Previous Page Next Page 
కళ్ళు పేజి 2


    అతని గుండె ఇంకోసారి దడదడలాడింది. ఒళ్ళంతా చిరు చెమటలు పట్టాయి.

 

    ఇంకోసారి డోరు ఎటువైపుందో ఊహించుకుంటూ సాద్యమైనంత తొందరగా అడుగులు వేశాడు.

 

    ఓ నిముషం తర్వాత డోర్ తగిలింది. ఆత్రంగా చేతితో తడిమాడు. రాడ్డు తగిలింది. ఒక్క విసురుతో తీసి డోర్ తీశాడు. తెరుచుకుంది.

 

    గదిలోకి వచ్చి "మందాకినీ" అని పిలిచాడు. జవాబు లేదు.

 

    బయట వర్షం పడుతోన్న చప్పుడు వినబడుతోంది. చీకట్లో ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ మంచం దగ్గరకు నడిచాడు.

 

    మంచం తడిమే చేతులకు తగిలింది. "మందాకిని" అంటూ మళ్ళీ పిలిచాడు.

 

    ఆమె మంచంమీద ఉన్న అలికిడి లేదు.

 

    ఎక్కడ్నుంచో చలిగాలి లోపలకు దూసుకు వచ్చినట్లయింది. తలుపులు తీసి వున్నాయా?

 

    ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. క్షణంపాటు ఆలోచిస్తూ స్థబ్దుగా అలాగే నిలబడ్డాడు.

 

    ఉన్నట్లుండి లైట్లు వెలిగాయి.

 

    మందాకిని బెడ్ మీద లేదు. బయటకు వెళ్ళే డోర్ తెరిచి వుంది. అటువైపునుంచే చలిగాలి లోపలకు వస్తోంది.

 

    అశ్వినీకుమార్ గబగబ అటు లేచి వెళ్ళాడు. గుమ్మం దాటగానే రిలీఫ్ ఫీలయినట్లయింది. మందాకిని మెట్ల దగ్గర ఒంపులు తిరుగుతూ సాగిన రెయిలింగ్ కి ఆనుకుని నిలబడి వుంది.

 

    అలికిడి విని అతనివైపు తిరిగి నవ్వింది.

 

    ఇందాకట్నుంచీ తాను పడ్డ భయమంతా ఒట్టి భ్రమేనా?

 

    "మందాకినీ! ఇక్కడ నిలబడ్డావేం?" అన్నాడు మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ.

 

    "లైట్లు పోయాయి. చీకట్లో గదిలో ఒక్కదాన్నీ... ఉండటానికి ఏమిటో అనిపించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాను!"

 

    "భయమెయ్యలేదా?"

 

    "దేనికి భయం?"

 

    ఇప్పుడు ఈ వెలుగులో... ఇందాకటి వాతావరణానికి ఇప్పటికి ఎంత తేడా! అతను తాను పడ్డ ఆందోళన, అపోహలను గురించి ప్రస్తావించదలుచుకోలేదు.

 

    "అశ్వనీ! ఇహ వెడతాను. క్లబ్ నుంచి డాడీ వచ్చే టైమయింది."

 

    "నేనూ వస్తాను నీతో తోడుగా."

 

    "ఎప్పుడూ అననివాడివి. ఈ వేళ... ఏమిటలా అంటున్నావు అశ్వనీ?"

 

    "అర్థరాత్రిపూట... ఆడపిల్లవి... ఒంటరిగా..."

 

    మందాకిని నవ్వింది. "కొత్తగా కొన్న డీలక్స్ మారుతీ కారుంది. చాకులా దూసుకుపోగల చేవ ఈ చేతుల్లో వుంది."

 

    "అయినా..."

 

    "వద్దు అశ్వనీ! మన మేరేజ్ డిసైడ్ కాకుండా ముందుగా డాడీ కళ్ళలో పడటం మంచిదికాదు."

 

    "ఈ విషయం ఆయనతో ఎప్పుడు ప్రస్తావిస్తావు మందాకినీ?"

 

    "డాడీ చాలా మూడ్స్ మనిషి. ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి."

 

    "కాని ఒక్కొక్క క్షణం జరుగుతూన్న కొద్దీ..."

 

    "ఈ ఆలస్యాన్ని భరించటం నాకూ దుర్భరంగానే ఉంది. అశ్వనీ, ఇహ బయల్దేరతాను.

 

    తర్వాత అయిదు నిమిషాల్లో ఆమె కారులో వుంది.


                                                          *  *  *


    వర్షమింకా జోరుగా కురుస్తూనే వుంది. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ వర్షాన్నీ, చీకటినీ చీల్చుకుంటూ మారుతీ డీలక్స్ కారు వేగంగా దూసుకుపోతోంది.

 

    మందాకిని మనసు చాలా ఆహ్లాదంగా వుంది. ఎప్పుడూ ఇంతే. అశ్వనీకుమార్ తో ఆ మధురక్షణాలు గడిపి వచ్చాక తన ఒంటినీ, మనసునూ అతనావహించి వున్నట్టు గిలిగింతలుగా, మధుర మధురంగా వుంటుంది.

 

    తాను చాలా ఈజీగోయింగ్ అనీ, జీవితాన్ని చాలా లైట్ గా తీసుకుంటుందనీ తనకు పరిచయమున్న చాలామంది నమ్మిక. కాని తనకు ఒకే ఒక పురుషుడితో గడపాలన్న తీవ్రమైన ఆకాక్ష వుందనీ, మహత్తరమైన ప్రేమను జుర్రుకోవాలని తనలోని అణువణువూ ఉరకలు వేస్తూ, పరవళ్ళు తొక్కుతూ వుంటుందని చాలామందికి తెలీదు.

 

    ఆలోచనలు అలలు అలలుగా సాగిపోతూంటే ఆమె పాదం యాక్సిలేటర్ ని ఇంకా ఇంకా నొక్కుతోంది.

 

    ఉన్నట్లుండి మందాకిని ఉలికిపడింది. వెనకనుండి మెడమీద ఏదో ప్రాకినట్లయింది.

 

    అప్రయత్నంగా ఆమె ఎడమచెయ్యి మెడమీదకి వెళ్ళి తడుముకుంది. ఏమీ తగల్లేదు. కారులో లైటు వేసి చూద్దామా అనుకుంది. కాని ఒట్టి అపోహేమోలే అని సరిపెట్టుకుని అప్రయత్నంగా వేగమింకా ఎక్కువచేసింది.

 

    మేడమీద ఆ స్పర్శ... ఎంత వద్దనుకున్నా వెంట తరుముతోంది. ఒళ్ళు గగుర్పొడుస్తోంది.

 

    ఆలోచనలు సాగుతూనే వున్నాయి. మళ్ళీ మెడమీద ఏదో ప్రాకినట్లయింది. ఈసారి చాలా కరుగ్గా వుంది స్పర్శ.

 

    తృళ్ళిపడి మళ్ళీ ఎడమచేతిని మెడమీదకి జరుపుకోబోయింది.

 

    "కదలకు" అంది వెనకనుంచి ఓ కర్కశమైన కంఠం. అప్పటికే రెండు చేతులు ఆమె మెడచుట్టూ ఆక్రమించుకుని వున్నాయి.

 

    మందాకినికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అప్రయత్నంగా కారు స్లో చెయ్యబోయింది.

 

    "కారాపటానికి ప్రయత్నిస్తే నీ మెడ క్షణంలో నలిగిపోతుంది. జాగ్రత్త" ఆమె కంఠం చుట్టూ అతని చేతులు బిగుసుకున్నాయి. మందాకినికి ఊపిరాడక బ్రాంకోస్ఫాసమ్ వచ్చి చిన్న దగ్గుతెరలా వచ్చింది. తన చేతుల్లోని బలం చూపించటానికే అతనలా చేస్తున్నాడని గ్రహించింది. అనుకోకుండా కాలు యాక్సిలేటర్ ని బలంగా నొక్కింది.

 

    ఆమె మెడమీద అతని చేతుల పట్టు కొద్దిగా సడలింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS