Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 2


    "అతనంటే నాకేవగింపు ఏమీ లేదుగానీ, అతన్నెలా తప్పించుకోవాలో అర్ధంకాలేదు. నేను పారిపోతానని భయమేసి అసలతను యింటికి వెళ్ళటం మానేశాడు. అతని గుమాస్తా ఒకడు ఒకరోజు వచ్చి 'వాళ్ళబ్బాయికి జ్వరంగా వున్నదనీ, తండ్రిని కలవరిస్తున్నాడనీ' చెప్పాడు. అప్పటికీ అతను కదలలేదు. అతని కొడుకు జ్వరం రోజురోజుకూ ఎక్కువయిపోతోంది. టైఫాయిడ్ అని తేలిందట. ఇతను పోడు. ఇహ నేను భరించలేక 'నువ్వుపోయి నీ కొడుకును చూడకపోయినట్లయితే విషం తాగి ఛస్తాను' అని బెదిరించాను. అతను బిక్కమొహం వేసి 'నేను వెళితే నువ్వు పారిపోతావుగా' అన్నాడు. 'పారిపోను' అని చెప్పాను. పాపం వెళ్లాడు. కొడుకు 'నాన్నా! నాన్నా!' అని కలవరిస్తున్నాడు. తండ్రిని చూడగానే అంత తీవ్రతలోనూ ఆ కుర్రాడి ముఖం విప్పారింది. కాని పాపం, ఎంత ప్రయత్నించినా కొడుకుని దక్కించుకోలేక పోయాడు. దానితో అతని హృదయం వెయ్యిముక్కలయింది. పిచ్చివాడిలా అయిపోయాడు. ఇల్లు కదలటం మానేశాడు దుఃఖంతో. నాకు కబురుచేశాడు. 'నువ్వు కనిపిస్తే తిరిగి పాపపంకిలంలో పడతానని భయంగా వుంది. దయవుంచి యీ ఊరినుంచి వెళ్ళిపో' అని. అలాగే ఆ ఊరినించి వెళ్ళిపోయాను.
    "తర్వాత నా జీవితం ఎన్ని సంఘటనలకు గురి అయిందీ, ఎంతమంది నాచుట్టూ పరిభ్రమించారో, ఎన్ని విపరీతాలు జరిగాయో, ఎన్ని సుఖాలు అనుభవించానో, ఎన్నికష్టాలు అనుభవించానో చెబితే నీకు వరుసగా పదిసంవత్సరాలు నిద్రపట్టదు. ఝడుసుకుంటావు.
    "మనిషిలా గడిపాను. పిశాచిలా గడిపాను. అన్నిరకాలా గడిపాను. ఈ ఊళ్ళో ఇంతకాలంగా వుంటున్నాను. నువ్వు యిక్కడ వున్నావని మొదట తెలీదు. ఒకసారి రిక్షాలో వస్తూ నిన్ను చూశాను. పలకరించుదామనుకున్నాను. అప్పటికే చాలాదూరం వెళ్ళిపోయావు. దూరంనుంచే రిక్షావాడ్ని నిన్ను అనుసరించమని చెప్పాను. నీ యిల్లు గుర్తుచూసుకుని వెళ్ళిపోయాను, నిన్ను కలుసుకోవటానికి. అప్పటికి నేనింకా ఓ విషవలయం మధ్య యిరుక్కుని వున్నాను.
    "ఇప్పుడు హఠాత్తుగా ఒంటరిగా మిగిలిపోయాను. చేతిలో డబ్బులూ అయిపోయాయి. తెలియని అలసటగా వుంది. అనుభవాలలోకి దుమికే స్థితిలో లేను. ఎక్కడైనా స్తబ్దుగా వుండి, విశ్రాంతి తీసుకోవాలనిపించింది. నీవు గుర్తువచ్చావు. నిన్ను వెదుక్కుంటూ వచ్చాను."
    అని జగతి ముగించింది. రెండు నిముషాలపాటు కళ్ళు మూసుకుంది.. కనులు మూసుకున్నప్పుడు ఆమెముఖంలో ప్రస్ఫుటమయ్యే పవిత్రకాంతుల వంక అతను నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. కాసేపటికి ఆమె కనులు విప్పి-
    "కొన్నాళ్ళపాటు నీతో వుందామనుకుంటున్నాను. అంటే నీ సహాయం అర్థిస్తూనే వున్నానని తెలుస్తూనే వుందికదూ? ఏమంటావు?" అంది జగతి.
    మృత్యుంజయరావుకు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లయింది. తాను సంకోచించటం గ్రహిస్తే 'ఏం యిష్టంలేదా?' అన్నప్రశ్న ఎప్పుడు ఊడిపడుతుందోనని కంగారుపడ్డాడు. "నాకేం అభ్యంతరంలేదు. కాని, ఈ ఒక్కగదిలో మనమిద్దరమెలా యిముడుతాము? నాకేం ఫర్వాలేదనుకో. నీకు చాలా యిబ్బంది అయిపోతుంది కదా?"
    "ఫర్వాలేదు. నేనెలాగో సరిపెట్టుకుంటాను కదా. ఏం, నీకోసం వచ్చేవాళ్ళు ఎక్కువుంటారా?"
    "అంత ఎక్కువ లేరనుకో. అయినా దాన్ని గురించికాదు. నీ యిబ్బందిని గురించే"
    "నా గురించి నువ్వు బాధపడకు. ఇంతకన్నా యిరుకుగదులెన్నిట్లోనో కాలం వెళ్ళబుచ్చిన రోజులున్నాయి. నేను బాగా అలసిపోయాను. నిద్రకూడా వస్తూంది. ఇక పడుకుందామా?"
    "అలాగే" అంటూ అతను లేచి నిలబడి పడుకోవటానికి ఏమి ఏర్పాట్లు చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. తనగదిలో ఒకటే మంచం వుంది. దానిమీద పరుపూ, దుప్పటీ మాసిపోయి తోళ్ళవలె వున్నాయి. ఓ చాపవుండి దానిమీద తలగడా వేసుకుని తను పడుకుందామని, ఆమెను మంచంమీద పడుకోమందామని ఆ విషయమే చెప్పాడు.
    ఆమె ఏమీ అభ్యంతరం చెప్పలేదు. "అలాగే" అంది.
    రెండు నిముషాలలో అతను చేతనైనంతవరకూ పక్క శుభ్రంగా దులిపివేసి, తను క్రింద చాపవేసుకుని "పడుకో" అన్నాడు. ఆమె లేచి మంచంమీద కూర్చుని బద్ధకంగా వళ్లు విరుచుకుని, మెల్లిగా దానిమీద వాలింది. అతను లైటు ఆర్పేసి చాపమీదకు చేరి పడుకున్నాడు.
    అసలైతే వర్షాకాలమే. కాని చాలారోజులుగా వర్షాలే కురవటంలేదు. పైపెచ్చు పగలంతా ఎండలు, రాత్రుళ్ళు ఉక్క.
    "అమ్మ దగ్గరకు ఈమధ్య ఎప్పుడైనా వెళ్ళావా?' అని అడిగింది జగతి, రెండుక్షణాలు గడిచాక.
    "నాలుగయిదు నెలలవుతుంది."
    "కులాసాగా వుందా?"
    ఈ ప్రశ్నకు అతను ఆశ్చర్యపడ్డాడు. అసలు తల్లిని గురించి తనే ఎత్తుదామనుకున్నాడు కాని ఎటువంటి కఠోరమైన ప్రత్యుత్తరం వినాల్సి వస్తుందోనని మెదలకుండా వూరుకున్నాడు. "అదే కులాసా. ఆ వయసులో అంతకుమించిన ఆరోగ్యం ఎక్కడ వస్తుంది?" అన్నాడు కంఠస్వరం తగ్గించి.
    ఆమె చాలాసేపటివరకూ మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. నిరీక్షించి, నిరీక్షించి తిరిగి అతనే "అమ్మని చూడాలని లేదా?" అని ప్రశ్నించాడు ధైర్యంచేసి. "ఊహుఁ. లేదు"
    "ఎందుకనీ"
    "ఎందుకంటే ఏం చెబుతాను? నాకీ జీవితంలో ఏ బంధమూ వున్నట్లు అనిపించటంలేదు. ఒకరు నాకోసం అనిగానీ, నేను ఒకరిదాన్ననిగానీ తలపోయటం నాకు ఊపిరాడనట్లుగా వుంటుంది. నా జీవితంలో ఉపద్రవమైన తప్పటడుగు వేయటం జరిగింది. ఆ దారేవేరు. ఇహ అక్కడ్నుంచి వెనక్కి తిరిగిరావటం నా తరంకాదు. రాకపొవటమూ మంచిదే. ఆ దోవను అలా వొదిలేయటమే శ్రేయస్కరం. చూడు. నాది భయంకరమైన మనస్తత్వమని నాకు తెలుసు. కాని నన్నుగురించి నేను అసహ్యించుకోవటంలేదు. అట్లా అసహ్యించుకుని చర్వితచర్వణం చేసుకున్న రోజున నాకు పిచ్చి అయినా ఎత్తుతుంది. లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటాను. నాకు పిచ్చి ఎక్కినదశలో నీకు మళ్ళీ కనిపిస్తానని నమ్మకం వుందిలే. జయా! అప్పుడు నువ్వేం చేస్తావు?" 
    అతను ఉలిక్కిపడ్డాడు. గాద్గదికం కానీ,ఆర్ధ్రతగానీ లేని కంఠస్వరంతో ఆమె వేసింది ప్రశ్న.
    "జవాబు చెప్పలేకపోతున్నావు జయా! మనసులోనే వుంచుకో. పోనీ అమ్మ నన్ను ఎప్పుడైనా అడుగుతూ వుంటుందా?"
    "అనుకుంటూ వుంటుంది."
    ఆమె నిట్టూర్చింది. "తల్లి ప్రాణమంటారు. అదే కాబోలు."
    "నువ్వు కనిపించావని అమ్మకు రాసేదా?"
    "వద్దు, వద్దు ఆ పనిమాత్రం చేయకు."
    మళ్ళీ కాసేపు మాటలులేవు.
    జగతి ఏదో గుర్తువచ్చినట్లు "ఇందాక నేను గేటుదగ్గర నిల్చుని అంతసేపు పిలిచాను కదా! నువ్వయితే బండనిద్ర పోతున్నావనుకుందాం. ఈ యింట్లో యిహ నువ్వుతప్ప మనుషులు లేరేమిటి?" అన్నది.
    "లేకేం? మాయింటివాళ్ళు మధ్యభాగంలో వుంటారు. ఈ ప్రక్కగది ఒకటీ విడగొట్టి నాకిచ్చారన్నమాట. గేటుదగ్గర అలికిడి అయితేచాలు వాళ్ళు తలుపు తెరుచుకుని చూస్తారు. ప్రస్తుతం ఊళ్ళో లేకపోవటంబట్టి అదేం జరగలేదు. ఇహ మిగతా వాటాలవాళ్ళు వాళ్ళ తాలూకు అవకపోతే అరిచి గీపెట్టినా లేచి రారు."
    "ఉహూఁ" అని వూరుకుంది జగతి. ఇంకేమీ మాట్లాడలేదు.
    తరువాత చాలాసేపు నిశ్శబ్దం తాండవించేసరికి ఆమె నిద్రపోతూందని గ్రహించాడు. అతనికి ఎంత ప్రయత్నించినా నిద్ర రావటంలేదు. అయిదేళ్ళ తర్వాత ఆమె తనని వెతుక్కుంటూ వచ్చింది. ఇది శాశ్వతం కాకపోవచ్చు. అసలీ విశాలసృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. కాని క్షణికాలైన సంఘటనా పరంపరలే. ఒకదానితో యింకొకటి సంబంధం వున్నవయితే శాశ్వత భ్రమను కలుగజేస్తూ వుంటాయి.

    కొన్ని విషయాలలో మానవుడు అల్పసంతోషి, కొన్నిటిలో నిరాశాపరుడు, మరికొన్నిటిలో పూర్తిగా అసంతృప్తుడు. ఇన్నిటి సమ్మేళనం కాకపోతే అతను వెకిలిగా, వెల్తిగా తయారౌతాడు.
    కాని ఈ సమ్మేళనం పరిమితంగా వుండాలి. క్రమబద్ధంగా వుండాలి. లేకపోతే...? జవాబు మృత్యుంజయరావు.
    ఈనాటి అనుకోని సంఘటనకేనా? కాబోలు. అతని నేత్రాంచలాలలో అశ్రువులు నిలిచాయి. వాటినలాగే కారనిస్తూ ఆ చీకటిలో అతను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. మంచంమీద జగతి హాయిగా నిద్రపోతోంది.
                         2
    ప్రపంచంలోని ప్రతిచిన్న విషయానికీ ప్రాధాన్యత యిచ్చి ఆలోచించే వాళ్ళల్లో అగ్రగణ్యుడు మృత్యుంజయరావు. ఈ విధంగా ఆలోచించగలగటం అతని తెలివితేటలకు నిదర్శనమని ఎవరూ పొరబడకూడదు. తెలివైనవాళ్ళు పనికిమాలిన విషయాలగురించి ఎప్పుడూ ఆలోచించరు. అసలు వాటిజోలికి పోరు. మృత్యుంజయరావువంటి వ్యక్తులు ముఖ్యంగా పనేమిటంటే చెత్త విషయాలని గురించి ఆలోచించటమూనూ, అసలు వాటిని గురించి వొదిలెయ్యటమూ, లేక మరిచిపొవటమూ.
    అంతటితో అవలేదు. ఉన్నవాడ్ని వున్నట్టు నిలబెట్టి "నువ్వెవరివయ్యా? ఎందుకు బ్రతుకుతున్నావు?" అని ప్రశ్నవేస్తే తబ్బిబ్బుపడి గడగడ వొణికి పోతాడు. ఈ ప్రశ్నకు చాలామంది గడబిడ పడేమాట నిజమే. కాని ఆ దారి వేరు. ఈదారి వేరు.
    ఈ బుద్ధి అతనికి పుట్టుకతో అబ్బినదే. కర్ణుడు కుండలాలతో జన్మించినట్లు అతను యిలాంటి వెనక్కిలాగే గుణాలను అనేకం సంతరించుకుని జన్మించాడు.
    భూదేవిలాంటి శ్రీదేవికి పుట్టిన బిడ్డలిద్దరూ విభిన్నపు అతీతగుణాలు కలవారు కావటం ఆమె దురదృష్టం. ఆ దురదృష్టం అంతకుముందునుంచీ వున్నది. తరువాతనూ వెన్నాడింది.
    శ్రీదేవి శరీరం తెల్లగా పాలరాతివలె వుండి, స్ఫుటికంలా స్వచ్చంగా మెరుస్తూ వుండేది. కాంతిని విరజిమ్ముతూ యితిహాసపు నాయికా సౌందర్యాన్ని స్ఫురింపచేసేది. ఆమె కంఠం సముద్రతీరాన అదృష్టవంతుడికి దొరికే శంఖం. ఆమె కంఠం తియ్యని తేనియ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS