Previous Page Next Page 
ప్లే పేజి 2


    ఐ హావ్ సమ్ గెస్ట్స్ ఎట్ హోమ్... ఐ వాంట్ బీ ఏబుల్ టూ కమ్ టుమారో సర్..." జంకుతూనే అన్నాడా యువకుడు.
    
    "ఏదైనా ఇంపార్టెంట్ మేటరా? అయినా నేను ఆల్ రెడీ ఒక కుంభకోణం మీద వర్క్ చేస్తున్నాను. అది పూర్తి కాకుండానే మరొకటంటే కష్టం...." నవ్వుతూ అన్నాడు జగన్నాయకులు.
    
    "ఇంకొకటి కాదు సార్ - ప్రస్తుతం మీరు ఇన్ వెస్టి గేట్ చేస్తున్న విషయమే. చాలా ప్రమాదకరమైందని మా డెస్క్ లో చెప్పుకోవడం విని హడావిడిగా వచ్చాను. శతృవులు ఆల్ రెడీ రంగంలోకి దిగిపోయారని చూచాయగా తెలిసింది. ఆ విషయమై మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పటానికే వచ్చాను. ఒక్క పదినిమిషాలు మీరు టైమిస్తే-నాకు తెలిసిన వివరాలన్నీ మీకు చెప్పేస్తాను... ఆ యువకుడిలోని ఆందోళన అంతకంతకు పెరుగుతూ పోతోంది.
    
    "నా ముఫ్ఫై ఎనిమిదేళ్ళ సర్వీస్ లో కొన్నివేల కుంభకోణాల్ని వెలికి తీసాను, అప్పుడు లేని ప్రమాదం-ఇప్పుడు ముంచుకొచ్చినా ఏం చేయగలుగుతుంది...? డోంట్ వర్రీ మై బాయ్..." అన్నాడు జగన్నాయకులు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
    
    ఆయనకెలా చెప్పాలో అర్ధంకాలేదు ఆ యువకుడికి.
    
    "మీ చుట్టూ మృత్యువు వల పన్నబడిందని- ఏ క్షణంలోనైనా మిమ్మల్ని మట్టు బెట్టే ప్రమాదం పొంచి ఉందని-రిలయబుల్ సోర్స్ ద్వారా తెల్సుకుని వచ్చాను సార్.... ప్లీజ్ సార్... కొంచెం జాగ్రత్తగా వుండండి. కొన్ని వందల కోట్లు ఖరీదుచేసే ఒక విలువైన లాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, అనూహ్యంగా మీ చేతికి చిక్కాయని - వాటిని చేజిక్కించుకొనేందుకు మీ శతృవులు ఎన్నో పన్నాగాలు పన్నారని-అయినా మీరు వాటిని వాళ్ళకు అందజేయలేదనీ కోపంతో మిమ్మల్ని మట్టుబెట్టాలని చూస్తున్నారట.
    
    దీని వెనుక పెద్ద హస్తాలే ఉన్నాయని ప్రెస్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు సార్.... ప్లీజ్ సార్..." టెన్ మినిట్స్ ఇవ్వండి చాలు- లేదా ఐదు నిమిషాలైనా..." ఆ యువకుడు ప్రాధేయపడ్డాడు తిరిగి.
    
    జగన్నాయకులు ఆ యువకుడికేసి చూసి నవ్వుతూ - "డోంట్ వర్రీ... సాక్షాత్తు మృత్యువే వచ్చి నా ఎదుట నిలిచి ఆ డాక్యుమెంట్సు ఇవ్వమన్నా ఇవ్వను. అది వెలుగుచూసి తీరాల్సిందే-రేపు కలుద్దాం. ఓకేనా? బై..." అంటూ ఆ యువకుడి భుజాన్ని నిమిరి లోపలకు నడిచాడు జగన్నాయకులు.
    
    బార్ లోకి వెళ్ళిన తరువాత జగన్నాయకులు వైల్డ్ గా ప్రవర్తిస్తాడని- ఇరిటేట్ అయిపోతాడని, ఆ యువకుడికి ముందుగానే తేల్చి ఉండటంతో- నిస్పృహగా తలని దించి వెను తిరిగాడు.    

    కానప్పటికే జగన్నాయకులు, ఆ డాక్యుమెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికొచ్చినట్లు ఆ యువకుడికి తెలీదు.
    
                                                      *    *    *    *    *
    
    చలికాలం కావడం వల్ల, ప్రెస్ క్లబ్ బార్ సందడిగా ఉంది.
    
    లోనికి అడుగు పెట్టిన జగన్నాయకులు, తలెత్తి, నాలుగు వేపులా చూసాడు. కొంతమంది గౌరవంగా, కొంతమంది వినయంగా, మరికొంత మంది అభిమానంగా విష్ చేసారాయన్ని.
    
    అందర్నీ చిరునవ్వుతోనే, విష్ చేసి, దూరంగా టీ.వి. పక్కన, ఖాళీగా ఉన్న తన టేబుల్ వేపు నడిచాడాయన.
    
    జగన్నాయకులు రెగ్యులర్ గా కూర్చునే సీటు అది.
    
    సాయంత్రం ఆరు గంటల తర్వాత, ఆ సీట్లో ఎవరూ కూర్చోరు. దానిక్కారణం, ఫోర్త్ ఎస్టేట్ లోనూ, ప్రెస్ క్లబ్ లోకి రావడం, తొమ్మిదిన్నర, పదిగంటల మధ్య వెళ్ళిపోవటం అందరికీ తెల్సిన విషయమే!
    
    టేబుల్ మీదున్న యాష్ ట్రేను ముందుకులాగి, చేతిలోని సిగరెట్ బట్ ను అందులో పడేసి, గ్లాసులోని నీళ్ళను గడగడా తాగేసి, గ్లాసుకు యధాస్థానంలో పెట్టి, మరో సిగరెట్ ను వెలిగించుకో బోతుండగా-
    
    అలవాటుగా బేరర్ కుడిచేత్తో డ్రింక్ గ్లాస్, ఎడంచేత్తో చిప్స్ ప్లేట్ తో వచ్చాడు.
    
    "ఓల్డ్ మాంక్ రమ్ అయిపోయింది సార్.... హెర్క్యులస్ తెచ్చాను" సరంజామాను టేబుల్ మీద పెడుతూ అన్నాడు బేరర్ వినయంగా.
    
    "వేన్నీళ్ళు తెచ్చావా...." అడిగాడు జగన్నాయకులు.
    
    "తెస్తాను సర్..." గబగబా కిచెన్ వేపు పరుగెత్తి అంతే వేగంతో మగ్ నిండా వేన్నీళ్ళు తెచ్చి పెట్టాడు.
    
    జగన్నాయకులు, రమ్ ని, వేన్నీళ్ళతో తీసుకుంటాడు. అది ఆయన అలవాటు.
    
    డ్రింక్ లో వేన్నీళ్ళు కలుపుకుని, డ్రింక్ ని సగం వరకూ తాగి, గ్లాసుని టేబిల్ మీద పెట్టాడు.
    
    ప్రెస్ క్లబ్ సందడిగా ఉంది. రకరకాల వ్యక్తులు - రకరకాల సంభాషణలు.
    
    ఒక పక్క టీ.వీ, హై వాయస్-
    
    పెగ్ తర్వాత పెగ్ బేరర్ తెస్తూనే ఉన్నాడు.
    
    సిగరెట్ తర్వాత సిగరెట్ వెలుగుతూనే ఉంది.
    
    మిగతా ప్రపంచంతో, సంబంధం లేకుండా, జగన్నాయకులు తాగుతూనే ఉన్నాడు. సరిగ్గా అరవై నిమిషాలు గడిచాయి.
    
    ఖాళీ సిగరెట్ ప్యాకెట్ ను, పక్కన పడేసి బేరర్ తో కొత్త సిగరెట్ ప్యాకెట్ ను తెప్పించుకున్నాడు.
    
    సిగరెట్ ప్యాకెట్ ను, ఓపెన్ చేస్తూ నాలుగు వేపులా చూసాడు. నెమ్మది, నెమ్మదిగా జనం కదుల్తున్నారు. పది గంటలు దాటితేనే తప్ప, బార్ వదిలి పెట్టని జనం, ముందుగానే టేబిళ్ళ నుంచి కదలడం ఆశ్చర్యంగా ఉంది జగన్నాయకులుకి.
    
    అప్పటికే మూడు పెగ్గులు, ఫినిష్ చేసాడాయన - అయినా చలిని తట్టుకోలేక పోతున్నాడు.
    
    బేరర్ మరో పెగ్ తెచ్చాడు - మరో అరగంట గడిచింది.
    
    రెండు టేబిల్స్  తప్ప, మిగతా టేబుల్స్ ఖాళీ అయిపోయాయి సందడి తగ్గుముఖం పట్టింది.
    
    ఆ రెండు టేబిల్స్ ముందున్న సినిమా జర్నలిస్టులు, ఆరోజు షూటింగ్ కబుర్లను చెప్పుకుని, జోక్సు వేసుకుంటున్నారు.
    
    "ఆర్నెల్లు స్టోరీ మీద కూర్చుని, మా హీరోకోసం, అద్భుతమైన లైన్ తయారు చేసాం - అని చెప్పాడా డైరట్రు... రెండు షెడ్యూళ్ళు పూర్తయ్యేసరికి, ఆ కధ నాదని, ఆ సీన్లు కూడా నావని ఓ మళయాళం డైరట్రు కేసెట్టాడు.....తీరా చూస్తే, ఆ స్టోరీ, ఈ స్టోరీ, ఆ లైనూ, ఈ లైనూ ఒకటేనట.
    
    నాకీ లైను, నిద్దర్లో ప్లాష్ లా వచ్చిందని, ఆ మళయాళం సినిమా గురించి, నాకస్సలు తెలీదని.... ప్రెస్ మీట్లో ఏడ్చి మరీ చెప్పాడు ఆ డైరట్రు..."
    
    "ఆ డైరెట్రు...ప్రతి దానికీ ఏడ్చేస్తాడు....అదేంగోలో..." రెండో జర్నలిస్టు నవ్వుతూ అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS