Next Page 
అనైతికం పేజి 1


                                       అనైతికం
                                                     యండమూరి వీరేంద్రనాథ్

                                     నవల ప్రారంభించే ముందు
                                         ఇది చదవండి

    అసలు దీన్నంతా ముందు మాటగా వ్రాద్దామా- లేక నవల చివర వ్రాద్దామా అని ఆలోచించాను. చివర్లో వ్రాస్తే, అదేదో డిఫెన్సు వాదనలా వుంటుందనిపించింది.

 

    ఈ ముందుమాట వ్రాయటానికి కారణం ఒకటుంది. ఈ నవల సీరియల్ గా వస్తున్నప్పుడు కొన్ని విమర్శనాత్మక ఉత్తరాలు వచ్చాయి. అందులో కొన్ని సహేతుకమైనవి. వాటిని దృష్టిలో పెట్టుకుని- ఈ నవలలో మార్పులు చేశాను. పోతే, మరికొన్ని నిర్హేతుకమైన విమర్శలు. నేను ఏ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని వ్రాశానో, ఆ కోణంలోంచి చదవకపోవడం వలన వచ్చినవి. నిజానికి అవి విమర్శలు కావు. రచయితతో అభిప్రాయభేదాలు.

 

    పాఠకుల్ని తనతోపాటూ తీసుకు వెళ్ళలేకపోవటం రచయిత అసమర్థత అయితే అయి వుండవచ్చుగాక! కానీ- అసలు ఆ కోణంలోంచి ఆలోచించటానికే ఇష్టపడకుండా మంకుపట్టు పట్టే పాఠకుడిని ఏ రచయితయినా ఏం చేయగలడు? ఉదాహరణకి ఈ నవల చివరిపేజీలో అచ్చమ్మ కూతురు పాత్ర వస్తుంది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ- "నేను ఉద్యోగం చేయను. పెళ్ళి చేసుకుని గృహిణిగా స్థిరపడతాను" అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంది. దీనిమీద ఎవరయినా పాఠకుడు (రాలు) విపరీతంగా స్పందించి, "మరెందుకు అంత చదువు చదవటం? ఎంత నేషనల్ వేస్ట్? అంత చదువు చదివింది ఇంట్లో వంట చేసుకుంటూ పడి వుండటానికా?" అంటే రచయిత ఏం చెప్పగలడు? ఆ పాత్ర అభిప్రాయం అది. "....ఎవరి క్రిందో ఆఫీసులో పనిచేయటం కన్నా నా పిల్లల్ని పెంచటమే నాకు తృప్తి. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ గృహిణిగా వుండటం. ఏదైనా కారణంవల్ల... అంటే ఆర్థిక పరిస్థితులవల్ల కానీ, భర్తనించి విడివడటం వల్ల కానీ ఉద్యోగం చేయవలసి వస్తే, అప్పుడు చేస్తాను. పోతే- చదువుకీ, ఉద్యోగానికీ సంబంధం లేదని నేను నమ్ముతున్నాను" అని ఆ పాత్ర అంటే- అందులో తప్పేముంది? గృహిణిగా తన హక్కులు తాను పరిరక్షించుకోగలనన్న నమ్మకం ఆ అమ్మాయికుంది. స్త్రీ వాదమంటే స్వతంత్రంగా బ్రతకటం కాదనుకొంటోంది. ఆ అభిప్రాయాన్నే చెప్పింది. అదే రచయితగా ఈ కథకి ముగింపు కూడా. అయితే, ప్రస్తుత సమాజంలో స్త్రీ జీవిత గమనం అటువంటి పూలపాన్పు కాదు. తన ఆశలు నెరవేరక, పోరాడవలసి వస్తే- ఏం చేయాలో కూడా రచయితగా రెండు పాత్రల ద్వారా చెప్పించాను. (నిజానికి అవే ముఖ్యమైన పాత్రలు.) అయితే అది సెకెండ్ ప్రిఫరెన్సు.    

 

    ఇదింత క్లియర్ గా వున్నప్పుడు - ఇక అర్థం కాక పోవటానికేముంది? ముగింపు అంటే- అది సుఖాంతమో- దుఃఖాంతమో అయి వుండనవసరం లేదు. ఆ విధమైన అంతం జీవితానికే లేదు. అలాటి 'అంతాలు' అనుభవాలకీ, అనుభూతులకీ వుంటాయి. జీవితాలకి కాదు.

 

    ఈ నవల ముగింపు పట్ల అసంతృప్తే కాదు. చదువు కున్నంతసేపూ మనసంతా దేవేసినట్టు, ఒక రకమైన ఫస్ట్రేషన్ కలుగుతున్నట్టు, 'ఛీ ఇలా కాకపోతే ఎంత బావుణ్ణు' అనిపించినట్టు వుంటే - అదొకరకంగా విజయమే! మన వికృత స్వరూపాలు అద్దంలో చూసుకోవటానికి భయమెందుకు? అందమైన కలల్లో బ్రతకటం తప్పుకాదు. అవి కేవలం 'కల'లన్న నిజాన్ని మర్చిపోనంతవరకూ!... కలలే జీవితమన్న భ్రమలో రచనల్ని 'తయారుచేసి' కొంతకాలం పాటూ నేనూ అమ్మాను. దానికి విరుద్ధంగా వాస్తవాన్ని చెప్పాలన్న తాపత్రయంతో వ్రాసిన నవల ఇది.

 

    ఇందులో అచ్చమ్మ, అహల్య పాత్రలు నిజంగా వున్నవి. వారి అనుమతితోనే ఈ నవల వ్రాయటం జరిగింది. అచ్చమ్మ కథ ముగింపు కూడా యధాతథమే. అహల్య మాత్రం విదేశాల్లో లేదు. ప్రస్తుతం భారతదేశంలోనే వుంటోంది. అదొక్కటే మార్పు!!! ఇద్దరి కష్టాలూ రెండు వేర్వేరు కోణాల్లోంచి వచ్చినవి! ఒకరివి- అంతర్గతమైన అసంతృప్తి వల్ల (మైక్రో), మరొకరివి బయట సామాజిక దురన్యాయం వల్ల (మాక్రో) కలిగినవి. ఈ రెంటినీ జోడించి వ్రాయొచ్చునన్న ఆలోచనే ఈ నవల ఉద్భవానికి కారణం. ఈ కోణంలోంచి చదివితే రచయిత చెప్పదల్చుకున్నది క్లియర్ గా అర్థమవుతుంది.

 

    నైతికమూ, సామాజికమూ, ఆర్థికమూ- అన్న మూడు కట్టుబాట్లకి ప్రతీకలుగా అహల్య, అచ్చమ్మ, శ్యామల- అన్న మూడు పాత్రల్ని సృష్టించటం జరిగింది. ఈ పాత్రలు తమ కథలు తాము చెపుతాయి. ఈ టెక్నిక్ ని "వెన్నెల్లో గోదారి" అన్న నవలలో ఉపయోగించాను. అయితే ఆ నవలలో అన్నీ ఉదాత్తమైన పాత్రలవటం చేత ఏ ఇబ్బందీ రాలేదు. ఈ నవలలో అలా కాదు. కేవలం 'మామూలు మనుష్యుల' కథ ఇది. అందుకే ఇబ్బంది.

 

    చాలా రచనల్లో... మంచి తనానికి ఒక ప్రతీక (హీరో), చెడుకి ఒక ప్రతీక (విలన్) వుంటారు అయితే నిజ జీవితంలో అలా కాదు. మనలోనే ఒక హీరో (మంచి ఆలోచించేవాడు), ఒక విలన్ (చెడు చేసేవాడు) వుంటాడు. మన విలన్ ని మనం మనలోనే దాచేసుకుంటాం. కనీసం అటువంటి ఆలోచన వున్నట్టు కూడా బయటకు కనపడనివ్వం.

 

    లేదా- మన బలహీనతల్ని తార్కికంగా, మనకి కన్వీనియెంట్ గా మార్చుకుంటాం! వాదిస్తాం!! మన భావాలే సరియైనవి అని నమ్ముతాం!!!

 

    ఇదిగో, సరీగ్గా ఈ నవల వ్రాయటంలో - ఇక్కడే వచ్చింది చిక్కు! ముఖ్యంగా అహల్య పాత్ర తన కథ చెప్పేటప్పుడు!!

 

ఆమె చుట్టూ వుండే పాత్రలు- ఆమెకి ఒకలాగా కనపడతాయి. పాఠకులకి మరోలాగా కనపడతాయి. అంతే కాదు, ఆమె ఆలోచనా విధానం మారినప్పుడల్లా- ఎదుటి పాత్ర స్వభావం మారినట్టు (పాఠకులకి) అనిపిస్తుంది. దాంతో- పాత్రలకి ఒక వ్యక్తిత్వమూ, కన్సిస్టెన్సీ వున్నట్టు కనిపించదు. మన ఆలోచనలు నిజానికి ఎంత గందరగోళంగా, ఎంత తొందర తొందరగా మారిపోతూవుంటాయో, అంత వాస్తవంగా (అహల్యే తన కథ చెపుతూ వుంటుంది కాబట్టి) ఆమె భావాలన్నీ వెంట వెంటనే మారిపోతున్నట్టు చిత్రీకరించటం జరిగింది. ఉదాహరణకి- ఆమె తన బావగారిని ఇష్టపడినప్పుడు ఆయన ఏం చేసినా బాగానే వుంటుంది. చివరికి ఆయన తన చెల్లి పెళ్ళికి డబ్బు ఖర్చు పెట్టకపోవటం కూడా తార్కికంగా సరియైనదే అనిపిస్తుంది. అందుకే అన్నారేమో- ప్రేమ గుడ్డిదని.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS