Next Page 
మాయ జలతారు పేజి 1


                                    మాయ జలతారు

                                                                 దాశరధి రంగాచార్య

 

                    


    
                                              1    
    
    * "పీనా న మనా హై న పిలానా హి మనా హై    
    సాఖీ!
    పీనేకె బాద్ హోష్ మె ఆనాహి మనా హై"
    "వహ్వా ఏమ్ ఇన్పించినవుర! ఏమిన్పించినవుర!" అని పిచ్చయ్య పోచయ్యను ఊపాడు
    "వహ్వా వహ్వా" అని వీపు చరిచాడు పరమయ్య
    "ఈ పాట మీదనే ఆడరిస్త నాల్గు షీషలు రే పోరగా పోరడా! రాబే జల్దీ" అని పిలిచాడు పిచ్చయ్య.
    సికింద్రాబాద్ నించి హైద్రాబాద్ వెళ్ళే రోడ్ల మలుపులో కట్లదుకాణం జనసమ్మర్ధం ఎక్కువగా ఉంది జనం గుంపులు ఎడం ఎడంగా కూర్చున్నారు అందరికీ సప్లయి చేయాల్సినవాడు ఒక్కడే కుర్రాడు వేరే గుంపుకి సీసాలిచి డబ్బు పుచ్చుకుంటుండగా పిలిచాడు పిచ్చయ్య.
    "వస్తి, వస్తి" అని డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు కుర్రాడు.
    "అరె రాబే జల్దీ" - మళ్ళా కేకవేశాడు పరమయ్య
    పరిగెత్తుకొని వచ్చాడు కుర్రాడు నాలుగు కల్లు సీసాలకు ఆర్డరిచ్చాడు పిచ్చయ్య వారి ముందున్న ఖాళీ సీసాలూ, డబ్బూ పుచ్చుకొని వెళ్ళి నాలుగు సీసాలు తెచ్చిపెట్టాడు కుర్రాడు ముగ్గురూ మూడు సీసాలెత్తి తాగేశారు మూర్ఖులు, బజ్జీలమ్మే అవ్వ బుట్టతో వచ్చింది.
    "పైసలున్నయిర ఏమన్న?" అని పిచ్చయ్య, పోచయ్య జేబులో చేయివేశాడు చిల్లర చేతికందింది తీశాడు "పిక ముంచుకొని లేదంటన్నవులే?"
    "తాగేకాడ దాచెడి దేందిర, ఉన్నకాడికి తాగాలె" అన్నాడు పరమయ్య.
    పోచయ్య పలకలేదు గుడాలు కొన్నాడు పిచ్చయ్య గుడాలు తింటూ ఒక్క సీసా ముగ్గురూ తాగుతున్నారు.
    _____________________
    * "తాగుట, తాగించుట కాదు తప్పు
    సాఖీ!
    తాగి, తెలివితప్పకుంట శుద్ధతప్పు"
    కల్లు దుకాణంలోంచి బుర్రకధ, బిచ్చపువాళ్ళ పాటలూ వినిపిస్తున్నాయి వీటన్నింటిని మింగుతూ కేక వేసి పక్కనుంచి రైలు సాగిపోయింది సీసా ఖాళీ చేశారు ముగ్గురూ
    "పోరడు కండ్లపడ్తాండా యాణ్ణన్న" అడిగాడు పిచ్చయ్య
    "కంపోనకి పోయినట్లున్నడు"
    "సట్కాయిస్తాం పా-మళ్ళపైన లేడున్నయి?" అని చల్లగా జారుకున్నాడు పిచ్చయ్య అతణ్ణి అనుసరించారిద్దరూ.
    
                                            *    *    *
    
    పోచయ్య భార్య లక్ష్మి గుడిసెముందు కూర్చొని ఉంది ఆ గుడిసె చుట్టూ గూడెంలోని పిల్లలంతా మూగారు ఆవిడంటే పిల్లలకు బాగా చనువు. కధలు చెపుతుంది పాటలు నేర్పుతుంది పాఠాలు కూడా చెబుతూంటుంది.
    అప్పుడే ఇంటికి వస్తున్నాడు బాలయ్య రిక్షా ఇచ్చి చూచాడు "పోరలందర్ని పెట్క కూకున్నవు సర్లేగాని పోచయ్య ఏడికి పోయిండే?" అడిగాడు.
    బాలయ్య మాట విని లేచి నుంచుంది లక్ష్మి "నూకలు తెస్తవని పోయిండన్న"
    "పోయినాడు మల్ల ఆడు చెడిపోతాండు చూడు దోస్తి గిట్టమంచిగ లేదు ఎప్పుడు పోయిండు?"
    "పొద్దుమింకంగ"
    "వాని కెందుకిచ్చినవు పైసలు? నువ్వె తెచ్చుకోక పోయినావు రేషన్ దుక్నానికి పోయి"
    "మందెక్వుంటరు, నువ్వేం పోతవు నేనే తెస్తనని పైకం తీసుకున్నడన్న"
    "ఇంకా డేమొస్తడుగాని, పోరలు పొండి గుడిసెల్లకు" అని అందరినీ వెళ్ళగొట్టి, "నూకలేమన్నున్నయా? లేకుంటే ఆడికే వచ్చి ఒక ముద్ద తిను"
    "ఎందుకన్న! వస్తనే ఉంటడు"
    "ఏందో వాడెట్లనో అయిపోతాండు వాణ్ణి జరా సుద్రాయించాలె చూడు" అని వెళ్ళిపోయాడు.
    కల్లు దుకాణంనుంచి బయలుదేరిన ముగ్గురూ రోడ్డు పక్కనుంచి నడుస్తున్నారు తూలుతూ పరమయ్య తూలి పడిపోయాడు పిచ్చయ్యా పోచయ్యా లేవనెత్తారు
    "ఏమొ అట్ల పడ్తివి?"
    "జర సోలిన"
    "సోలివాణ్ణి పట్టుకుంటంలనే మజ ఉన్నదే ఏమన్నడో ఎరికెనా?" అన్నాడు పోచయ్య.
    "ఇన్పించ రాదుటే ఎరికెనా? ఎరికెనా? అనడుగుతవు"
    "నశా పిలాకె గిరానాతో సబ్ కో ఆతా హై
    మజా తా జబ్ హైకి గిర్తోఁ కా ధామ్ లే సాఖీ!"
    "ఏమ్ చెప్పినవుర, ఏం చెప్పినవుర పోచిగా, పైసల్లేవుగని రొండు చప్టీలు పోయిస్తుంటినిర"
    "ఏమన్నవు? చప్టీ ఏదె బే" అని చేయిచాచి లాగబోయి తూలి పడబోయాడు పరమయ్య.
    ఇద్దరూ పట్టుకున్నారు నడిపించుకు వెళ్ళారు కొంతదూరం నడిచి జనసమ్మర్ధంలేని రోడ్డుకు వచ్చేశారు కరెంటు దీపాల వెలుగుకు తారు రోడ్డు మెరుస్తూంది ముగ్గురూ రోడ్డుకు ఒక పక్కన కూలపడ్డారు.
    "తాగినన్క ఊరుకుంటే మజ ఏమున్నది పాడరపాట_" పిచ్చయ్య ప్రోత్సహించాడు అందుకున్నాడు పోచయ్య.
    "చమేలీ కే మండ్వే తలే
    దో బదన్ ప్యార్ కీ ఆగ్ మే జల్ గయీఁ"
    చప్పట్లు కొడుతున్నారు ముగ్గురూ
    "దో బదన్ ప్యార్ కీ ఆగ్ మే జల్ గయీఁ
    ఏక్ మైకదేసే ఆగే ఉస్ మోడ్ సర్"
    "లేర పోదం పదం పాడుకుంటనే" - పరమయ్య అన్నాడు ముగ్గురూ లేచారు తూలుతూ నడిరోడ్డునుంచి వెళ్ళిపోతున్నారు ఒక కుక్క నాల్క చాచుకొని వస్తూంది వారిని చూచి "భౌ భౌ" అని మొరిగింది "ఉస్కూ ఉస్కూ" అన్నారు ముగ్గురూ.
    కుక్క వెంటపడింది ముగ్గురూ తలా ఒకవైపు పరిగెత్తారు కుక్క రోడ్డుకు వెళ్ళిపోయింది ముగ్గురూ భుజాల మీద చేతులు వేసుకొని ముందుకు సాగారు.
    "అహ తైతక, అహ తైతక"
    "బండి మీద బండి కట్టి పదహారు బండ్లు కట్టి"
    "ఏ బండ్ల నున్నవు కొడకో నైజాం సర్కరోడా?"
    ముగ్గురూ ఎగురుతున్నారు ఆడుతున్నారు పాడుతున్నారు.
    ఎదురుగా లారీ వస్తూంది వారికి లారీ లైట్లు కనిపించలేదు హారనూ వినిపించలేదు దగ్గరకి వచ్చి ఆగిపోయింది లారీ డ్రైవరు దిగాడు.
    "ఏమ్రో! ఏమన్న చావు పిలుస్తోందా ఛస్తే చస్తిరి కాని ఇంకో లారీ కిందపడి చావురి జరుగుండి జరుగుండి" అని పక్కకు నెట్టాడు.
    అప్పుడుగాని ఈ లోకంలోకి రాలేదు. వారు పోచయ్య లారీని చూచాడు "బియ్యమేన అణా ఇండ్లున్నయి?" అడిగాడు డ్రైవరును.
    "నీ కెందుకుర అయ్యన్ని? నడువ్ బే నడువ్" అని నెట్టాడు డ్రైవరు కాస్త తూలి సర్దుకున్నాడు "అట్లాకాదన్న నూకలు తెస్తనని పైకం త్యీసుకొని ఎల్లిన కల్లు దుక్నానికి పెట్టిన జరిన్ని పెడ్తవేమోనని"
    పెద్దగా నవ్వాడు డ్రైవరు "వచ్చిండు తీన్ మార్ ఖాన్, సన్నబియ్యం తినేటంద్కు పోబే పో" అని లారీ ఎక్కి వెళ్ళిపోయాడు.
    మళ్ళీ ముగ్గురు కలిసి సాగిపోయారు "ఇదో గూడె మొచ్చింది గా బాలిగాడున్నడు సూశినవా? వాడు గడ్డివాముకు కాపలా ఉన్న కుక్కను వంటోడు వాడు తాగడు, మందిని తాగనియ్యడు పోశిగా, నువ్వట్లపో మేమిట్ల పోతం జరా సంబ్లాయించుకొని పోతవులే"   


Next Page 

  • WRITERS
    PUBLICATIONS