Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 3


    "నా కిష్టం లేని పనులు నువ్వు చెయ్యకూడదు." అంటాడు పరమ గంభీరంగా.
    "నాకిష్టంలేని పనులు నువ్వు మానేస్తావా?"
    "ఓ! మానేస్తాను చెప్పు."
    "సరే పాటకచ్చేరీలు చెయ్యడం మానెయ్యి".
    "త్రీ ఛీర్స్ టు మృదుల-హిప్ - హిప్ - హుర్రే" చప్పట్లు కొట్టి నవ్వింది. మర్నాడే ప్రయాణమై వెళ్ళిపోయింది.
    ఒకసారి మృదులతోపాటు ఒక టిబెటియన్ కూడా వచ్చాడు.
    "ఈయన పేరు మింగియార్. టిబెట్ లామేసరీ నుంచి వచ్చాడు. ఏవో కొన్ని ప్రత్యేకమైన మూలికల కోసం మన అడవుల్లో తిరగడానికి మన గవర్నమెంటు నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. ఇతను చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా వుంటే వివరంగా తెలుసుకోవాలని మన యింటికి రమ్మన్నాను." భర్తకి పరిచయం చేసింది. లోలోపల గుఱ్ఱుమంటున్నా పైకి చచ్చినట్లు మర్యాదగా మాట్లాడేడు. ఆ రోజే మింగియార్ వినకుండా "ఇతను మనింట్లో వుండటం నాకిష్టంలేదు." అన్నాడు యమ సీరియస్ గా.
    "నా యింట్లో," అనే పొరపాటు అతను చేయలేదు. దాని పర్యవసానం అనుభవించకపోయినా ఊహించగలడు.
    "అలాగా! అయితే సరే మా నాన్నగారింటికి తీసుకుపోతాను. నేను రెండు మూడు రోజులక్కడే వుంటాను" ఈవెనింగ్ ఎక్సర్ సైజ్ లో ఒక భాగమైన స్కిప్పింగ్ చేసుకుంటూ అంది.
    తెల్లగా పాలిపోయింది అతని ముఖం. ఈ అమ్మాయితో ఎలా వ్యవహరించాలో అతనికేమీ బోధపడటంలేదు. నిజంగా కోపం వచ్చేసింది.
    "మనిద్దరి మధ్యా అన్నీ అపార్ధాలే వస్తున్నాయి."
    స్కిప్పింగ్ మానకుండా నవ్వుతోనే, "అయితే విడిపోదాం!" అంది. గుండె గుభిల్లుమంది భాగవతార్ కి. కళ్ళప్పజెప్పి నిలబడ్డ అతన్ని చూసి స్కిప్పింగ్ రోప్ విసిరి అవతల పారేసి, అతని మెడచుట్టూ చేతులు వేసి పెదవులతో మెడమీద, చెవుల వెనక గిలిగింతలు పెడుతూ ముద్దులు పెట్టుకుంది. ఏ లోకాలలోకో తేలిపోయాడు.
    ఎలా! ఇలాంటి అమ్మాయితో పోట్లాడటం ఇది చాలదన్నట్లు ఆనంగ్ మరొకడు తయారయ్యాడు. అతడొక ప్రఖ్యాత రచయిత. ట్రైబల్ లైఫ్ మీద మెటీరియల్ కావాలంటూ వచ్చి కూర్చుంటాడు. అతనికి చాలామంది ఆడ స్నేహితులున్నారని ప్రతీతి. ఇలాంటివి చెప్పినా మృదుల లక్ష్యపెట్టదు. "అతని పర్సనల్ లైఫ్ తో నాకేం సంబంధం? ఇతడు సిన్సియర్ గా ట్రైలర్ లైఫ్ గురించి రాస్తే వాళ్ళకెంతో కొంత మేలు జరుగుతుంది కదా!" అంటుంది. అతనితో గంటలు గంటలు మాట్లాడుతూ కూర్చుంటుంది. ఎన్నని భరించడం? ఎలా భరించడం? భరించక ఏం చెయ్యడం?
    జూబ్లీహాల్ లో భాగవతార్ పాటకచ్చేరి ముగిసింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మారుమ్రోగుతుండగానే. "నాకర్జంట్ పని వుంది సార్! వెళ్ళిపోవాలి" అని భాగవతార్ కారుకోసం వెయిట్ చేయకుండా ఆటోలో తన ఇన్ స్ట్రుమెంట్స్ తో వెళ్ళిపోయాడు ఏడెంటో.
    సంతోషించాడు భాగవతార్. ఏడెంటో తనతో కూడా యింటికొస్తే మృదుల వెంటనే అతణ్ణి వదిలిపెట్టదు. అతడి అమెరికా దేశాన్ని గురించి, అతడుండే ప్రాంతాన్ని గురించి ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. ఒక గంటసేపు బాతాఖానీ వేసుకున్న తరువాత కూడ ఊళ్ళో ఉంటే భాగవతార్ పాటకచ్చేరీకి తప్పకుండా వెళుతుంది మృదుల. ఆరోజు కూడా వచ్చింది.
    ఆర్గనైజర్ తిరిగొచ్చి, "సర్! మృదులగారు లేరు. మీ పాటకచ్చేరీ పూర్తికాగానే హడావిడిగా వెళ్ళిపోయారట. ఏదేనా పనిమీద ఇంటికే వెళ్ళేరేమో?" అన్నాడు. గుండెమీద ఏదో పెద్దబరువు పెట్టినట్లెయింది భాగవతార్ కి, ఏండెటో హడావిడిగా వెళ్ళిపోయాడు. మృదుల కూడా హడావిడిగా వెళ్ళిపోయింది ఒకవేళ.
    తరువాత ఊహించడానికి అతని మనసు యెదురు తిరిగింది. కార్లో కూర్చుని చప్పుడు చేస్తూ డోర్ వేసేసి. "త్వరగా పోనీ", అన్నాడు డ్రైవర్ తో. డ్రైవర్ తాపీగా వెనక్కి తిరిగి, "ఎక్కడికి సార్!" అన్నాడు.
    "ఇంటికే, త్వరగా! డ్రైవర్ గేర్ మార్చి స్పీడ్ పెంచాడు. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ చూపడంతో ఆపవలసి వచ్చింది.
    "ఆపుతావేం? త్వరగా పోనీయమని చెప్పరాదూ!" రాగజ్ఞానం మరిచిపోయినట్లు కీచున అరిచాడు.
    "రెడ్ లైట్ వచ్చింది సార్! ఇపుడు రోడ్ క్రాస్ చేస్తే పెనాల్టీ వేస్తారు. అంతేకాదు వెహికల్ సీజ్ చేసినా చెయ్యొచ్చు. అప్పుడు మనకి మరింత ఆలస్యమవుతుంది. పోనీమంటారా?" వినయంగా అడిగాడు డ్రైవర్.
    "వద్దులే." విసుగ్గా పక్కకి తిప్పుకున్నాడు. ఎవరో అమ్మాయి పంజాబీ డ్రెస్సుతో మోపెడ్ మీద వెళుతూ సిగ్నల్ యివ్వకపోవడంతో తనూ ఆగింది.
    "మృదులా!" అరిచాడు. ఆ అమ్మాయి మొహం యిటు తిప్పింది. మృదుల కాదు. ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ పంజాబీ డ్రెస్ లు వేసుకుని మోపెడ్ మీద తిరిగేవాళ్లే. ముఖ్యమంత్రి రకరకాల రూల్సు ప్రవేశపెడుతున్నారు కాని. ఆంధ్రదేశంలో ఆడపిల్లలంతా విధిగా చీరలే కట్టుకోవాలనే రూలు ప్రవేశ పెట్టడం లేదు. పంజాబీ డ్రెస్సుల్లో, జీన్స్ లో ఫ్రాక్స్ ల్లో తెలుగుదనం ఎక్కడేడ్చింది. ఎట్లాగైతేనే గ్రీన్ లైట్ వచ్చి కారు ముందుకు కదిలింది. ఫర్లాంగు దూరం నడిచిందో లేదో పెద్ద ప్రోసెషన్ ఎదురొచ్చింది. రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా విద్యార్ధులంతా ఊరేగింపుగా ముందుకి నడుస్తున్నారు. ఈ రకమయిన ఊరేగింపులు ఏ రకమైన అల్లరులకు దారితీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు చేస్తున్నారు. ప్రొపెషన్ గొంతు చించుకుని నినాదాలిచ్చుకుంటూ జెండాలు పట్టుకుని బ్లాక్ బేడ్జస్ తగిలించుకుని పెళ్ళి నడకలతో ముందుకు సాగుతోంది. వాళ్ళలో ఒక్కొక్కడ్ని చావదన్నాలనిపించింది భాగవతార్ కి. పోలీసులు లాఠీలతో జనాన్ని అటూ యిటూ వొత్తిగిల చేస్తున్నారు. ఏ రకంగాను ఏ వర్గంలోను ఉద్రేకాలు చెలరేగకుండా జాగ్రత్తపడుతున్నారు. మొత్తంమీద ఆ ప్రోసెషన్ రోడ్డు దాటేసరికి పూర్తిగా నలభై అయిదు నిముషాలు పట్టింది. అప్పుడు మళ్ళీ కదిలింది కారు. ప్రోసెషన్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. దాన్లోంచి తప్పించుకొని బయటపడేసరికి మరో అరగంట పట్టింది. ఇల్లు చేరుకొనేసరికి తలుపు తాళం వేసి వుంది. ఇది అతను అనుమానిస్తున్నదే! అతని దగ్గర డూప్లికేట్ తాళం వుంది. తలుపు తెరిచి కాలితో ఒక్కతాపు తన్నాడు కోపంగా ఇల్లంతా చీకటిగా వుంది. లైటు వేసాడు. హాల్లో లేదు మృదుల. ఎందుకుంటుంది? మృదుల ఎక్కడ వుంటుందో అతని మనసు చెప్తోంది. ప్లాట్స్ కింద వున్న షెడ్స్ లో కారు పార్క్ చెయ్యబోతున్న డ్రైవర్ తో. "కారు పార్క్ చెయ్యకు. మనం మళ్ళీ బయలుదేరాలి" అని తలుపు మళ్ళీ బయట నుంచి లాక్ చేసేసి కారులో కూర్చుని "ఏండెటో యింటికి పోనీ" అన్నాడు. కారు ఏండెటో యిల్లు చేరుకొనేసరికి లైట్లు వెలుగుతున్నాయి. లోపల్నుంచి మంద్రంగా పాప్ మ్యూజిక్ వినిపిస్తోంది. ఎంతో ఆసక్తితో శాస్త్రీయ సంగీతం నేర్చుకుని అద్భుతంగా మృదంగం వాయించినా అతనికి పాప్ మ్యూజిక్ అంటే కూడా యిష్టమే. డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాడు. అప్పుడప్పుడు క్లబ్స్ లో పెర్ఫార్మెసెస్ కూడా యిస్తాడు. తలుపులు బయట వేసున్నాయి. లోపల్నించి స్టెప్స్ వేస్తున్న చప్పుడు వినిపిస్తోంది. దబదబ తలుపు బాదాడు భాగవతార్. కాలింగ్ బెల్ వున్నదన్నమాట మరిచిపోయి. లోపల్నించి ముందు స్టెప్స్ ఆగిపోయాయి. తరువాత మ్యూజిక్ ఆగిపోయింది. 
    "ఎవరూ!" లోపల్నించి విసుగ్గా అరిచాడు ఏండెటో తలుపు తీయకుండానే.
    "నేనే తలుపు తెరు". గొంతు మార్చి అన్నాడు భాగవతార్. సంగీతం పాడేటప్పుడు అతడు రకరకాల కంఠస్వరంతో పాడటం ప్రాక్టీస్ చేసాడు. అతడి పాటకచ్చేరీలో యిదొక ప్రత్యేక ఆకర్షణ.
    "నేను బిజీగా వున్నాను. నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. ఇంకోసారి రండి" లోపల్నించె అరుస్తూ అన్నాడు ఏండెటో.
    "నేను భాగవతార్ ని తలుపుతీయి," బయటి నుంచి అరిచాడు.
    రెండు నిముషాల నిశ్శబ్దం. తరువాత తలుపులు తెరుచుకున్నాయి. ఎవరో హడావిడిగా లోపలి గదిలో పరిగెడుతోన్న సందడి, గుమ్మానికడ్డంగా నిలబడ్డ ఏండెటోని తోసుకుని ఏండెటో బెడ్ రూమ్ లోకి వెళ్ళబోయాడు భాగవతార్. కర్టెన్ వేసివున్న గుమ్మానికి రెండుచేతులు చాచి అడ్డుగా నిలబడి, "ఇది నా బెడ్ రూమ్. మీరు లోపలికెళ్ళడానికి వీల్లేదు." అన్నాడు కరుగ్గా.
    "నేను వెళ్ళి తీరాలి."
    "ఇది నా యిల్లు. నేను వీల్లేదంటున్నాను." తెరవెనుక ఏదో నీడ కదిలింది.
    "ఎవరున్నారు లోపల?"
"అది మీ కనవసరం."
    "అంత రహస్యంగా దాచవలసిన అవసరమేమొచ్చింది?"
    "అది నా వ్యక్తిగత విషయం. మీకు చెప్పవలసిన అవసరంలేదు" ఏండెటోని తప్పించుకుని లోపలికెళ్ళడానికి ప్రయత్నించాడు భాగవతార్. అతడు ఎటుకదిలితే అటు కదులుతూ చేతులు అడ్డుగా జాపుతున్నాడు ఏండెటో. తెరమీద నీడ అటూ యిటూ కదులుతోంది.
    "ఎవర్నో తెచ్చి యింట్లో పెట్టుకున్నావని పోలీసు రిపోర్టు యిస్తాను."
    "ఎటూ కాని వేళ నా యింటి మీదకొచ్చి నానాగొడవా చేస్తున్నావని, మతి చలించిందని మెంటల్ హాస్పిటల్ లో చేర్పిస్తాను."
    "యూ బ్రూట్".
    "ఇంగ్లీషు తిట్టు తిట్టకు. నేను తెలుగులో బోలెడన్ని తిట్టగలను. లోపలివాళ్ళు వింటే నవ్వుకుంటారు." గతుక్కుమని వెనక్కి తగ్గాడు. లోపల వున్నది మృదులేనా? తనని చూసి నవ్వుకుంటోందా? జుట్టు పీక్కున్నాడు.  


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS