Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 2


    "ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో సూటిగా చెప్పుతల్లీ! అర్ధం కావటంలేదు." తెచ్చి పెట్టుకున్నట్లున్న మాలతి విసుగుదల చూసి భానుమతి కొంచెంగా నవ్వింది.

    "చెప్పాలంటే చాలావుంది. ప్రస్తుతం సందర్భానికి అన్వయించుకున్నంత  వరకూ అమ్మమ్మల మాడిలాంటిదానికి మనం స్వస్తి చెప్పాలని."

    మాలతికి వాదం పొడిగించాలని లేదు. ఆమెకు జీవితం సాఫీగా నిండుగా నిర్మలంగా కనిపిస్తుంది. పొడిచినట్లు, జీవితపు లోతుల్లోకి వెళ్లిపోయినట్లు, అగాధాల అంచులను తాకుతున్నట్లు మాట్లాడటం ఆమెకి భయం.

    బస్సు గమ్యం చేరేటంతవరకూ ఆమె మౌనంగానే కూర్చుంది.

    ఆఫీసుకు చేరేసరికి పదిన్నర దాటిపోయింది. లోపలకు అడుగు పెడుతూంటే మాలతికి శరీరం చెమటలు పట్టినట్టుగా అయి, గుండె గబగబ కొట్టుకుంటోంది.చిన్నప్పటినుంచీ ఆమె దారిద్ర్యాన్ని రుచి చూస్తునేవుంది.టైపూ, షార్టుహ్యాండు నేర్చుకున్నాక అష్టకష్టాలు పడితేనేగానీ ఈ ఉద్యోగం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వెనక్కి వెళ్ళకూడదు. ముందుకే జరగాలంటే ఈ ఉద్యోగం నిలబెట్టుకుని తీరాలి.

    ఓసారి భానుమతి ముఖంలోకి  చూసింది. ఆమెలో ఆ భయం కనబడుతున్నట్లు లేదు. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అన్నభావం కొట్టుకువచ్చినట్లు కనబడుతోంది. బస్ స్టాప్  నుంచి ఆఫీసుకు ఫర్లాంగు దూరానికి  తక్కువలేదు. ఎండలో నడచిరావటంవల్ల ఎర్రబడిన ఆమె ముఖం, దాని మీద అలుముకున్న స్వేదబిందువులు గబ గబ  నడచిరావటం వల్ల వచ్చిన చిన్న వగర్పు- భానుమతి మరింత అందంగా కొత్తగా శోభాయమానంగా కనబడ్డది.

    ఆఫీసులో అందరూ అప్పటికే వచ్చేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చుని వున్నారు. భానుమతి, మాలతికూడా వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. మేనేజర్ రూమ్ వంక భయం భయంగా చూసి మాలతి టైపుమిషన్ ప్రక్కనున్న ఫైళ్ళ మీద చెయ్యి వేసింది.

    అయిదు నిముషాలన్నా గడచివుండదు. ప్యూన్ వచ్చి "మేనేజరుగారు రమ్మంటున్నారు" అన్నాడు.

    ఇద్దరిలో ఎవరినైందీ తెలియక తటస్థంగా అయినట్టు ఇద్దరూ ఉండిపోయారు.

    "మిమ్మల్నేనమ్మా" అన్నాడు ప్యూన్ మాలతివంక చూస్తూ.

    ఎవరయితే ప్రతిదాన్నీ చూసి ఎక్కువ ఉలిక్కి ఉలిక్కిపడుతూ వుంటారో, వాళ్ళమీదనే సంఘటనలు విరుచుకు పడుతూవుంటాయి. మాలతి ముఖం వెలాతెలా పోయినట్లు కాగా, భానుమతికేసి జాలిగా చూసింది. భానుమతి నవ్వి "ఫర్వాలేదు వెళ్ళిరమ్మ"న్నట్లు చూసింది. మాలతి విధిలేక లేచి తడబడుతున్న అడుగులతో మేనేజరు గదివైపు నడిచి వెళ్ళింది.

    భారీ ఎత్తున నిర్వహించబడుతున్న ట్రాన్స్ పోర్టు కంపెనీ అది. ఆ కంపెనీ యజమానులు మార్వాడీలు. దేశమంతటా ఆ కంపెనీకి బ్రాంచి ఆఫీసులున్నాయి. వ్యాప్తిలోను, అంతస్థుల్లోనూ చాలా మంచి పేరు తెచ్చుకున్న కంపెనీ. కొన్ని వందల లారీలు, వ్యాన్ లు ఆ కంపెనీ ఆధిపత్యంలో పని చేస్తున్నాయి. హైదరాబాద్  ఆఫీసుకు మేనేజరు చంద్రశేఖర్.

    మాలతి లోపలికు వెళ్ళి తప్పుచేసినట్లు తలవంచుకుని నిలబడింది. ఆమె సున్నితమైన చేతివ్రేళ్ళు ముందు వున్న కుర్చీ పైభాగాని కానుకుని మెల్లిగా వణుకుతున్నాయి.

    మేనేజరు చిన్నవాడే. వయసు ఇరవై అయిదు. ఇరవై ఆరేళ్లుంటాయి. పొడుగాటి విగ్రహమని కూర్చుని వున్నా తెలుస్తోంది. మంచి తెలుపు ముఖం క్రమశిక్షణ వల్ల ఏర్పడిన స్వచ్చత వుంది. క్రాఫ్ అందంగా వంకీలు తిరిగివున్నా బుద్ధిమంతుడైన బాలుడు అణచి దువ్వుకున్నట్లు దువ్వుకుని ఆ వంకీలను నిర్దాక్షిణ్యంగా అణిచేశాడు. విశాలమైన కళ్ళలో చురుకుదనంతో పాటు ప్రశాంతత కూడా నిండివుంది.

    "కూర్చోండి" అన్న కంఠం శాంతంగా వినిపించేసరికి మాలతి విస్మయంగా తల ఎత్తి చూసింది.

    అతను కోపంగా లేడు, చికాకుగానూ లేడు. మామూలుగా ఎప్పటిలాగా ఏమీ జరగనట్లే వున్నాడు.

    "మీకోసమే ఎదురుచూస్తున్నాను. అర్జంటుగా టైప్ చెయ్యాల్సిన  ఉత్తరాలు వున్నాయి."

    పిడుగులు పడలేదు. మాలతి రక్తంలోకి ఒక్కసారిగా జీవం వచ్చినట్లయి, ఆగిపోబోతూ మళ్లీ సర్రున  ప్రవహించినట్లయింది.

    "ఉండండి, నోట్ బుక్ తీసుకొస్తాను" అంటూ గబగబ తలుపు తీసుకుని తన సీటుదగ్గరకు వెళ్ళి క్షణంలో సిద్ధమై బుద్ధిమంతురాలిలాగా అతనికెదురుగా కూర్చుంది.

    అతను చెప్పుకుపోతున్నాడు. ఆమె షార్టు హ్యాండులో నోటుచేసుకుంటోంది. ఐదారు ఉత్తరాలదాకా డిక్టేటు చేశారు. ఈ మధ్యలో ఆమె తలఎత్తి అతని వంక చూడలేదు. అతని పెదవులు కదుల్తున్నాయిగానీ గోడవైపునుండి చూపు మరల్చలేదు.

    డిక్టేట్ చేయటం పూర్తయింది.

    అప్పుడు మాత్రం తల ఎత్తి "ఇహా వెళ్ళవచ్చునా?" అన్నట్లు చూసింది.

    "త్వరగా పూర్తిచేసి పంపించండి..... అవునూ... మీరుండేది ఆఫీసుకు బాగా దూరమా?"

    మాలతి ఉలిక్కిపడింది. "కోఠీలో ఉంటున్నామండీ" అంది నెమ్మదిగా.

    "ఉంటున్నామంటే?"

    "నేనూ, భానుమతి."

    "ఇద్దరూ కలిసే వున్నారన్నమాట. ఆల్ రైట్. వెళ్ళి పని చూసుకోండి"అతను తల వంచుకుని ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు.

    "హమ్మయ్య ! అనుకుంటూ మాలతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అక్కడ్నుంచి వచ్చేసింది.

    మాలతి ఆ ఉద్యోగంలో చేరి మూడ్నేల్లయింది . అప్పటికే అక్కడ భానుమతి వుంది. ఆర్నెల్లయింది అందులోకి వచ్చి. ఆమె టైపిస్టు కాదు, క్లర్క్. మాలతిని హైడ్రాబాద్ కొత్త. ఆమెలో కొత్తదనం, గగుర్పాటు కనిపెట్టి భానుమతి"ఇన్నాళ్ళూ నేను ఓ గర్ల్స్ హాస్టల్" లో వుంటున్నాను. అక్కడ- అంతమంది అమ్మాయిల మధ్య వుండటం నాకూ ఇబ్బందిగా వుంది. ఒక రూమ్ చూద్దాం వుండండి, ఇద్దరం కలసివుందాం"అంది.

    "అమ్మాయిలతో కలసి వుండటం ఇబ్బందన్నారు. నేనూ అమ్మాయినే కదా?"అంది బెదురుగా మాలతి.       


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS