Previous Page Next Page 
చైనా యానం పేజి 3


                                            రెండు

    అఖిల భారత డాక్టర్ కొట్నిన్ మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి.కె. బాసు 9-11-76లో రాసిన ఈ దిగువ ఉత్తరం చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను.
    "డియర్ మిష్టర్ శ్రీశ్రీ
    ఇప్పుడే మీకో టెలిగ్రాం పంపించాను. అందులో - "నవంబరు నెలాఖరున కొట్నీస్ మెమోరియల్ హాలు ప్రారంభోత్సవానికి ఇండియా నుంచి చైనాకు వెళ్ళబోతున్న ప్రతినిధి వర్గంలో మీరు పాల్గొనాలని నా వాంఛ.
    అంగీకరించినట్లు టెలిగ్రాం ఇవ్వండి. లేదా 617561 కి గాని 382806 కి గాని ఫోన్ చెయ్యండి ' అని వుంది.
    "రెండేళ్ళ క్రితం మనం ఒంగోలులో కలుసుకోవడం జ్ఞాపకం వస్తోంది. తప్పకుండా మీరు మాతో వస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఏమయినా వీలైనంత త్వరలో మీ నిర్ణయాన్ని తెలియజేయండి."
    ఒంగోలులో జరిగిన ఇండియా - చైనా మిత్రమండలి (ఆంధ్రశాఖ) సమావేశానికి నేను అద్యక్షుడినీ, డాక్టర్ బాసూ ఉపన్యాసకులలో ఒకరూను. ఆ పరిచయాన్నీ పురస్కరించుకొని, చైనాకు వెళ్ళబోయే ప్రతినిధి వర్గంలో అయన నా పేరు కూడా సూచించారు.
    ఎంత అప్పుచేసి అయినా సరే చైనాకు వెళ్ళి తీరాలని నిశ్చయించాను. వెంటనే నా నిశ్చయాన్ని తెలియజేస్తూ టెలిగ్రాం యిచ్చాను. తర్వాత విపులంగా ఒక ఉత్తరం రాస్తూ ప్రయాణపు ఖర్చులు ఎవరికి - వారు భరించుకోవలసి వుంటుందా అని అడిగెను.
    ఆ వుత్తరం అందక ముందే కొట్నీస్ కమిటీ కార్యదర్శి శ్రీ డానియల్ లతీఫ్ నుండి నాకీ దిగువ ఉత్తరం వచ్చింది.

                                                                               చేంబర్ నం. 61.
                                                                                  సుప్రీంకోర్టు,
                                                                             న్యూడిల్లీ, 110001,
                                                                                   11-11-76.

    "డియర్ మహాకవి.
    మన అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ బాసూ నాయకత్యం వహిస్తున్న కోట్నీస్ స్మారక ప్రతినిధి వర్గ సభ్యులలో ఒకరుగా మిమ్మల్ని ఎంచుకోవడం జరిగిందని తెలుపడానికి సంతసిస్తున్నాను. చీనా లోని మోపే రాష్ట్రపు ముఖ్య పట్టణం  షిభియాచువాంగ్ లో 9-12-76 న జరగబోయే "భారత మిత్రుడు డాక్టర్ డి.యస్ . కొట్నీస్ మెమోరియల్ హాలు" అవిష్కరణోత్సవంలో పాల్గొనడానికి ఈ డెలిగేషన్ వెళ్తోంది. ఇది కలకత్తా నుండి నవంబరు 29న బయల్దేరి చైనాలో సుమారు నెల దినాలు పర్యటిస్తుంది. పాస్ పోర్టులు మొదలైన వాటి గురించి అవసరమయిన సంప్రదింపులు మన ప్రభుత్వంతో జరుగుతున్నాయి. ఈ ప్రయాణానికి కావలసిన చైనీస్ వీసాను న్యూడిల్లీ;లోని చైనా రాయబార కార్యాలయం నుండి సకాలంలో తెప్పించుకోండి."
    ఈ విషయం ఖర్చుల విషయం లేనందున అప్పటికింకా ఉత్తరం అందలేదన్నమాట. ఇదే ఉత్తరంలో తతిమ్మా డెలిగేట్ల పేర్లూ చిరునామాలు ఉన్నాయి. (పేర్లు, మాత్రమే ఇస్తున్నాను.)

    1. శ్రీ బిషంబర్ నాద్ పాండే, యం.పి.
    2. డాక్టర్ మిస్. వత్సలాయస్ కొట్నీస్
    3. శ్రీమతి మైత్రేయిదేవి.
    4. మహాకవి శ్రీశ్రీ
    5. డాక్టర్ హీరేంద్రనాద్ గోహేనీ
    6. శ్రీ జ్ఞాన్ సింగ్ ధింగ్రా
    7. ప్రొఫెసర్ తారాచంద్ర్ గుప్తా.
    
    పై జాబితాలో మొదటి వారూ , అయిదవ వారూ బయల్దేరలేదు. కొట్నీస్ గారి జ్యేష్ట సోదరుడు మంగేష్, దినేశ్ గుప్తా, శ్రీమతి బి.కె. బాసు కలిపి తొమ్మండుగురం ప్రతినిధులం.
    (ప్రారంభోత్సవం అయిపోయిన తరువాత శ్రీ బిషంబర్ నాద్ పదో ప్రతినిధిగా పీకింగ్ వచ్చారు.)
    15-11-76 వ తేదీన శ్రీ లతీఫ్ వద్ద నుంచి నాకు రెండో వుత్తరం వచ్చింది. అందులో ఇలా వుంది.
    "డియర్ మహాకవి,
    ఇంతక్రితం ఉత్తరంలో నవంబరు 28వ తేదీన కలకత్తాలో కలియవలసిందిగా కోరాను. అందుకు మారుగా అదేరోజు మీరు బొంబాయికి రావాలి. ఏమంటే ఆ రోజు పీకింగ్ కు సరాసరి విమాన సర్వీస్ వుంది.
    28 నవంబరు స్విసెయిర్ 09.35 కు బొంబాయి నుండి 18.45కు పీకింగ్.
            (అదే రోజున)
    మీ ప్రాంతం పాస్ పోర్టు ఆఫీసుకు వెంటనే దరఖాస్తు పెట్టండి. ఇక్కడ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చేత ఆదేశాలిప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటి కోసమని మీరు ఆలసించకండి.
    మీరు బయలుదేరుతున్న చోటు నుండి చైనాకు రానూ పోనూ ప్రయాణపు ఖర్చులు చైనా ప్రభుత్వమే భరిస్తుందని ఈనాటికి మీకు తెలిసే వుంటుందనుకుంటాను. సీతా ట్రావెల్స్ వారు మీతో ప్రయాణపు వివరాలు మాట్లాడతారు.
    విదేశీ వ్యవహార మంత్రిత్వం అంగీకారం మీద అంతా ఆధారపడి వుంది. అందుకే ఎదురు చూస్తున్నాం."
    ఎందువల్లనో ఈసారి కూడా రాదేమో.రెండవసారి కూడా ఆశాభంగం తప్పదేమో అనుకుంటూనే నా ప్రయత్నాలు నేను సాగించాను. ముఖ్యంగా శ్యామ్ బెనిగాల్ ను బుక్ చేసిన రవిరాజ్ ఇంటర్ నేషనల్ వారి కేశన జయరాంగారికి నా ప్రయాణపు విషయం తెలియజేసాను. "మీరు చైనాకు వెళ్ళడం మా అందరికీ ఆనందంగా వుంది. ఎన్నాళ్ళయినా సరే ఆగుతాం వెళ్ళిరండి" అన్నారాయన. "అలాక్కాదు. 9వ తేదీ తర్వాత మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తా" నన్నాను నేను.
    సాధ్యమైనంత ఆలస్యంగా బయలుదేరి సాధ్యమైనంత పెందరాళే తిరిగి వచ్చేయాలని నా ఉద్దేశం. అందుకే లతీఫ్ తన రెండవ ఉత్తరం చివరన ఇలా రాశారు.

    "మహకవి శ్రీశ్రీకి స్పెషల్ నోట్:
    మీరు డెలిగేషన్ లో చేరుతున్నందుకు మేమందరమూ సంతోషిస్తున్నాము. మీరు ప్రధాన ప్రతినిధి వర్గంలో బయల్దేరనందువల్ల ఈ దిగువ రెండు తేదీలలో ఏదయినా ఎంచుకోండి.
    
                                                                        బుధవారం 16-12-76 ఇదియోషియన్
                                                                                   ఎయిర్లైన్ బొంబాయి
                                                                             నుంచి 21.20గం|| పీకింగ్ కు
                                                                          06.45 గం|| ఆదివారం 5-12-76
                                                                               బొంబాయి 21-20 గం||
                                                                                  పీకింగ్ 06-45 గం||
    డాక్టర్ బాసు గారి భార్య 16-12-76న బయల్దేరుతారు. మీరు కూడా ఆవిడతో కలసి వెళ్తే బాగుంటుంది."
    నావి రెండు పాస్ పోర్టులకు కాలదోషం పట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ తొలినుంచి ప్రయత్నాలు చేయాలి. సీతా ట్రావెల్స్ వారి మద్రాసు శాఖలో పనిచేస్తున్న శ్రీ శర్మగారు ఇందులో నాకు చాలా సాయపడ్డారు. విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు ఎప్పుడు నేనెంత డబ్బు అడిగితె అంతా యిచ్చారు. చిన్న చిన్న మొత్తాలే కావచ్చును. "మార్పు" స్క్రిప్టు రచన పద్దులోనే గావచ్చును అడగ్గానే డబ్బివ్వడమనేది చాలా గొప్ప సంగతి.
    ఇంతకూ 28వ తేదీ నాటికి పాస్ పోర్టు రానేలేదు. డెలిగేషనంతా వెళ్ళిపోయి వుంటారనుకున్నాను. ఏ రోజుకారోజు పాస్ పోర్టు ఆఫీసరుకు టెలిఫోన్ చేస్తూ వుండేవాణ్ణి. "నా అభ్యంతరం గాని, ఆలస్యం గానీ ఏమీ లేదు. మీ పాస్ పోర్టు సిద్దంగా ఉంది. సంతకం పెట్టడానికి నేను సిద్దంగా ఉన్నా, డిల్లీ నుంచి క్లియరెన్స్ రావడమే తరువాయి" అనేశాడాయన.
    డెలిగేషన్ సభ్యులందరికీ మంజూరు చేసి, నా ఒక్కడికి మాత్రమే ప్యాస్ పోర్ట్ నిరాకరించడం జరగదని నాకు తెలుసు. ఎందువల్లనంటే అప్పుడు నా కీర్తి మరీ పెరిగిపోతుంది! అది నా విరోధులకు ఇష్టం లేదు.
    అందుకే ప్యాస్ పోర్టు వచ్చినా రాకపోయినా మహా బాగే అని నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS