Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 3


    అన్ని టీ.వీ. కెమేరాలు చూస్తున్నా కూడా....


    ఎవరూ గ్రహించలేనంత ఒడుపుగా....


    సంకెళ్ళు వదిలించేసుకున్నాడు రాజా!


    ఇది అతనికి కొత్త కాదు.


    అతనికి తెలిసిన విద్య ఇదొక్కటే కూడా కాదు.


    అనేకమైన పనులు అతి లాఘవంగా చెయ్యగలడు అతను. వాటి గురించి ముందు ముందు.


    రాజా చెయ్యి తన మెడ మీద పడగానే భగవాన్ అదిరిపడ్డాడు.


    బెల్టుపైగా ఉన్న పేలని బాంబు వైపు చూసుకున్నాడు.

 

    దానిని కనెక్ట్ చేస్తున్న వైరు కత్తిరించేసి ఉంది.


    వైరు ముక్కలు మాత్రం భగవాన్ పాదాల దగ్గర పడి ఉన్నాయి.


    "నేనే కట్ చేశా!" అన్నాడు రాజా- చాలా తేలిగ్గా. తర్వాత సెక్యూరిటీ వాళ్ళతో అన్నాడు -


    "ఇంక వీడు మీ కేండిడేట్! వీడిని ఏం చేస్తారో మీ ఇష్టం."


    మరుక్షణంలో భగవాన్ మీదికి లంఘించారు సెక్యూరిటీ పర్సనల్ - అతన్ని తోసుకుంటూ అవతలకి లాక్కెళ్ళిపోయారు.


    వెంటనే హర్షధ్వానాలు వినబడ్డాయి జనంలో నుంచి.


    అభివాదం స్వీకరిస్తున్నట్లు కొంచెం ఒంగి తల పంకించాడు రాజా.


    చాలాసేపటి తర్వాత గానీ హర్షధ్వానాలు చల్లబడలేదు.


    అప్పుడు వినబడింది ఒక గొంతు చాలా ఎగ్జయిటెడ్ గా.


    "మిస్టర్ రాజా! నేను ఒక అమెరికన్ కంపెనీ రిప్రెజెంటేటివ్ ని. నీకు ఇష్టమయితే మాతో ఒక అగ్రిమెంట్ కి రావచ్చు. మిలియన్ల డాలర్లలో ఉండే కాంట్రాక్టు ఆఫర్ చేస్తాం. నువ్వు అమెరికాలోనే సెటిలయిపోవచ్చు! నీకు మంచి టాలెంటు ఉంది! ఆ టాలెంట్ కి తగిన భవిష్యత్తు ఇండియాలో ఉండదు. కమ్ విత్ అజ్ అండ్ జాయిన్ అవర్ కంపెనీ."


    అంతా విని నవ్వాడు రాజా.


    అవతలి వాళ్ళది ఏ కంపెనీ అని కూడా అడగలేదు అతను.


    ముక్తసరిగా అన్నాడు -


    "నో థాంక్స్! నేను ఇండియాలోనే ఉంటాను."


    "ఏం చేస్తావ్ అక్కడ?" అన్నాడు అవతల వ్యక్తి హీనంగా చూస్తూ.


    "ఐ విల్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్! అండ్ ఐ విల్ సర్వ్ మై కంట్రీ" అన్నాడు రాజా.


    ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు అవతలి వ్యక్తి.


    "ఇంత టాలెంట్ పెట్టుకుని, ఇండియాలో పోలీసు ఉద్యోగం చేస్తావా?"


    "అవును!"


    "ఎందుకు?"


    "అది నా జీవిత ఆశయం" అన్నాడు రాజా స్థిరంగా.


    ఆ ఆశయం తనకి కలిగేటట్లు చేసిన వ్యక్తిని అతనెప్పుడూ మర్చిపోడు.


    జేబులో నుంచి పర్సు తీశాడు రాజా.


    అందులో ఉంది ఆ వ్యక్తి ఫోటో!


    ఆ వ్యక్తి వైపు ఆరాధనా భావంతో చూశాడు.


                                                       *    *    *    *


            ఆఖరి మలుపు


    అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం...


    ఒక రోజు మధ్యాహ్నం....


    మండిపోతున్న ఎండలో, కట్టుకున్న పట్టుచీరె కంబళిలా గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తోంది డయాస్ మీద కూర్చున్న మినిస్టర్ విజయకుమారికి.


    నిజానికి ఈ మీటింగు పొద్దున పదిగంటలకే అయిపోయి ఉండాల్సింది. కానీ తను ఢిల్లీ నుంచి వచ్చిన వెధవ ఫ్లయిట్ లేటయ్యింది. అయినా ఇప్పటిదాకా ఈ అలగాజనాన్ని ఆపి ఉంచగలిగాడంటే, అదంతా యూత్ లీడర్ అయిన తన కొడుకు సంజీవ్ ప్రతిభే అయి ఉండాలి.


    గూండాగిరీ చేసి పనులు సాధించడంలో సంజీవ్ ఐ సాటికారు ఎవరూ!


    కానీ ఆ గూండాగిరీనే యిప్పుడు తన కొంపని ముంచేటట్లుంది.


    సంజీవ్ కి చిన్నా పెద్దా అని లేదు. వావీ వరసా అని లేదు. బీదా బిక్కీ అని లేదు.


    తన పని పూర్తికావడానికి ఎవరినైనా సరే పాతాళానికి తొక్కెయ్యగలడు. సంజీవ్ ఏ క్లాస్ బ్లాక్ మెయిలర్ కూడా! నిజం!!


    ఇప్పుడు తనే తన కొడుకు సంజీవ్ బ్లాక్ మెయిలింగ్ కి టార్గెట్ అయిపోయింది.


    ఏం చేశాడో, ఎట్లా దొరికిందో గానీ, సంజీవ్ చేతిలో పడింది ఒక వీడియో కేసెట్టు.


    తనూ, మినిస్టర్ బలరామిరెడ్డి పడుకుని ఉండగా ఎవరో దొంగచాటుగా తీశారు ఆ వీడియో ఫిల్ముని.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS