Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 2


    అతనికి శీలంపట్ల ఏమీ శ్రద్ధలేదు. చేతికి అందిన అనుభవాన్ని జార విడవటం అతనికి సుతరామూ యిష్టంలేదు. పైగా అతనిలో భోగలాలసతకు తక్కువేమీ లేదు. పైకి కనిపించని ధైర్యసాహసాలు చాలా వున్నాయి. సాధ్యమైనంత వరకూ యింట్లో బయటపడకుండా అతడు జీవితాన్ని ఖర్చు పెట్టసాగాడు.

 

    అతను బి.ఏ. ఫైనలియర్ చదువుతుండగా యింటర్మీడియట్ లో మనోరమ అని ఒక అమ్మాయి వుండేది.

 

    మనోరమ కాలేజీకంతటికీ అందగత్తె.

 

    ఆమె తండ్రి పెద్ద ఆఫీసరు. ఆమె రోజూ కాలేజీకి కారులో వచ్చేది. కారుదిగి హంసగమనంతో అలా లోపలకి వస్తుంటే విద్యార్థులంతా పిచ్చెక్కినట్లు ఆమెవంక చూసేవాళ్ళు. నిజంగా ఆమె రూపసుందరి. అలాంటి వాళ్ళు ఏ రెండుమూడేళ్ళకో ఓసారి కళాశాలల్లో తటస్థపడుతుంటారు. రామం దృష్టిలో ఆమె ఏనాడో పడింది. కాని ఆమె మిగతా పిల్లలమాదిరి కాదని అతను గ్రహించాడు. ఆమె అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తుంది. నవ్విస్తుంది. కవ్విస్తుంది. కాని ఆమెను అంతకంటే సమీపించటం కష్టం అని తెలుసుకున్నాడు. కాని ఆమె సౌందర్యం అతడ్ని ప్రలోభపెట్టడం మానలేదు.

 

    ఓసారి అతను తన ఉపన్యాసం ముగించి స్టేజీదిగి వస్తుంటే ఆమె ఎదురుగా వెళ్లి కంగ్రాచ్యులేట్ చేసింది.

 

    "థాంక్స్" అన్నాడతను. అని వదిలిపెట్టలేదు. క్రమంగా వాళ్ళ యింటికి వెళ్ళి మాట్లాడటంవరకూ నడిపాడు వ్యవహారం.

 

    ఆమెతండ్రికి వెయ్యిరూపాయల వరకూ జీతం వస్తుంది. ఆమెకి తల్లిలేదు. సవతి తల్లి వుంది. ఆయనకు మనోరమ ఒక్కతే కూతురు. సవతితల్లి ఈమెను బాగానే చూస్తున్నట్లు కనబడుతుంది.

 

    రామం వివిధ విషయాల్లో పరిచయం వున్నవాడు. దేన్నిగురించి అయినా అందంగా మాట్లాడగలడు. మనోరమ యింగ్లీషు, తెలుగూ చాలా మధురంగా మాట్లాడుతుంది.

 

    ఓసారి ఆమె సౌందర్యం భరించలేక, అతను పొరపాటున అన్నట్లు ఆమెప్రక్కన నిలబడి వుండగా మోచేత్తో పొడిచాడు.

 

    మనోరమ వికసించిన మొహంతో అతనివంక చూసింది. "మీరట్లా చేస్తే చాలా బావుందండీ. మళ్లీ అనండి అట్లా" అన్నది.

 

    అతను "ఎట్లా" అన్నాడు.

 

    "ఇప్పుడు అన్నారే అట్లా" అన్నది ఆమె.

 

    అతనామెను మళ్ళీ మోచేత్తో పొడిచాడు.

 

    "మళ్లీ అనండి" అన్నదామె.

 

    అతను మళ్ళీ అన్నాడు.

 

    "మీరు బాగా అంటారండీ" అన్నదామె.

 

    ఆమె వెటకారంగా అన్నదో, అనుభూతితో అన్నదో అతనికి అర్థంకాలేదు. ఎంత చొరవ వున్నా కాస్తా యిబ్బందిగానే ఫీలయ్యాడు.

 

    "మీరెప్పుడూ నన్ను వెక్కిరించరేం?" అనడిగింది మరోసారి. అతను నాలిక బయటపెట్టి వెక్కిరించాడు.

 

    "అబ్బ! ఎంత అందంగా వుంది మీరు వెక్కిరిస్తోంటే" అని అతనిచేత అట్లా మళ్ళా మళ్ళా చేయించుకుంది.

 

    అట్లా వాళ్ళిద్దరిమధ్య స్నేహం అధికం కాసాగింది. ఆమె ఏం మాట్లాడినా అందులో పసితనమేగాని తృష్ణ ఏమీ గోచరించేది కాదు. ఒక్కోసారి యింత అమాయకురాలు ప్రపంచంలో వుండదేమో అనిపించేది. పుస్తకాల్లో పాత్రలా అందంగా, సున్నితంగా, ఆలోచనాత్మకంగా జీవించేది ఆమె.

 

    ఎన్నడూ ఎరగని రామం ఆమెను ఆరాధించనారంభించాడు. ఆమె కనిపించకపోతే బాధగా, వేదనగా వుండేది.

 

    ఓ సాయంత్రం ఆమెతో మాట్లాడుతూ వుండగా ఎందుకో అతని ఎడమకన్ను అదిరింది.

 

    "భలే కన్నుకొట్టారే" అన్నదామె విస్మయంగా.

 

    అతను అప్రతిభుడయ్యాడు. "లేదు" అందామనుకొన్నాడు. కాని యింతలోనే మనోరమ "మళ్ళీ కొట్టండి కన్ను" అంది ఉత్సాహంగా.

 

    అతను అట్లా చేశాడు.

 

    మళ్ళీమళ్ళీ అడిగి ఆమె అతనితో అట్లా చేయించింది.

 

    ఉన్నట్లుండి అతను "మీరు నాకు కన్నుకొట్టండి" అన్నాడు.

 

    ఆమె కొట్టింది.

 

    "మళ్ళీ"

 

    ఇట్లా ఇదరూ ఒకరికెదురుగా ఒకరు కూర్చుని చాలాసేపు కన్ను కొట్టుకున్నారు. ఆ రాత్రి సంపుల్లమానమయిన మనస్సుతో యింటికి వస్తూ "మనోరమ ఏంచేసినా అసహ్యం ఎరుగనివ్యక్తి. ఈ కాలేజిలోకెల్లా నన్ను అదృష్టవంతుడ్ని చేసిన అపురూపసుందరి" అనుకున్నాడు ఉల్లాసంగా.

 

    ఇంతలో అతని పరీక్షలు దగ్గరకు వచ్చాయి. పరీక్ష తప్పితే తన పరిస్థితి శోచనీయంగా వుంటుందని అతనికి తెలుసు. అందుకని కష్టపడి చదవసాగాడు. కాని ఈ చదువులోకూడా మనోరమ అతని దృష్టిపథంనుండి తొలగిపోలేదు. ఆ ద్వంద్వమైన మనసుతో సతమతమౌతూ ఎట్లాగో పరీక్షలకు చదివాడు.

 

    పరీక్షలు ముగిశాక మనోరమ అతన్ని కలుసుకుంది.

 

    "బాగా రాశారా?" అని అడిగింది.

 

    "తప్పకుండా ప్యాస్ అవుతాను" అన్నాడు రామం.

 

    "అదే నా కోరిక" అంది మనోరమ.

 

    అతను ప్యాస్ అయ్యాడు. కాని చెప్పుకోతగ్గ మార్కులు రాలేదు. పై చదువులు చదవాలని పెద్ద ఇచ్చలేదు. కాని తండ్రి ఎలానూ అంగీకరించడన్న భయంతో ఎం.ఏ. సీటుకు అప్లికేషన్ పెట్టాడు అయిదారు యూనివర్శిటీలకు. అతని నుదుట అదృష్టరేఖ లేదు. సీటు రాలేదు.

 

    "ఏం చేస్తారు?" అనడిగింది మనోరమ.

 

    అతనికే తెలియటల్లేదు. ఆరువందల రూపాయల ఉద్యోగం చేసి రిటైరయిన మనిషి తండ్రి. ఈ బి.ఏ. క్వాలిఫికేషన్ తో తాను ఆయన అంతస్తుకు ఏమి ఎదుగుతాడు? తండ్రిముఖం యెదుట పడటానికి సిగ్గుగా వుండేది. ఆయన కూడా తన విషయం ఏమీ పట్టించుకోనట్లు ముభావంగా ఊరుకున్నాడు. క్రమంగా రోజులు గడిసినకొద్దీ పరాయి ఇంట్లో వుంటున్నట్లు అనుభూతి కలగసాగింది. తిండి తింటూంటే దయాభిక్షలా వుండేది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS