Next Page 
ప్లే పేజి 1


                                            ప్లే
    
                                                          ---సూర్యదేవర రామ్ మోహనరావు
    

                                
    
  

    హైదరాబాద్...
    
    బషీర్ బాగ్...
    
    సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిముషాలైంది. చలికాలం కావడంవల్ల సన్న, సన్నని చీకట్లు ముసురుకున్నాయి.
    
    మంచుతో కలగలిపిన చల్లని చలిగాలి రివ్వు, రివ్వున వీస్తోంది. అయినా బషీర్ బాగ్ చౌరస్తా, ఎప్పటిలాగే సందడిగా ఉంది. ట్రాఫిక్ ఐలాండ్ లోని పోలీస్ కానిస్టేబుల్, స్టేజి మీద కధాకళి చేస్తున్న డాన్సర్ లా ఉన్నాడు.
    
    చౌరస్తాకు, నాలుగువేపులా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్, హడావుడిగా తమ పని తాము చేసుకుపోతున్నాయి.
    
    అప్పుడే రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ గా మారింది-
    
    లిబర్టీ వేపు నుంచి, అబిడ్స్ కు వెళ్ళే వాహనాలు సర్రుమని, ముందుకు దూసుకుపోయాయి.
    
    అదే సమయంలో-
    
    కుడిపక్క, ఫుట్ పాత్ రోడ్ ని క్రాస్ చెయ్యడానికి నుంచున్నాడో వ్యక్తి.
    
    ఆయనకో అరవై ఏళ్ళుంటాయి-తెల్లటి పంచె, దానిమీద తెల్లటి లాల్చీ, ఆ లాల్చీ మీద గ్రే కలర్ స్వెట్టర్ - కంఠం చుట్టూ మఫ్లర్- ఎడం చేతిలో ఏదో డైరీ - కుడి చేతి వేళ్ళ మధ్య వెలుగుతున్న చార్మినార్ సిగరెట్! కాళ్ళకు హవాయి చెప్పల్స్...
    
    విశాలమైన నుదురు.........గాలి కెగురుతూ, ఆ నుదురుమీద పడుతున్న తెల్లటి జుత్తును పైకి తోసుకుని, కళ్ళజోడుని సర్దుకుని, ఫుట్ పాత్ మీద నుంచి రోడ్డుమీదకు అడుగేసాడు.
    
    రెండే రెండు నిమిషాలు.
    
    పెట్రోల్ బంక్, బాబూఖాన్ ఎస్టేట్ పక్కనుంచి, ప్రెస్ క్లబ్ వేపు, తలవంచుకుని నడుస్తున్నాడాయన.
    
    ప్రెస్ క్లబ్ కు, ఆయనకు మధ్య ఇరవై అడుగుల దూరం మాత్రమే ఉంది.
    
    "నమస్తే సాబ్...." తలెత్తి చూసాడాయన ఎదురుగా ముఫ్ఫై ఏళ్ళ యువకుడు. ప్రెస్ క్లబ్ లోంచి అప్పుడే బయటకొచ్చిన వాడిలా ఉన్నాడు. ఆ యువకుడెవరో వెంటనే గుర్తురాలేదు ఆయనకు. కళ్ళతోనే విష్ చేసి, ముందుకు నడిచాడు. ఆ యువకుడు జనం మధ్యలో కలిసిపోయాడు.
    
    తనను విష్ చేసిన యువకుడ్ని గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రెస్ క్లబ్ మెట్లెక్కాడాయన.
    
    ఆయన పేరు జగన్నాయకులు.
    
    నలభై ఏళ్ళపాటు, ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో, సీనియర్ పొలిటికల్ రిపోర్టర్ గా పనిచేసి రిటైరై వారంరోజులే అయింది.
    
    రిటైరయినా, అక్రమాలు, అన్యాయాల పట్ల తక్షణం స్పందించి, పరిశోధన లోకిదిగి సంచలనాత్మక న్యూస్ స్టోరీస్ ని వెలికి తీయటంలో మాత్రం వెనకడుగు వేయకపోవటం ఆయన ప్రత్యేకత.
    
    అందుకే ఆయనకి అరుణ్ శౌరీ, అరుణ్ పూరి, శేఖర్ గుప్తా, ఎస్. వెంకటనారాయణ లాంటి ప్రముఖ జాతీయస్థాయి పాత్రికేయులకున్నంత గొప్ప పేరుంది.
    
    జగన్నాయకులు పేరు వింటేచాలు-అటు పవర్ లాబీలో-ఇటు బ్యూరో క్రాట్స్ కారిడార్స్ లో-ఆపైన చీకటి ప్రపంచపు మాఫియా ముఠాల స్థావరాలలో దడ-ఒణుకు.
    
    ప్రజలకు అన్యాయం జరిగినా-ప్రభుత్వ శాఖల్లో నిర్లక్ష్య ధోరణి చోటు చేసుకున్నా-నాయకుల కదలికల్లో అక్రమాలు ప్రోది చేసుకున్నా, ఇట్టే స్పందించి-దాని లోతుపాతుల్ని తరిచి చూసి-వాటిని వెలుగులోకి తెచ్చి-పత్రికల్లో చోటు చేసుకునే వరకు నిద్రపోడు-
    
    ఎందరు బెదిరించినా ఎన్నోసార్లు మృత్యువు ఆయన సమీపానికి వచ్చి హెచ్చరిక చేసి వెళ్ళినా, జంకని మొండి ధైర్యం ఆయనది.
    
    యాభై ఎనిమిది ఏళ్ళు మీదకొచ్చి, ఆయన్ని రిటైర్ మెంట్ కి గురిచేసిన రోజు ఆయన నిజంగానే బాధపడ్డాడు. బహుశా అదేనేమో ఆయన బాధ పడిన తొలి సందర్భం...
    
    రిటైరయ్యేనాటికి ఆయన చేతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన, ఒక న్యూస్ స్టోరీకి ఊపిరిపోసే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఆయన నిమగ్నమయి ఉన్నాడు.
    
    ప్రెస్ క్లబ్ భారత్ కి ఇంకొద్ది క్షణాల్లో ఆయన ఎంటరవుతాడనగా, ఒక యువకుడు హడావిడిగా వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
    
    "సార్...." పిలిచాడా యువకుడు.
    
    పరధ్యానంగా ఉన్న జగన్నాయకులు ఆ పిలుపుని వినిపించుకోలేదు.
    
    "సార్...." ఆ యువకుడు మరోసారి ఒకింత బిగ్గరగా పిలిచాడు.
    
    ఆ పిలుపుతో జగన్నాయకులు చటుక్కున వెనుదిరిగి చూసాడు.
    
    చూస్తూనే ఆ యువకుడ్ని గుర్తుపట్టాడు జగన్నాయకులు-
    
    ఆ యువకుడికి జగన్నాయకులే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో జాబ్ ఇప్పించారు.
    
    "ఏమోయ్.....బావున్నావా" ఆప్యాయంగా పలకరించాడు జగన్నాయకులు.
    
    "మీతో అర్జంటుగా ఓ విషయం మాట్లాడాలి. మీరు ఫర్మిషనిస్తే" ఆ యువకుడు నసుగుతూ అన్నాడు.
    
    ఆ యువకుడు మాట్లాడుతున్నపుడు అతని కంఠంలో తొంగిచూసిన ఆదుర్ధాని, ఆందోళనని పసిగట్టలేదు జగన్నాయకులు.
    
    "ఈ టైమ్ లోనా? రేపయితే ఎలా ఉంటుంది....?" అన్నారు జగన్నాయకులు యధాలాపంగా.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS