Next Page 
అక్షరయజ్ఞం పేజి 1

                                         అక్షరయజ్ఞం
   
                                                  --సూర్యదేవర రామ్ మోహనరావు
   

   

 

                               

 

   నీరవ నిశీధిలో కీచురాళ్ళ రొద మధ్య
   అతను ఒంటరిగా నడుస్తున్నాడు.
   చెదిరిన జుత్తు...
   పెరిగిన గెడ్డం...
   మాసిన బట్టలు...
   అరిగిన చెప్పులు...
   అలక్ష్యంగా నడక...
   అంతులేని ఆలోచనల్ని నింపుకొన్న మెదడు.

   
    నిర్మానుష్యంగా వున్న నడివీధిలో నిరాకారంగా నింగికేసి నడుస్తున్నట్టు.... నడుస్తూనే వున్నాడు.
   
    కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. వాలుతున్న ఆ కళ్ళ రెప్పల వెనుక కరిగిపోతున్న కలలు... అలలు... అవే కన్రెప్పలు అలవోకగా మూతపడితే...
   
    కైలాస శిఖర దర్శనం...
   
    ఆ నిశ్శబ్ద రాత్రిలో నింగీ, నేల, నీరు, నీడ అతనునిమజ్జనం చెందినట్లుగా ఒక వింత భావన...
   
    కాలభైరవుడిలా కదిలిపోతున్న అతను తీహార్ జైలు తలారిలా, తీసి హజార్ సెంటర్ రౌడీలా వున్నాడు.
   
    ఆ చీకటి, ఆ నిశ్శబ్దం, ఆ నిర్మానుష్యం అతన్నేం భయపెట్టలేక అవే భయపడుతున్నట్లుగా వున్నాయి.
   
    నైరాశ్యపు లోతుల్ని, నిరాశా క్రోధాల్ని కొలుస్తున్న అతని మస్తిష్కం, మంచుగడ్డలా గడ్డ కట్టుకుపోయింది.
   
    అతని వయసు పాతిక.... ముఫ్ఫై మధ్య వుంటుంది. ఆరడుగుల ఎత్తులో, బలంగా, దృఢంగా వున్నాడు. సౌకుమార్యం అంటే తెలీని రాక్షసత్వం అతని కండరాల అంచులలో దాగి వుంది.
   
    అక్కడో లైటు, అక్కడో లైటు.... బితుకు బితుకుమంటూ చీకటిని పారద్రోలే ప్రయత్నంలో విఫలమవుతుండగా వాటిమధ్య అల్లరిమూకల అరాచక శక్తుల ఆవేశానికి బలై, బ్రద్దలయిన నియాన్ లైట్లు మనిషి రాక్షస ప్రవృత్తికి ప్రతీకగా మిగిలివున్నాయి.
   
    అతను ఉన్నట్టుండి పెద్దగా నవ్వాడు... నవ్వుతున్నాడు. నవ్వుకి నవ్వుకి మధ్య సంధిలో ప్రేలాపనలు.
   
    బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్....
   
    వీనస్...
   
    అద్భుతమైన అందాలరాణి...
   
    ప్రేమకు నిలయం...
   
    ప్రేమ ప్రపంచానికి రాజ్ఞి...
   
    అందాల లోకానికి సామ్రాజ్ఞి...
   
    ఉన్నట్టుండి ఒక్కసారి ఫెల్లున నవ్వాడు. రోడ్డు ప్రక్క పేవ్ మెంట్ పై సిగ్గు విడిచిన రాజనీతికి, దిక్కుమాలిన దేశ ఆర్ధిక వ్యవస్థ అవశేషాలుగా శేష వస్త్రాలతో చలికి ముడుచుకు పడుకున్న పేద జీవులు ఉలిక్కిపడి లేచారు. ఎందుకంత భయం... భయాన్ని మించిన పేదరికాన్ని వెన్నుపై మోస్తూ ఇంకెందుకు భయం... దేని గురించి ఆ ఉలికిపాటు....?!       
   
    ఒక బక్కప్రాణి లేచి-
   
    "పాపం ఎవరో పిచ్చివాడు.... పిచ్చి ముదిరినట్టుంది" అంటూ కుదుటపడ్డాడు.
   
    "ఎస్... ఐ యామ్ మేడ్...
   
    నాట్ బేడ్...
   
    ఇఫ్ వీనస్ ఎండ్...
   
    రొమాన్స్ విల్ ఎండ్...
   
    డ్రీమ్స్ విల్ ఎండ్...
   
    బ్యూటిఫుల్ ఐయిడియస్ విల్ ఎండ్....
   
    కవిత్వానికి, కలలకి ప్రతీక కాలి మసైపోతుంది...
   
    మీరు ఆకల్ని మీదేసుకొని, పేదరికాన్ని కప్పుకుని, అనారోగ్యాన్ని ఆసరా చేసుకొని, అనాకారితనాన్ని ఔపాసన పట్టి పడుకోండి. అసలు ఆలోచించక మీరు, ఎక్కువాలోచించి నేను ఇలాగే అంతమైపోతాం."
   
    పెద్దగా అరుస్తున్నట్లుగా అంటూ ముందుకు సాగిపోతూనే వున్నాడు.
   
    క్షణాలు, నిమిషాలు గడిచిపోతూనే వున్నాయి. వీధి మలుపు తిరిగాడు.
   
    జాలీల షట్టర్స్ లోంచి మెరుస్తూ కనిపిస్తున్న బంగారు నగలు... వజ్రాలహారాలు... ముత్యాల సరాలు... అన్నీ.... వరుసగా బంగారపు కొట్లు...
   
    "సెంటిమెంట్ పీపుల్ యూజ్ లెస్ మెటల్... అదిగో అక్కడెవరో కొట్టుకుంటున్నట్లుందే...?! నగరాలలోని మనుష్యుల, నాగరికత తెలిసిన జంతువులు, రంగు రంగుల మనుష్యులు, రంగు వెలసిన బొమ్మలు, నల్లటి మనుష్యుల ఆఫ్రికా, తెల్లవాళ్ళ యూరప్, చిన్న కళ్ళ చైనా, బోదురు కప్పల శ్రీలంక...భగవద్గీతలోని జ్ఞానం, ఖురాన్ లోని విశ్వజనీనత, బైబిల్ లోని త్యాగం, తోరాలోని ప్రాచీన జ్ఞానసంపద.... ఏవీ వీళ్ళకు తెలీదా? వీళ్ళు ఈ జాతుల వాళ్ళు కారా? రాక్షస గోళం నుంచి దిగబడ్డారా?
   
    "ఏయ్... ఎవర్రా అక్కడ? ఏమిటా గోల? ఎందుకా గుద్దులాట? జ్ఞానహీనుల్లారా....?"
   
    ఆ నిశీధి ప్రపంచాన్ని డబుల్ బ్యారల్ గన్ బాయ్ నెట్ తో గడ్డమెత్తి ప్రశ్నించినట్లున్న అతని మాటలకు వాళ్ళు అదిరి, బెదిరి, ఆపై చెదిరిపోయారు.
   
    మరలా నవ్వాడు....
   
    ఇప్పుడతనిపై నాలుగో రౌండ్ నాటుసారా బాగా పనిచేస్తోంది.
   
    పై గుండీ లూడిన ఛీజ్ కాటన్ షర్ట్ పై ప్రాభవపు ప్రమాణాల్ని కోల్పోయిన జీన్ పాంట్... అతని పేదరికానికి పరాకాష్టగా, పరిహసిస్తున్నట్లున్నాయి.
   
    అతను ఆశగా ఫ్యాంటు జేబులోకి చెయ్యెట్టాడు. అక్కడ తగిలిన చిన్న సీసాను బయటకు తీశాడు. దానివేపోసారి ప్రేమగా చూసి, దానిలో మిగిలిన ద్రవాన్ని ధారగా గొంతులోకి వంపుకున్నాడు. కొద్దిక్షణాల్లో అది ఖాళీ అయిపోయింది.
   
    దాన్ని రోడ్డువారగా విసురుతూ తూలిపడ్డాడు. లేచేందుకు ప్రయత్నించి మరో రెండడుగులు వేసేలోపే మరలా రోడ్డుకి ఓవేపు తూలిపడ్డాడు.
   
                                     *    *    *    *    *
   
    ప్రతిరోజు సరిగ్గా రాత్రి 1-30కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నిద్రలోకి జారుకుంటుంది. కాని ఆ రాత్రి మేలుకొని మేజువాణి ప్రదర్శిస్తోంది.
   
    జె.జె. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ దాదాపు వందమంది పూలమాలల బొకేలతో, ఇన్ స్టెంట్ ఇన్ ఫర్ మేటివ్ ఫైల్స్ తో సిద్దంగా వున్నారు.
   
    అందరి ముఖాల్లో ఆందోళనగా, అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోంది.
   
    హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అధారటీస్ అంగీకరించిన టైమ్ కే, చార్టడ్ ఫ్లయిట్ లాండ్ అవ్వాలి.
   
    రాబోతున్న వ్యక్తి ఒక అసాధారణ వ్యక్తి. అంతులేని సంపదలపై అధికారమున్న వ్యక్తి అపర కుబేరుడు. అంతర్జాతీయ పారిశ్రామిక రంగంపై అదుపున్న అజేయుడు... అతనే జె.జె.ది గ్రేట్ ఇండస్ట్రియల్ ఎంఫైర్, జె.జె. కెమికల్స్, జె.జె. సిమెంట్స్, జె.జె. హోటల్స్, జె.జె. షిప్పింగ్ కార్పొరేషన్, జె.జె. పేపర్ మిల్స్, జె.జె. ఆటోమోబైల్స్, జె.జె. కన్ స్ట్రక్షన్స్, జె.జె. వాట్ నాట్?       
   
    ఖండాతరంగా అల్లుకుపోయిన జె.జె. ఓ మారుమూల భూగోళం విసిరేసిన దీవిలో కూర్చుని అయినా ఒకే ఒక్క కేబుల్ తో కొన్ని వందల కోట్ల సరుకును మిలియన్ కి మిలియన్స్ డాలర్స్ ని, పౌండ్స్ ని, దినారాల్ని కదిలించే సత్తా వున్న రారాజు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS