Next Page 
ఛాలెంజ్ పేజి 1

                                       

                                 ఛాలెంజ్
                                   
     - యర్రంశెట్టి శాయి
                   
                                                                                                 
 

   రాజశేఖర్ ఎస్టేట్ లోని ఆ అందమయిన భవనం ఈనాటిది కాదు.

    దానికి సుమారు యాభై ఏళ్ళ వయసుంది.

    కోట్లకు పడగలెత్తిన అమృత రాజశేఖర్ ఆంగ్లేయుల మీద కసితో కట్టించాడది. రంగూన్ లో వ్యాపారం చేస్తున్న రోజుల్లో ఓ పారిశ్రామికవేత్తల సమావేశంలో, ఆ సమావేశం ప్రారంభించడానికి వచ్చిన ఓ ఆంగ్ల అధికారి అన్నాడు.

    "భారతదేశంలో కూడా ప్రపంచంలోని యితర దేశాలకు ఏ మాత్రం తీసిపోనంత గొప్ప వ్యాపారస్తులున్నారు. ప్రపంచంలోని అమితమయిన ధనవంతుల్లో భారతదేశం వారు కూడా చాలామంది వున్నారు. అయినా వాళ్ళు నివసించే యిళ్ళు, ఇళ్ళల్లో వుండాల్సిన సౌకర్యాలు వీటిల్లో మాత్రం వాళ్ళు చాలా శోచనీయమయిన స్థితిలో వున్నారు. ప్రపంచంలోనే వెనుకబడిన జాతిగా భారత జాతిని భావించవచ్చు" ఇలా సాగిందతని వుపన్యాసం.

    ఆ ప్రసంగం అమృతరాజశేఖర్ ని గాయపరచిందెందుకో.

    ఆ తరువాత కొద్దిరోజులకే ఆయన రూమ్ నుంచి ఆర్కిటెక్ట్స్ ని పిలిపించి అత్యంత ఆధునికంగా, అత్యంత ఆధునికంగా, అత్యంత విలాసవంతంగా వుండే భవనం కట్టించడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు.

    ఆ భవనం నిర్మాణానికి అప్పట్లోనే కోట్ల రూపాయలు ఖర్చయిందని అందరూ చెప్పుకుంటారు.

    అప్పటినుంచీ ఆ భవనంలోనే విదేశీ యాత్రికులు అతిధులుగా వుండటానికి పోటీ పడుతూండేవారు.

    అమృతరాజశేఖర్ చనిపోయాక అతని వ్యాపారంలోకి అతని కొడుకు ఆనందరాజశేఖర్ ప్రవేశించాడు.

    ఆనందరాజశేఖర్ చదువు సంధ్యలన్నీ ఇంగ్లండ్ లోనే పూర్తయినాయి. ఇంగ్లీషువాళ్ళ చదువు, వాళ్ళ తెలివితేటలు అన్నీ అతనికి అబ్బినాయిగానీ అతనికి చదువు పూర్తయ్యే సరికి ఆంగ్లేయులంటే విపరీతమయిన ద్వేషం పేరుకుపోయింది.

    భారతీయులను వాళ్ళు రెండో శ్రేణి పౌరులుగా చూడటం అందుకు ముఖ్యకారణం-

    ఇప్పటికీ భారతీయులు ఇంకా వున్నతవిద్య కోసం విదేశాలకెళ్ళాల్సి రావటం ఆయనకు మనస్తాపం కలిగించింది. ప్రభుత్వం చేయలేకపోయినా ఆ పనిని తనయినా చేపట్టాలన్న కోరిక కలిగించి. ఎప్పటికయినా ప్రపంచంలోని మేధావులను వాళ్ళు కోరినంత డబ్బు యిచ్చి భారతదేశం తీసుకు రావాలనీ, వారి సాయంతో ఇక్కడే ప్రపంచంలోని ఇతర ఉన్నత విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోని విద్యా సంస్థలు నెలకొల్పాలనీ నిర్ణయించుకున్నాడతను.

    ఆ రోజు అతను మామూలుగానే ఉదయం అయిదున్నరకు నిద్రలేచాడు. కళ్ళు విప్పగానే ఎదురుగా జంషెడ్జీ టాటా వర్ణ చిత్రం కనిపించిందతనికి.

    టాటా అతని అభిమాన హీరో.

    అతని ధ్యేయం.....

    దేశంలో అందరూ అంత సిన్సియర్ గా, వ్యాపారాన్ని ఓ తపస్సులా చేయగలిగితే మన దేశం చాలా అవలీలగా అగ్ర దేశాల సరసన నిలబడ గలదని అతని పూర్తి నమ్మకం.

    మన దేశంలో శ్రామికులకు కొదవలేదు. తెలివితేటలకు కొదవలేదు. వాటిని సక్రమంగా వినియోగించటమే విజయానికి కారణమవుతుంది.

    తను ఫ్యాక్టరీలూ, వ్యాపార సంస్థలూ అన్నీ అమిత లాభాలార్జిస్తూండడం కేవలం తన అనుభవం, తెలివితేటలూ, రాత్రింబగళ్ళు శ్రమపడగల తన ఓపిక వల్ల కాదు. తను ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్న యజమాని, కార్మికుడు సంబంధ బాంధవ్యాలు, తన డిసిప్లిన్ వారికి వుత్తేజం కలిగించేదిగా వుంటుంది కానీ బాధపెట్టేలా వుండదు.

    అయితే రాన్రాను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అతనికి చిరాకు కలిగించటం ప్రారంభించింది.

    ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ ఎలక్షన్స్ లో ఎన్నికయిన నాయకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తుంటే, ప్రభుత్వం వారిని సమర్ధించటం, మంచీ చెడూ తెలుసుకోకుండా ఏక పక్ష నిర్ణయాలు చేయటం, బయటి రాజకీయాలను తమ ఫ్యాక్టరీ యూనియన్లలోకి తెచ్చి కార్మికులలో క్రమశిక్షణా రాహిత్యానికి దోహదం చేయటం.

    ఇవన్నీ అతనికి తను చేపట్టదల్చుకున్న భవిష్యత్ కార్యక్రమాలను గురించి పునరాలోచనలు కలిగించసాగాయి.

    అసలు స్వాతంత్ర్యానంతరం మన దేశం పెట్టుబడిదారి వ్యవస్థను వదిలేసి సోషలిజాన్ని చేపట్టటం ఆత్మహత్యా సదృశమని అతను భావించాడు.

    అతను భావించినట్లే పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్స్ అన్నీ విపరీతమయిన నష్టాల్లో నడవటం, ప్రైవేట్ సెక్టర్ లు ఎప్పుడూ సమ్మెలు, లాకౌట్ లూ. పారిశ్రామిక దేశం ఏ మాత్రం ప్రగతి సాధించలేక పోవటం, పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ప్రభుత్వం లైసెన్సులు, ఇతర సౌకర్యాలు కలుగచేయటానికి విపరీతమయిన లంచాలు గుంజటం, చిత్రవధ చేయటం అన్నీ జరుగుతూ వచ్చాయి.

    "సార్! బెడ్ కాఫీ" అన్నాడు నౌఖరు వినయంగా.

    రాజశేఖరం కాఫీ తాగుతూనే న్యూస్ పేపర్ హెడ్డింగ్ లు చకచక చూశాడు. కాఫీ తాగటం పూర్తయ్యేసరికి మరో నౌఖర్ వచ్చి నిలబడ్డాడు ఓ బాత్ టవల్ పట్టుకుని.

    "సార్ స్నానానికి ఏర్పాట్లు అయ్యాయి" అన్నాడు.

    రాజశేఖరం బాత్రూం వైపు నడిచాడు.

    అందులో నుంచి బయటికొచ్చే సరికి ఇంకో నౌఖర్ అతను ఆ రోజు ధరించాల్సిన సూటు ఏదో నిర్ణయించటం కోసం కొన్ని సూట్లు హేంగర్స్ తో వరుసగా పట్టుకుని నిలబడ్డాడు. రాజశేఖరం ఒక డ్రస్ సెలక్ట్ చేసి తన గదిలోకి నడిచి టైమ్ చూసుకున్నాడు.

    ఖచ్చితంగా అరున్నరయింది మామూలుగానే.

    బాల్కనీలోకొచ్చి నిలబడ్డాడతను.

 

   అక్కడనుంచే గార్డెన్ అంతా తనిఖీ చేశాడు.

    ఓ క్రోటన్స్ చెట్టు తాలూకు ఎండుటాకు వేలాడుతూ కనిపించింది.

    చకచక మెట్లు దిగి ఆ చెట్టు దగ్గరకు చేరుకున్నాడతను. ఆ ఎండుటాకుని కోయబోతుంటే తోటమాలి పరుగుతో వచ్చాడు.

    "చూళ్లేదు సార్! పొరబాటయింది. ఇంకోసారలా జరగకుండా చూసుకుంటాను" అన్నాడతను వినయంగా.

    "ఇంకోసారి సంగతి తర్వాత ఆలోచిద్దాం? వాట్ షల్ వుయ్ డూ నౌ?"

    "ఒక రోజు జీతం కట్ చేయండి సార్" భయంగా అన్నాడు.

    "దానివల్ల శిక్ష నీ కుటుంబానికి పడినట్లవుతుంది. అందుకని రెండు రోజులు మన భవానాని కెదురుగా వున్న రోడ్డంతా శుభ్రం చేయి. రోడ్ మీద ఒక్క కాగితం ముక్కగానీ, సిగరెట్ పెట్టెలు, పీకలు ఏమీ కనిపించడానికి వీల్లేదు. ఒక వేళ ఏమయినా కనిపించాయంటే మెయిన్ రోడ్ కూడా శుభ్రం చేయాల్సి వస్తుంది. ఓ.కె?"

    తోటమాలి ముఖం రకరకాల రంగుల్లోకి మారుతోంది. తప్పులు చేసేవారికి ప్రపంచంలో ఇలాంటి పనిష్మెంట్ లు వుంటాయని అతనికి మొదటిసారిగా తెలుస్తోంది.

    గడియారం ఏడవగానే నౌఖరు ట్రాలీలో ఫలహారాలు తీసుకుని డైనింగ్ రూమ్ కి చేరుకున్నాడు.

    డైనింగ్ టేబుల్ మీద ఫలహారాలు ఎరేంజ్ చేస్తుండగానే రాజశేఖరం వచ్చాడు.

    ఫలహారాలు పూర్తిచేసే లోపల సెక్రటరీ వచ్చి ఆ రోజు ఎంగేజ్ మెంట్స్ అవీ చక చక చదివాడు.

    బయట పోర్టికోలో కారు సిద్ధంగా వుంది.

    డ్రైవర్ డోర్ తెరచి పట్టుకున్నాడు.

    రాజశేఖరం బయటకొచ్చి కార్లో కూర్చుంటూ ఓసారి డ్రైవర్ వైపు చూశాడు.

    అతను గడ్డం చేసుకోలేదని తెలిసిపోయింది.

    "గడ్డం ఎందుకు చేసుకోలేదు?" సీరియస్ గా అడిగాడు.

    "బ్లేడ్ కొనుక్కోవటం మర్చిపోయాను సార్! నిన్న ఆదివారం షాపులు లేవు"

    "ఊ! పోనీ."

    కారు బయల్దేరింది.

    రోడ్లన్నీ అప్పటికే రద్దీగా వున్నాయి. ఎటు చూసినా స్కూళ్ళకెళ్లే పిల్లలు.

    కొంతదూరం వెళ్ళాక 'కారాపు' అన్నాడతను.

    డ్రైవర్ కారుని పక్కకు తీసి ఆపాడు.

    "దిగు"

    అతను దిగగానే తనూ దిగి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.

    "నువ్వు నడిచి ఆఫీసుకి రా?" అన్నాడు కారు స్టార్టు చేస్తూ.

    "నడిచా సార్?" పక్కనే పరిగెడుతూ అడిగాడు.

    "అవును! గడ్డం చేసుకోనందుకు పనిష్మెంట్ అది."

    కారు వేగంగా వెళ్ళిపోయింది.

    ఆఫీస్ చేరుకన్నాడతను.

    స్టాఫంతా ఎవరిదారిన వారు తలవంచుకుని పనిచేసుకుంటున్నారు. తను ఆఫీస్ కొచ్చినప్పుడు వాళ్ళంతా లేచి నిలబడాల్సిన అవసరం లేదని ఆఫీస్ కి రావటం ప్రారంభించిన రెండో రోజే ఒక రూల్ పాస్ చేశాడతను.

    తన గదిలోకి వెళ్ళగానే ఇంటర్ కమ్ లో సెక్రటరీకి రింగ్ చేశాడు.

    "గుడ్ మానింగ్ సర్!"

    "గుడ్ మానింగ్ మిస్ ప్రమీలా! ఐ వాంట్ ఆఫీస్ మేనేజర్ కనకారావ్!"

    "ఓ.కె! సర్!"

    కొద్ది క్షణాల్లో మేనేజర్ కనకారావ్ వచ్చాడు వినయంగా.

    "గుడ్ మానింగ్ సర్!"

    "గుడ్ మానింగ్ మిస్టర్ కనకారావ్! ప్లీజ్ టేక్ యువర్ సీట్"

    కనకారావు కూర్చున్నాడు.

    "మిస్టర్ కనకారావ్! నేను చాలాకాలం అమెరికాలో వుండటంవల్ల ఇండియాతో సరిగ్గా టచ్ లేకుండా పోయింది! పునర్జన్మల మీద మీ అభిప్రాయం ఏమిటి?"

    "నాకా నమ్మకం వుంది సార్! మూగమనసులు సినిమా ఆరుసార్లు చూశాను."

    "ఐసీ! అయితే చనిపోయినవాళ్ళు తిరిగి పుడతారంటావ్!"

    "ఖచ్చితంగా పుడతారు. బీహార్ లో ఓ చిన్నకుర్రాడు తను కిందటి జన్మలో IAS అఫీసర్నని చెప్పాడట. తల్లిదండ్రులు, బంధువులు వెళ్ళి ఎంక్వయిరీ చేస్తే ఆ కలెక్టర్ సరిగ్గా ఆ కుర్రాడు పుట్టిన ముందు రోజే చనిపోయాడని తేలిందట."

    "నువ్వు చెప్పింది కరెక్టేనని నాకూ అనిపిస్తోంది మిస్టర్ కనకారావ్."

    "ఇప్పుడీ అనుమానం ఎందుకొచ్చింది సార్?"

    "మరేం లేదు! మీ పెదనాన్నగారి అంత్యక్రియల కోసమని నిన్న నువ్వు శెలవుపెట్టి వెళ్ళావు కదా! ఆ సాయంత్రం మీ పెదనాన్నగారే స్వయంగా మనాఫీసుకొచ్చారు నీకోసం."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS