Previous Page Next Page 
మరీచిక పేజి 2


    "అదిగో మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డు!"

 

    రంగారావు పకపకా నవ్వాడు.

 

    "మీరు బయటికి వెళ్ళండి!" రుక్మిణి కసురుకుంది.

 

    రంగారావు బయటికి వెళ్ళిపోయాడు.

 

    "పూర్ డాడీ! నో! నో! పూర్ మమ్మీ! డాడీ నిజంగానే తనమాటకు జవదాటడు అనుకుంటూ వున్నది. ఆ వంటమనిషితో... హారిబుల్! డాడీ వ్యవహారం మమ్మీకి తెలియదు."

 

    "ఏమిటే అలా చూస్తావ్! జరీ పువ్వులు కుట్టిన మిల్కీవైట్ పట్టుచీర... మొన్న కొన్నది...కట్టుకో."

 

    "నిజంగానా మమ్మీ! ఓ బ్యూటిఫుల్!" అంటూ రుక్మిణి మెడచుట్టూ చేతులు వేసి వూగసాగింది.

 

    "అబ్బబ్బ! ఏమిటే నీగోల! నా తల రేగిపోతుంది. త్వరగా కానియ్!"

 

    శబరి ఉత్సాహంగా పట్టుచీర తీసింది. శబరి పట్టుచీరలు కట్టుకోవడం రుక్మిణికి ఇష్టం వుండదు. అందుకే శబరికి పట్టుచీరలంటే ఇష్టం!

 

    పట్టుచీరలు కట్టుకుంటే పేరంటాలులా వుంటావంటుంది తల్లి. అలా వుంటే తనుఎలా వుంటుందో చూసుకోవాలని శబరికి.

 

    "ఇప్పుడే బయలుదేరాలా మమ్మీ డిన్నర్ కు?"

 

    "ఎన్నిసార్లు చెప్పాలే! ముందు షాపింగుకు వెళ్దాం!"

 

    "ఎందుకు మమ్మీ?"

 

    "బట్టలు కొనాలి."

 

    "ఎవరికి?"

 

    "నీకూ, నాకూ!"

 

    "నాకెందుకు మమ్మీ రెండు బీరువాలనిండా బట్టలుంటేనూ? కావాలంటే నువ్వు కొనుక్కో!"

 

    "నువ్వు వాక్కుం డా ముందు తయారవుతావా లేదా?"

 

    శబరి తెల్లపట్టుచీర జరీపువ్వులు కుట్టింది కట్టుకొని, ముత్యాల నగలు పెట్టుకొన్నది.

 

    రుక్మిణీ ఓ క్షణం కూతురి ముస్తాబు పరిశీలించి బీరువా తెరిచి ముత్యాల గాజులు తీసి ఇచ్చింది.

 

    శబరి గాజులు వేసుకుంది. బ్రష్ తో గిరిజాల జుత్తు టచ్ చేసుకుంది.

 

    రుక్మిణి నడినెత్తిన ముడిచుట్టింది. ఫారెన్ టెక్నికలర్ షిఫాన్ చీర కట్టుకుంది. రవ్వల సెట్టు నగలు పెట్టుకుంది.

 

    పూర్ మమ్మే౧ పట్టుచీరలో పెద్దదిగా కన్పిస్తుందనే భయం. ఎప్పుడూ షిఫాన్స్ కడుతుంది.

 

    శబరి తల్లికేసి జాలిగా చూసింది.

 

    "ఇంకా కాలేదూ?" రంగారావు లోపలకు వచ్చాడు.

 

    "ఎలా వుందండీ ఈ చీర?"

 

    "బ్యూటిఫుల్!"

 

    "బోర్!"

 

    ఒక్కసారిగా భార్యభర్తలిద్దరూ శబరికేసి చూశారు.

 

    "లేకపోతే యేమిటి మమ్మీ? రోజూ బయలుదేరుతూ నువ్వు ప్రశ్న వేస్తావ్! డాడీ అదే జవాబిస్తాడు!"

 

    రుక్మిణి చిరుకోపంతో కూతురుకేసి చూసింది.

 

    రంగారావు ముసిముసిగా నవ్వుకున్నాడు.

 

    శబరికి మహాబద్ధకంగా వుంది. పట్టుచీర బరువుగా వుంది. నగలు మరీ బరువుగా వున్నాయి. మెత్తటి పాతచీర కట్టుకొని, కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని రాములమ్మనూ, నరసిమ్మనూ చూడాలని వుంది.

 

    కాని తల్లివెనకే యాంత్రికంగా బయలుదేరింది.

 

    డ్రైవర్ గబగబా వచ్చి కారుడోర్ తెరిచి పట్టుకున్నాడు.

 

    వీడొకడు! కీ ఇచ్చిన బొమ్మలా మమ్మీని చూడగానే వచ్చి డోర్ తెరుస్తాడు. యెప్పుడూ మమ్మీ ఎక్కేవైపే డోర్ తెరుస్తాడు. రొటీన్ కు భిన్నంగా ఒక్కరోజైనా మమ్మీవైపు డోర్ వదిలేసి డాడీవైపు డోర్ తెరవకూడదూ? అతనికి బోర్ గా వుండదూ? ఠంచన్ గా తను కారు దగ్గిరికి వచ్చేసరి డోర్ తెరిచి అతివినయంగా, ఒకే ఫోజులో రోజూ నిల్చునే డ్రైవర్ను చూస్తే మమ్మీకి మాత్రం బోర్ గా వుండదూ?

 

    కనీసం వెరైటీకోసమైనా మమ్మీకి తన వైపు డోర్ తనే తెరిచి కూర్చోవాలనిపించదూ?

 

    కారు ఆగగానే, డ్రైవర్ దిగి, కారుచుట్టూ తిరిగొచ్చి మళ్ళీ మమ్మీ కూర్చున్న వైపు డోరే తెరుస్తాడు. చూడటానికి తనకే బోరుగా వుంటే ఆ డ్రైవర్ కు మాత్రం బోర్ గా వుండదూ?

 

    కారు సాగింది.

 

    శబరి డ్రైవర్ సుబ్బయ్య పక్కన ముందు సీట్లో కూర్చుంది.

 

    తనెప్పుడూ ఈ సుబ్బయ్య పక్కనే కూర్చుంటుంది. మమ్మీ డాడీ వెనుక సీట్లో కూర్చుంటారు.

 

    అప్పుడప్పుడు మమ్మీగానీ, డాడీగానీ సుబ్బయ్య పక్కన కూర్చోకూడదూ?

 

    డ్రైవర్ కు మాత్రం బోర్ గదూ యెప్పుడూ స్టీరింగు ముందే, అదే పోజులో కూర్చోవాలంటే?

 

    కారు అబిడ్స్ బుల్ చంద్ బట్టల దుకాణం ముందు ఆగింది.

 

    సుబ్బయ్య దిగి, గిర్రున తిరిగొచ్చి అమ్మగారు కూర్చున్నవైపు డోర్ తెరిచి వినయంగా నిల్చున్నాడు. శబరికి ఆ దృశ్యం చూస్తుంటే నవ్వొచ్చింది.

 

    శబరి కారు దిగి పేవ్ మెంట్ మీద నిలబడిపోయింది.

 

    "డాడీ! డాడీ అటు చూడు. సింప్లీ థ్రిల్లింగ్!" దాదాపు గంతులు వేస్తున్నట్లే ఉత్సాహంతో ఊగిపోతూ అన్నది శబరి.

 

    అప్పటికే రుక్మిణి షాపులోకి వెళ్ళిపోయింది.

 

    రంగారావు నిల్చుని కూతురు చూస్తున్న వైపు దృష్టి సారించాడు.

 

    తెల్లగా, పొడవుగా వున్న నాలుగు మానవాకారాలు కన్పించాయి. నడుం వరకూ యెలాంటి ఆచ్చాదనా లేదు. మోకాళ్ళపైకి మడిచి కట్టిన కాషాయరంగు ధోవతులు, నున్నటి బోడిగుండ్లు, వెనక కొత్తిమీర కట్టలా వున్న పిలకలు, ఆ పిలకల చివర చిన్న ముళ్ళు, నుదుటిమీదా, గుండెల మీదా, చేతుల మీదా నామాలు. రెండు చేతులతో తాళాలు వేస్తూ, కొంచెంగా వంగి, "హరేరామ! హరేకృష్ణ!" అంటూ పాడుతూ నలుగురు వ్యక్తులు చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోయినట్లు నడుస్తున్నారు. వాళ్ళ పాదాల కేసి చూసింది శబరి. ఆ పాదాలు శరీరం కంటె తెల్లగా ఒకప్పుడు బూట్సుకు అలవాటుపడిన వాటిలా వున్నాయి. చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు.

 

    "ఏమిటలా అయ్యా కూతుళ్లు రోడ్డుమీదే నిలబడిపోయారు!" షాపు నుంచి బయటికి వచ్చి అన్నది రుక్మిణి చిరాగ్గా.

 

    "డాడీ, వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళలా వున్నారు గదూ?"

 

    "అమెరికన్స్!"

 

    "ఎందుకు అలా వేషాలు వేసుకున్నారు? మన దేవుడిమీద పాటలు పాడుతూ తిరుగుతున్నారేం?" వాళ్ళవైపు నుంచి కళ్ళు తిప్పకుండానే అన్నది శబరి.

 

    "పనిలేక! రండి! రండి!" రుక్మిణి దుకాణంలోకి వెళ్ళింది.

 

    "రామ్మా!" ఒక అడుగు ముందుకు వేశాడు రంగారావు.

 

    "ఉండు డాడీ!" వాళ్ళనుండి కళ్ళు తిప్పకుండానే అన్నది.

 

    "మీ మమ్మీ గొడవ చేస్తుంది పద!"

 

    "వాళ్ళెక్కడ వుంటారు డాడీ?"

 

    "ఇక్కడే ఎక్కడో వాళ్ళ మఠం వున్నదట!"

 

    "మనం అక్కడికి వెళదాం డాడీ!"

 

    రంగారావు ఆశ్చర్యంగా శబరి ముఖంలోకి చూశాడు.

 

    "మనం అక్కడి కెందుకమ్మా?"

 

    "చూడాలని వుంది. బలే తమాషాగా వున్నారు గదూ వాళ్ళు?" కళ్ళు తిప్పుతూ అన్నది శబరి.

 

    "రుక్మిణి ముందు చీరలు కుప్పలుగా పడిపోతున్నాయి. ఒక్కొక్కటే తీసి పక్కన పడేస్తూ వుంది. శబరి చూస్తూ నిల్చుంది. కాని ఆమె కళ్ళముందు "హరేకృష్ణ" భక్తులే కన్పిస్తున్నారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS