Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 2

    "ఈ విషయంలో వినను"

    "మీకు నాకన్నా డబ్బే ముఖ్యమా?"

    "కాదు"

    "అలాంటప్పుడు నాకోరిక తీర్చటానికి ఏమిటి?"

    "పిల్లలు తప్పు మార్గాన పోతుంటే పెద్దలు మందలించాలి. అందరూ పల్లకీ ఎక్కాలని ప్రయత్నిస్తే మోసేవారు ఉండరు. పల్లకీ యెక్కేవారు యెప్పుడూ ఒక్కరే ఉంటారు. పల్లకీ మోసే బోయీలు మాత్రం నలుగురు వుండక తప్పదు. అది ధర్మం"

    "ధర్మం పేరుతో నోరుమూయించే అధర్మం అది. పల్లకీ యెక్కినవాడు అందులోనే కూర్చోక ఒకసారి తాను బోయీగమారి పల్లకీ మోస్తే యేమిటిట?"

    "బోయీని పల్లకీ ఎక్కించా?"

    "యస్. బోయీని పల్లకీ ఎక్కించే"

    పద్మిని అలా అనగానే మధుసూదనరావు పడిపడి నవ్వాడు.

    పద్మిని గోళ్ళు కొరుక్కుంటూ వుండిపోయింది.

    "ఇది ఏ తెలుగు సినిమాలో డైలాగు పప్పీ!"

    "అపర ధర్మరాజు సినిమాలో హీరో అంటాడు."

    "నిజ జీవితంలో ఆ హీరో యెప్పుడయినా ఒక్క పైసా అంటే పైసా యెవరికయినా ఎప్పుడయినా ధర్మం చేశాడా?"

    "నాకు తెలీదు" అంది పద్మిని.

    "అందుకే చెబుతున్నాను, నీకు తెలియనివాటిల్లో తల దూర్చవద్దని"

    "ఈ విషయంలో నేను తలవొగ్గేదిలేదు" పద్మిని గట్టిగా తన నిర్ణయం చెప్పేసింది.

    "ఇదే విషయంలో నేను తలదించేది లేదు" అంతకన్నా గట్టిగా చెప్పేసి అక్కడ్నించి చరచరా వెళ్ళిపోయాడు మధుసూదనరావు.

    "పట్టుదలకొస్తే ఎందులోను నీకు తీసిపోదు డాడీ నీ ఈ కూతురు" గట్టిగా అరచి చెప్పింది పద్మిని.

    తండ్రీ కూతుళ్ళమధ్య నలిగిపోతున్న పూర్ణిమాదేవి రెండు చేతుల్లో తల ఇరికించుకుని అలా వుండిపోయింది.


                                                                                           2


    ఆ మర్నాడు

    కోటీశ్వరుడు మధుసూదనరావుగారి ఏకైక తనయ పద్మిని ప్రియదర్శిని చేతిలో పైసా లేకుండా కట్టుగుడ్డలతో ఇంట్లోంచి బయటకొచ్చేసింది.

    "పప్పీ వెళ్ళిపోతున్నదండీ, దానికేమీ తెలీదు" అంటూ లబలబలాడింది పూర్ణిమాదేవి.

    "వెళ్ళనీయ్ మన ప్రేమ దాన్ని కట్టిపడేయలేకపోయింది. అది చదివిన తెలుగు నవలలు అది చూసిన తెలుగు సినిమాలు జీవితపాఠాలు నేర్పకపోగా జీవితాన్ని వక్రంగా చిత్రీకరిస్తూ చూపించాయి. వాటి ప్రభావం పప్పీ మీద బాగా పడింది. నిజజీవితంలోకి వెళ్ళనియ్యి. లోకం పోకడ తెలుస్తుంది. జీవితంలో తారసపడే రకరకాల వ్యక్తుల నిజరూపాలు తెలుస్తాయి. అనుభవాన్ని మించిన పాఠం లేదన్నారు పెద్దలు. కానీయ్ ఇదీ ఒకందుకు మంచిదే. కానీయ్ పప్పీకి తెలిసివస్తుంది" మధుసూదనరావు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా తల వంకిస్తూ అన్నాడు.

    "అది ఆడపిల్లండీ! దానికేమీ తెలీదు. ప్రపంచజ్ఞానం బొత్తిగా శూన్యం. అలాంటిదాన్ని ఒంటరిగా వదిలేసి__

    "నేను వదిలెయ్యలేదు. పప్పీయే మనల్ని వదిలేసి వెళ్ళింది" గంభీరంగా అన్నాడు మధుసూదనరావు.

    "ఎవరు ఎవర్ని వదిలేశారన్నది ముఖ్యంకాదండి. దాని విషయం చూడవలసిన బాధ్యత మీకులేదా?" పూర్ణిమాదేవి దుఃఖపూరిత స్వరంతో అంది.

    "బాధ్యత తెలుసు! దాని బరువు తెలుసు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయం నాకు వదిలేయ్" అంటూ మధుసూదనరావు అక్కడ్నించి వెళ్ళిపోయాడు.

    బ్రతిమాలి చెప్పినా కూతురు వినలేదు. బాధ వెళ్ళపోసుకున్నా భర్త వినలేదు. తన ఆవేదనని ఎవరికి చెప్పాలి. ఆ యింటి గోడలకా? కనబడని ఆ పై వాడికా?

    పూర్ణిమాదేవి ఆలోచిస్తూ వుంటే కిందనుంచి అరుపులు వినిపించాయి. గబగబా పోర్టికోలోకి వెళ్ళి కిందకి చూస్తూ వుండిపోయింది.

    అక్కడ__

    వాకిలిగేటుకి అవతల__

    ఇంట్లోంచి బయటకొచ్చేసిన పద్మిని ప్రియదర్శిని సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గర కెళ్ళింది.

    అమ్మాయిగారు తమదగ్గర కొచ్చేలోపల వాళ్ళల్లో వాళ్ళు అప్పుడే గుసగుస లాడేసుకున్నారు.

    "అయ్యగారు మొహం చాటేసి అమ్మాయిగార్ని చర్చలకి పంపిస్తున్నార్రోయ్" అందులో వకడన్నాడు.

    "అలా ఎందుకనుకోవాలి! ఆళ్ళంతా పెద్దోళ్ళు__ఇదో నాటకం అనుకో" రెండోవాడు అన్నాడు.

    "మనం ఉత్త వెర్రి వెధవలం అనుకుంటున్నారేమో అమ్మాయిగారు వచ్చేది ఆపైనున్న అమ్మగారు వచ్చేది మనం తగ్గేదిలేదు" అందులో వకడన్నాడు.

    వీళ్ళిలా మాట్లాడుకోవడం పూర్తికాలేదు వాళ్ళ ముందుకి పద్మిని ప్రియదర్శిని రానేవచ్చింది.

    అదేదో సినిమాలో హీరోయిన్ లా చేతులు కట్టుకొని ఆప్యాయత, అనురాగమూ, దయ చాపుల్లో సారిస్తూ "చూడండి!" అంది.

    "అప్పటికే వాళ్ళంతా కళ్ళు విప్పార్చుకొని పద్మినిని చూస్తూ వున్నారు. ఇంకేం చూడాలో వాళ్ళకి అర్ధం కాలేదు.

    "నేను మీ మనిషిని__" గంభీరంగా పలికింది పద్మిని.

    వాళ్ళ బుర్రలొక్కసారిగా గిర్రున తిరిగాయి. మనం యివ్వాళ తాగలేదుకదా!" అని చూపులతో ప్రశ్నించుకొన్నారు.

    సమ్మెకు మూల పురుషుడైన సూరిబాబు "ఇదంతా నాటకం!" అంటూ గట్టిగా అరిచాడు.

    "నాటకాలు మాకొద్దు. మా కష్టార్జితం మాకు పారేయండి. యజమాని డౌన్ డౌన్ __ యజమాని కూతురు డౌన్ డౌన్ ... వర్కర్స్ యూనియన్ జిందాబాద్!" అంటూ గట్టిగా అరిచారు.

    సమ్మె చేస్తున్న కార్మికుల అరుపులు సరిగ్గా ఐదు నిమిషాలు అలాసాగాయి.

    ఆ అరుపులు భరించలేక రెండు చెవుల్లో వేళ్ళు పెట్టుకొని అలా నుంచుండిపోయింది పద్మిని.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS