Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 3


    అతడు కాస్త ముందుకు వంగి ఆమె మొహంలోకి చూశాడు. ఆ మొహంలో ఉదయపు ప్రశాంతత, ఫ్రెష్ నెస్ లేవు. వడలి బడలికగా ఉంది.

 

    చెదిరి మొహంమీద జీరాడుతున్న ముంగుర్లు చూస్తూ అన్నాడు -

 

    "నీలూ... రాత్రి ఎమర్జన్సీ వచ్చింది. సర్జరీ అయ్యేప్పటికి చాలా లేటయింది"

 

    ఆమె అతనివేపు కూడా చూడలేదు. అతని ఉనికినే పట్టించుకోనట్టు గరిటతో కూర తిప్పింది.

 

    ఆ తిప్పడం మామూలుగా కాదు. గిన్నె అడుగుపొర ఊడొచ్చేటంత బలంగా ఉంది.

 

    అతనికెందుకో నవ్వొచ్చింది.

 

    "నువ్వు టిఫిన్ తిన్నావా?" లాలనగా అడిగాడు.

 

    ఆమె మాట్లాడలేదు.

 

    "నేను తినిపిస్తాను తిను" తన ప్లేటులోని ఇడ్లీ ముక్క తుంచి ఆమె నోటికి అందించబోయాడు.

 

    విసురుగా అతని చేతిని తోసేసింది.

 

    "సారీ నీలూ! నేనేం చెయ్యగలను చెప్పు?" నొచ్చుకుంటూ అన్నాడు.

 

    ఆమె వినిపించుకోనట్లు ఉల్లిపాయ చేతిలోకి తీసుకొని వంటగది నానుకొని ఉన్న కారిడార్ లోకి వెళ్ళిపోయింది. అనుకోకుండా అతనిచూపు రిస్టువాచీ మీద నిలిచింది.

 

    "టైం లేదు. నీలిమ చాలా కోపంగా ఉంది. ఇప్పుడే తగ్గేకోపం కాదది. బ్రతిమాలుకోవడానికీ, మామూలు చేసుకోవడానికీ ఇది సమయం కాదు" అనుకుంటూనే త్వరత్వరగా టిఫిన్ ముగించి బయటికెళ్ళిన నీలిమ నుద్దేశించి-

 

    "సారీ నీలూ.. పొరపాటు నాదే! అయామ్ వెరీ సార్! టైమయిపోయింది. హాస్పిటల్ కి వెళుతున్నాను" అని చెప్పేసి వెనుదిరిగాడు.

 

    "ఏం చేసినా సారీ చెప్పుకుంటే సరిపోతుంది, సారీ ముసుగులో ఎన్నయినా చేయవచ్చు" అణుచుకున్న కోపం గొణుగుడు రూపంలో ఆమె నోటినుండి బయటకొచ్చింది.

 

    అపార్ట్ మెంట్ భవనాన్ని ఆనుకుని ఉన్న రోడ్డుమీద ఏదో వాహనం సడన్ బ్రేక్ తో కీచుమని శబ్దం చేసింది. ఆ శబ్దంలో ఆమె గొణుగుడు కలిసిపోయింది.

 

    బ్రతిమిలాడి దగ్గర చేర్చుకుంటాడన్న ఆశ తీరక ఆమె మనసు కుతకుతలాడింది.

 

    "అప్పటికే అతను పిల్లల గది చేరుకున్నాడు.

 

    కొడుకు జీవని మంచంమీద కూర్చుని ముందుకు వంగి కాళ్ళకు సాక్స్ వేసుకొంటున్నాడు. స్కూలు బ్యాగ్ సర్దుతోంది కూతురు మువ్వ.

 

    "జీవూ! టైమ్ కి ఇంటికొచ్చేయాలి మీరు. లేకపోతే మమ్మీ కంగారుపడుతుంది కదా!" అన్నాడు గుమ్మందగ్గర నిలబడి.

 

    జీవన్ మాట్లాడలేదు. తలతిప్పి కూడా చూడలేదు.

 

    "అలాగే డాడీ! ఇంకెప్పుడూ ఆలస్యంగా రాము" అంతా గమనిస్తూ బుద్ధిగా చెప్పింది మువ్వ.

 

    కొడుకు సాక్స్ వేసుకోవడంలో నిమగ్నమయ్యాడనుకొని - "ఓ కే నే వెడుతున్నా" అంటూ వెనుదిరిగాడు.

 

    "డాడీ...." గారంగా పిలిచింది మువ్వ. ఆ గొంతులోని మార్దవం అతన్ని నిలిపివేసింది.

 

    "ఏంట్రా తల్లీ?" గిరుక్కున తిరిగి కూతురి మొహంలోకి లాలనగా చూశాడు.

 

    "ఇవాళయినా నువ్వు త్వరగా వచ్చేస్తావా?" దగ్గరగా వచ్చి అపురూపం అయినట్టు అతన్ని ఆనుకుని నిలబడి అడిగింది.

 

    ఒక పవనం హృదయాన్ని స్పృశిస్తూ వెళ్ళిపోయిన అనుభూతి.

 

    "ష్యూర్ డియర్! తప్పకుండా వచ్చేస్తాను. రాత్రికి అందరం హోటల్లో భోంచేద్దాం. మమ్మీకి కూడా చెప్పు" కూతురి తలనీద చెయ్యివేసి హత్తుకుంటూ అన్నాడు.

 

    "హోటల్ కా? అయితే నాకు ఐస్ క్రీం కూడా ఇప్పించాలి"

 

    "తప్పకుండా ఇప్పిస్తాను నా తల్లికి"

 

    "మరి నిజంగా వచ్చేస్తావా?" తల పైకెత్తి అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది.

 

    "నిజంగా వచ్చేస్తాను బంగారు. అన్నయ్యకీ, నీకూ గేమ్స్ కూడా కొనుక్కుందాం! ఓకే!"

 

    "ఓకే!" హుషారుగా అని తండ్రి చెయ్యందుకుని ముద్దిచ్చి వదిలేసింది. వంగి కూతురు బుగ్గమీద రెండు ముద్దులిచ్చి బయటకు అడుగులేశాడు తప్పనిసరిగా ఇవాళ పెందలాడే వచ్చెయాలి అనుకొంటూ.

 

    గుమ్మం ప్రక్కనే ఉన్న కుండీలోని నందివర్ధనం మొక్క సన్నగా కదలి వీడ్కోలు చెప్పింది.

 

    నాలుగంతస్థుల భవనం అది. ఒక్కొక్క అంటుస్థుకి నాలుగు టూ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మొదటి అంతస్థులో ఉంటున్నారు శరత్ చంద్ర కుటుంబం.

 

    గ్రౌండ్ ఫ్లోర్ లో కారు పార్కింగ్ వుంది.

 

    చకచకా మెట్టు దిగి తన మారుతీ కారును చేరాడు శరత్ చంద్ర.

 

    మరో రెండు నిమిషాల్లో కారుస్టార్టయి రోడ్డెక్కిన శబ్ధం ఫ్లాట్ లోని పిల్లలకు వినిపించింది.

 

    ఆ శబ్దం క్రమంగా దూరమౌతుండగా చిన్న గొంతుతో అన్నాడు పన్నెండేళ్ళ జీవన్.

 

    "స్కూలునుండి టైమ్ కి రావాలట! ఈయన వచ్చేస్తున్నట్టు మనకి చెబుతున్నాడు పెద్ద!"

 

    "ఇవాళ డాడీ వచ్చేస్తారన్నయ్యా! రాత్రికి హోటల్లో నువ్వు ఏం తింటావ్?" తెలివిగ మాట మార్చేసింది ఏడేళ్ళ మువ్వ.


                             *    *    *    *

 

    అది నగరంలో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నగరం నడిబొడ్డున 30 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలం అది.

 

    ఎంట్రన్స్ గేట్ దాటగానే లోపలికి దారితీసే రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న పచిచని పూలతోట, కన్నతల్లి వెచ్చని పలకరింపులా రోగులకు ఆహ్వానం పలుకుతుంది.

 

    తోట దాటగానే ప్రహరీ గోడనానుకుని పెద్ద పెద్ద వృక్షాల మధ్య స్థలాన్ని అంతస్థుల భవనాలు విశాలంగా ఆక్రమించుకుని ఉన్నాయి.

 

    గేట్ పై భాగాన పెద్ద బోర్డ్ మీద "సిద్ధార్ధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్" అని మెరిసే అక్షరాలు రోడ్డున పోయేవాళ్ళ చూపుల్ని అప్రయత్నంగా నిలిపేస్తున్నాయి.

 

    ఎంట్రన్స్ లోని ఔట్ పేషెంట్ విభాగం బిల్డింగ్ దాటి లోపలకి వెడితే ఎదురుగా ప్రముఖంగా కనిపించేది కార్డియాలజీ విభాగం.

 

    దాన్ని అనుకునే ఐసిసియు ఆ తర్వాత గుండె జబ్బులనుంచి కోలుకుంటున్న రోగుల వార్డులు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్డియాలజీకి కేటాయించబడింది.

 

    కార్డియాలజీ విభాగం పైనున్న మొదటి అంతస్తులో ఉంది కార్డియో - థొరాసిక్ సర్జరీ విభాగం.

 

    కార్డియాలజీ విభాగంలో గుండెకి సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడి, ఆపరేషన్ తప్ప మార్గం లేదని నిర్ణయం కాబడిన రోగులు ఈ విభాగానికి తరలించబడతారు. అక్కడ కార్డియో థొరాసిక్ సర్జన్స్ వారి గుండెకి ఆపరేషన్ చేసి చికిత్స చేస్తుంటారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS