Next Page 
అడుగడుగునా... పేజి 1


                       అడుగడుగునా....
       
                                       __ కురుముద్దాలి విజయలక్ష్మి


    "అబ్బాయ్!" "ఓయ్, నిన్నే అబ్బాయ్ పిలిచేది!"

    అబ్బాయ్ అని పిలవబడిన అతగాడి పేరు చంద్రశేఖర్ ఆజాద్.

    సమయానుకూలంగా సందర్భశుద్ధిగా ఆ పేరు పలు రకాలుగా మారుతుంటుంది. చంద్రం, చెన్నా, చిన్నా, శేఖర్, శేఖరాయ్ యిలా.

    చంద్రశేఖర ఆజాద్ కి కవిత్వం రాయాలన్న పైత్యం బాగా వుంది. అందుకని అప్పుడప్పుడు కలం పట్టుకుని కాగితాలపై దున్ని పారేస్తుంటారు. ఇప్పుడు చేస్తున్నదీ అదే.

    పార్కులో ఎవరూ లేని ఓ మూల చోటు చూసుకొని పున్నాగ చెట్టు కింద తాపీగా కూర్చుని "ఆకుకి చెందని పోకకి పొందని...." అంటూ రాస్తున్నాడు.

    "చెముడా అబ్బాయ్ నీకు ?"

    "ఈ తఫా కాస్త గట్టిగా పక్కనుంచే మాట వినిపించటంతొ చంద్ర తలపైకెత్తి చూశాడు.

    మోకాళ్ళ రెండింటిపైన చేతులు వుంచుకొని కాస్త వంగి చంద్ర ముఖంలోకి కళ్ళార్ప కుండా చూస్తున్నది కాస్తా గబుక్కున పైకి లేచి సరీగా నుంచుంది.

    చంద్ర ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాడు.

    అమ్మాయి అమ్మాయిగానే తెలిసిపోతున్నది. ధరించిన డ్రస్ మాత్రం అబ్బాయిని గుర్తుతెస్తున్నది. ముదురునీలం జీన్స్ ప్యాంట్ ఎర్రగీరల షర్ట్ టక్ చేసి జానెడే వున్న కురులని ఎగదువ్వి వదిలేసిసింది. బ్లాక్ గళ్ళున రుమాలు మెడకి వదులుగా కట్టుకుంది. మనిషి కూడా మాంచి హైటు, బలంగా వుండటంతొ అధాటుగా చూస్తే రౌడీ అబ్బాయిలా వుంది.

    పరిశీలనగా చూడటం పూర్తి అయింతరువాత "నన్నేనా పిలిచింది?" అనడిగాడు చంద్ర.

    "ఎస్."

    "మరి ఆపిలుపేమిటి, అబ్బాయి దబ్బాయి అంటూ?" దబాయింపుగా అన్నాడు చంద్ర.

    "అదా? అని ఓ నవ్వు నవ్వి "నీ పేరు తెలియదు కదబ్బాయ్! అందుకని అలా పిలిచాను." అంది. చంద్ర ఎదురుగా మోకాళ్ళు నేలకాన్చి కూర్చుంటూ.

    "నాపేరు చంద్రశేఖర ఆజాద్ "

    "అబ్బో. ఆ వీరుడి పేరా"

    "మరే"
   
    "అతని ధైర్యసాహసాలు నీకూ వున్నాయా?"

    "నేతి బీరకాయతో నన్ను పోల్చిచూడకు. ఆ పేరే కాదు అతని సాహసాలు కూడా నా నరనరాన జీర్ణించి వున్నాయి"

    ఓ సారి గూడలెగరేసి అబ్బో అంతటి మొనగాడివా! అన్నట్లు చూసింది. "ఓ చిన్న పరీక్ష పెడతాను. అభ్యంతరం లేదు కదా?" అంది.

    "నాకభ్యంతరం లేదు. కాని నువ్వెవ్వరు. నీపేరేంటి? నాకు నీవు పరీక్ష పెట్టటం 'ఏమిటి?' అసలు నీకూ నాకూ సంబంధం ఏమిటి? నీవు నన్ను చూశావేమో గాని నేను నిన్నెప్పుడూ చూడలేదు. పైగా నీవు నన్ను ఇలా ధైర్యంగా మాట్లాడించటం నాకంతా...."

    టప్పున చప్పుడు చేస్తూ నమస్కారం పెట్టింది. "చాలు మహాప్రభో చాలు. నేను నీవు నీవు నేను పది ముక్కల్లో పాతికసార్లు ఈ పదప్రయోగం చేశావు. విషయం విన్న విస్తాను. ప్రజాచైతన్య నాట్య మండలిలో సభ్యురాలిని. వారు వేసే ప్రతి నాటకంలో ఎక్కువగా వేషాలు వేస్తుంటాను. నా పేరు అవంతి.

    చంద్ర మధ్యలో కల్పించుకుని రెండు చేతులూ జోడించి....

    "నమో వాకములు అవంతీ రాకుమారీ!" అన్నాడు.

    "నా పేరు అంత వ్యంగ్యంగా వుందా మహానుభావా! చంద్రశేఖర ఆజాద్ పేరు నీకుండగా లేంది అవంతి అన్నపేరు నాకుండటంలో తప్పేముందట!" గద్దింపుగా అంది అవంతి.

    "సారీ" అన్నాడు చంద్ర.

    "నా కథ, నాకష్టం సాంతం వినండి. ప్రజా చైతన్య నాట్య మండలి గురించి మీకేమన్నా తెలుసా?"

    "ఉహూ నాకు నాటకాలంటే వళ్ళు మంట. సినిమాలు మటుకు తెగ చూస్తాను. ణ మొగుడు మాత్రం నాటకం అంటే చాలు పరుగెత్తుకు వెళతాడు"

    "మీకు మీకు....మొగుడా?"

    చంద్ర నాలుక కొరుక్కున్నాడు. "మొగుడంటే అర్ధం మొట్టేవాడని. నా ప్రాణ మిత్రుడు నా సర్వం ఇందర్. పూర్తిపేరు ఇంద్రజిత్. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్నిసార్లు ఇలా నాటకాలు వేశారో వాడి నాలుక మీదే వుంటుంది" గొప్పగా చెప్పాడు.

    "ఆ మహానుభావుణ్ణి నాకొకసారి పరిచయం చేయరా?"

    "తప్పకుండా! ఇంతకీ మీకొచ్చిన కష్టం చెప్పలేదు"      


Next Page 

  • WRITERS
    PUBLICATIONS