Next Page 
ఇది ఒక కుక్క కథ  పేజి 1


                     ఇది ఒక కుక్క కథ

                                                _ వసుంధర

                                             

   
   

ఇందిర అందం చాలాకాలంగా స్వామిని ఆకర్షిస్తోంది. అయితే ఆ తప్పు ఇందిరదీ కాదు, స్వామిదీ కాదు - వయసుది!
    స్వామిని పందొమ్మిదేళ్ళు. బియస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. క్లాసులో అన్నింట్లోనూ ఫస్టుగా వస్తాడని చాలామంది లెక్చరర్సు మెచ్చుకుంటూంటారు. అయితే క్లాసులోని అందరికంటే తనే తెలివైనవాడినన్న అభిప్రాయం స్వామికి లేదు. అతను అందరితోనూ మంచిగా వుంటాడు. అందరూ అతనికి స్నేహితులే. తరచుగా జరిగే సంభాషణల్లో తన స్థానాన్ని అంచనా వేసుకుని, క్లాసులో తనకంటె తెలివైనవాళ్ళు ఇంకా అయిదారుగురిదాకా ఉన్నారని అతను గ్రహించాడు. ఆ అయిదారుగురిలోనూ సగంమంది డబ్బున్నవాళ్ళు - సరదాకోసం చదువుకుంటున్నారు. మిగతా సగం మంది బాధ్యతలను గుర్తించనివారు. స్వామి బాధ్యతలనూ గుర్తించాడు, అతనికి డబ్బూ లేదు. తెలివితేటలకు ఈ రెండూ విషయాలూ జతపడ్డ కారణంగా అతను కష్టపడి చదువుతాడు. క్లాసులో ఫస్టుగా వస్తున్నాడు.
    ఫస్టుగా వస్తున్న స్వామిని, కష్టపడి చదువుకోవలసిన అవసరమున్న స్వామిని ఇందిర అందం ఆకర్షిస్తోంది. అదెంతవరకు ఒప్పో అతనే అంచనా వేసుకోలేకపోతున్నాడు. ఆ ఆకర్షణ కూడా ఒకటి రెండు రోజులది కాదు. రెండు సంవత్సరాలది. స్వామి ఫస్టు బియస్సీ చదువుతున్నప్పుడత నామెను చూశాడు. చూసినప్పుడే ఆమె అందం అతన్నాకర్షించింది. అస్తమానం ఆమెను చూడాలనిపించేదతనికి. అయితే ఆమె ఎవరో, ఎక్కడిదో అతనికి తెలియదు. రోజూ అతని గది ముందునుంచే వెడుతూండేదామె. ఆమెను చూడగానే అతనూ బయల్దేరేవాడు. ఆమెను అనుసరించేవాడు. ఆమె జూనియర్ కాలేజీకి వెళ్ళేది. అతను కాలేజీకి వెళ్ళేవాడు. అదే అతని పని. ఆమెను పలకరించాలనీ, ఆమెతో మాట్లాడాలనీ అతనెన్నోమార్లు అనుకున్నాడు. కాని అలా చేయలేకపోయేవాడు. అతనిలో ధైర్యం చాలలేదు.
    ఇందిరకు స్వామిపై ఉన్న అభిప్రాయం చెప్పడం కష్టం. ఆమె అతన్ని గమనించే వుండాలి. అతణ్ణి చూడగానే ఆమె ముఖంలో మార్పులు వస్తాయి. అతను కనబడనప్పుడామె కళ్ళు అతనికోసం వెదుకుతాయి. అయితే జ్వరం వచ్చి స్వామి కాలేజీకి బయల్దేరకపోతే, ఆమె అతని కోసం వెతుక్కోలేదు. చాలాకాలం తర్వాత అతను కనబడితే చిరునవ్వుతో కూడిన పలకరింపూ చేయలేదు.
    ఈ విధమైన వీరి పరిచయం సుమారు ఒక సంవత్సరం గడిచింది. తర్వాత స్వామి అదృష్టమో ఏమోకాని, ఆమె అతను చదివే కాలేజీలోనే అతను చదివే గ్రూపులోనే ఒక సంవత్సరం జూనియర్ గా బియస్సీలో చేరింది. ఇది జరిగినప్పుడు స్వామి చాలా సంతోషించాడు. ఆమె తనకు బాగా దగ్గరగా వచ్చినట్లు భావించాడతను. ఏదో విధంగా తమ అనుబంధం పెరుగుతుందని అతను ఆశించాడు. అయితే దేనికైనా ప్రయత్నం కావాలిగదా! అది లేకపోవడం వల్ల మరో సంవత్సరం కూడా వీరి పరిచయం ముఖాల్ని చూసుకోవడం వద్దనే ఉండిపోయింది.
    ఏదో చేయాలనీ, తమ పరిచయాన్ని గాఢతరం గావించాలనీ స్వామి ఆవేశపడేవాడు. అతను బియస్సీ ఫైనలియర్లోకి వచ్చేక తనకు ఇందిర దక్కదన్న భయం అతన్నావహించింది.
    ఎందుకంటే ఇందిరకు కాలేజీబ్యూటీ అని పేరుంది. చాలా చలాకీ పిల్ల అని అంతా చెప్పుకుంటారు. ఆమెను కనీసం అయిదారుగురు మగస్నేహితులున్నారు. అయితే కాలేజీలో ఆమెకు చెడ్డ పేరు లేదు. మగపిల్లలతో చాలా గౌరవంగా వ్యవహరిస్తుందామె. అందమైనదాన్ననీ, ఆడపిల్లననీ అహంకారం చూపదు. ఏ అబ్బాయి తనతో మాట్లాడడానికి ప్రయత్నించినా ప్రోత్సహించి ఆప్యాయంగా జవాబిస్తుందామె. ఈ కారణంగా అబ్బాయిలందరిలోనూ ఆమెకు మంచి పేరుంది.
    ఇంత మంచి అమ్మాయిని, చలాకి పిల్లని ఎన్నాళ్ళగానో అభిమానిస్తూ ఇంతవరకూ పలకరించనైనా పలకరించలేదంటే ఆ తప్పు స్వామిది. ఆ విషయం అతనూ గ్రహించాడు. అయితే తన మనసులోని విషయాలన్నింటినీ ఆమె ముందు చెప్పగల ధైర్యం అతనికి లేదు. అతనికున్న బలమంతా కలానిదే! అందుకే అతను తెగించి ఒక ప్రేమలేఖ రాశాడు. అందులో తన మనసులోని భావాలన్నింటినీ ప్రకటించాడు. ఒకరోజు కాలేజీలో ఇందిర ఒంటరిగా ఉన్న సమయం చూసి - తొలిసారిగా పలకరించి చటుక్కున ఆమె చేతిలో తన ప్రేమలేఖ ఉన్న కవరు పెట్టి ఇంచుమించు పారిపోయిన విధంగా అక్కణ్ణించి   వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూంటే అతని శరీరమంతా వణికింది. మనసునిండా ఏదో తెలియని భయామావహించుకుంది.
    ఉత్తరం అందజేసిన మూడు రోజులవరకూ స్వామి ఇందిరను తప్పించుకుని తిరిగాడు. చెప్పుకోదగ్గ విశేషాలు కూడా ఏమీ జరుగలేదు. అతనిలో క్రమంగా భయం మాయమై ఆ స్థానంలో కుతూహలం చోటు చేసుకోసాగింది. అతను ఇందిర వంక చూడడానికి భయపడడం తగ్గించాడు. అయితే అతనికి ఇందిర ప్రవర్తనలో కొత్తదనం ఏమీ కనబడలేదు. ఆమె ఎప్పటివలెనే ప్రవర్తిస్తోంది. తమ ఇద్దరకూ మధ్య ఏదో జరిగిందన్న భావం ఆమెలో ద్యోతకం కావడంలేదు.
    ఆమె నుంచి రియాక్షన్ కోసం స్వామి సుమారు రెండువారాలు ఎదురు చూశాడు. ఆమె నిర్లిప్తత అతని సహనాన్ని పరీక్షించింది. చివరకు ఆగలేక అతనో రోజు కాలేజీలో ఆమెను పలకరించాడు. ఆమె నవ్వి "నమస్తే!" అంది.
    ఒక్కక్షణం తటపటాయించి "నేను మీకో ఉత్తరమిచ్చాను...." అన్నాడు స్వామి.
    ఆమె క్లుప్తంగా "ఊఁ" అంది.
    "దానికి మీరు జవాబిస్తారని ఆశించాను?"
    "రాదని ఈపాటికి తెలిసే ఉండాలి" అందామె.
    "కాని నా ఉత్తరానికి జవాబు కావాలి?"
    "జవాబివ్వకపోవడం కూడా ఒక జవాబే కదా!"
    స్వామికి ఏమనాలో తోచలేదు. "నేను పట్టుదలగలవాణ్ణి. జవాబు వచ్చేవరకూ ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాస్తానేమో!" అన్నాడు.
    "మొదటి ఉత్తరం చించి పారవేస్తాను. రెండోది మా అన్నయ్యకిస్తాను. మూడోది ప్రిన్సిపాలు కిస్తాను. ఇదీ నా పద్ధతి. మూడుకు మించి నాకెవ్వరూ  ఉత్తరాలు రాయలేదు. ఒకటికిమించి ఇంతవరకూ ఎవరూ రాయలేదు. ఒకటి రాసిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు" అంది ఇందిర. ఇదంతా చాలా మామూలు విషయమన్న భావం ఆమె ముఖంలోనూ, మాట్లాడే తీరులోనూ ప్రస్పుటమౌతోంది.
    "ఎంతో అభిమానంతో ఉత్తరం రాస్తే చించి పారేస్తారా?" అన్నాడు స్వామి తన ఉత్తరానికి పట్టిన గతిని తలచుకుంటూ బాధగా.
    "చూడండి- మనం చదువుకోడానికిక్కడికు వచ్చాం. ప్రేమలూ, అభిమానాలకూ ఇక్కడ తావులేదు. చదువుకోవాలన్న బాధ్యత ఒక్కటే మనకుండేది. మాది సంప్రదాయం పాటించే కుటుంబం. నన్ను పెళ్ళిచేసుకోవాలనుకునేవారు ముందు మా పెద్దలని సంప్రదించాలి. ఆ తర్వాతనే నా ఇష్టాయిష్టాల ప్రసక్తి. నా సంగతెలాగున్నా మీరింకా పెళ్ళికి సిద్ధంగా ఉన్నారని నేననుకోను. ఇంకా చాలా సంవత్సరాలు చదువుకుని తర్వాత  ఎప్పుడో స్థిరపడాలనుకుంటారు. మీరు క్లాసులో చాలా తెలివైన వారని విన్నాను, మీ లక్ష్యాన్ని చదువుమీద నుంచి ఆడవారిపైకి మళ్ళించకండి" అంది ఇందిర. ఎంతో అనుభవమున్నదానిలా ఆమె మాట్లాడుతూంటే ,స్వామి ఆశ్చర్యంగా విన్నాడు. అతని కళ్ళకావహించిన మత్తుపొర కొంతవరకూ విడిపోయినట్లయింది. అతనేమీ మాట్లాడకుండా ఆమెవంకనే చూస్తున్నాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS