Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 2


    "హిపోక్రసీ! సూరి పెదాలు తడబడుతున్నాయి. "కాదనకు సుధీర్! శౌరిని కాకాపడుతూ బ్రతకడం అలవాటైన నువ్వు ఇప్పుడు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నది ప్రబంధని కాదు, ఓ ముఖ్యమంత్రి కూతుర్ని."
    
    అదృశ్యమైపోయాడు సుధీర్.
    
    ప్రబంధ సమీపంలో నిలబడ్డ యూనివర్శిటీ విద్యార్ధినులంతా అవాక్కయి చూస్తున్నారు ప్రబంధని కాదు, సూరిని.
    
    సహజంగా మాటకారి అయిన సూరి ఎంత పొగరున్న వ్యక్తో వాళ్ళకి తెలుసు. తరచుగా తాగడం, ఇష్టంలేని సన్నివేశాల్లో తల దూర్చి ఎదుటివాళ్ళతో కయ్యానికి దిగడం అతని హాబీ.
    
    అలా అని అతడి ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ లోపించిందని కాదు. అసలు లాజిక్ ను దాటి మాట్లాడడు. కాకపోతే తన పాయింటును ఒప్పించాలనే మొండితనం ఎక్కువ.
    
    ఎంత మొండివాడూ అంటే దేనికీ వెరవని వ్యక్తి. ఇష్టంలేకపోయినా అతన్ని శౌరి స్నేహితుడుగా అంగీకరించటానికి కారణం కూడా అదే.
    
    నిక్కచ్చిగా, ఖచ్చితంగా నలుగురిలోనూ నిలదీయగల సూరిని తన కూటమిలోనే వుంచుకోవడం శౌరి రాజకీయ పరిజ్ఞానంలో ఓ భాగం.
    
    "ఆగండి మిస్ ప్రబంధా!"
    
    వెళ్ళబోయిన ప్రబంధ వెనక్కి తిరిగి చూసింది.
    
    "మాట్లాడుతుండగా వెళ్ళడం సభ్యత కాదు."
    
    "నాకు మీరు సభ్యత నేర్పాల్సిన ఆగత్యం లేదు."
    
    "అది నేర్పితే రావటానికి జనరల్ నాలెడ్జి కాదు. జీన్స్ లో ఉండాలి" క్షణం ఆగాడు. "జీన్స్ అంటే మీరిప్పుడు వేసుకున్న జీన్స్ కాదు. జన్యు కణాలలో అని నా భావం."
    
    "మిష్టర్ సూరీ" ప్రబంధ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "కంట్రోల్ యువర్ టంగ్."
    
    ప్రసన్నంగా చూశాడు సూరి. "మేడమ్ క్యూరీకన్నా మీరు గొప్ప వ్యక్తి అనిపించుకోవాలీ అంటే మీకు క్యూరీ గురించి చాలా తెలియాలి. ఆవిడ చాలా సరళస్వభావం స్త్రీ మిస్ ప్రబంధా! ఎంత సున్నితమైన మనస్తత్వం గలదీ అంటే, మొదటి ప్రపంచయుద్దంలో గాయపడ్డ మనుషుల్ని చూసి జాలిపడింది. ఒక శాస్త్రజ్ఞురాలిగానే కాక మనిషిగా మానవతావాదంతో వారికీ చాలా సాయపడింది. బహుశా ఈ విషయం మీరు చదివిన జి.కె.బుక్స్ లో ఉన్నట్టులేదు. అదిగో అలా ఉడుక్కోకూడదు."
    
    ప్రబంధలో అహంకారపు తెర తొలగింది యిక్కడే. "క్యూరీ గురించి మీ కన్నా నాకే ఎక్కువ తెలుసు."
    
    "తెలిస్తే..." మృదువుగానే అన్నాడు- "ఆఫ్ట్రాల్ ఓ జి.కె. టెస్ట్ లో గెలుపు సాధించిన మీరు, నోబుల్ బహుమతి సాధించినంత మత్తుతో ఇలా ప్రవర్తించే వారు కాదు. ఎస్ మిస్ ప్రబంధా! స్టేట్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ కండక్ట్ చేసిన జి.కె.టెస్ట్ ఏ మనిషి మేధకీ గీటురాయి కాదు."
    
    "యూ సీ మిష్టర్ సూరీ!" ప్రబంధ స్వాతిశయం గురించి సూరికూడా తక్కువగా అంచనా వేశాడు. "పోలెండ్ రాజధాని వార్సాలో పుట్టిన క్యూరీ నాలాగే తన పదహారవ యేట హైస్కూల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసింది."
    
    "చాలామంది పూర్తిచేస్తారు. కానీ ఆమె ఆ ఎగ్జామ్ లో గోల్డ్ మెడల్ సాధించింది."    

    ప్రబంధ వినే స్థితిలో లేదు. "వార్సా యూనివర్శిటీలో ఆ రోజుల్లో అమ్మాయిలకి అడ్మిషన్ దొరక్కపోవడంతో పారిస్ సే ఖాన్ యూనివర్శిటీలో బి ఎస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించింది."    

    "ఇప్పుడు మీరు పీజీలో అలాంటి గోల్డ్ మెడల్ సాధిస్తానంటారు."
    
    "ఎస్! సాధించి తీరుతాను."
    
    "అసాధ్యంకాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కూతురు కాబట్టి..."
    
    "అంటే...." రోషంతో ఆమె రొప్పుతూంది. "నా ఐక్యూ టెస్ట్ విజయం కూడా..."
    
    "అలాగే సాధించారు అనను కాని, అలా సాధించడం కష్టం కాదు అంటున్నాను."
    
    "బుల్ షిట్" ప్రబంధలో ఉక్రోషం తారాస్థాయిని చేరుకుంది. "ఐసే ఇట్సే బుల్ షిట్."
    
    అర నిముషంపాటు రెప్పలార్చకుండా చూస్తూ వుండిపోయాడు సూరి. మారాం చేస్తున్న పసిపిల్లలా అనిపించింది తప్ప అతనికి కోపం రావడంలేదు. "మిస్ ప్రబంధా! మేధని అభినందించడానికి నాకు అభ్యంతరంలేదు. కానీ ఎదగాల్సిన మీలాంటి వ్యక్తి ఎదుటివాళ్ళ స్టేట్ మెంట్సుని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. మేధ అంటే అది. మీకు కాకా పట్టాలని మిమ్మల్ని మేడమ్ క్యూరీతో పోలిస్తే మీలో నాలాంటివాడు చూడాలనుకునేది అణకువ తప్ప అహంకారం కాదు."
    
    "మధ్యలో మీకేమిటి దుగ్ధ? క్యూరీ ఇందులో నాకన్నా గొప్పది?"
    
    "చాలా రాంగ్ ట్రాక్ లో ఆలోచిస్తున్నారు ప్రబంధా!" చేతిలోని గ్లాసుని ఖాళీచేసి పక్కనపెట్టాడు. "యూ సీ మిస్ ప్రబంధా! మోడరన్ ఫిజిక్స్ పురోభివృద్దికి కారణమైన వ్యక్తి మాత్రమే కాదు మేడమ్ క్యూరీ. భర్త పీరెక్యూరీతోబాటు దశాబ్దాల తరబడి సైన్స్ లో కృషి చేసిన స్త్రీ ఆమె తన ఆలోచనాసరళిని తన కూతురు ఐరేన్ క్యూరీలో సైతం నింపి అటు అల్లుడు ఫ్రెడరిక్ కూడా శాస్త్రజ్ఞుడుగా నోబుల్ బహుమతుల్ని సాధించేట్టు ప్రోత్సహించిన వ్యక్తి ఆమె. రెండు తఃరాల కృషితో అయిదు నోబుల్ బహుమతుల్ని సాధించిన ఒకే ఒక కుటుంబంగా ప్రశస్తి పొందటానికి కారణమైన క్యూరీతో మీకు పోలికెక్కడ? ఏ వ్యక్తి పురోగతినైనా నేను అంచనావేయగల సమర్దుడిని అనడంలేదు. అలా అంచనావేయగల శక్తి నాకు లేదు. కానీ అనన్య సామాన్యమయిన కృషి, దీక్షలకి ప్రతి రూపమై, ఇప్పటి శాస్త్ర పురోభివృద్దికి మూలమయిన రేడియం ఉత్పత్తికి కారణమైన క్యూరీని తక్కువగా అంచనా వేయటం న్యాయం కాదంటున్నాను. నిరంతర తపస్సులా తన లక్ష్యాన్ని కొనసాగించి, రేడియో ఏక్టివిటీ పరిశోధనలో ఎన్నో వివరాల్ని సేకరించి చివరికి అణు ధార్మికతకు గురై బ్లడ్ క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయిన మేడమ్ క్యూరీ త్యాగనిరతని మీ అహంతో...."
    
    "స్టాపిట్!" అరిచింది ప్రబంధ.
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS