Previous Page Next Page 
సీతాచరితం పేజి 3


    ఒక సమాజ స్వభావం, ఆ సమాజంలోని ఉత్పత్తి సాధనాల మీద ఆధారపడి వుంటుంది. మానవ సంబంధాలు, అధికారం, శ్రమ ఫలితం, ఇవన్ని ఆయా కాలాల్లో అమల్లో ఉండిన ఉత్పత్తి సాధనాలమీద ఆధారపడి వుంటాయి. ఎందుచేతంటే సమాజ జీవితానికి ప్రధాన ఆధారం ఉత్పత్తి. కాబట్టి జనజీవనం యావత్తు ఈ ఉత్పత్తి సాధనాల మీద ఆధారపడి వుంటుంది. ఉత్పత్తి సాధనం సామాన్యమయినప్పుడు మానవునికి తన శ్రమ ఫలితం చాలవరకు దక్కుతుంది. ఉత్పత్తి సాధనాలు క్లిష్టములైనప్పుడు మానవుడు తన శ్రమఫలితం దక్కించుకోవడం కష్టతరమవుతుంది. కాబట్టి, మానవునికి ఆదిమ దశ నుండి శ్రమ స్వామ్య దశ వరకు సమాజాన్ని నాలుగు దశలుగా నిర్ణయించవచ్చు. ఇవి స్థూలమైన విభజన మాత్రమే. ఒక దశ ఒకే స్థితికి స్థిరమైవుంటుంది అనుకోవడం సరికాదు. ఒక దశ నుండి మరో దశకు పరిణామం చెందుతున్నప్పుడు ఉభయదశల సమ్మిశ్రిత ప్రభావాలు కనిపిస్తాయి. మానవ పరిణామం ఒక్క రోజులో వచ్చేదికాదు. ఇందుకు కొన్ని శతాబ్దాలు పట్టవచ్చు. ఈ పరిణామ దశలో ఒక దశను నిర్దిష్టంగా చెప్పడం కష్టం. బహుశః రామాయణ రచన ఇలాంటి పరిణామ దశలో జరిగింది.


    ఉత్పత్తి సాధనాల ఆధారంగా సమాజ దశలను తెలుసుకుంటూ పోతే పరిణామ క్రమంలో ఆదిమ సమాజం తొలిదశ అవుతుంది.


    ఆదిమ సమాజం


    ఆదిమ సమాజంలో ఉత్పత్తి సాధనాలు అతి సాధారణములయినవి. రాతి ఆయుధాలు, రాతి సాధనాలు, వినియోగించి ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ సాధనాలను సమకూర్చుకోవడానికి మేధస్సు అక్కరలేదు. ఈ సాధనాలు సాధారణ మానవులు అతి సులభంగా చేజిక్కించుకోగలరు. కాబట్టి తన శ్రమ ఫలితాన్ని తాను దక్కించుకోగలడు. ఇది వైయ్యక్తిక దశగాను సామూహిక దశ. జనజీవనం అచ్చం తిండి సంపాదించుకోవడంతో సరిపోదు. రక్షణ అతి ముఖ్యమైన అంగం. తనను రక్షించుకోవడం, తాను ఆర్జించింది. కాపాడుకోవడం జనజీవితంలో ప్రధానమైనవి. రక్షణ కోసం కొన్ని తెగలు సమూహాలుగా ఏర్పడి అడవి జంతువుల బారి నుండి, ప్రకృతి శక్తుల బారి నుండి కాపాడుకున్నాయి. ఈ దశలో ఉత్పత్తి కంటే సేకరణకు ప్రాధాన్యత హెచ్చు - సేకరణ, రవాణ కూడ ఉత్పత్తి అంగములే అనే ఆర్ధిక శాస్త్రవేత్తలు  లేకపోలేదు. ఆ దశలో ఆహారాన్ని సేకరించడం, సేకరించినవాటిని భద్రపరచడం ప్రధానమైన విషయం. ఆహార సేకరణగాని, సేకరించినవాటిని భద్రపరచడం ప్రధానమైన విషయం. ఆహార సేకరణగాని, దాని రక్షణగాని ఒక్కనితో సాధ్యమయ్యే పనులుకావు. కాబట్టి అందుకు సామూహిక శ్రమ అవసరం. అందుకే ఆదిమ సమాజంలో వ్యక్తులుగాక తెగలుగా గుర్తించబడ్డాయి. ఈ దశలో ఆస్తి అందరిది. ఏ ఒక్కరిదికాదు. ఆస్తి తెగకు చెందుతుంది. ఆస్తిరక్షణ. ఆస్తి సేకరణ బాధ్యతలు సామూహికములు - దీన్ని మనం "సామూహిక దశ" అన్నా తప్పు లేదు.


    మరొక ప్రధానమైన విషయం ఆస్తి. ఆస్తి మీద సమాజ స్వభావం ఆధారపడి వుంటుంది. ఆస్తి అందరిదయినప్పుడు శ్రమ ఫలితం అందరికి దక్కుతుంది. ఆస్తి కొందరిదైనప్పుడు శ్రమ ఫలితం కొందరికే దక్కుతుంది. ఆదిమ సమాజంలో ఆస్తి అనే పదం లేకున్నా అది అందరికీ దక్కింది కాబట్టి, మనిషికి మనిషికి మధ్య ఆస్తుల అడ్డుగోడలుగాని, అధికారపు కోటలుగాని లేవు. మానవ సంబంధాలు సమానత మీదనే ఆధారపడి వుండేవి. కుల మతాలు, కుట్రలు ఎరుగని సమాజమది.


    శ్రమ సామూహికం కాబట్టి సాహిత్యం కూడ సామూహిక సృష్టి అయింది. కళలన్ని సామూహికములే. మనిషి వేటాడినపుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు పదాలు పాడారు. అది సామూహికమయిందే సామూహిక నృత్యాలు చేశారు. ఈ విధంగా ఆనాటి సాహిత్యం వైయుక్తికం గాక సామూహికమయింది. ఆస్తి వలనే సాహిత్యం సామూహికమయింది. కళలూ అంతే.


    భూస్వామ్య దశ


    భూస్వామ్యదశలో ఉత్పత్తి సాధనాలు కొంత క్లిష్టములుగా తయారయినాయి. నాగలి, మగ్గం ఇలాంటివి ఉత్పత్తి చేసే శ్రామికులు తమకు తాముగా సేకరించుకోలేకపొయ్యారు. వీటికోసం మరికొందరు వృత్తి పనుల వారిమీద ఆధారపడవలసి వచ్చింది. కాబట్టి సమాజాన్ని వృత్తుల వారిగా విభజించడం అవసరముంది. ఈ వృత్తుల విభజన అవసరం కావడానికి కారణం ఏమంటే వృత్తుల్లో శిక్షణ ఇవ్వడానికి ఈనాటివలే శిక్షణ కేంద్రాలు లేవు - కాదు - అసంభవం కూడ. కాబట్టి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ కుటుంబాన్ని శిక్షణా కేంద్రంగా తీసుకోవడం జరిగింది. తండ్రి తర్వాత కొడుకు. ఆ విధంగా ఆ కుటుంబం ఆ కులం ఆ వృత్తికే సేమితం అయింది.


    "చాతుర్వర్ణం మయా స్రష్టం గుణకర్మ విభాగశః" అన్నాడు కృష్ణుడు గీతలో - ఈ వృత్తుల విభజనే కులాలుగా మారింది. అనంతర కాలంలో కొన్ని అగ్రవర్ణాలు, సమాజాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి కారణాలయినాయి.


    ఉత్పత్తి సాధనాలు క్లిష్టములయినా అతిక్లిష్టములు కావు. ఉత్పత్తి చేసేవాడు వాటిని సులభంగా కాకున్నా సేకరించుకోగలడు. ఒక మగ్గాన్ని ఒక నాగలిని లేక ఒక సుత్తిని, ఒక కత్తిని సేకరించుకోవడం అంత కష్టమైన పనిగాదు - కాగా ఉత్పత్తి సాధనం మీద ఉత్పాదకునికి పూర్తి హక్కు అధికారం ఉండేది. నేతపనివానికి మగ్గం మీద పూర్తి అధికారం ఉంటుంది. అతడు దారం తీసి, బట్టనేసి, అమ్ముకోగలడు. అంటే ఉత్పత్తి నుండి వినిమయం వరకు మధ్య దళారుల ప్రమేయం తక్కువ. ఆ విధంగా కొంతవరకు తన శ్రమ ఫలితాన్ని దక్కించుకోగలిగాడు. ఈ వృత్తి పనివారు "శ్రేణులుగా" ఏర్పడి తన ఉత్సాదనను పెంచుకోవడానికి ప్రయత్నించిన ఉదాహరణలు చాలా వున్నాయి.


    ఉత్పాదన తర్వాత సమాజ జీవితానికి రక్షణ ప్రధానమైంది. ఈ రక్షణ అనేదే, భూస్వామ్య దశలో మానవుని స్వేచ్ఛను హరించి అతనిని బానిసగా మార్చింది. ఆదిమ సమాజంలో సాధారణాలైన ఉత్పత్తి సాధనాలు వుండటం వల్ల - సామూహిక శ్రమ అవసరం కావడం వల్ల రక్షణ బాధ్యత సమూహానికి చెందింది. కాని వృత్తుల విభజన వల్ల సమాజం విడిపోయి, సామూహికతకు చోటు లేకుండా చేసింది! కాబట్టి రక్షణకని ఒక ప్రత్యేక సంస్థ అవసరమయింది. అతడు రాజు లేక రాచరికం - ఈ వ్యవస్థ ప్రజలు ఏర్పరచుకున్నదే ఐనా, రాజులు ప్రజాపీజకులు అయినారు. వీరు ఒక తెగగా ఏర్పడి తమ ఆధిక్యాన్ని ఒప్పుకొమ్మని ప్రజలను తమ పశుబలంతో పీడించారు. వీరికి మేధావి వర్గం అండ అవసరమయింది. అందువల్ల ఇటు మేధావి వర్గం అంటే బ్రాహ్మణులు అటు ప్రభుత్వ వర్గమంటే క్షత్రియులు కుమ్మక్కై, సమాజంలోని ఇతర వర్గాలను బానిసలుగా చేసుకున్నారు. ఈవిధంగా ఆదిమ సమాజంలో వున్న స్వేచ్ఛ నశించి, అధికారం, ఆస్తి, కొన్ని కులాల పెత్తనమై సమాజాన్ని పీడించే అవకాశాన్ని కల్పించుకున్నారు.


    భూస్వామ్య దశలో అధికారం భూమిది. భూమి కలవాడు భూపతి. భూమిని చేజిక్కించుకొని అధికారం చేజిక్కించుకోవడం భూస్వామ్య దశ యొక్క లక్షణం. ఈ భూపతులు తమ క్రింద నున్న వారందరినీ తమ ఆస్తిగానే పరిగణించారు. అంతేగాదు తమ భార్యలను, స్త్రీ జనాన్ని కూడ ఆస్తిగానే పరిగణించారు.


    భూస్వామ్య దశ యొక్క ప్రధాన లక్షణం సోమరులు. వీరు సోమరులేగాని ఉత్పత్తి విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని వుంటారు వీరు ఉత్పత్తి విధానాన్ని తలక్రిందులు చేయగలరు. వీరు ఉత్పత్తిదారులు కారు. కాని ఉత్పాదక యంత్రాంగాన్ని తమ చేతి కీలుబొమ్మగా తిప్పగలరు. ధనస్వామ్య వ్యవస్థకు, ఈ మధ్య దళారులు మూల స్తంభాలు. అంటే ధన స్వామ్య వ్యవస్థ ఒకటి ధనం మీద, రెండవది సోమరుల మీద ఆదారపడి వుందని అర్థం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS