Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 1


                     అనగనగా ఓ హనీమూన్

                                                   యర్రంశెట్టి శాయి

                      


    "జాలీ లైఫ్ క్లబ్ లో చేరదల్చుకున్నవాళ్ళు పెళ్ళయిన పదేళ్ళలోపే విడాకులు తీసుకోవాలి. మరీ ఇంత లేటయితే కష్టం."
    "ఇంకోసారిలాంటి పొరబాటు చేయనని హామీ ఇస్తున్నాను"
    "అంటే ఇంకో పెళ్ళి చేసుకునే ప్లానేమయినా వుందా"
    "అబ్బే, లేదండీ"
    "అలా అయితే మీరు పాతికవేలు ఫీజు కట్టండి" అన్నాడు క్లబ్ సెక్రటరీ చిరంజీవి.
    ఇలాంటి క్లబ్ కి సెక్రటరీ అయిన యంగ్ మాన్ చిరంజీవి రూల్స్ ప్రకారం అయితే పెళ్ళి చేసుకోకూడదు. కానీ ఒక డాన్స్ ప్రోగ్రాంలో సంగీత అనే మోస్ట్ బ్యూటిఫుల్ గాళ్ ని తెగ ప్రేమించాడు. ఎంత గాఢంగా ప్రేమించాడంటే...
    "ఏంట్రా? ఆ అమ్మాయి డాన్స్ బాగా చేస్తోందా?" ఆశ్చర్యంగా అడిగారు ఫ్రెండ్స్.
    "అద్బుతంగా చేస్తోంది! షి డిజర్వ్ స్ ఎ గ్రామీ అవార్డ్" అన్నాడు చిరంజీవి.
    "గ్రామీ అవార్డ్?"
    "అవును!"
    "ఈ అమ్మాయికా?"
    "ఇంకోసారి ఆమెను 'అమ్మాయ్' అనకండి"
    "మరేమనాలి?"
    "దేవత!"
    "దేవత!" మళ్ళీ నవ్వులు.
    "ఒరేయ్! మర్డర్ చేస్తాను నవ్వారంటే."
    "ఈ పిల్లను దేవత అనటం కంటే మర్డరయి పోవటమే బెటరు."
    ఇంత గాఢంగా అన్నమాట!
    ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ చెప్పటం కంటే నవల్లో చదివితే మీకే బాగా అర్థమవుతుంది.
    ఈశ్వరరావుకి ఆ ఉదయం ఎందుకనో చాలా హుషారుగా ఉంది.
    హుషారుగా ఉన్నప్పుడు అతనికి బోల్ రాధా బోల్ సంగమ్ హోగాకీ నహీ అని గట్టిగా పాడేయటం చిన్నప్పటినుంచీ అలవాటు. అంచేత ఆ పాట పాడేశాడు.   
    కానీ ఈశ్వరరావు అతనిని గమనించలేదు.
    లిఫ్ట్ ఎయిత్ ఫ్లోర్ చేరుకునేలోగానే పాట పూర్తిచేసేయాలన్న కోరిక కలిగిందతనికి. అందుకని కొంచెం వేగంగా పాడేయసాగాడా పాట.
    "తేరే మన్ కీ జమ్ నామేరే గంగా, కా బోల్ రాధా బోల్ సంగమ్ హోగాకీ నహీ."
    ఆ పాట సాహిత్యంలో ఏదో తేడా వచ్చిందనిపించిందతనికి.
    అందుకని పాటాపి మళ్ళీ మొదటినుంచీ పాడటానికి ప్రయత్నించాడు.
    "తేరే మన్ కీ గంగా అవుర్ మేరే మన్ కీ గంగా కా బోల్ రాధా" పాట మళ్ళీ ఆగిపోయింది.
    "మేరే తేరే మన్ కీ గంగా జమునా కా బోల్ రాధ బోల్ సంగమ్" మళ్ళీ ఆపేశాడు.
    అంతవరకూ ఓపిక పట్టిన లిఫ్ట్ బోయ్ ఎందుకయినా మంచిదని రెండడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు.
    లిఫ్ట్ లో నుంచి బయటకు నడిచాడు ఈశ్వరరావు.
    తను ఛాంబర్ చేరుకునేసరికి సెక్రటరీ వచ్చి "గుడ్ మార్నింగ్ సర్" అన్నాడు వినయంగా.
    "గుడ్ మార్నింగ్! కిత్ నే సదియే బీత్ గయే హై! హాయ్ తేరే సమ్ జానేమే!"
    సెక్రటరీ చిరునవ్వు నవ్వాడు.
    అతనికి ఈశ్వరరావు సంగతి బాగా తెలుసు.
    హుషారుగా వున్నప్పుడు అదే పాట పాడటం అతను చాలాసార్లు విన్నాడు.
    "యస్ మై డియర్ సెక్రటరీ! మన కార్యక్రమాలేమిటో త్వరగా చెప్పు" కొద్దిక్షణాల తర్వాత పాట ఆపేసి అడిగాడు ఈశ్వరరావు.
    "మన కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న దేశమంతటి నుంచీ చాలా పెద్ద ఆర్డర్స్ వచ్చాయండీ! అందరికీ సప్లయ్ చేయలేం కనుక మీరు ఎవరికి ఫేవర్ చేయమంటే వారికి చేస్తామని ఆ కంపెనీ జనరల్ మేనేజర్ గారు ఫైల్ పంపారండీ" అంటూ టేబుల్ మీదున్న ఫైల్స్ దొంతరలో నుంచి ఓ ఫైల్ తీసి అతనికిచ్చాడు.
    ఈశ్వరరావుకి మరింత ఆనందం కలిగింది. కెమికల్ ఫ్యాక్టరీ లాభాలు ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్నాయి.
    వెంటనే అతను ఆపేసిన పాట మళ్ళీ పెదాలమీదకొచ్చేసింది.
    "కిత్ నే సదియా బీత్ గయే హై హోయె తుజేసముజానే మే.
    దిల్ కబడ్ తా బోల్ కభీకమ్ హోగాకి నహీ.
    బోల్ రాధా బోల్ సంగమ్ హోగాకీ నహీ."
    అంటూ నోటికొచ్చినట్లు పాడేశాడు.
    "నహి నహి" అన్నాడు సెక్రటరీ తనూ పాటలో భాగం పంచుకుంటూ.
    "షటప్" అన్నాడు ఈశ్వరరావు.    
    సెక్రటరీ షటప్పయిపోయాడు. ఈశ్వరరావు చకచక ఫైల్స్ చూసి పెన్ తో టిక్ లు వేసి ఫైల్ని మళ్ళీ సెక్రటరీ మీదకు విసిరికొట్టాడు.
    "వాట్ నెస్ట్?"
    "మన అల్యూమినియం ఫ్యాక్టరీ తాలూకూ ప్రొడక్ట్స్ కి స్టాకిస్ట్ గా వుండటానికి రెండువేల అప్లికేషన్లు వచ్చాయి సార్" అంటూ మరో ఫైల్ అతనిముందుంచాడు.
    "వండర్ ఫుల్!" అన్నాడు ఈశ్వరరావు మరింత ఎగ్జయిటయిపోతూ.
    ఆ ఎగ్జయిట్ మెంట్ లో మళ్ళీ పాట తెలీకుండానే వచ్చేసింది.
    "బోల్ రాధా బోల్ సంగమ్ హోగాకీ నహీ!
    అరె బోల్ రాధా బోల్ సంగమ్ హోగాకీ నహీ?"
    "హోగా హోగా హోగా!" అన్నాడు సెక్రటరీ కూడా తనను తను మర్చిపోయి.
    దాంతో ఈశ్వరరావు కోపం ఆగలేదు. తన చేతిలోని ఫైలు విసురుగా సెక్రటరీ ముఖం మీద కొట్టాడు.
    "సారీ సర్!" అన్నాడు సెక్రటరీ.  
    "వాట్ నెస్ట్"
    "మీ బామ్మర్ది గారు మీ సహకారంతో కట్టించిన పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ ఎల్లుండి ప్రొడక్షన్ ప్రారంభించాల్సి వుండగా నిన్న రాత్రి అగ్నిప్రమాదంలో బూడిదయి పోయిందండీ!"
    ఈశ్వరరావు నిశ్చేష్టుడయ్యాడు.
    "అగ్ని ప్రమాదమా?"
    "అవున్సార్! బూడిదయి పోయిందట సార్. అలా అని ఆయన ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి ఇచ్చిన మెసేజ్ చెప్తోందండీ"
    "నో! ఇంపాజిబుల్! నమ్మలేను"
    "నమ్మాలి సర్! ఎందుకంటే మెసేజ్ కాయితం కూడా కాలి వుంది సార్."
    "మైగాడ్! అంతా సర్వనాశనం అయిపోయింది."
    "బూడిద కూడా అయ్యింది సార్."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS