Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 2


                              ఎ.కె. 47
                                                _ చందు హర్షవర్ధన్   


    లబ్ డబ్ ......   

      లబ్ డబ్ ......

        లబ్ డబ్ ......

    శరీర సరోవరాన అరవిందంలా విచ్చుకున్న అతని గుండె లయబద్ధంగా కొట్టుకుంటూ, ఆవరించిన శబ్దాన్ని ఆవలికి నెట్టేస్తూ వుంది.

    వెంటబడిన వేటగాడినిచూసి ప్రాణభీతితో పరుగుతీసే లేడికూనలా అతడు పరిగెడుతున్నాడు.

    చావు సమీపించినప్పుడే బ్రతకాలన్న ఆశ ప్రతి జీవికి బలీయంగా వుంటుంది.

    బ్రతుకు మీద ఆశ, ప్రాణాలమీద తీపి అతన్ని మరింత వేగంగా పరిగెత్తిస్తున్నాయి.

    అతని ఎద ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది.

    ఎదుర్రాళ్ళ దెబ్బలకు కాలిబొటన వ్రేలు టొమేటోలా చిట్లిపోయినా, పాదాల్లోకి సూదులవంటి ముళ్ళు దిగబడుతున్నా ఏమాత్రం లెక్క చేయక అతడు పరుగెడుతూనేవున్నాడు.
   
ప్రపంచంలో ప్రతి మనిషి తన ప్రాణాన్ని తాను ప్రేమించుకుంటాడు. ఆ ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, తప్పించుకునే ప్రయత్నమో, లేక ప్రమాదాన్ని తప్పించే ప్రయోగమో చేస్తాడు.

    సంధించిన బాణంలా దూసుకుపోతున్న అతనుకాస్తా హఠాత్తుగా ఆగాడు. తన చుట్టూ వున్న పరిసరాలను ఒకసారి కలయజూసాడు.

    పరిగెత్తడం ఆగిపోయినా, అతని గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే వుంది.

    పరుగుతో అలసిపోయి కాదు, ప్రాణం మీది ఆశతో.

    చావుకంటే, చావుకు సంబంధించిన భావమే మనిషిని భయకంపితుని చేస్తుంది.

    అతని ముఖంనిండా చెమట. కళ్ళనిండా తప్పించుకో గలిగాననే ఆనందం.

    నిజానికి, అతని ఆనందం నిమేష మాత్రమే.

    మృత్యువు అతని వెనుకే మోహరించి వుందని, మరికొద్ది క్షణాలలో ఈ సృష్టికీ అతనికీ మధ్య గల లంకె తెగిపోతుందని అతనికి తెలియదు.

    తెలియని యదార్ధంకంటే, ఉత్తుత్తి భ్రమలే ఒక్కోసారి మనిషికి ఊరట కలిగిస్తాయి.

    ప్రమాదం లేదు, తను తప్పించుకోగలిగాను అని అతను తన మనసులో అనుకున్నాడు.

    ఆ మరుక్షణమే కౌంట్ డౌన్ ప్రారంభమయింది.

    పది......

      తొమ్మిది......

         ఎనిమిది.......

    అరటాకు మీది నీటిబిందువులాగా క్షణాలు జారిపోతున్నాయి.

    మూడు.....

      రెండు.......

         ఒకటి........

        0.........

    "అమ్మా....!" యావత్ నాగరిక ప్రపంచానికి వినిపించేట్టు చావుకేక.

    ఆ కేకకు గాలి స్థంభించిపోయింది. పరిసరాలు గడగడ వణికిపోయాయి.

    కేవలం మూడు సెకన్లలో ఆటోమేటిక్ రైఫిల్ నుంచి నిప్పులు కురుస్తూ దూసుకువచ్చిన ముప్పయ్ రౌండ్ల అతని దేహాన్ని దూదిపింజల్లా శూన్యంలోకి ఎగరేశాయి.

    ఇరవై ఏళ్ళ క్రితం మాతృగర్భం నుంచి మనుషుల మధ్యకు వచ్చిన రాజా అనే ఆ యువకుడు మానవ సమాజంనుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు.

    కల్లాకపటం తెలియక, కలలుగానే ఇరవై ఏళ్ళ జీవితానికి తెరపడింది.

    కుప్పలా కూలిన అతని ఒళ్ళు తూట్లుపడి జల్లెడలా మారింది. జల్లెడలా మారిన అతని ఒంట్లోంచి పచ్చి నెత్తురు జాలువారుతోంది.

    నెత్తుటి నెత్తావులతో ఆ పరిసరాలు మత్తెక్కిపోయాయి.

    మురిపెంగా పెంచుకున్న ఓ తల్లి కడుపుతీపిని మృత్యువు నోట కరచుకుపోయింది.

    నవ సమాజ నిర్మాత యువతరం. భావికాల నిర్ణేత యువతరం!

    ఆ యువతరానికి చెందిన రాజాకు అప్పుడే కాలం చెల్లిపోవడానికి కారణం ఏమిటి?
 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS