Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 2

    "చాల్లేండి సంబడం." చిరుకోపంతో మూతి తిప్పింది ఆదిలక్షమ్మ.
    వాసంతి మాత్రం పెదవి కదపలేదు. మూతి ముడుచుకుని కోపం వచ్చిందనటానికి నిదర్శనంగా గోళ్ళు కొరుకుతూ వుండిపోయింది.
    వాసంతి చాలా కోపంతో వుందని గ్రహించాడు రాధాకృష్ణ. తానెప్పుడొచ్చినా "మామయ్యా! మామయ్యా!" అంటూ వసపిట్టలావాగే వాసంతి ఈరోజు మౌనవ్రతం పట్టిందంటే కారణం పెద్దదే అయివుంటుంది. ఏమిటో అది? అక్కా బావని అడిగే బదులు డైరెక్టుగా వాసంతినే అడిగితే ఒక్క నిమిషంలో తేలిపోతుంది అనుకున్నాడు రాధాకృష్ణ.
    "ఏంటిరావాసూ! ఉత్త గోళ్ళు మాత్రమే కొరికి తింటున్నావా? చిగుళ్ళు వేళ్ళు అన్నీ నమిలిమింగుతున్నావా?" రాధాకృష్ణ నవ్వుతూ అడిగాడు.
    వాసంతికి రాధాకృష్ణవద్ద చనువుంది. ప్రస్తుతం కోపావేశంలో వుంది కాబట్టి పలకరించలేదు. తల్లి తండ్రి చెప్పిన కొన్ని విషయాలు కాదన్న సందర్భాలు కొన్ని వచ్చాయి. వాళ్ళ మాటలకి అంగీకారం తెలపలేక అవుననటానికి మనసొప్పక మామయ్య రాధాకృష్ణ సలహా తీసుకుని ఇద్దరూ కల్సి గండం తప్పించుకునేవారు. రాధాకృష్ణ పలకరించగానే వాసంతికి నూతన శక్తి వచ్చింది.
    "మామయ్యా! అమ్మ, అదే మీ అక్క ఆదిలక్షమ్మగారు నన్ను కోప్పడింది. నేనేం చిన్న బొట్టికాయనా మాట పడటానికి, టీనేజీ దాటినదాన్ని. నాకో వ్యక్తిత్వం, నాకూ ఓ ఆత్మా..."
    "ఆగాగు, నీగురించి నాకు తెలియకపోతేకదా, ఏకరువు పెట్టాల్సింది, అసలు విషయం చెప్పు చాలు. ఏమని కోప్పడింది?"
    "అదిగో ఎదురుగానే వుందిగా మీ అక్కగారినే అడుగు."
    ఎక్కడిమాట అక్కడేయటం, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం రాధాకృష్ణకు బహుచక్కగా తెల్సు. "ఒరేయ్ వాసు! అక్కనే అడిగి తెల్సుకుంటాగాని ముందా కోపం ముఖంలోంచి తరిమెయ్యి. ఆడపిల్ల నవ్వుతూ వుండాలి. నవ్వుతూవున్న ఆడపిల్ల ముఖం ఎంత కళగా వుంటుందో తెల్సా!" కొంచెం పొగడ్త జోడించి అన్నాడు.
    "తెల్సు, బాగా తెల్సు. ఆ అక్కకి తమ్ముడివి కాదూ! బుద్ధిబైట పడేసుకున్నావు." అంది వాసంతి.
    గతుక్కుమన్నాడు రాధాకృష్ణ. "ఇప్పుడు కానిమా! నేనేమన్నాను?" అన్నాడు.
    "పాపం తెలీదు, బుల్లి పాపాయి. మళ్ళీ పెద్దడాక్టరని పేరు."
    "ఆ పేరు పేషెంట్ల ధర్మమా అని వచ్చింది. అసలు విషయానికిరా."
    "ఆడపిల్ల ముఖం నవ్వుతూ వుండాలని అన్నావ్, మరి మగాడి ముఖం నవ్వుతూ వుండక్కరలేదా! మగాడి ముఖం ఎలా వున్నా ఫరవాలేదా? ప్రతిదానికి ఆడపిల్ల దొరుకుతుంది మీకు."
    "ఓహ్, ఈ చిన్నవిషయం గురించా! ఆడపిల్లముఖం నవ్వుతూ వుంటే కళకళలాడుతుంటుంది. ఆడపిల్ల ముఖం ఎలాగుండాలో చెప్పిన విజ్నులే మగాణ్ని గురించి ఓ విషయం చెప్పారురా వాసూ!" అంటూ ఆగాడు రాధాకృష్ణ.
    "ఏమని? మగాడి ముఖం ఏడుస్తూ వుండాలనా?" అంది వాసంతి కిసుక్కున నవ్వి.
    'ఛీ, ఇది పెద్దదయిందిగాని బుద్ధి ఏమాత్రం పెరగలేదు.' అనుకుంది ఆదిలక్షమ్మ.
    "కాదు. మగాడిముఖం గాంభీర్యంగా వుండాలి. ఆడపిల్ల ముఖంలో నవ్వు ఎంత అందాన్నిస్తుందో మగాడి ముఖంలో గాంభీర్యం అంతకు రెట్టింపు ఆకర్షణీయంగా వుంటుంది." గంభీరంగా ముఖంపెట్టి అన్నాడు రాధాకృష్ణ.
    "హియర్, హియర్" అంటూ చప్పట్లుకొట్టింది వాసంతి.
    వెంకట్రామయ్యగారికి కూతురి సంతోషమే తన సంతోషం. చిన్న పిల్లలా ఆనందంతో వాసంతి చప్పట్లు చరుస్తుంటే ఆయనా చేతులు కలిసి చప్పట్లుచరిచారు. ఆదిలక్షమ్మకి ఓ పక్క సంతోషంగాను మరో పక్క చిరాగ్గాను వుంది.
    "అమ్మయ్య! వాతావరణంలో మార్పు వచ్చింది, కొద్దినిమిషములలోనే కూల్ హోమ్ అయింది. గుడ్. ఇహ అసలు విషయానికొద్దాము. అక్కా! ఏమిటి వాసూని కోప్పడ్డావుట? ఏం జరిగింది? ఏమని కోప్పడ్డావు?" 
    "అయ్యోరామ! దాన్ని కోప్పడితే మీ బావగారు నన్ను బ్రతకనిస్తారా? ఆయనదాకా ఎందుకు, ముందు యిది బ్రతకనిస్తుందా?"
    రాధాకృష్ణ వాసంతివైపు తిరిగి. "ఏంటిరా వాసూ! అక్క నిన్ను కోప్పడలేదని చెపుతున్నది?" అని అడిగాడు.
    "కోప్పడింది తిట్టింది. చాలాచాలా మాటలంది మామయ్యా! నే మంచిదాన్ని కాబట్టి కొద్దిగా సర్దుకున్నాను. కావాలంటే నాన్నగారినడుగు."
    "పిల్లికి ఎలుక సాక్ష్యంట. అడుగు ఆయన ఏంచెపుతారో చూద్దాం" అంది ఆదిలక్షమ్మ.
    "ఏమిటి బావగారూ! అక్క వాసూని తిట్టి కోప్పడి చాలా చాలా మాటలందా!"
    "ఇందాక వాళ్ళిద్దరూ పెళ్ళిచూపుల విషయంలో ఘర్షణ పడ్డమాట వాస్తవమే. మీ అక్కమాట వింటుంటే అదీనిజమే, ఆలోచించతగ్గమాట అనిపిస్తుంది. ఇటు వాసు మాట వింటుంటే ఇదీనిజమే, ఆలోచించి తగ్గమాటే అనిపిస్తున్నది. ఎటూ మొగ్గలేక ఏంచెయ్యలేక ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కింది. మంచి సమయానికొచ్చావ్, అదేదో నువ్వే పరిష్కరించి వెళ్ళు రాధాకృష్ణా!" అన్నారు వెంకట్రామయ్యగారు.
    "ఇంతవరకూ ఎవరూ అసలువిషయం చెప్పలేదు. ఇంక పరిష్కారం ఏంచెయ్యను, ఎవరో ఒకరు అసలు విషయం చెప్పండి."
    "నేనే చెపుతా మామయ్యా! ముందీవిషయం చెప్పు. నేనాడపిల్లను అవునా కాదా?"
    "అయ్యయ్యో! నువ్వాడపిల్లవి కాదని ఎవరన్నారు? ఉత్త ఆడపిల్లవేకాదు, అందమైన ఆడపిల్లవు. మనిద్దరిమధ్య యిరవై ఏళ్ళవయసు తేడా వుండటం, అదీగాక అయినవాళ్ళలో అమ్మాయిని పెళ్లాడితే చాలా దుష్పలితాలు జరుగుతాయని మా డాక్టర్ల సిద్ధాంతం. శాస్త్రరీత్యా అది ప్రూవ్ కావటం వల్ల నిన్ను పెళ్ళాడకుండా శ్రీమహాలక్ష్మి మెడలో మూడుముళ్ళు వేశాను. లేకపోతేనా?"
    "సరేలే మామయ్య! నా ప్రశ్నకు సమాధానం చెప్పమంటే కథ చెపుతున్నావు. కావాలని అత్తయ్యని పెళ్ళిచేసుకున్నావు. గొప్పగ కబుర్లు. నిన్నెవరూ పెళ్ళాడటానికి ఇక్కడెవరు దిగులుపడి కూర్చోలేదు. అసలు విషయానికిరా."
    "ఓ.కే. నేనాడపిల్లను అవునా కాదా? అని నీ ప్రశ్న అవునా!"
    "ఎస్/ అంకుల్ జిమ్."
    "నువ్వాడపిల్లవేరావాసూ! ఉత్తాడపిల్లకాదు అందమైన ఆడపిల్లవి."
    "అవునా మామయ్య! మరి అమ్మేమందో తెలుసా! నువ్వాడదానివి కావటే, నీకు సిగ్గు సెరము లేదుటే! అంటూ చాలాచాలా తిట్టింది."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS