Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 2


    "నువ్వు నీ ఫ్రెండుతో ఏ కాశ్మీరుకో, ఢిల్లీకో ప్రోగ్రాం వేశావ్. మీ మమ్మీ ఒప్పుకోదని నీకు తెలుసు..."


    "ఓ డాడీ"


    "అందుకే నాదగ్గరకు వచ్చావ్"


    "డాడీ" అసహనంగా అన్నది అమూల్య.


    జడ్జి కృష్ణారావు అమూల్యలోని అసహనాన్ని గుర్తించలేదు.


    "ఎక్కడికెళ్తున్నారు? ఎన్ని రోజులు ప్రయాణం? ఆ శేఖరుగాడూ, మాలతి కూడా వస్తున్నారా?"


    "లాభం లేదు. వాళ్ళుంటే మీమంమీ చస్తే ఒప్పుకోదు"


    "అబ్బబ్బ డాడీ! మీ ధోరణి మీదేగాని...నేను చెప్పేది కూడా వింటారా?"


    "ఆదిత్యా వాళ్ళతో పిక్ నిక్ వెళుతున్నావా? ఆదిత్యతో అంటే మరి మీ మమ్మీకి అభ్యంతరం ఉండకూడదే."


    "ఓ మై గాడ్"


    "నో మిలార్డ్"


    "మీరు అనుకొనేదేమీ కాదు నాన్నా"


    "మరేమిటి తల్లీ మీ మమ్మీని కూడా పిలువు, ఒకేసారి వింటాం"


    మళ్ళీ నేను జడ్జిమెంట్ రాసుకోవాలి. రామూ అమ్మగార్నీ."


    "డాడీ ప్లీజ్ మమ్మీని పిలవకండి. మీతో మాట్లాడాలనే ఇంత పొద్దుటే మీగదిలోకి వచ్చాను. మీరు నేను చెప్పేది వినకుండానే ఏమేమో మాట్లాడేస్తున్నారు" విసుగ్గా అన్నది అమూల్య.


    "మరి ఏమిటి తల్లీ నన్ను చంపక వెంటనే చెప్పేయ్."


    "నన్ను మీరే చెప్పనివ్వడంలేదు."


    "ఎస్! అవును కదూ? ఇప్పుడు చెప్పేస్తా. నీ స్నేహితురాల్ని నువ్వు పాసైనందుకు పార్టీకి పిలవాలనుకుంటున్నావు. మీ మమ్మీ ఒప్పుకోదని నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలకు మమ్మీతో గొడవెందుకమ్మా: నేను డబ్బు ఇస్తాను. ఏ హోటల్ కైనా వెళ్ళి..."


    "ఓ గాడ్!"


    "నో మిలార్డ్!"


    "ఎస్ మిలార్డ్ దయచేసి నన్ను చెప్పనివ్వండి."


    "అంటే ఈసారి ఓడిపోయానన్న మాట?" ఎదురుగా ఉన్న పెన్సిల్ చేతిలోకి తీసుకొని బల్లమీద చిన్నగా కొట్టుకోసాగాడు.


    "అవును ఓడిపోయాను."


    "ఇక చెప్పనా?"


    "ఓకే! యు ప్రొసీడ్"


    "మీరు సీరియస్ గా లేరు"


    "నేను చాలా సీరియస్ గా ఉన్నాను" గాంభీర్యాన్ని ముఖంలోకి తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు కృష్ణారావు.


    డాడీ...మరి...మరి...నేను ప్రేమిస్తున్నాను.


    "కృష్ణారావు చప్పున తలెత్తి అమూల్య ముఖంలోకి చూశాడు. చేతిలోని పెన్సిల్ బల్ల మీదపడి దొర్లుకుంటూ పోయి క్రిందపడింది.


    కిందకు వంగి అమూల్య పెన్సిల్ తీసి బల్ల పైన పెట్టింది.


    కృష్ణారావు కూతుర్నే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అమూల్య దిక్కులు చూస్తూ కూర్చుంది.


    కృష్ణారావు పక్కున నవ్వాడు.


    అమూల్య ముఖం చిన్నబుచ్చుకుంది.


    ఈ డాడీ ఎప్పుడూ ఇంతే: తను ఎంత సీరియస్ గా మాట్లాడినా తేలిగ్గా కొట్టి పారేస్తారు. ప్రేమించానంటే నవ్వుతారేం? డాడీ దృష్టిలో ఇంకా తను పాపాయే. ప్రేమంటే తెలియని పసిదే. ప్రేమంటే తెలియదని ఉద్దేశం.


    అమూల్య ముఖంలోని మార్పుని గమనించాడు కృష్ణారావు.


    అతని నవ్వు ఆగిపోయింది. గంభీరంగా కూతురి ముఖంలోకి చూడసాగాడు.


    ఆ ముఖం తనకు తెలిసిన పసిముఖం కాదు. ఆ ముఖంలో చిలిపితనం కూడా లేదు. గంభీరంగా ఉన్నది.


    అవును అమూల్య పసిబిడ్డ కాదు. ఇరవై ఏళ్ళు వచ్చినాయి. తను ఆ విషయం ఆలోచించనే లేదు. తన భార్య అమూల్య పెళ్ళి గురించి మాట్లాడితే "అమూల్యకు ఇప్పుడే ఏం పెళ్ళి?" అంటూ కొట్టిపారేసేవాడు.


    అమూల్య ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. అమూల్య నేలకేసి చూస్తున్నది.


    "ఎవర్ని?" పొడిగా ఉన్నది కృష్ణారావు కంఠం.


    అమూల్య పేరు చెప్పటానికి సందేహిస్తున్నట్టు కనిపించింది.


    "చెప్పమ్మా నాదగ్గర సిగ్గేమిటి?"


    అమూల్య ఏదో అనబోయి ఆగిపోయింది.


    "చెప్పు తల్లీ! ఆదిత్యేగా. అతనంటే నాకు బొత్తిగా గిట్టదు ఖాళీ డబ్బా లాంటివాడు. అందం వుంది. అంతే డబ్బుంది. మీ మమ్మీకి అది చాలు. మరోసారి ఆలోచించు! ఆదిత్య అలవాట్లు..."


    "ఆదిత్యా కాదు."

    
    "బ్రతికించావు మరింకెవరు?"


    అమూల్య తలదించుకుని కుడిచేతి బొటనవేలి గోరు కొరుక్కోసాగింది.


    "మరి డిప్యూటి కలెక్టర్ కొడుకా? హిప్పీగాడిలా వుంటాడు. ఛ!ఛ! వాడి జుట్టూ వాడూ...చస్తే నేను ఒప్పుకోను."


    "అతను కాదు డాడీ!"


    "మరెవరూ? ఆ అర్థం అయింది. ఈ మధ్య కొత్తగా ఎవరో మీ గ్రూప్ లో చేరినట్టున్నాడు. పొట్టిగా వుంటాడు. వెధవ జోక్స్ వేస్తూ వుంటాడు. ఎవరబ్బాయి అన్నావ్? ఎస్.పి.కొడుకా? పోలీసువాళ్ళ సంబంధమా...?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS