Next Page 
వేసవి వెన్నెల పేజి 1


                                వేసవి వెన్నెల


                                                                          -వాసిరెడ్డి సీతాదేవి

 

                                         


    "డాడీ!"


    జులపాల కిందగా కుడి అరచేతిలో మెడను సవరించుకుంటూ తల ఒక వోరగా విరిచి ముద్దుముద్దుగా అన్నది అమూల్య.


    జడ్జీ కృష్ణారావు జడ్జిమెంటు రాయడంలో పూర్తిగా లీనమై ఉన్నారు. కూతురు పిలుపు ఆయన చెవులకు ఎక్కలేదు.


    "డాడీ!"    


    కృష్ణారావు గారి పెన్ ఆగిపోయింది. చివ్వున తలెత్తి చూశారు. జడ్జిమెంటు రాయడంతో పూర్తిగా నిమగ్నమై ఉన్న కృష్ణారావుకు ఎదురుగా నిల్చున్న కూతుర్ని పోల్చుకోడానికి కొద్ది క్షణాలు పట్టింది. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. కూతురు ముఖంలోకి విస్మయంగా చూస్తూ ఉండిపోయారు.


    అమూల్య తెల్లటి నుదురు మీద నల్లటి ముంగురులు ఫాన్ గాలికి కదులుతున్నాయ్. కళ్ళ మీదకి బరువుగా వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా పైకెత్తి బద్దకంగా తండ్రి ముఖంలోకి చూసింది.


    ఎనిమిదైనా లేపితే గాని నిద్రలేవని అమూల్య ఆరింటికే తన గదిలోకి రావడం కృష్ణారావుకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది.


    "డాడీ?" ముఖం మీద పడుతున్న ముంగురులని ఎడంచేత్తో పైకి తోసుకుంటూ అన్నది.


    "ఏం తల్లీ? ఏమిటి విశేషం? ఇంత పొద్దునే నిద్రలేవడం నిజంగా సెవెంత్ వండర్. అదీ ఎవరూ నిద్ర లేపకుండా!" అంటూ అమూల్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.


    "అసలు నిద్రపోతే కదా డాడీ లేవడానికి?"


    "వాట్?"


    "రాత్రంతా నిద్ర లేదు."


    "కృష్ణారావు విస్మయంగా కూతురు ముఖంలోకి చూశాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. ముఖంలో ఎంతో అలసట. అలసటను పోగొట్టుకోవడానికి అన్నట్టు ఓసారి వళ్ళు విరుచుకుంటూ తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.


    "అసలు నిద్రపోలేదా! ఏం తల్లీ? ఏమైందీ? ఆరోగ్యం సరిగా లేదా?" అంటూ లేచి అమూల్య నుదురు మీద చెయ్యి వేసి చూశాడు.


    "వెచ్చగా ఉంది. జ్వరం వచ్చిందేమో? రామూ! రామూ!"


    "రామూ ఎందుకు డాడీ?"


    "ధర్మామీటర్...?"


    "అబ్బే నాకు జ్వరం రాలేదు. ఆరోగ్యం బాగానే వుంది."


    "నో!నో! నీ ఆరోగ్యం బొత్తిగా బాగాలేదు. లేకపోతే నీకేమిటి నిద్రపోక పోవడం ఏమిటి. ఇప్పుడే మన డాక్టర్ శివయ్యకు ఫోన్ చేస్తాను" అంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ ఎత్తాడు.


    "ఓ డాడీ! నాకేం జబ్బు లేదన్నానుగా? నా మాట వినండి."


    అంటూ తండ్రి చేతిలోని రిసీవర్ లాక్కుని ఫోన్ పెట్టేసింది.


    "మరి నిద్ర ఎందుకు పట్టలేదు."


    అమూల్య బద్దకంగా నవ్వింది.


    "ఏమిటి థల్లే౧ నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు. ఉండు మీ అమ్మను పిలవమంటాను."


    "ప్లీజ్ డాడీ! మమ్మీని పిలవకండి. నీతో నేను ఒక విషయం మాట్లాడాలి. మమ్మీ ఉండకూడదు."


    కృష్ణారావు విస్మయంగా కూతురు ముఖంలోకి చూశాడు.


    "నాతో మాట్లాడాలా? మీ మమ్మీ వినకూడదా?" అన్నట్టు తల పంకించాడు.


    "అర్థం అయిందమ్మా?"


    "అర్థం అయిందా?" అమూల్య చెంపలు ఎరుపెక్కాయి.


    "అవును"


    "ఏమిటి డాడీ?"


    "అదే మీ అమ్మకు కూడా చెప్పలేని విషయం నాకు చెప్పడానికి వచ్చావు అవునా?"


    "అవును"


    "ఎస్ ప్రొసీడ్"


    "అర్థం అయిందన్నారుగా?" సిగ్గుపడుతూ అన్నది అమూల్య.


    "అయినా ముద్దాయి చెప్పకుండానే ఊహించి జడ్జిమెంట్సు రాయకూడదుగా?"


    'ఓ డాడీ'


    'నోసే మిలార్డ్'


    "అబ్బబ్బ డాడీ! నేను సీరియస్ గా మాట్లాడాలని వచ్చాను."


    కృష్ణారావు గలగలా నవ్వాడు.


    'నిజం డాడీ'


    'ఏమిటమ్మా నిజం?'


    నువ్వు నాతో సీరియస్ గా మాట్లాడాలా? అసలు నీకు సీరియస్ గా మాట్లాడ వలసిన విషయాలు కూడా ఉన్నాయా? అదీ నాతో...?


    "అవును డాడీ! మీతోనే"


    "ఏమిటబ్బా అది?" కొంచెంసేపు ఆలోచించింది. చేతిలో వున్న పెన్ తో నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ "ఆ చెప్పనా?" అన్నాడు.


    "మీరు చెప్పలేరు"


    "ఇన్ సల్టింగ్. జస్టిస్ కృష్ణారావు కూతురి మనసులో మాట చెప్పలేక పోవటమా? అందులో నీ మనసులో మాట...?


    "చెప్పండి?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS