Previous Page Next Page 
జయ - విజయ పేజి 2


    "థాంక్యూ అక్కా! నేనూ నీలాగా ఉద్యోగం సంపాదించి అప్పుడు నీ ఋణం తీర్చుకుంటాన్లే! ఓ.కే...వస్తాను, టైమయిపోయింది..." అంటూ బయటకు పరుగెత్తింది జయ.
    విజయ నవ్వుతూ గదిలోకి నడిచి బట్టలు మార్చుకునేసరికి ఆమెకు "టీ" తెచ్చి అందించింది.
    "మీ మావయ్య ఉత్తరం రాశారివ్వాళ?" అందామె అక్కడున్న కుర్చీలో కూర్చొంటూ.
    "ఏమిటి విశేషాలు?" అడిగింది విజయ కాఫీ తాగుతూ.
    "అదే! అదేదో సంబంధం ఉందని ఇదివరకు చెప్పాడు కదా! ఆ వివరాలు కనుక్కుని రాశాడిప్పుడు. అబ్బాయి అక్కడే షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడట! అన్నివిధాలా ఆ సంబంధం బాగానే ఉందట! వచ్చే ఆదివారం వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తున్నారు!.
    విజయ చిరునవ్వు నవ్వింది.
    "నీకు అన్నీ తొందరెక్కువమ్మా!" అంది నెమ్మదిగా.
    "ఏం?" అడిగింది పార్వతి.
    "లేకపోతే ఏమిటి? నాకు ఇప్పుడే పెళ్ళిచేసి పంపిస్తే మిమ్మల్నెవరు చూస్తారు? ఈ ఒక్క సంవత్సరం ఆగితే ఎలాగూ జయ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఆ తరువాత తనుకూడా ఉద్యోగం సంపాదించుకుంటుంది. అంతవరకూ నేను ఇక్కడే ఉండటం అవసరం కాదూ?"
    "ఏమోనమ్మా! వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నా అవస్థ నేనే ఎలాగోలా పడతానులే! ముందు నీ ఒక్కదాని భారమయినా వదుల్తే తరువాత జయ విషయం కూడా చూడవచ్చు!" అంది పార్వతి.
    విజయ ఇంకేమీ మాట్లాడలేదు.
    తనకు వివాహం చేసుకోవాలి అన్న కోరిక లేదు. కాలేజీలో చదివే రోజుల్లో వివాహం మీద ఆసక్తి వుండేదిగానీ, రాన్రాను అదికూడా సన్నగిల్లిపోయింది. అందుక్కారణం తనకు జరిగిన పెళ్ళిచూపులే! మొదటిసారి పెళ్ళిచూపులకు అతనెవరో వచ్చాడు. అతగాడి రూపం ఏమాత్రం బాగుండలేదు. అతనికి కూడా తన రూపం నచ్చలేదని వాళ్ళు తెలియజేసేసరికి తను ఆశ్చర్యపోయింది. అంతవరకూ అతనిని చేసుకోవడానికి తను ఒప్పుకోవాలా వద్దా అనే ఆలోచిస్తూ వచ్చింది. కానీ తీరా ఆ వార్త తెలిసేసరికి మతి పోయినట్లయింది. అంతటి అనాకారికి కూడా తను నచ్చలేదంటే ఆశ్చర్యంగా అనిపించింది. తను అందగత్తెకాదు. తనలో ఆకర్షణ లేదు. తనకు తెలుసా విషయం. కానీ అతనికంటే తన రూపం అన్నివిధాలా మెరుగే! అతనే తనని కాదంటే అసలు తననిక చేసుకునేవారెవరయినా ఉంటారా?
    ఆ తరువాత మరో రెండు సంబంధాలు కూడా తన అనుమానాన్నే బలపరిచినయ్. వారికీతను నచ్చలేదట! అప్పటినుంచే తనకు వివాహమంటే కోరిక చచ్చిపోయింది. ఇలా అందరికీ తనని తను ప్రదర్శించుకొని "నన్ను పెళ్ళాడండహో" అని చాటింపు లెందుకు? తన రూపం నచ్చినవాడు దొరికినప్పుడే వివాహం అవుతుంది. లేదా వివాహం లేకుండా వుండిపోతుంది. ఇందులో పేద్ద మునిగిపోయిందేముందని? ముందు జయకు వివాహం చేసేస్తే సరి! ఇంకే గొడవా ఉండదు తనకి! జయకు వివాహం అవడం అంత కష్టమేమీ కాదు. కట్నం కూడా అడగకుండా ఆమెని చేసుకుంటారు ఎవరయినా. అంత అందంగా వుంటుంది! ఒకోసారి దాని అందం చూసి తనకే ఈర్ష్య కలుగుతుంటుంది. అసలు తామిద్దరూ అక్కా చెల్లెళ్ళంటే ఎవరూ నమ్మరు. నిజానికి తామిద్దరూ సొంత అక్కాచెల్లెళ్ళయితేగా! తనకు బహుశా తన తల్లి రూపం వచ్చి వుండాలి. తన తల్లి నల్లగా వుండేది. ముఖంలో కళ వుండేదికాదు. తనకు మరీ వివరంగా గుర్తులేదామె రూపం! తనకు ఆరేడేళ్ళ వయసు ఉండగా చనిపోయిందామె. అప్పటినుంచీ తన తల్లి పార్వతే! అయిదారేళ్ళక్రితం తండ్రి కూడా చనిపోయాక తల్లీ తండ్రీ కూడా ఆమే అయ్యింది.
    నిజంగా తను ఓ విధంగా అదృష్టవంతురాలే!
    సాధారణంగా మారుటి తల్లులు ఎన్నో బాధలు పెడతారని తను అనేక కథల్లో చదివింది. ఎంతోమంది చెప్పుకుంటుండగా వింది. కానీ అవన్నీ అభూతకల్పనలేమో అన్న అనుమానం కలిగింది పార్వతికి తన మీదున్న ప్రేమ చూస్తూంటే!
    జయనూ తననూ ఒకటిగానే పెంచిందామె. ఏ విషయంలోనూ విచక్షణ చూపలేదింతవరకూ!
    "ఇవాళ ఆ రచయిత అడ్రస్ తెలియజేయమని ఓ పత్రికకు ఉత్తరం రాశానమ్మా!" పార్వతితో అంది విజయ.
    "అలా తెలియజేస్తారా!" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "ఇస్తారని మా ఆఫీసులో రజనీ లేదూ_తను చెప్పింది!" అంది విజయ ఆనందంగా.
    జయ పార్క్ కి చేరుకుని నెమ్మదిగా నడువసాగింది. ఆమె కళ్ళు ఎవరికోసమో గాలిస్తున్నాయ్. అప్పటికే సంధ్య అలుముకుంటోంది. దాన్ని రాత్రిగా మార్చేయడానికి తంటాలు పడుతున్నాయి వీధి దీపాలు. ఉండుండి వెనక్కు తిరిగికూడా చూడసాగిందామె.
    "హలో..." ఎదురుగా వచ్చిన ఓ యువకుడు పలుకరించేసరికి ఆశగా, ఆనందంగా అతని మొఖంలోకి చూసిందామె.
    అతను తనూహించినట్లు కిషోర్ కాదు. ఎవడో తనని 'టీజ్' చేస్తున్నాడు.
    "ఇడియట్..." అతని మొఖంమీదే అని ముందుకి నడిచిందామె.
    "థాంక్యూ" నవ్వుతూ అంటూన్న అతని మాటలు వినబడినాయ్ ఆమెకి.
    మరికొద్ది దూరం నడిచేసరికి కిషోర్ ఆమెకెదురుగా వస్తూ కనిపించాడు.
    "సారీ! అయిదు నిమిషాలు లేటయింది!" నవ్వుతూ అన్నాడతను.
    "నేనూ ఇప్పుడే వచ్చాను." నవ్వుతూ అంది జయ.
    "పిక్చర్ కెళ్దామా?" అడిగాడతను.
    "మీ యిష్టం!"
    "ఆలస్యంగా ఇంటికెళ్తే ఏమీ పరవాలేదు కదా!"
    "ఓ! నేను మాజిక్ షోకెళ్తున్నానని చెప్పి వచ్చాను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS