Next Page 
క్రిమినల్స్ -1 పేజి 1


                          క్రిమినల్స్ - 1

                                                      __సూర్యదేవర రామ్ మోహన్ రావు 


    17 సెప్టెంబర్ గురువారం.....

    అర్దరాత్రి కావటానికి  మరొక్క  నిమిషమే  వుందనగా  వులిక్కిపాటుగా నిద్రలోంచి  లేచాడు పరమశివం.

    ఓసారి కళ్ళు  నులుముకుని  చీకట్లోనే  నలువేపులా  పరికించిచూశాడు. ముందుగా  ఏం కనిపించలేదు.

    చీకటికి అలవాటు పడేదాకా  అలాగే  చూస్తుండిపోయాడు. క్షణాలు  నిముషాలయ్యాయి. అప్పుడే  అతనికి అస్పష్టంగా  గదిలోని వస్తువులు కనిపిస్తున్నాయి.

    మంచంమీంచి  లేచి దేవుడి పటం  దగ్గరకు  నడిచి  అక్కడున్న  కిడ్డీబ్యాంకు  బొమ్మను చేతిలోకి తీసుకుని  రెండు మూడుసార్లు  గాల్లో  ఊపి చిల్లరనాణేలు  చేసిన శబ్దాన్ని  విన్నాడు.

    ఆ తరువాత  చీకట్లోనే  కిడ్డీబ్యాంకు  మొఖానికి  అతికించిన  ఓ పసిపిల్లవాడి ఫోటోను చూసేందుకు  ప్రయత్నించి  విఫలమయ్యాడు. ఉండుండి అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. చీకట్లోనే ఆ బొమ్మను  ఆర్తిగా  గుండెలకేసి అదుముకున్నాడు.

    ఇప్పుడతని  కళ్ళముందు ఓ పసివాడి అమాయకమైన  ముఖం వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపిస్తోంది. ఒక్కసారే పరమశివం నేలమీద  కూలబడిపోయి  చిన్నపిల్లాడిలా  ఏడవటం ప్రారంభించాడు.

    సరిగ్గా  అదే సమయంలో  ఊరికి  అవతలగా  వున్న చింతల తోపులో  ఇద్దరువ్యక్తులు  తమ మందీ మార్బలంతో  మందుపార్టీలో పెట్రేగిపోతున్నారు.

    "సరిగ్గానే దెబ్బకొట్టానా?" మధుమూర్తి తడబడుతూ  అడిగాడు ఎదురుగావున్న పట్టాభిని.

    అప్పటికే  మందును బాగా  తలకెక్కించుకున్న  పట్టాభి  మహదానందపడిపోతూ  "భేష్ భేష్" అంటూ  గంగిరెద్దులా  తలూపాడు ఓ పక్క గ్లాసును నింపుకుంటూ.


                                                                   o    o    o


    "పోలీసాఫీసర్ అయ్యేవాడికి  బుద్ధిబలం  ఎంతుండాలో  భుజబలం  అంతే వుండాలి" మేజర్ మార్తాండ్ తన ఒళ్ళో  కూర్చున్న  తన పదేళ్ళ కొడుకు యుగంధర్ కి ఉత్తేజం కలిగించేలా  చెప్పుకుపోతున్నాడు.

    "మీ కాలెందుకు  పోయింది డాడి అని అప్పుడప్పుడు అడుగుతుంటావ్ నువ్వు.

    దేశభక్తి కోసం  ఫణంగా  పెట్టాను అని నేను చెబుతుంటాను. నీకర్ధం అవుతుందో లేదో నాకు తెలియటంలేదు. ఆ దేశభక్తి  అనేదానికోసం  మనిషికి ఎంతో ముఖ్యమైన  కాలును పోగొట్టుకుంటారా అనికూడా  అడిగావోసారి కాని మరెప్పుడూ అలా అడగవద్దు.

    దేశంకోసం కేవలం కాలేనా పోగొట్టుకుంది  మీరు అని అడగాలి. ఆ స్థాయికి నీవు ఎదగాలి" అంటూ  యుగంధర్ తలమీద  చేయివేసి ప్రేమగా నిమిరాడు అతను.


                                  o    o    o


    సరిగా పై రెండు సంఘటనలు  ఒకేరోజు  వేర్వేరు ప్రాంతాల్లో  జరిగాయి.

    ఆ రాత్రంతా పరమశివం కంటిమీద  కునుకులేకుండా  కంటికి, మంటికి ఏకధారంగా విలపిస్తూనే వున్నాడు.

    కాని....అతని కూతురు  అంతా గమనిస్తూనే వుంది. ఆ చీకట్లోనే తండ్రినీ, తండ్రి చేతిలోని తమ్ముడి కిడ్డీబ్యాంకు  బొమ్మను గమనిస్తూ తనూ  ఏడుస్తోంది. లోలోపలే దిగమ్రింగుకుంటోంది.


                                  o    o    o


    ఉదయం ఏడుగంటలు__

    పరమశివం  కిడ్డీబ్యాంకు  బొమ్మను తన లాల్చీజేబులో  వేసుకొని భార్యా, కూతురుకు ఏం చెప్పకుండానే గడపదాటి వడివడిగా ఎలిమెంటరీ స్కూల్ కేసి సాగిపోయాడు.

    "బాబూ నీ పేరేంటమ్మా ?"

    పరమశివం అప్పుడే స్కూల్ నుంచి బయటకొచ్చిన ఒక కుర్రాడ్ని పక్కకుపిలిచి  అడిగాడు.

    "నీకెందుకు?"

    అన్నాడా కుర్రాడు చికాకుగా జారిపోతున్న నిక్కరుని  ఓ చేత్తో పైకి లాక్కుంటూ.

    "ఏంలేదు బాబూ! నీవు అచ్చం "పసివాడి ప్రాణం" సినిమాలో నటించిన రాజాలా వున్నావ్ అందుకని" అన్నాడు పరమశివం చైల్డ్ సైకాలజీని ఆధారంగా చేసుకుని.

    ఆ కుర్రాడి కళ్ళల్లో  మెరుపు.

    "నా పేరు బాబు రాజా అని మార్చుకోనా?" హుషారుగా  అన్నాడా కుర్రాడు.

    "అలాగే మార్చుకుందువుగాని, నీకు ఉదయ్ తెలుసా?" ఆతృతగా ఎదురుచూస్తూ అడిగాడు పరమశివం.

    "తెలుసు పేరు మార్చుకోనా?" మరలా ఉత్సాహ పడ్డాడా కుర్రాడు.

    పరమశివం  ఆ కుర్రాడి సినిమాపిచ్చికి ఒకింత  బాధపడ్డాడు.

    "మార్చుకుందువుగాని ఉదయ్ గురించి ఏమన్నా తెలుసా నీకు?" అతని కంఠంలో పితృహృదయం అడ్డుపడుతోంది.

    "వాడు జైలు కెళ్ళాడు?"

    "ఎందుకు?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS