న టేప్ రికార్డర్ ఆన్ చేస్తూ.

    ముకేష్ పాట మొదలుపెట్టాడు-- "కహతా హై జోకర్ సారా జమానా-"
    రామ్ గోపాల్ కి ఆ పాట ఎన్నిసార్లు విన్నా ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. అది మిడిల్ క్లాస్- వాడి మీదే రాసినట్లనిపిస్తుందతనికి.
    ప్రసూనాంబ చుట్టుపక్కల వాళ్ళందరికి ప్రకటనల ద్వారా బ్యాంక్ వాళ్ళు చేస్తున్న మోసం గురించి చెప్తోంది.
    "అవునండీ! మొన్న ఆ మధ్య మా వారు కూడా ఇలాగే ఆ క్రెడిట్ కార్డ్ పబ్లిసిటీ బోర్డులు సిటీబస్ వెనక చూసి ఆ కార్డ్ కోసం బ్యాంక్ కెళ్ళారు. ఓ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి, తీరా వెళ్ళాక మీరు ఆరు నెలలపాటు ఎకౌంట్ ఓపెన్ చేసి మెయింటెయిన్ చేస్తే తప్ప కార్డ్ ఇవ్వం అన్నారు. సర్లేగదాని ఎకౌంట్ ఓపెన్ చేసి ఆరునెలల తర్వాత వెళితే అప్లికేషన్ లు రాయించుకుని క్రెడిట్ కార్డ్ మీకు ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను అంటూ లెటర్ రాశారు" అంది సావిత్రమ్మ గారు.
    "మమ్మల్నీ ఇంకో బ్యాంక్ వారిలాగే మోసం చేశారు అక్కయ్యగారూ, మా వారు నానా తిప్పలూ పడి ఎకౌంట్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డుకి అప్లయ్ చేస్తే "ఇవ్వలేనందుకు చింతిస్తున్నాం" అంటూ ఉత్తరం రాశారు" అంది రాజేశ్వరి.
    "అన్నీ దొంగ బ్యాంకులు, మోసం ప్రకటనలు" అంది పార్వతీ దేవి.
    అప్పుడె ఇంటి ఓనర్ స్కూటర్ మీద గేటు ముందాగి "వచ్చే నెల నుంచీ అద్దె ఎనిమిది వందలకు పెంచుతున్నా" అనేసి వెళ్ళిపోయాడు.
    మర్నాడు న్యూస్ పేపర్ చూస్తూనే కెవ్వున కేకవేసింది ప్రసూనాంబ ఆనందంతో, రామ్ గోపాల్ ఉలికిపడి నిద్రలేచాడు.
    "ఏమండోయ్! ఇది చూశారా! ఇదేదో హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంట వెంటనే ఇల్లు కట్టుకోడానికి అప్పు ఇస్తామంటున్నారు."
    రామ్ గోపాల్ ఆత్రుతగా చదివాడా ప్రకటన. పూర్తిగా చదివేసరికి అతను నిరాశపడిపోయాడు.

    "నేన్జెప్పలే ఇందులో ఏదో మతలబ్ ఉంటదని! వాళ్ళు ఏమంటున్రో ఎరుకనా! ముందు మనం పాతిక వేలు డిపాజిట్ కట్టాల్నంట. తర్వాత ఆడు లోన్ ఇస్తాడంట! ఒక్కసారి మన పైసలు ఆడి చేతిలో పడినాంక ఇంక ఆడి చేతిల మనం తోలుబొమ్మలే కదా! ఆడెట్టాడిపిస్తే అట్లాడాలె."
    ప్రసూనాంబకు కోపం వచ్చింది.
    "అన్నీ అట్లా అనుకుంటే ఎలా? మనం ఇంకెప్పటికీ ఇల్లు కట్టలేము. నా మాట విని ఒక్కసారి వెళ్ళి వివరాలు కనుక్కురండి."
    "ఇదిగో మాట్లాడితే సెలవు పెట్టనికి నా తోటిగాడు."
    ప్రసూనాంబకు కోపం వచ్చేసింది. కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
    "నాకు ముందే తెలుసు, మీ నిజామాబాద్ జిల్లా వోళ్లు ఇలాగే అంటారని! మా నాన్నగారు అంటూనే ఉన్నారు- మన ఖమ్మం జిల్లావోళ్ళకి, నిజామాబాద్ జిల్లా వోళ్ళకి కుదర్దే! మన మెంటాలిటీ వేరు, వాళ్ళ మెంటాలిటీ వేరు అని! కానీ, మా అమ్మే వినిపించుకోకుండా కాళ్ళ దగ్గర కొచ్చిన బంగారంలాంటి వరంగల్ సంబంధం కాదని మీ సంబంధం అంటగట్టింది!"
    ఆ మాటతో రామ్ గోపాల్ కి కోపం ముంచుకొచ్చింది.
    "అంటే, మా నిజామాబాదోండ్లం చిల్లరగాండ్లమా?"
    "అవును. ముమ్మాటికీ చిల్లరగాళ్ళే! లేకపోతే సొంత భార్య మాట ఎవరయినా కాదంటారా?"
    "మా అమ్మ గూడా ఖమ్మ పోరిలను జేసుకోకురా బిడ్డా అని మొత్తుకుంటుండెగానీ, నేనే మీరు మా నాయన్తాలాకు బంధువులని, కాదంటే మా నాయన దిల్ దుఃఖాయిస్తదని జేస్కోనికి వప్పుకున్నా. ఇప్పుడు జూడు- బరాబర్ మా అమ్మ జెప్పినట్లే అవుతున్నది. పెండ్లయిన దినం కెళ్ళి ఒకటే కిరికిరి, ఒకటే లొల్లి."
    కొద్దిసేపు ఇద్దరూ గొడవపడ్డాక మామూలుగానే రాజీపడ్డారు.
    బ్యాంకులో ఇద్దరు పిల్లల కోసం వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇరవై వేలు తీసుకెళ్ళి ఆ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేసి ఇంటి లోన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తీరా ఆ ఆఫీసుకు చేరుకునేసరికి ఆఫీస్ బయట కొన్ని వందలమంది గుమికూడి కనిపించారు. పెద్దగా అరుపులు, కేకలు వినబడుతున్నాయ్. కొంతమంది నేలమీద కూలబడి బిగ్గరగా ఏడ్చేస్తున్నారు. ఏడుస్తున్న వారిలో ఓ గొంతు విని ఠక్కున గుర్తుపట్టాడు రామ్ గోపాల్.
    "ఆ గొంతు మా ఆఫీస్ లో పనిజేసే శ్రీనివాస శాస్త్రిదే. పద" అంటూ జనాన్ని తోసుకుంటూ అతని దగ్గరకు చేరుకుని తనూ నేలమీద కూర్చున్నాడు.
    "ఏమాయె శ్రీనివాస్! ఏడుస్తున్నావేం సంగతి?"
    శ్రీనివాసశాస్త్రి అమాంతం రామ్ గోపాల్ ని కౌగిలించుకొని మళ్ళీ బోరుమని ఏడ్చేయటం ప్రారంభించాడు.
    "ఏం చెప్పను గురూ! నేను ఇంటి లోన్ కోసమని యాభయ్ వేలు డిపాజిట్ కట్టాను. ఆరునెలల్లో లోన్ ఇస్తానన్నాడు. అయిదు నెలలవంగానే అందరి డిపాజిట్లు తీసుకుని తమిళనాడుకు పారిపోయాడు"
    రామ్ గోపాల్ గుండె ఝల్లుమంది.
    "అదేమి? మంది పైసల్దీసుకుని పోతూంటే గవర్నమెంటేం జేస్తున్నది? అట్టాంటోళ్ళకు ఇట్ల డిపాజిట్లు కలెక్టు జేసేందుకు పర్మిషనెట్లిచ్చిన్రు" అడిగాడు ఆశ్చర్యంగా.
    "గీబాడుకవులూ- గవర్నమెంట్ బాడుకవులూ కుమ్మక్కై మందిని ముంచిన్రు దేముడో- గిప్పుడు నాకేం దిక్కు దేముడో-"
    "ఊరుకో శాస్త్రీ. ఏడిస్తే ఏం లాభం?"
    "అమ్మో! నా యాభయ్ వేలు- అవి కష్టపడి సంపాదించిన పైసలయితే అట్లాగే ఊరుకునేవాడిని. కానీ, అవన్నీ ఆఫీసులో లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బు. లంచాలు తీసుకోవడమంటే మాటలా? ఎంత రిస్క్ ఉంటుందందులో? పైదాకా ఎవడికి సరిగ్గా వాటాలందకపోయినా మొత్తం తవ్వి ఆఖరికి నాలాంటి గుమాస్తాగాడినే మటాష్ చేసేస్తారు. ఓరి దేముడో! అంత రిస్క్ తీసుకుని సంపాదించిన డబ్బుకే ఎసరు పెట్టాడే వీడు. కష్టార్జితం అయినా పోతే పోయిందని ఊరుకునే వాడిని దేవుడా!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS