Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 1

                        

                పడిలేచే కడలితరంగం


                                                 --కొమ్మనాపల్లి గణపతిరావు


    జీవితం ఓ మహార్ణవమైతే అనుభవాలు కడలి కడుపున దాక్కున్న నదీనదాలవంటివి. వివిధ తావులనుండి పరుగిడిన ప్రవాహాలు సముద్రాంతర్భాగంలో చేరి ఒకే రుచిని సంతరించుకున్నట్టే అనుభవాలు సైతం జీవితంలో అందంగా ఇమిడిపోయి ఒకే రాగాన్ని శృతి చేయగల సాధనాలు కావాలి. కానినాడు జీవితమే హితం కాని ఓ చేదు అనుభవంగా మిగిలిపోతుంది.
                                            *                          *                     *       
    ఆ రాత్రి

    కీర్తిశేషులైన రాజానరేంద్రదేవ్ లోగిలిలో స్తబ్దత ఆవరించుకుని వుంది.

    అలనాటి వైభవాన్ని అందంగా గుర్తుచేసే ఆ భవంతిలోని ఓ విశాలమైన గదిలో నరేంద్రదేవ్ తనయులైన రంగనాధంగారు ఆయాసంతో రొప్పుతుంటే వారి ఏకైక పుత్రిక శిల్ప భయకంపితురాలవుతూ దిక్కుతోచని దానిలా సమీపంలో కూర్చుని వుంది.

    ఎన్నో యేళ్ళుగా ఆ లోగిలిలో వుంటున్న రంగనాధం గారి దూరపు బంధువు అన్నపూర్ణమ్మ కూడా కర్తవ్యం తోచక డాక్టరుకోసం నిరీక్షిస్తూ ద్వారంవేపు చూస్తూ నిలబడింది.

    పల్లె పెద్దదైనా సమయానికి వైద్యసహాయం అందని ఆ ఊరి దౌర్బాగ్యం గురించి శిల్పకు బాగా తెలుసు. అందుకే హఠాత్తుగా తండ్రిగారికి గుండెనొప్పి రావటంతో ఫేమిలీ డాక్టరయిన విశ్వాస్ ను ఫోనులో పిలవాలని ప్రయత్నించిన రింగ్ టోన్ రాకపోవటంతో ఆలస్యం చేయకుండా కారులో నౌకర్ని పంపింది.


    నాన్నగారిచే అనకాపల్లి తీసుకువెళ్ళాలనుకుంది కాని ఆమెకు ధైర్యం చాలలేదు.

    కారణం అయిదుమైళ్ళ కుదుపులతో కూడిన కారు ప్రయాణం ఆయన ప్రస్తుత పరిస్థితికి క్షేమం కాదన్న భావం.

    ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ పోరికోలో కారు ఆగిన చప్పుడైంది.

    డాక్టర్ విశ్వాస్ గదిలో అడుగుపెట్టగానే తేలికపడ్డ మనసుతో "గుడీవినింగ్ అంకుల్" అంటూ పలకరించింది శిల్ప.

    మగతగా కళ్ళు మూసుకుని వున్న రంగనాధంగారి బి.పి. చెక్ చేశాడు డాక్టర్.

    నాన్నగారు సాయంకాలం ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఇంటికి రావటం, ఒంటరిగా గదిలో కూర్చోవటం, భోజనాలవేళ పిలవాలని వెళ్ళేసరికి బయలుదేరబోతూ గుండె పట్టుకుని మెలికలు తిరిగిపోవటం అంతా శిల్ప వివరించి చెబుతుంటే మౌనంగా వింటూ ఓ ఇంజక్షన్ చేశాడు.

    కొన్ని కేప్సూల్స్ ఇచ్చి అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడాల్సిందీ వివరించాడు.

    "అంకుల్...."

    వెళ్ళబోతున్న డాక్టర్ విశ్వాస్ శిల్ప కళ్ళల్లోని భయం చూసి లాలనగా తల నిమిరాడు.

    "నథింగ్ టు వర్రీ.... మైల్డ్ స్ట్రోక్ .... అంతే!"

    "నాకేదో భయంగా వుంది అంకుల్."

    "నోనో..... భయంలేదని చెబుతున్నాగా.... వయసు మీదపడుతుంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పవు మరి. రేపు ఉదయాన్నే వస్తాగా."

    ఆమెకు ధైర్యం చెప్పాడు.


    బయటికి వెళ్ళబోతూ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగాడు.

    "ఇవాళ మధ్యాహ్నం నుండీ ఫోన్ అవుటాఫ్ ఆర్డర్..... కాబట్టే ఫోన్ లో నన్ను కాంటాక్ట్ చేయబోయి ఫెయిలయ్యావు. ఈ రాత్రికి ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి అనవసరంగా హైరానా పడకు."


    డాక్టర్ విశ్వాస్ ను అనుసరించి, కారు బారులుతీరిన పూలతోట మధ్యగా ప్రయాణంచేసి సింహద్వారం దాటే వరకూ అలాగే నిలబడింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS