Previous Page Next Page 
8 డౌన్ పేజి 3

    భవాని శంకర్ కూడా తనసర్వే ముగించి కోచ్ లోకి ఎక్కి, ఈ యువరాణి ఎగ్జాట్ గా ఎదుటికిటికీ దగ్గరే తనబెర్తు కూడా ఉండడంచూసి ఆనందంతో పొంగిపోయి "థాంక్యూ మైడియర్ రైల్వే మాన్. ప్రయాణీకులజర్నీ డల్ అవకుండా ఇంతటి మహత్తరమయిన జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయం నాకీ యువరాణిని చూసేవరకు తెలీలేదు బ్రదర్. మేగాడ్ బ్లెస్ యూ విత్ డిలింక్డ్ ప్రోడక్టివిటీ బోనస్" అని లోపలఅనుకోబోయి పైకనేశాడు.
    అతని డైలాగ్ విని ఆ యువరాణి కొంచెంకంగారుపది తన చుట్టూదట్టంగా అల్లుకున్న దిగుళ్ళ పొగమంచులో నుంచి ఓ క్షణంపాటు బయటకొచ్చి అతని కళ్ళలోకి చూసి మళ్ళీ పొగమంచులోకెళ్ళిపోయింది.    
    ఆమె చూపులు తనచూపులతో కలిసిన ఆ కొద్ది క్షణాలు స్వర్గంలో విహరిస్తున్నంత అనిర్వచనీయమయిన ఆనందం అనుభవించాడతను.
     కాని ఆమె మళ్ళీ చూపులు మరల్చుకున్న మరుక్షణం స్వర్గంనుంచి ఆంద్రప్రదేశ్ రాజధానిలో అమాంతంపడిపోయినట్లయింది.    
    నౌఖర్లు ఆ ముసలాయన తాలూకు సూట్ కేసులు సీట్లకింద సర్ది అతని వాటర్ బాటిల్, థర్మోస్ ఫాస్కూ అన్నీ హుక్స్ తగిలించి శెలవుతీసుకుని వెళ్ళిపోయారు.    
    "సమ్ థింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్" అన్నాడు ఆ పెద్ద మనిషి భవాని శంకర్ తో.    
    భవాని శంకర్ చిరునవ్వునవ్వాడు మళ్ళీ.    
    "అఫ్ కోర్స్, కానీ నథింగ్ ఈజ్ బెటర్ దేన్ అన్ వాంటెడ్ థింగ్స్" అన్నాడు మేథావి లుక్ ఒకటి ఇస్తూ.    
    ఆయన కొంచెం పజిలయి ఓ క్షణం ఆలోచించి మళ్ళీ భవాని శంకర్ వేపు చూశాడు.    
    "హ్హ హ్హ హ్హ, వెల్ సెడ్ అఫ్ కోర్స్ నథింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ బాడ్ థింగ్స్ వెల్ సెడ్" అన్నాడు అభినందిస్తూ.    
    కానీ భవానీశంకర్ ఆ అభినందనలను లెక్క చేయలేదు. తనలాంటి యంగ్ మెన్ కి అభినందనల పరంపర ఓల్డు జెంటిల్మెన్ నుంచి కాకుండా యంగ్ బ్యూటీక్వీన్స్ నుంచి రావాలని అతనిప్రగాడాభిప్రాయం.    
    అతని చూపులు హఠాత్తుగా యువరాణి పక్కనున్న బాలక్ మీద పడినియ్.    
    ఆ బాలక్ చూపులన్నీ తన చేతిలోని ఆస్ట్రిక్స్ పుస్తకాల మీదుండటం గమనించాడతను.    
    "హలో, మైడియర్ బాలక్. ఈ పుస్తకాలు చదివిన ఎంజాయ్ చేయాలన్న కోరిక నీమనసులో డిప్రెషన్ గ ఏర్పడి, త్వరలో సైక్లోన్ గా మారిపోతోందని అర్ధమయింది ఫ్రెండ్. కమాన్, తీసుకో" అన్నాడు ఆప్యాయంగా.    
    ఆ బాలక్ ఉత్సాహంగా పుస్తకాలు తీసుకున్నాడు.    
    భవాని శంకర్ ఇంక ఆలస్యం చేయకుండా దేశంకోసం త్యాగాలు చేసిన ఫ్రీడమ్ ఫైటర్ చూపు ఆ యువరాణి వేపు విసిరాడు గాని యువరాణి తన పొగమంచులో నుంచి బయటకు రాలేదు.    
    అయినా భవానిశంకర్ నిరుత్సాహపడలేదు.    
    ఎంతమంది ప్రాణాలు పోయినాసరే, ఎన్ని కోట్లరూపాయలు నీళ్ళపాలయినాసరే బుద్ధ విగ్రహాన్ని హుసేన్ సాగర్ లో ప్రతిష్టించడమేతమ ధ్యేయంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా మరో సరికొత్త ప్రణాళికారచన ప్రారంభించాడు.    
    సరిగ్గా అదే సమయంలో గార్డ్ విజిల్ వేశాడు.    
    ఆ విజిల్ వినగానే అప్పుడే ఫ్లాట్ ఫారం మీద కోస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులు బుల్లెట్స్ లా పరుగెత్తారు సామాన్లతో.    
    అయితే ఆ విజిల్ వేయడంలో గార్డ్ ద్వారకానాథ్ ఉద్దేశ్యం డ్రైవర్ బండిస్టార్టు చేయాలని కాదు. టి.ఎక్స్.ఆర్ (ట్రైన్ ఎగ్జామినర్) స్టాఫ్ త్వరగా వ్యాక్యూమ్ సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తారని.    
    గార్డు ఊహించినట్లే అతని విజిల్. టి.ఎక్స్.ఆర్.మోహనరావ్ లో కలవరం కలగజేసింది. మరోసారి వాచీలో టైమ్ చూసుకున్నాడతను. కేవలం రెండు నిమిషాలటైమ్ మిగిలివుంది బండి స్టార్టవటానికి. కానీ వ్యాక్యూమ్ రావటం లేదు.    
    మోహన్ రావ్ డ్రైవర్ గురుమూర్తి వేపు చూశాడు.    
    గురుమూర్తి వ్యాక్యూమ్ గేజ్ వేపు చూశాడు.    
    నీడిల్ పదిమీదే ఉందింకా. "ఓన్లీ టెన్" అన్నాడు అతను.    
    మోహన్రావ్ నమ్మకం కుదరక ఇంజన్ మీద కెక్కి తనే స్వయంగా గేజ్ వేపు చూశాడు.    
    ఒకటికి రెండుసార్లు లివర్ మీదకొట్టి వ్యాక్యూమ్ పూర్తిగా పడిపోయేటట్లు చేశాడు. ముల్లు కిందకు పడిపోయి పదిమీదకొచ్చింది.    
    అతనికి తన కళాసీలమీదచిరాకు కలిగింది.
    8 డౌన్ సికింద్రాబాద్ డివిజనులో చాలా ప్రాముఖ్యతగల ఎక్స్ ప్రెస్ అన్న విషయం వాళ్ళకు తెలుసు. తెలిసీ ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారంటే ఏమనాలి.    
    ఇంజన్ నుంచి ఫ్లాట్ ఫారం మీదకు దిగి వరుసగా అన్నికారేజీల హోస్ పైప్స్ చెక్ చేసుకుంటూ వెనుకకు నడవసాగాడు. ఎక్కడా వ్యాక్యూమ్ లీక్ అవటం లేదు. ఏడెనిమిది కోచీలు దాటేసరికి స్టార్టింగ్ బెల్ వినిపించింది.    
    మోహన్రావ్ వెనకకు తిరిగి ఇంజన్ ముందున్న స్టార్టింగ్ సిగ్నల్ వేపు చూశాడు.    
    గ్రీన్ రంగులోకి మారిందది.    
    మరింత ఆందోళనతో ఫ్లాట్ ఫారం మీదున్న గడియారం వేపు చూశాడు.    
    అప్పటికే రెండు నిమిషాలు ఆలస్యం అయింది.    
    ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ పదినిమిషాలు ఆలస్యంగా బయలుదేరిందంటే ఆ ఆలస్యానికి కారకులయినవారికి ఛార్జిషీట్ వస్తుంది.    
    పైగా ఈ మధ్యే కొత్తగా వచ్చిన సీనియర్ డి.ఎమ్.ఇ (డివిజనల్ మెకానికల్ ఇంజనీర్) ఏదయినా సహిస్తాడు గానీ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ లేట్ స్టార్టు విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు.    
    అతను వచ్చిన ఈ రెండు నెలల్లోనే తనకు రెండు ఛార్జిషీట్ లు వచ్చాయ్. ఇంచుమించుగా పరుగుతో గార్డు బ్రేక్ దగ్గరకు చేరుకున్నాడతను.    
    అక్కడ కూడాగేజ్ లో తొమ్మిదే చూపుతోంది.    
    ఖాసిమ్, రాజు, నర్సింహ ముగ్గురూ అక్కడే ఆఖరికోచీలహోస్ పైప్స్ చెక్ చేస్తున్నారు.    
    "అరె, ఏమోయ్ ఖాసిమ్ ఇంతవరకూ వ్యాక్యూమ్ రాలేదు. ఏం చెక్ చేస్తున్రయ్యా"    
    దబాయించాడు మోహన్రావ్.    
    ఖాసిమ్ చెమటలు తుడుచుకుంటూ రెండు కోచీల మధ్యనుంచి మోహన్రావ్ వేపు చూశాడు.    
    "ఈ ఎక్ స్ట్రా కోచీలు తగిలించిన్రుకద్సార్. వీటి దిక్కుకెళ్ళే లీక్ అవుతోంది. ఫాల్తూకోచీలు సార్ ఇవి" విసుగ్గా అన్నాడతను.
    రాజు, నర్సింహ మళ్ళీ ముందుకోచ్ దగ్గరకు పరుగెత్తారు. స్టేషన్ మాస్టర్ జార్జ్ హడావుడిగా మోహన్రావ్ దగ్గరకొచ్చాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS