Next Page 
నీరు పల్లమెరుగు పేజి 1


                                     నీరు పల్లమెరుగు           
                                                                  డా||సి.ఆనందారామం

                                  


    తడబడుతున్న అడుగులతో, దడదడ లాడుతున్న గుండెలతో మేనేజర్ గదిలోకి అడుగుపెట్టింది తులసి. సూర్యం తలెత్తి తులసిని చూసి చిరునవ్వుతో "రండి!" అంటూ కుర్చీ చూపించాడు. ఆ చిరునవ్వుకూ, ఆప్యాయతతో కూడిన పలకరింపుకూ చాలా వరకు స్థిమితపడింది తులసి. ఎడంచేత్తో నుదుటిమీది చెమట తుడుచుకుంటూ కుర్చీలో కూచుంది. సూర్యం, తులసి చేతిని సానుభూతితో చూస్తూ "ఎలా వుంది మీ చెయ్యి" అన్నాడు.
    తులసి మొహమాటంగా తన చేతిని పైటకొంగు చాటున దాచుకుంటూ "అలాగే వుంది. కొంచెం రోజుల్లో స్పెషలిస్టుకి చూపించుకొందామనుకొంటున్నాను. త్వరలో నయం కావచ్చు." అంది.
    "లెటజ్ హోప్ ఫర్ ది బెస్ట్" మామూలుగా అన్నాడు సూర్యం. సంభాషణ తర్వాత నడవలేదు. తను వచ్చిన విషయం ఎలా ప్రస్థావించాలా అని సంకోచంతో మధనపడుతోంది తులసి.
    "కాఫీ తెప్పించమంటారా?" అని ప్యూన్ ని పిలవటానికి బెల్ ప్రెస్ చెయ్యబోయాడు సూర్యం.
    "వద్దు-వద్దు. నేను మీతో నా ఉద్యోగం విషయం మాట్లాడదామని వచ్చాను."
    "ఉద్యోగం విషయమా? మా కంపెనీ పంపిన నోటీస్ అందలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు సూర్యం.
    ఆ ఆశ్చర్యానికీ, ఆ ప్రశ్నకూ ఉసూరుమనిపోయింది తులసి.    
    "అందింది. అందుకే వచ్చాను. మీకు మా యింటి పరిస్థితులు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నా ఉద్యోగం పోతే ఎంత కష్టమో ఆలోచించండి"
    "అవుననుకోండి. కంపెనీకి పని జరగటం కావాలి కాని, మన కష్టసుఖాలన్నీ ఆలోచిస్తారా?"
    "ప్లీజ్! మన చిన్ననాటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా నాకీ సహాయం చెయ్యలేరా?"
    సూర్యం కళ్ళు చిత్రంగా మెరిశాయి. ఇన్ని రోజుల తర్వాత తులసి మొదటిసారిగా చిన్ననాటి స్నేహం ప్రస్తావన తెస్తోంది.
    "మన చిన్ననాటి స్నేహం నేనేనాడూ మరిచిపోలేదు. ఆ సంగతి మీకు తెలుసు. కానీ, ఇక్కడ మీలాగే నేనూ ఒక ఉద్యోగిని. కాకపోతే, మీకంటే పై ఉద్యోగిని. డైరెక్టర్ల ఆర్డర్లకు వ్యతిరేకంగా నేనేమీ చెయ్యను...."
    "మీరలా అంటే ఎలా? మీ దయవల్ల నా ఉద్యోగం నిలుపుకోగలిగితే మీకు జీవితాంతం కృతజ్ఞురాలినయి ఉంటాను" తనను తను మరిచి దీనంగా ప్రాధేయపడింది తులసి. అలా ప్రాధేయపడుతున్న తులసిని చూడలేనట్లు మొహం తిప్పుకున్నాడు సూర్యం.
    "మీ కృతజ్ఞతలు నాకు చాలా ఇష్టం. అందుకోసం నా శక్తి వంచనలేకుండా మరేవిధంగా సహాయపడమన్నా పడతాను. కానీ, ఈ ఉద్యోగ విషయంలో మాత్రం పూర్తిగా నిస్సహాయుణ్ణి."
    ఆశలన్నీ అణగారిపోయాయి తులసిలో. లేచి నిలబడి, "వస్తాను" అంది. సూర్యం తన కుర్చీలోంచి లేచి తులసికి కొంచెం దగ్గరగా వచ్చి బల్లమీది తులసి హేండ్ బాగ్ తులసి ఎడంచేతికి అందించాడు. తులసి తెల్లబోయి చూసింది. అతని చూపులు ప్రసన్నంగానే ఉన్నాయి. చిరునవ్వు ఆప్యాయంగానే ఉంది. మరి.....


Next Page 

  • WRITERS
    PUBLICATIONS